మిగిలిపోయిన అన్నం, పండ్ల తొక్కలు లాంటి ఆహార వ్యర్థాలకు దక్షిణ కొరియా చూపిన పరిష్కారం ఏమిటి?

ఫొటో సోర్స్, BBC Serenity Strull/Getty Images
- రచయిత, సూ మిన్ కిమ్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఇళ్లలోని ఆహార వ్యర్థాలను చెత్తకుప్పలకు తరలించడాన్ని దక్షిణ కొరియా 97 శాతం నుంచి దాదాపు సున్నాకు తగ్గించింది . ఇప్పుడు న్యూయార్క్ నగరం కూడా ఆ దిశగానే నడుస్తోంది.
దక్షిణ కొరియాలోని సోల్ నగరంలోని యోయిడో ప్రాంతంలో ఓ శనివారం మధ్యాహ్నం సీయుంగ్‌వాన్ హాంగ్ అనే వ్యక్తి ఆ వారమంతా తన ఇంట్లో పేరుకుపోయిన కూరగాయల వ్యర్థాలు, మిగిలిపోయిన అన్నం, పండ్ల తొక్కలను తీసుకుని తన అపార్ట్‌మెంట్ సముదాయంలోని ఆహార వ్యర్థాల సేకరణ యంత్రం వద్దకు వెళ్లి కార్డును స్కానర్‌పై ఉంచారు. వెంటనే ఆ యంత్రం మూత తెరుచుకుంది. ఆయన వేసిన వ్యర్థాల బరువు తెరపై కనిపించింది. ఆ బరువుకు ఎంత రుసుము చెల్లించాలో ఆయన ఖాతాలో నమోదైంది.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి నిమిషం కంటే తక్కువ సమయమే పడుతుంది. కానీ దీని వెనుక ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యర్థాల నిర్వహణ ప్రయోగాల్లో ఒకటి ఉంది.
ఇళ్ల నుంచి ఆహార వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి ఇతర దేశాలతో పోలిస్తే దక్షిణ కొరియా విస్తృత చర్యలు తీసుకుంది. ఇప్పుడు అదే బాటలో న్యూయార్క్ కూడా అడుగులు వేస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాలలో ఆహార వ్యర్థాల సమస్య అన్నిచోట్లా ఉంది. అమెరికాలో నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం వారం రోజుల్లో వృథా చేసే ఆహారం విలువ సుమారు 5 వేల రూపాయలకు పైగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా వంద కోట్ల టన్నులకు పైగా ఆహారం వృధా అవుతోంది. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచే ఉద్గారాలలో 10శాతానికి కారణమవుతోంది.
20వ శతాబ్దంలో వేగంగా జరిగిన పట్టణీకరణతో దక్షిణ కొరియాలో ఆహార వ్యర్థాల సమస్య తీవ్రమైంది. ఆహార వ్యర్థాలను ఇతర చెత్తతో కలిపి ల్యాండ్‌ఫిల్‌లకు తరలించడంతో చెత్త నిల్వ, పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోయాయి.
1990ల నుంచి దేశంలో ఆహార వ్యర్థాల నిర్వహణలో తీసుకొచ్చిన మార్పుల ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. 1996లో కేవలం 2.6 శాతంగా ఉన్న ఆహార వ్యర్థాల రీసైక్లింగ్ రేటు 2023 నాటికి దాదాపు 97 శాతానికి చేరింది.

ఫొటో సోర్స్, Yeni Kim
97శాతానికి చేరిన రీసైక్లింగ్ రేటు
దక్షిణ కొరియా ఆహార వ్యర్థాల రీసైక్లింగ్ రేటు 1996లో కేవలం 2.6% ఉండగా 2023 నాటికి దాదాపు 97%కి పెరిగింది . ఈ దేశంలో 1990 నుంచి ఆహార వ్యర్థాల నిర్వహణలో తీసుకువచ్చిన మార్పులు ఈ కింద చూడండి.
1995: దక్షిణ కొరియా ప్రభుత్వం పరిమాణం ఆధారిత చెత్త రుసుము ప్రవేశపెట్టింది.
1997: ఆహార వ్యర్థాలను వేరు చేయడం తప్పనిసరి చేసింది.
2005: ఆహార వ్యర్థాలను చెత్తకుప్పల వద్దకు తరలించడాన్ని పూర్తిగా నిషేధించింది.
2010: స్మార్ట్ బిన్‌లను పరిచయం చేస్తూ ఒక పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
2013: ఆహార వ్యర్థాల నుండి వెలువడే ద్రవాన్ని సముద్రంలో కలపడాన్ని నిషేధించింది.
ఈ మార్పుల్లో ప్రజలకు అత్యంత స్పష్టంగా కనిపించేది స్మార్ట్ బిన్లు. హాంగ్ ప్రతి వారం ఉపయోగించే యంత్రం కూడా అలాంటిదే. వీటిలో ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) స్కానర్లు ఉంటాయి. దక్షిణ కొరియా వ్యాప్తంగా 1,51,934 స్మార్ట్ బిన్‌లు వినియోగంలో ఉన్నట్టు, ఇవి 86.1 లక్షలకు పైగా కుటుంబాలు ఉపయోగిస్తున్నాయని 2025 నాటి ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది.
"నేను వేసే ఆహార వ్యర్థాల బరువు, వాటికి అయ్యే ఖర్చు రెండూ కనిపించడంతో, నేను ఎంత ఆహారాన్ని వృథా చేస్తున్నానో మరింతగా అర్థమైంది" అని హాంగ్ చెప్పారు.
ఇలా చేయడం వల్ల ఇళ్ల నుంచి ల్యాండ్‌ఫిల్‌కు వెళ్లే ఆహార వ్యర్థాల కారణంగా వెలువడే ఉద్గారాలు తగ్గడమే కాదు, ఈ వ్యర్థాల నుంచి శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
ఆహార వ్యర్థాలతో ఏం చేస్తారు?
హాంగ్ వంటి లక్షలాది మంది ప్రజలు పడేసే ఆహార వ్యర్థాల్లో కొంత భాగం చివరకు వ్యర్థాలను విద్యుత్తుగా మార్చే ఇంధన కేంద్రాలకు చేరుతుంది.
ల్యాండ్‌ఫిల్‌లో పూడ్చిపెట్టడం కంటే ఇది పర్యావరణానికి అనుకూలమైన మార్గం. సేంద్రియ వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్‌లో పూడ్చిపెట్టినప్పుడు అవి ఆక్సిజన్ అందుబాటులో లేకుండా కుళ్లిపోతాయి. ఈ ప్రక్రియలో మీథేన్ అనే గ్రీన్‌హౌస్ వాయువు విడుదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్‌తో పోలిస్తే మీథేన్‌కు 80 రెట్లకుపైగా ఉంటుంది.
ఈ వ్యర్థాల నుంచి లీచేట్ అనే ముదురు రంగులో ఉండే హానికర ద్రవం కూడా వెలువడుతుంది. ఇది నేలలోకి ఇంకిపోయి భూగర్భ జలాలను కలుషితం చేయవచ్చు.
ఆహార వ్యర్థాలను బయోరియాక్టర్‌లోకి పంపితే ఉత్పత్తయ్యే మీథేన్‌ను సేకరించి ఇంధనంగా మండించవచ్చు. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దీనిద్వారా శక్తిమంతమైన గ్రీన్‌హౌస్ వాయువైన మీథేన్ నేరుగా వాతావరణంలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.
దక్షిణ కొరియా మధ్య భాగంలో ఉన్న డేజియాన్ బయో ఎనర్జీ సెంటర్ తమకు అందే వ్యర్థాలలో 70-75 శాతాన్ని పునర్వినియోగ శక్తిగా మారుస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 6,000 దక్షిణ కొరియా కుటుంబాల రోజువారీ విద్యుత్ అవసరాలను తీర్చగలిగేలా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి ప్లాంట్లు దక్షిణ కొరియా అంతటా 340కి పైగా ఉన్నాయి.
ఈ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే శక్తి వల్ల శిలాజ ఇంధనాల అవసరం తగ్గుతుంది. 2026 నాటికి సుమారు 230 బిలియన్ కొరియన్ వోన్ (17 కోట్ల డాలర్లు) విలువైన శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఈ విధానం ద్వారా భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
'దక్షిణ కొరియా ఆహార వ్యర్థాల పునరుద్ధరణలో అద్భుతమైన పురోగతిని సాధించింది. అయితే కొత్త టెక్నాలజీ, విధానాల సాయంతో ఈ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లే కీలక మలుపులో ఉన్నాం' అని కొరియా ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ రీసర్చ్ ఫెలో మున్సోల్ జు తెలిపారు.

ఫొటో సోర్స్, Daejeon Bio Energy Centre
న్యూయార్క్‌లో సవాళ్లు
న్యూయార్క్ నగరం అక్టోబర్ 2024 నుంచి ఇళ్లలో ఆహార వ్యర్థాలను ఇతర చెత్త నుంచి వేరు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు దక్షిణ కొరియా విధానాన్ని ఒక నమూనాగా పేర్కొంది.
ప్రజలు ఆహార వ్యర్థాలను ప్రత్యేక బిన్‌లో లేదా మూత గట్టిగా మూసుకునేలా ఉన్న పాత్రలో వేయాలి. వాటిని రీసైక్లింగ్ చెత్తతో పాటు ఇంటి ముందే సేకరణ కోసం ఉంచాలి.
ఈ కార్యక్రమం దాదాపు 34 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. అమెరికాలోనే ఇది అతిపెద్ద సేంద్రియ వ్యర్థాల సేకరణ, పునర్వినియోగ కార్యక్రమం.
కానీ చాలామంది ప్రజలు ఆహార వ్యర్థాలను క్రమం తప్పకుండా వేరు చేయకపోవడం వల్ల ఈ కార్యక్రమం అమలు పెద్ద సవాలుగా మారింది.
ప్రజలను ఈ విధానంలో భాగస్వాములను చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యూయార్క్ పారిశుద్ధ్య విభాగం ఇటీవల నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో 60,000కుపైగా సార్లు మాట్లాడింది.
నిబంధనల అమలుపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి నిబంధనలు పాటించని ఇళ్లకు 63,000కుపైగా ఉల్లంఘన నోటీసులు జారీ చేసినట్లు పారిశుద్ధ్య విభాగం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
న్యూయార్క్‌లో స్మార్ట్ కంపోస్టింగ్ బిన్‌లు
ప్రతి ఇంటి నుంచి ప్రతి వారం సేకరించే ప్రత్యేక బిన్లతో పాటు, ప్రజలకు ఆహార వ్యర్థాలను కంపోస్ట్ చేయడం మరింత సులభం చేసేందుకు న్యూయార్క్ నగరం ఐదు ప్రాంతాల్లో 400కుపైగా స్మార్ట్ కంపోస్టింగ్ బిన్లను ఏర్పాటు చేసింది.
ఇళ్లలో ఉండే బిన్లకు భిన్నంగా, ఇవి సౌరశక్తితో పనిచేస్తాయి. మొబైల్ యాప్ ద్వారా 24 గంటలూ వీటిని ఉపయోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి రుసుము ఉండదు.
"ఈ బిన్‌లు ఉండటం వల్ల కంపోస్టింగ్ చేయడం చాలా సులభమైంది" అని మాన్‌హట్టన్‌లోని ఈస్ట్ విలేజ్ నివాసి గ్రేస్ ఫు అన్నారు.
అయితే వీటివల్ల కొన్ని ఆచరణాత్మక సమస్యలు కూడా ఉన్నాయి.
"వీటివల్ల మా అపార్ట్‌మెంట్ దగ్గర ఎలుకలు ఎక్కువైపోతున్నాయి. దాంతో మా బిన్‌ను బిల్డింగ్ లోపల పెట్టాం" అని ఫు తెలిపారు.
"బిన్‌లను మరింత తరచుగా శుభ్రం చేస్తే బాగుంటుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
2025లో న్యూయార్క్ నగర పారిశుద్ధ్య శాఖ సుమారు 1,40,000 టన్నుల గృహ సంబంధిత సేంద్రీయ వ్యర్థాలను నిర్వహించింది. ఇది గృహాల ద్వారా ఏటా ఉత్పత్తి అయ్యే సుమారు 1.5 మిలియన్ (15 లక్షల) టన్నుల వ్యర్థాలలో సుమారు 9% మాత్రమే. గడచిన కొన్నేళ్లతో పోలిస్తే మంచి పురోగతే అయినప్పటికీ, దక్షిణ కొరియా సాధించిన 97% లక్ష్యంతో పోలిస్తే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది.
ఈ విధంగా సేకరించిన వ్యర్థాలను జిల్లాల వారీగా రెండు వేర్వేరు ప్రాంతాలకు పంపుతున్నారు. కొన్ని వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి స్టేటన్ ఐలాండ్ కంపోస్ట్ ఫెసిలిటీకి వెళ్తాయి.
మిగిలినవి బ్రూక్లిన్‌లోని న్యూటౌన్ క్రీక్ వేస్ట్ వాటర్ రిసోర్స్ రికవరీ ఫెసిలిటీకి పంపి, అక్కడ మురుగునీటి అవక్షేపంతో కలిపి బయోగ్యాస్, బయోసాలిడ్స్‌ను ఉత్పత్తి చేస్తారు.
'న్యూయార్క్ వాసులలో దాదాపు 70% మంది అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నందున, దక్షిణ కొరియా విధానాన్ని ఇక్కడ అమలు చేయడానికి మంచి అవకాశం ఉంది' అని కొలంబియా క్లైమేట్ స్కూల్‌లోని సస్టైనబిలిటీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ స్టీవెన్ కోహెన్ అన్నారు.
"దక్షిణ కొరియా ఉపయోగిస్తున్న ఆర్‌ఎఫ్‌ఐడీ బిన్ల వల్ల ప్రతి ఒక్కరూ తాము ఉత్పత్తి చేసే సేంద్రియ వ్యర్థాలకు నేరుగా బాధ్యత వహించేలా చేయవచ్చు," అని కోహెన్ చెప్పారు.సర్క్యులర్ ఎకానమీలో సేంద్రీయ వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగించడం, శక్తిగా మార్చడం చాలా అవసరం' అని ఆయన చెప్పారు.
ఈ నగరంలో చాలా మంది ప్రజలు ఇప్పటికీ తమ సేంద్రీయ వ్యర్థాలను సరిగ్గా వేరు చేయడం లేదు' అని కోహెన్ చెప్పారు.
న్యూయార్క్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
"సమస్య ఏమిటంటే, ఈ నగరంలో ఇప్పటికీ చాలామంది తమ సేంద్రియ వ్యర్థాలను సరిగ్గా వేరు చేయడం లేదు," అని కోహెన్ అన్నారు. ఆహార వ్యర్థాలను రీసైకిల్ చేయడం ఎందుకు ముఖ్యమో ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తే వారి భాగస్వామ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రోత్సాహకాలు కూడా ఇందుకు ఉపయోగపడవచ్చని అన్నారు.
సోల్‌లోని యోయిడోలో హాంగ్ తన ఖాళీ ఆహార వ్యర్థాల బిన్‌ను తీసుకుని మళ్లీ తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అప్పటికే వ్యర్థాల సేకరణ యంత్రంపై ఉన్న తెర ఆగిపోయింది.
ఇది ఇప్పుడు ఆయన జీవితంలో ఒక సాధారణ రోజువారీ పనిగా మారిపోయింది.
"ఆహార వ్యర్థాలను తగ్గించడం అందరి ఉమ్మడి బాధ్యత" అంటారు హాంగ్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























