ఛాతీలో నొప్పి.. గ్యాస్ట్రిక్ సమస్యా, గుండెపోటా?

గుండె పోటు, ఛాతి నొప్పి, గ్యాస్, అజీర్ణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

ఉదయం 8 గంటలు. 48 ఏళ్ల రమేష్ ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అకస్మాత్తుగా ఛాతీ మధ్యలో బరువుగా అనిపించింది.

"నిన్న రాత్రి బిర్యానీ ఎక్కువ తిన్నాను. గ్యాస్ అయి ఉంటుంది" అనుకుని ఒక యాంటాసిడ్ మాత్ర వేసుకున్నారు.

కొద్దిసేపు నొప్పి తగ్గినట్లు అనిపించింది. కానీ అరగంట తర్వాత నొప్పి ఎడమ భుజానికి, చేతికి వ్యాపించింది. చెమటలు పట్టాయి. శ్వాస తీసుకోవడం కష్టమైంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షల్లో తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు తేలింది.

వెంటనే యాంజియోప్లాస్టీ చేయడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఇలాంటి సంఘటనలు మన చుట్టూ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ఛాతీలో నొప్పిని గ్యాస్, అజీర్ణం, కండరాల నొప్పి అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. కొన్నిసార్లు ఆ నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకుంటుంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుండె పోటు, ఛాతి నొప్పి, గ్యాస్, అజీర్ణం

ఛాతీలో నొప్పి అంటే గుండెపోటేనా?

అంటే... అన్ని సందర్భాల్లో కాదు అనే చెప్పాలి. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని సాధారణమైనవి.

ఛాతీలో నొప్పికి ప్రధాన కారణాలు

  • గుండె సంబంధిత వ్యాధులు
  • గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్
  • కండరాల నొప్పి
  • పక్కటెముకల సమస్యలు
  • ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు
  • న్యుమోనియా
  • ఊపిరితిత్తుల్లో రక్తగడ్డలు
  • ఆందోళన (Anxiety)
  • పానిక్ అటాక్
  • వైరల్ ఇన్ఫెక్షన్లు

అందుకే ఛాతీలో నొప్పికి కారణాన్ని ఊహించి సొంతంగా ఏవో మందులు వేసుకోకుండా... వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మన గుండె రోజుకు సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటూ, శరీరమంతా రక్తాన్ని పంపిస్తుంది. ఈ పనికి గుండె కండరాలకు కూడా నిరంతరం రక్తం అవసరం. ఈ రక్తాన్ని అందించే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీ (ధమని)లు అంటారు.

ఈ ధమనుల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియం పేరుకుపోయి రక్తప్రసరణ తగ్గితే గుండెకు ఆక్సిజన్ సరిపోదు. రక్తనాళం పూర్తిగా మూసుకుపోతే గుండె కండరాలు చనిపోవడం ప్రారంభమవుతుంది. దీనినే గుండెపోటు (Heart Attack / Myocardial Infarction) అంటారు.

గుండెపోటు వచ్చిన మొదటి 60 నుంచి 90 నిమిషాలు అత్యంత కీలకం. దీనిని 'గోల్డెన్ అవర్' అంటారు.

ఈ సమయంలో రక్తప్రసరణను పునరుద్ధరిస్తే గుండె కండరాలను కాపాడవచ్చు. మరణాల ప్రమాదం తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో గుండె వైఫల్యానికి అవకాశాలు తగ్గుతాయి.

అందుకే ఛాతీలో నొప్పి వస్తే గంటల తరబడి ఇంట్లో వేచి ఉండకూడదు.

గుండె పోటు, ఛాతి నొప్పి, గ్యాస్, అజీర్ణం

ఫొటో సోర్స్, Getty Images

గ్యాస్ట్రిక్ సమస్యతో వచ్చే నొప్పికి, గుండెపోటు నొప్పికి తేడా ఏంటంటే

అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా ఛాతీలో మంట లేదా నొప్పి రావచ్చు.

సాధారణంగా ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు, గొంతులో మంట భోజనం చేసిన తర్వాత ఎక్కువ అవడం, ముందుకు వంగితే పెరగడం, పడుకున్నప్పుడు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

యాంటాసిడ్ మందులతో దీనికి కొంత ఉపశమనం కలుగుతుంది.

అయితే పదే పదే గ్యాస్‌లా అనిపించే నొప్పిని గ్యాస్ట్రిక్ సమస్యే అని భావించడం ప్రమాదకరం.

మరి గుండెపోటు నొప్పి ఎలా ఉంటుంది?

గుండెపోటు వస్తే సినిమాల్లో చూపినట్లు ఒక్కసారిగా నేలపై పడిపోతారని చాలామంది అనుకుంటారు. కానీ నిజ జీవితంలో గుండెపోటు చాలా సందర్భాల్లో నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

సాధారణంగా ఛాతీ మధ్యలో బరువుగా అనిపించడం, ఎవరో బండరాయి పెట్టినట్లు ఒత్తిడి, గట్టిగా నొక్కుతున్నట్లు బాధ, 15–20 నిమిషాలకు మించి కొనసాగడం, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోవడం, నొప్పి ఎడమ చేయి లేదా రెండు చేతులు, మెడ, దవడ, వీపు లేదా భుజాలకు వ్యాపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం లేదా వాంతులు, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు ఉంటే.. దాన్ని గుండెపోటుగా భావించి అత్యవసర వైద్య సహాయం పొందాలి.

మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలాసార్లు భిన్నంగా ఉంటాయి. అందువల్ల చాలామంది గుండెపోటును గ్యాస్ట్రిక్ సమస్యగా లేదా అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.

గుండె పోటు, ఛాతి నొప్పి, గ్యాస్, అజీర్ణం

ఫొటో సోర్స్, Getty Images

మహిళల్లో కనిపించే అసాధారణ లక్షణాలు

తీవ్రమైన అలసట, అజీర్ణం, వికారం, కడుపు పైభాగంలో నొప్పి, వెన్ను నొప్పి, మెడ లేదా దవడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, చెమటలు పట్టడం వంటివి.

కొంతమందికి ఛాతీ నొప్పి అసలు ఉండకపోవచ్చు కూడా.

మధుమేహం ఉన్నవారిలో నరాలు దెబ్బతినడం వల్ల గుండెపోటు వచ్చినా తీవ్రమైన నొప్పి ఉండకపోవచ్చు. దీనిని Silent Heart Attack అంటారు.

అటువంటి వారిలో ఆకస్మిక నీరసం, చెమటలు, శ్వాసలో ఇబ్బంది, తల తిరగడం, అసాధారణ అలసట వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తాయి.

అందుకే మధుమేహ రోగులు చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

భారత్‌లో గుండెపోటుతో మరణించే వారిలో చాలామంది ఆసుపత్రికి చేరుకునే లోపే లేదా ఆలస్యంగా చేరుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

"ఇంకొంత సేపు చూస్తే తగ్గిపోతుంది", "గ్యాస్ అయి ఉంటుంది", "కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది" అనే ఆలోచనే చాలా సందర్భాల్లో ప్రమాదానికి దారి తీస్తుంది.

గుండె పోటు, ఛాతి నొప్పి, గ్యాస్, అజీర్ణం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో గుండె సంబంధ వ్యాధుల పెరుగుదల

గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనాల ప్రకారం... ప్రపంచంలోనే గుండెజబ్బుల భారం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో మొత్తం మరణాల్లో సుమారు 27–28 శాతం గుండె, రక్తనాళాల వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది గుండెపోటు బారిన పడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి.

గుండె పోటు, ఛాతి నొప్పి, గ్యాస్, అజీర్ణం

ఫొటో సోర్స్, Getty Images

యువతలో గుండెపోటు ఎందుకు పెరుగుతోంది?

గతంలో 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించిన గుండెపోటు ఇప్పుడు 30–40 ఏళ్ల వయసు వారిలో కూడా నమోదవుతోంది. దీనికి గల ప్రధాన కారణాలు...

1. ధూమపానం

సిగరెట్లు, బీడీలు, ఈ-సిగరెట్లు వంటివి రక్తనాళాలను దెబ్బతీస్తాయి.

2. మధుమేహం

భారత్‌ను 'డయాబెటిస్ క్యాపిటల్' అని వైద్య నిపుణులు పిలుస్తుంటారు. మధుమేహం గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

3. అధిక రక్తపోటు

ఎక్కువ కాలం పాటు బీపీ నియంత్రణలో లేకపోతే గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

4. అధిక కొలెస్ట్రాల్

LDL (చెడు కొలెస్ట్రాల్) పెరిగితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తుంది.

5. ఊబకాయం

నడుము చుట్టూ కొవ్వు పెరగడం కూడా ప్రమాద సంకేతమే.

6. వ్యాయామం లేకపోవడం

రోజంతా కూర్చునే ఉద్యోగాలు, తక్కువ శారీరక శ్రమ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

7. మానసిక ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల రక్తపోటు, హార్మోన్ల మార్పులు, అనారోగ్యకర జీవనశైలి వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

8. నిద్రలేమి

రోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

heart attack related medical tests

ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఏమి చేయాలి?

ముందుగా భయపడకూడదు. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు.

ఛాతీలో నొప్పి వస్తే వెంటనే కూర్చోవాలి లేదా విశ్రాంతి తీసుకోవాలి.

నొప్పి తగ్గుతుందేమో అని ఇంట్లోనే గంటల తరబడి వేచి ఉండకూడదు.

వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పాలి.

వీలైనంత త్వరగా సమీపంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలి.

స్వయంగా కారు లేదా బైక్ నడపడం మంచిది కాదు. కుటుంబ సభ్యుడు లేదా అంబులెన్స్ సహాయం తీసుకోవాలి.

ఆసుపత్రికి వెళ్లిన తర్వాత రోగి పరిస్థితిని బట్టి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు.

1. ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రామ్)

ఇది గుండె విద్యుత్ కార్యకలాపాన్ని నమోదు చేసే పరీక్ష. కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. గుండెపోటు సంకేతాలను త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది.

అయితే ప్రారంభ దశలో ఈసీజీ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అందుకే అవసరమైతే మళ్లీ పరీక్ష చేస్తారు.

2. ట్రోపోనిన్ (Cardiac Troponin)

గుండె కండరాలు దెబ్బతిన్నప్పుడు రక్తంలో ట్రోపోనిన్ అనే ప్రోటీన్ పెరుగుతుంది. ఈ పరీక్ష గుండెపోటు నిర్ధరణలో అత్యంత ముఖ్యమైనది.

3. 2డీ ఎకో (Echocardiography)

ఈ పరీక్ష ద్వారా గుండె పంపింగ్ సామర్థ్యం, కవాటాల పనితీరు, గుండె కండరాల కదలిక, ఇతర గుండె సమస్యలు తెలుసుకోవచ్చు.

4. రక్త పరీక్షలు

రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, మూత్రపిండాల పనితీరు, రక్తహీనత, ఇతర అవసరమైన పరీక్షలు చేస్తారు.

5. కరోనరీ యాంజియోగ్రఫీ

గుండెకు రక్తాన్ని అందించే ధమనుల్లో ఎక్కడ, ఎంత శాతం అడ్డంకి ఉందో తెలుసుకోవడానికి ప్రత్యేక డై ఉపయోగించి చేసే పరీక్ష. ఈ పరీక్ష తర్వాత తదుపరి చికిత్సను నిర్ణయిస్తారు.

heart surgery

ఫొటో సోర్స్, Getty Images

గుండెపోటు వస్తే ఎలాంటి శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయు?

యాంజియోప్లాస్టీ అంటే ఏమిటి?

రక్తనాళం మూసుకుపోయిన చోట ఒక చిన్న బెలూన్ సహాయంతో ధమనిని విస్తరించే విధానాన్ని యాంజియోప్లాస్టీ (Angioplasty) అంటారు. తర్వాత మళ్లీ ఆ రక్తనాళం మూసుకుపోకుండా అక్కడ ఒక స్టెంట్ ఉంచుతారు.

స్టెంట్ అంటే ఏమిటి?

స్టెంట్ అనేది చాలా చిన్న మెష్ లాంటి లోహపు గొట్టం. దీనివల్ల రక్తప్రసరణ పునరుద్ధరణ జరుగుతుంది. గుండెకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. గుండె కండరాలు మరింత దెబ్బతినకుండా కాపాడవచ్చు.

బైపాస్ శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం?

ఒకటి కంటే ఎక్కువ ధమనులు తీవ్రంగా మూసుకుపోయినప్పుడు లేదా యాంజియోప్లాస్టీ సరిపోని పరిస్థితుల్లో కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) శస్త్రచికిత్సను సూచించవచ్చు. ఇందులో శరీరంలోని మరో రక్తనాళాన్ని ఉపయోగించి కొత్త మార్గం ద్వారా రక్త ప్రసరణ కల్పిస్తారు.

గుండెపోటును నివారించవచ్చా?

గుండెపోటు నివారణకు.. ఆరోగ్యకరమైన జీవనశైలే అసలైన రక్షణ.

గుండెపోటు ఒక్కరోజులో రాదు... మన జీవనశైలిలో సంవత్సరాలుగా జరిగే చిన్న చిన్న తప్పుల ఫలితంగా వస్తుంది.

ఆధునిక వైద్యం గుండెపోటుకు అద్భుతమైన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ, గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, రాకుండా నివారించడమే ఉత్తమమైన మార్గం.

గుండె పోటు, ఛాతి నొప్పి, గ్యాస్, అజీర్ణం

ఫొటో సోర్స్, Getty Images

గుండెను కాపాడే 10 నియమాలు

1.ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండండి.

ధూమపానం మానేసిన కొద్ది కాలానికే గుండె పోటు ప్రమాదం తగ్గడం ప్రారంభమవుతుంది.

2. వ్యాయామం

వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి. వేగంగా నడక, సైక్లింగ్, ఈత, యోగా వంటి వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

3. ఆహారంలో మార్పులు చేసుకోండి.

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు (Whole grains), నట్స్ (పరిమితంగా), చేపలు ఎక్కువగా తీసుకోవాలి. అధిక ఉప్పు, డీప్ ఫ్రైడ్ ఆహారం, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించాలి.

4. రక్తపోటును నియంత్రించండి.

దీనిని Silent Killer అంటారు. కనీసం సంవత్సరానికి ఒకసారి రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి.

5. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.

మధుమేహం ఉన్నవారు HbA1cను నియంత్రణలో ఉంచాలి. మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆహారం, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

6. కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేయవద్దు.

LDL కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు ఇరుకవుతాయి. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలను వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.

7. ఒత్తిడిని తగ్గించుకోవాలి.

దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు, కుటుంబంతో సమయం గడపడం, ఇష్టమైన హాబీలకు సమయం కేటాయించడం వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

8. తగినంత నిద్ర అవసరం.

రోజుకు 7–8 గంటల నాణ్యమైన నిద్ర గుండె ఆరోగ్యానికి కీలకం. దీర్ఘకాలిక నిద్రలేమి గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

9. బరువును నియంత్రించుకోవాలి.

నడుము చుట్టూ అధిక కొవ్వు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం బరువు నియంత్రణకు సహాయపడతాయి.

10. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

40 సంవత్సరాలు దాటినవారు లేదా ప్రమాద కారకాలు ఉన్నవారు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, HbA1c (అవసరమైతే), లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, అవసరమైతే 2డీ ఎకో లేదా టీఎంటీ వంటి పరీక్షలు వైద్యుల సలహా మేరకు చేయించుకోవాలి.

ఛాతీలో నొప్పి అనేది శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక సంకేతం. అది గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు, కండరాల నొప్పి కావచ్చు, లేదా గుండెపోటుకు తొలి సూచన కూడా కావచ్చు. అందువల్ల సొంత నిర్ణయాలతో చికిత్స ఆలస్యం చేయడం ప్రమాదకరం. సమయానికి ఆసుపత్రికి చేరుకోవడం, సరైన పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్స తీసుకోవడం వల్ల చాలా అవసరం.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)