థైరాయిడ్ క్యాన్సర్ : ఈ వ్యాధిని ముందే గుర్తించొచ్చా, చికిత్స ఉందా?

థైరాయిడ్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

"మెడలో చిన్న గడ్డ కనిపించింది... ఇది క్యాన్సరా?" అనే భయం చాలామందిలో ఉంటుంది.

థైరాయిడ్‌లో గడ్డలు (thyroid nodules) చాలా సాధారణం. అయితే వాటిలో అన్నీ క్యాన్సర్లు కావు. అలాగే థైరాయిడ్ క్యాన్సర్ ప్రారంభ దశలో చాలాసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు.

మెడలో వచ్చే అనుమానాస్పద మార్పులను ముందుగా గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, సరైన చికిత్స పొందడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సెప్టెంబర్‌ను థైరాయిడ్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తుంటారు.

మంచి విషయం ఏంటంటే - థైరాయిడ్ క్యాన్సర్లలో ముఖ్యంగా పాపిలరీ, ఫాలిక్యులర్ వంటి వాటికి చికిత్స ఫలితాలు సాధారణంగా చాలా బాగుంటాయి.

చాలామంది చికిత్స తర్వాత దీర్ఘకాలం సాధారణ జీవితాన్ని గడుపుతారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?

మెడ ముందు భాగంలో, శ్వాసనాళం ముందు ఉండే సీతాకోక చిలుక ఆకారపు గ్రంథి థైరాయిడ్.

ఇది శరీరంలోని జీవ క్రియ, గుండె వేగం, శరీర ఉష్ణోగ్రత తదితరాలను నియంత్రించడంలో కీలకమైన థైరాయిడ్ హార్మోన్‌ను తయారు చేస్తుంది.

థైరాయిడ్ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి క్యాన్సర్‌గా మారితే దానిని థైరాయిడ్ క్యాన్సర్ అంటారు.

థైరాయిడ్ క్యాన్సర్ - ప్రధాన రకాలు

  • పాపిలరీ థైరాయిడ్ కార్సినోమా – అత్యంత సాధారణ రకం
  • ఫాలిక్యులర్ థైరాయిడ్ కార్సినోమా
  • ఆంకోసైటిక్ థైరాయిడ్ కార్సినోమా
  • మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా
  • అనాప్లాస్టిక్ థైరాయిడ్ కార్సినోమా

వీటి ప్రవర్తన, చికిత్స, రోగ నిరూపణ ఒకేలా ఉండవు.

థైరాయిడ్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి వస్తోంది?

డబ్ల్యూహెచ్ఓ/ఐఏఆర్సీ గ్లోబోకాన్ 2022 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 8.21 లక్షల కొత్త థైరాయిడ్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.

అదే సంవత్సరంలో సుమారు 47,500 మరణాలు నమోదయ్యాయి. అంటే కేసుల సంఖ్యతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం కూడా థైరాయిడ్ క్యాన్సర్‌లో మంచి ప్రోగ్నోసిస్‌కు ఒక సూచన.

అమెరికా సీర్ (SEER) డేటా ప్రకారం థైరాయిడ్ క్యాన్సర్‌కు 5 సంవత్సరాల సాపేక్ష మనుగడ సుమారు 98 శాతంగా ఉంది.

అయితే ఇది అన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్లకు ఒకేలా వర్తించదు... వయసు, క్యాన్సర్ రకం, స్టేజ్, క్యాన్సర్ వ్యాప్తి వంటి అంశాలు ప్రోగ్నోసిస్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

థైరాయిడ్ క్యాన్సర్‌ అని ఎప్పుడు అనుమానించాలి?

థైరాయిడ్ క్యాన్సర్‌లో అత్యంత సాధారణ సంకేతం... మెడలో కొత్తగా కనిపించే గడ్డ లేదా నాడ్యుల్ (nodule).

ఉదాహరణకు, అద్దంలో చూసుకున్నప్పుడు మెడలో చిన్న ఉబ్బరంలా కనిపించడం, షర్ట్ కాలర్ పెట్టుకున్నప్పుడు గడ్డ తగలడం, లేదా నెక్లెస్ వేసుకున్నప్పుడు ఒక గడ్డ అనిపించడం వంటివి.

అయితే మెడలో గడ్డ ఉందంటే తప్పనిసరిగా క్యాన్సర్ అని కాదు.

చాలా థైరాయిడ్ నాడ్యుల్స్ క్యాన్సర్ కానివిగా ఉంటాయి.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

థైరాయిడ్ గడ్డ క్రమంగా పెద్దదవడం, మెడలో బిళ్లలు కట్టడం, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, దీర్ఘకాలంగా గొంతు బొంగురుపోవడం, మెడ, దవడ లేదా చెవి నొప్పి వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ప్రత్యేకంగా... గొంతు బొంగురుపోవడం కొత్తగా ప్రారంభమై, తగ్గకుండా కొనసాగితే ఈఎన్‌టీ లేదా ఎండోక్రైనాలజీ నిపుణుడిని కలవడం మంచిది.

థైరాయిడ్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

రక్త పరీక్షలో థైరాయిడ్ క్యాన్సర్ కనిపిస్తుందా?

థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH ) సాధారణంగా ఉన్నంతమాత్రాన థైరాయిడ్ క్యాన్సర్‌ లేదని చెప్పలేం.

థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న చాలామంది వ్యక్తుల్లో TSH, T3, T4 సాధారణంగానే ఉండవచ్చు.

అందువల్ల మెడలో అనుమానాస్పద గడ్డ ఉంటే కేవలం రక్త పరీక్షలు ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు.

డాక్టర్ ఏ పరీక్షలు చేస్తారు?

మొదటి దశ

1. వైద్య పరీక్షలు (Clinical examination) - మెడను పరీక్షించి థైరాయిడ్ గ్రంధి, మెడలో రెండు వైపులా బిళ్లల మాదిరిగా ఏదైనా అసాధారణంగా ఉందా అని చూస్తారు.

2. అల్ట్రా సౌండ్ స్కాన్ - ఇది థైరాయిడ్ నాడ్యుల్‌ను అంచనా వేయడానికి చాలా ముఖ్యమైన పరీక్ష. నాడ్యుల్ పరిమాణం, ఆకారం, అంచులు, కాల్సిఫికేషన్లు, రక్తనాళాల విస్తృతి, లింఫ్ నోడ్స్ వంటి అంశాలను పరిశీలిస్తారు.

3. FNAC

అల్ట్రా సౌండ్ ఆధారంగా అనుమానాస్పద నాడ్యుల్స్‌కు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ (FNAC) చేయవచ్చు. సన్నని సూదితో గడ్డ నుంచి కణాలను తీసుకుని మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తారు. అవసరాన్ని బట్టి సీటీ/ఎంఆర్ఐ, మాలిక్యులార్ పరీక్ష లేదా ఇతర పరీక్షలు కూడా చేయవచ్చు.

థైరాయిడ్ క్యాన్సర్ వస్తే భయపడాల్సిందేనా?

అవసరం లేదు.

పాపిలరీ, ఫాలిక్యులర్ వంటి థైరాయిడ్ క్యాన్సర్‌ రకాలలో చాలామందికి మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది. చిన్న గడ్డ థైరాయిడ్‌లోనే పరిమితమై ఉంటే చికిత్స తర్వాత తిరిగి వచ్చే రిస్క్ కూడా తక్కువగా ఉండవచ్చు.

2025 ఏటీఏ ( అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్) మార్గదర్శకాల ప్రకారం తిరిగి వచ్చే రిస్క్‌ను low, low-intermediate, intermediate-high, high risk వంటి విభాగాలుగా మరింత సున్నితంగా అంచనా వేస్తారు.

గడ్డ పరిమాణం, లింఫ్ నోడ్‌కు పాకిందా లేదా, బయట ఇతర అవయవాలకు పాకిందా లేదా, పాథాలజీ రకం వంటి అంశాలు ఇందులో ముఖ్యమైనవి.

థైరాయిడ్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

చికిత్స ఎలా ఉంటుంది?

అన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్‌లకు ఒకే చికిత్స ఉండదు.

1. సర్జరీ - చాలా థైరాయిడ్ క్యాన్సర్‌లకు సర్జరీ ప్రధాన చికిత్స.

2. రేడియో యాక్టివ్ అయోడిన్ I-131

మొత్తం థైరాయిడ్ గ్రంథిని తొలగించిన వారిలో ముఖ్యంగా హై-రిస్క్ ఉన్న వారిలో రేడియో యాక్టివ్ అయోడిన్ (RAI) చికిత్సను కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు.

అయితే ప్రతి థైరాయిడ్ క్యాన్సర్‌ రోగికి ఆర్ఏఐ అవసరం లేదు. లో-రిస్క్ ఉన్న వారికి సాధారణంగా ఇది ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు.

3. థైరాయిడ్ హార్మోన్ చికిత్స

మొత్తం థైరాయిడ్ తొలగించిన తర్వాత శరీరానికి థైరాయిడ్ హార్మోన్ అవసరం కాబట్టి లీవో థైరాక్సిన్ జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది.

4. అడ్వాన్స్డ్ డిసీజ్‌లో ఇతర చికిత్సలు

క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు లేదా రేడియో యాక్టివ్ అయోడిన్‌కు స్పందించని పరిస్థితి ఉన్నప్పుడు రేడియేషన్ చికిత్స, టార్గెటెడ్ థెరపీ, కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ వంటివి ఇస్తారు.

చికిత్స తర్వాత ఇబ్బందులు ఉంటాయా?

చాలామందికి చికిత్స సురక్షితంగా పూర్తవుతుంది. అయినప్పటికీ థైరాయిడ్ సర్జరీతో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.

గొంతు మారడం – థైరాయిడ్‌కి దగ్గరగా ఉండే రికరెంట్ లారింజియల్ నరం దెబ్బతింటే గొంతు బొంగురుపోవచ్చు.

కాల్షియం తగ్గడం - థైరాయిడ్ మొత్తం తీసివేసినపుడు పారా థైరాయిడ్ గ్రంధులు ప్రభావితమైతే కాల్షియం స్థాయి తగ్గవచ్చు.

వీరిలో పెదవులు, వేళ్ల వద్ద, చేతులు, కాళ్లలో తిమ్మిరి, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలాసార్లు ఇది తాత్కాలికమే. కొంతమందికి కాల్షియం + విటమిన్ డీ అవసరం కావచ్చు.

థైరాయిడ్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ఏఐ తర్వాత...?

రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ తర్వాత కొంతమందిలో నోరు పొడిబారడం, లాలాజల గ్రంథుల వాపు/అసౌకర్యం, రుచి మారడం వంటి సమస్యలు రావచ్చు.

అధిక మొత్తంలో ఆర్ఏఐ తీసుకున్నవారిలో రెండో క్యాన్సర్ ప్రమాదం స్వల్పంగా పెరగవచ్చని ఏటీఏ పేర్కొంది.

చికిత్స తర్వాత సాధారణ జీవితం గడపగలరా?

అవును. చికిత్స తర్వాత చాలా మంది సాధారణ జీవితాన్ని గడుపుతారు.

థైరాయిడ్ గ్రంథి మొత్తం తీసేసిన వారు హార్మోన్ టాబ్లెట్‌ను ప్రతిరోజూ తీసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు.

రక్తంలో టీఎస్‌హెచ్ అవసరాన్ని బట్టి థైరో గ్లోబులిన్, అల్ట్రా సౌండ్ వంటి పరీక్షలతో ఫాలో అప్ చేస్తారు.

ఉద్యోగం, కుటుంబ జీవితం, వ్యాయామం, ప్రయాణాలు వంటివి చాలా సందర్భాల్లో సాధారణంగానే కొనసాగించవచ్చు.

క్యాన్సర్ మళ్లీ వస్తుందా?

కొంతమందిలో మళ్లీ రావచ్చు. కానీ తిరిగి వచ్చినంత మాత్రాన తప్పనిసరిగా ప్రాణాపాయం అని కాదు.

థైరాయిడ్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?

మెడలో కొత్త గడ్డ కనిపిస్తే, గడ్డ వేగంగా పెరుగుతుంటే, మెడలో లింఫ్ నోడ్స్ వాపు ఉంటే, మింగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, కొత్తగా, నిరంతరంగా గొంతు బొంగురుపోతే, మెడలో ఎప్పుడూ నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

ముఖ్యంగా పిల్లలు లేదా యువకుల్లో మెడలో వాపు, గతంలో మెడ ప్రాంతంలో రేడియేషన్ తీసుకున్న వారు లేదా కుటుంబంలో థైరాయిడ్ క్యాన్సర్‌ చరిత్ర ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఇవి గుర్తుంచుకోవాలి

మెడలో గడ్డ అంటే క్యాన్సర్ అనుకోవడం తప్పు.

అదే సమయంలో, గడ్డ నొప్పి ఇవ్వడం లేదు కాబట్టి ప్రమాదం లేదు అనుకోవడం కూడా తప్పు.

థైరాయిడ్ క్యాన్సర్ చాలాసార్లు నొప్పి లేకుండానే ఉంటుంది. కొత్తగా వచ్చిన లేదా మెడలో పెరుగుతున్న వాపును నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

థైరాయిడ్ క్యాన్సర్ అనగానే కొంత భయం కలిగినా... వీటికి చికిత్స అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి.

సకాలంలో గుర్తించడం, రిస్కుసు సరిగ్గా అంచనా వేయటం, అవసరమైనంత మాత్రమే చికిత్స చేయడం, చికిత్స తర్వాత క్రమం తప్పకుండా ఫాలో అప్ చేయడం - ఇవే మంచి ఫలితాలకు కీలకం.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)