‘తిడతాడు, కొడతాడు, పదేపదే అత్యాచారం చేస్తాడు, చంపేందుకూ ప్రయత్నిస్తాడు.. అయినా ఆయన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నానంటే’

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం
    • రచయిత, మార్సీ మెక్‌కూల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

స్నేహితులు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని ఉండకపోతే తనను ఇన్నేళ్లు శారీరకంగా, మానసికంగా వేధించిన వ్యక్తినే పెళ్లి చేసుకొని ఉండేదాన్నని అమీ అనే మహిళ చెప్పారు.

(అమీ అనేది ఆమె అసలు పేరు కాదు)

ఒకవేళ పెళ్లి జరిగి ఉంటే ఆ వ్యక్తి తనను చంపేసి ఉండేవారని ఆమె భయపడుతున్నారు.

సీరియల్ రేపిస్ట్ క్రిస్టోఫర్ మాల్కమ్‌కు ఇటీవలే జైలు శిక్ష పడింది. అమీ జీవితంలో మానని గాయాలు చేసిన వ్యక్తి క్రిస్టోఫర్ మాల్కమ్.

"ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నా తండ్రిని చూసేందుకు ఒక ఫాదర్స్ డే సమయంలో వెళ్లే ముందు ఆయన నన్ను గాయపరిచాడు. ముఖమంతా గాయాలతో నిండిపోయింది" అని అమీ చెప్పారు.

"హింసను తగ్గించుకోడానికి, ప్రాణాలతో బయటపడటానికి ఆ బంధంలో కొనసాగడమే ఓ మార్గంగా ఉండేది" అని అమీ అన్నారు.

(గమనిక: ఈ కథనంలో కలవరపరిచే అంశాలున్నాయి)

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మాల్కమ్ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం తన భద్రతకు ప్రమాదకరమని ఆమె భావించారు.

అమీ కుటుంబసభ్యులు, స్నేహితులకు మాత్రం ఆమె భద్రతపై రోజురోజుకూ ఆందోళన పెరిగింది.

వాళ్లు పలుమార్లు గృహహింస ఫిర్యాదు పద్ధతిలో స్కాట్లాండ్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు.

అమీ గాయాల ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్‌లు వంటి ఆధారాలను అధికారులకు సమర్పించారు.

ఈ ఆధారాలతో మాల్కమ్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులకు తగిన సాక్ష్యాలు లభించాయి.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం
ఫొటో క్యాప్షన్, పెళ్లికి నాలుగు వారాలముందు మాల్కమ్‌ను అరెస్ట్ చేశారు.

పరిచయం.. సహజీవనం

2024 సెప్టెంబర్‌లో మాల్కమ్‌ను అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత కొద్దికాలానికే అమీ తనపై జరిగిన అత్యాచారం, దాడులు, వేధింపుల గురించి పూర్తిస్థాయిలో ఫిర్యాదు చేశారు.

మరో నాలుగు వారాల్లో ఆమె మాల్కమ్‌ని పెళ్లి చేసుకోవాల్సి ఉంది.

2023 ఆగస్టు చివరివారంలో టిండర్ అనే డేటింగ్ యాప్‌లో మాల్కమ్‌తో అమీకి పరిచయం ఏర్పడింది.

తర్వాత వారు కాఫీ కోసం కలిశారు. సరదాగా తిరిగారు. "అదంతా చాలా బాగుండేది" అని అమీ గుర్తుచేసుకున్నారు. తాను ఊహించిన కంటే వేగంగా తమ బంధం ముందుకుసాగిందని అమీ తెలిపారు.

మొదటి వారంలోనే మాల్కమ్ తల్లిదండ్రులను అమీ కలిశారు. కొన్నినెలల్లోపే వారు సహజీవనం ప్రారంభించారు. క్రిస్మస్ సరికి ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది.

"మేం సంతోషంగా ఉన్న సమయంలో ఆయన నా బెస్ట్ ఫ్రెండ్‌లా అనిపించేవాడు" అని అమీ గతాన్ని గుర్తుచేసుకున్నారు.

''చివరి రోజుల్లో అయితే నేను చెప్పాలనుకునేమాటలను కూడా ఆయనే పూర్తిచేసేవాడు. నేనేం ఆలోచిస్తున్నానో కూడా ఆయనకు తెలిసిపోయేది. అదంతా బాగుండేది. కానీ అదే సమయంలో భయంగానూ ఉండేది" అని ఆమె చెప్పారు.

అమీ జీవితాన్ని చాలా తొందరగానే మాల్కమ్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

''సంబంధం మన ఇద్దరి మధ్యే ఉండాలంటూ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయాలని నన్ను బలవంతం చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు నా కుటుంబసభ్యులు ఫోన్ చేసినా మాట్లాడనిచ్చేవాడు కాదు. వారి యాక్సెంట్ నచ్చదనేవాడు. నా ఫోన్‌ని దాచిపెట్టేవాడు లేదంటే లాక్కునేవాడు'' అని తాను ఎదుర్కొన్న వేధింపులను అమీ వివరించారు.

అమీ జాబ్ చేసే చోటకు వెళ్లి తొందరగా వచ్చేయమని, లేదంటే గొడవ చేస్తానని మాల్కమ్ బెదిరించేవారు.

మాల్కమ్ చెప్పినట్టు వినకపోతే ఇంటికి వెళ్లిన తర్వాత ఆ రాత్రి ఎంత భయంకరంగా, దారుణంగా ఉంటుందో అమీకి తెలుసు.

''ఇది నాకు చాలా బాధ కలిగించేది. ఎంతో కష్టపడి ఆ రంగంలోకి వెళ్లాను. నా ఉద్యోగాన్ని ఎంతో ప్రేమించా. పనికి దూరమైనప్పుడు నా జీవితంలో ఒక భాగాన్ని కోల్పోతున్నట్లు అనిపించేది" అని ఆమె చెప్పారు.

"నేను చేసేపని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్లాలనేది మరో వ్యక్తి నిర్ణయానికి వదిలేయడాన్ని చూసి నా సహోద్యోగులు ఇక నన్ను గౌరవించడంలేదేమో అనుకునేదాన్ని. ఏం జరుగుతుందో వారికి తెలుసని నాకు అప్పుడు తెలియదు" అని అమీ గుర్తుచేసుకున్నారు.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం

ఫొటో సోర్స్, Police of Scotland

ఫొటో క్యాప్షన్, మాల్కమ్‌కు 16ఏళ్ల జైలుశిక్ష పడింది.

‘మూడు రోజుల పాటు కొడుతూనే ఉన్నాడు’

వారి సంబంధంలో హింస కూడా ఉంది.

'' మొదట్లో ఎప్పుడో ఒకసారి కొట్టేవాడు. కానీ క్రమంగా అది తరచూ దాడి చేసే స్థాయికి చేరుకుంది'' అని అమీ చెప్పారు.

అలాంటి ఓ సంఘటన ఆమె గురించి వివరించారు.

"ఓసారి వరుసగా మూడు రోజుల పాటు మాల్కమ్ 'అటాక్ మోడ్‌'లో (దాడికి పాల్పడుతూనే) ఉన్నాడు. సోఫాను కత్తితో చించేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు" అని చెప్పారు.

మాల్కమ్ తన ఛాతీపై కూర్చొని గొంతు పిసికేవాడని అమీ చెప్పారు.

తనపై దాడి చేసే సమయంలో మాల్కమ్ తనను మరింతగా ఎగతాళి చేస్తూ, ఇంకా హింసకు పాల్పడతానని బెదరించేవాడని అమీ చెప్పారు.

మాల్కమ్ అలా చేసిన ఓ దాడిలోనే అమీకి జీవితాంతం మానని గాయాలయ్యాయి.

ఆమె రూపంలోనూ మార్పులొచ్చాయి.

మరో సందర్భంలో ఆమె మణికట్టును విరగ్గొట్టి, ఆస్పత్రికి కూడా వెళ్లనివ్వలేదు. ఆ గాయం ఇప్పటికీ మానలేదు. ఆమె ఇప్పటికీ ఒక చేతితో పుస్తకాన్ని పట్టుకోలేరు.

ఓ వాగ్వాదం సందర్భంగా ఆ దాడి చేసినట్టు అమీ గుర్తు చేసుకున్నారు.

మహిళలెప్పుడూ తన జీవితాన్ని కంట్రోల్ చెయ్యాలని చూస్తారని అరుస్తూ మాల్కమ్ తనపై దాడి చేశాడని అమీ తెలిపారు.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం
ఫొటో క్యాప్షన్, అమీకి తన సోదరి రాసిన లేఖ.

ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నా పట్టించుకోకుండా...

ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా అనేకసార్లు అమీపై మాల్కమ్ అత్యాచారానికి పాల్పడ్డారు.

మాల్కమ్ ప్రవర్తనలో అనూహ్య మార్పులుంటాయని అమీ చెప్పారు.

"కొన్నిసార్లు అనూహ్యంగా ప్రవరిస్తాడు. మరి కొన్ని సందర్భాల్లో నాకేం జరగబోతుందో ముందే చెప్తాడు." అని ఆమె వివరించారు.

"మాల్కమ్ ప్రవర్తన భరించరానిదిగా, దారుణంగా ఉండే రోజుల్లో ఆయన చేసే మొదటి పని.. ఉదయం 6 గంటలకే హెవీ మెటల్ (గట్టి శబ్దాలతో వచ్చే సంగీతాన్ని) ఆన్ చేయడం" అని అమీ గుర్తు చేసుకున్నారు.

"అది నాకెంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పాను. అది నాకు చిత్రహింస అని మాల్కమ్‌కు తెలుసు. ఇవాళ జరగబోయే దానికి సిద్ధంగా ఉండు అని చెప్పేవాడు. నాపై దాడి చేసిన తర్వాత కూడా మాల్కమ్‌తో కూర్చొని మాట్లాడేదాన్ని. నాతో అలా ప్రవర్తించడం సరికాదని నచ్చజెప్పడానికి ప్రయత్నించేదాన్ని. అప్పుడాయన తన సమస్యల గురించి మాట్లాడడం మొదలుపెట్టి విషయాన్ని పక్కదారి పట్టించేవాడు. దీంతో నేను ఏమీ చేయలేకపోతున్నాననిపించేది" అని అమీ వివరించారు.

"మనమేం చేయలేమని గుర్తించిన తర్వాత మనలో స్పందనారాహిత్యం ఏర్పడుతుంది. మెల్లగా దానికి అలవాటుపడిపోతాం" అని ఆమె అన్నారు.

"ఎవరికైనా చెబితే మాల్కమ్‌ను వదిలేసి వెళ్లిపోమని చెబుతారని తెలుసు. కానీ నిజానికి వెళ్లిపోగల పరిస్థితిలో ఉన్నట్టు అనిపించదు. చిక్కుకుపోయామన్న భావన కలుగుతుంది'' అని అమీ చెప్పారు.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం
ఫొటో క్యాప్షన్, మాల్కమ్‌ జైలునుంచి బయటకు వస్తే తనకు ప్రమాదమని అమీ ఆందోళన చెందుతున్నారు.

‘చివరి నిమిషంలో పెళ్లి వద్దనకున్నా వచ్చేసెయ్’

"స్నేహితులు, కుటుంబసభ్యులు మాట్లాడిన విధానమే నన్ను కాపాడింది. నా గురించి ఉన్న ఆందోళనను వాళ్లు నాతో వ్యక్తపరిచిన విధానమే నేను అందరికీ దూరం కాకుండా కాపాడింది. వాళ్లు సూటిగానే మాట్లాడేవారు. కానీ నన్ను ఒత్తిడి చేసేవారు కాదు" అని అమీ చెప్పారు.

వాళ్లు తనను అభిమానిస్తున్నారని, తన క్షేమమే కోరుకుంటున్నారని స్పష్టంగా చెప్పారు. మాల్కమ్ మంచి వ్యక్తి కాదనుకుంటున్నామని కూడా అన్నారు. అయితే ఏ నిర్ణయమేదైనా తనను సొంతగా తీసుకోమని కోరారు.

"అమ్మా, నాన్నలాగే నేనూ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను".. అమీ సోదరి లేఖ

అమీ పెళ్లికి తాను ఎందుకు రాలేకపోతున్నానో వివరిస్తూ అమీకి ఆమె సోదరి ఓ లేఖ రాశారు.

తనకు భయంకరమైన కలలు వస్తున్నాయని, అమీని మళ్లీ ఎప్పటికీ చూడలేమోనని భయపడుతున్నానని ఆ లేఖలో అమీ సోదరి భయాందోళన వ్యక్తంచేశారు.

"చివరి నిమిషంలో అయినా సరే నీకు ఈ పెళ్లి వద్దనిపిస్తే నా దగ్గరకు వచ్చేసెయ్. నా ఇంటి తలుపు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది" అని అమీ సోదరి ఆ లేఖలో రాశారు.

"ఇది చదివిన తర్వాత నేను నీ పెళ్లికి రావాలని నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే క్రిస్ (మాల్కమ్) గురించి తెలిసిన తర్వాత నువ్వు ఆయన్ను పెళ్లి చేసుకోవడం నేను చూడలేను. నిన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పు. అది నేను చూస్తూ ఉండలేను. అస్సలు తట్టుకోలేను. నా మాటలు నిన్ను నొప్పిస్తే క్షమించు.

కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో. ఈ బంధం నీకొద్దు అని ఏ క్షణాన అనిపించినా నా దగ్గరకు వచ్చేయ్. అమ్మా, నాన్న లాగే నేనూ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఈ లేఖ చదివినప్పుడు నా మీద నీకు ఎలాంటి అభిప్రాయమనింపించినా సరే.. నేను ఎల్లప్పుడూ నీ మంచి కోసమే తపిస్తా. శక్తిమేరకు నిన్ను కాపాడుకునేందు ప్రయత్నిస్తా. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తా. అది గుర్తు పెట్టుకో. నువ్వు ఎవరో గుర్తుంచుకో" అని అమీ సోదరి లేఖలో రాశారు.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసుల సాయంతో...

అమీకి తెలియకుండానే నలుగురు వ్యక్తులు తమ ఆందోళనల గురించి పోలీసులకు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు.

మొదటి ఫిర్యాదు తర్వాత మాల్కమ్ అరెస్ట్ అయినా బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే మరిన్ని ఆధారాలు లభిస్తుండడంతో అమీ కూడా వాంగూలం ఇవ్వాలని పోలీసులు కోరారు.

"అధికారులు నాతో స్పష్టంగా, నిర్మొహమాటంగా మాట్లాడారు. మీరు సాక్ష్యం చెప్పకపోతే రోడ్డు పక్కన కాల్వలో నీ మృతదేహాన్ని మేం గుర్తించాల్సి ఉంటుంది" అని వాళ్లు నాతో చెప్పారు.

"ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఎందుకంటే అప్పటిదాకా ఎవరూ నాతో అంత సూటిగా మాట్లాడలేదు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఓ సమయంలో నిజంగానే ఇలా జరిగే అవకాశం ఉందని నాకు బాగా తెలుసు" అని అమీ చెప్పారు.

30ఏళ్ల వయసున్న అమీ ఇప్పుడు తన కథను బీబీసీతో పంచుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, పోలీసులే తనను కాపాడారని ఆమె నమ్ముతున్నారు.

తనవిషయంలో వ్యవస్థ సరిగ్గా పనిచేసిందని అమీ భావిస్తున్నారు.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నలుగురు మహిళలపై నేరాలు

వేధింపులకు గురైన బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనకాడితే, ఆధారాల కోసం వారి వాంగ్మూలంపైనే ఆధారపడకుండా మిగిలిన అన్ని మార్గాల్లో ఆధారాలను అన్వేషిస్తామని స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు.

బాడీ కెమేరా రికార్డింగ్‌లు, సెల్ ఫోన్ విశ్లేషణ, గాయాల ఫొటోలు, మెడికల్ రిపోర్టులు, గతంలో జరిగిన సంఘటనలు, మాజీ భాగస్వాముల వాంగూల్మాలు వంటి ఆధారాలుంటాయి.

అలాంటి ఆధారాలుంటే నేరం రుజువై శిక్ష పడే అవకాశం ఉన్నప్పుడు కేసులను ముందుకు తీసుకెళ్లొచ్చు.

మాల్కమ్ నేరాలను నిరూపించేందుకు అమీ కుటుంబసభ్యులు, స్నేహితులు అందించిన సమాచారం చాలా కీలకమని ఓ పోలీసు ప్రతినిధి అన్నారు.

56 మంది సాక్ష్యుల విచారణ అనంతరం 37ఏళ్ల మాల్కమ్‌ దోషిగా తేలారు. స్కాట్లాండ్‌లోని లోథియన్, మోరే పట్టణాల్లో కలిపి మొత్తం నలుగురు మహిళలపై మాల్కమ్ నేరాలకు పాల్పడినట్టు రుజువైంది. వారిలో అమీ కూడా ఉన్నారు. మిగిలిన నేరాలు 2008 నాటివి. అప్పటికి అమీ ఇంకా టీనేజర్.

తనకు విధించిన 16 ఏళ్ల జైలు శిక్షపై మాల్కమ్ అప్పీలు చేశారు.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మాల్కమ్ విడుదల?

మహిళలపై మాల్కమ్‌లో ద్వేషం లోతుకు పాతుకుపోయిందని, దానివల్ల ఆయన ఎప్పటికీ మారలేరని, ఆయన అప్పీలును తిరస్కరించాలని అమీ కోరుతున్నారు.

స్టేసీ హంటర్, విక్కీ సోలమాన్ వంటి మహిళలు తమ భాగస్వాముల చేతుల్లో హత్యకు గురైన ఉదంతాల గురించి చదివినప్పుడు తన భవిష్యత్ భద్రతపై అమీ కూడా ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రతిపాదనలవల్ల మాల్కమ్‌ ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఆమె మరింతగా భయపడుతున్నారు.

జైళ్లలో రద్దీని తగ్గించేందుకు యూకే ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను స్కాట్లాండ్‌కు చెందిన అత్యున్నత జడ్జిలు ఈ వారం విమర్శించారు. తీవ్రమైన హింస, నేరాలు, అత్యాచారాలకు పాల్పడిన వారిని విడిచిపెడితే ప్రజా భద్రతకు తీవ్ర హాని కలుగుతుందని వారు హెచ్చరించారు.

మహిళలను హింస నుంచి రక్షించడం స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీకి ప్రాధాన్యతగా కనిపిస్తోంది. స్త్రీ ద్వేషాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చడంతో పాటు, బాధితుల సహాయం కోసం తన పదవీకాలంలోనే నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన హామీఇచ్చారు.

అయితే ప్రభుత్వం అందుకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని రేప్ క్రైసిస్ స్కాట్లాండ్ అనే స్వచ్ఛంద సంస్థ వాదిస్తోంది.

పెళ్లి, సహజీవనం, అత్యాచారం, గృహహింస, మహిళ, నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నా: అమీ

ప్రస్తుతం తన జీవితాన్ని ఆస్వాదించాలని అమీ నిర్ణయించుకున్నారు. ఆమెకు పలు సంస్థల నుంచి మద్దతు లభించింది. థెరపీ తీసుకున్నారు. కొత్త కారు, ఇళ్లు కొన్నారు. కుటుంబ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.

తన ఇన్నాళ్ల వేదనకు పని వల్లే ఉపశమనం లభించిందని అమీ చెప్పారు. తనకు అండగా నిలిచినవారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

"కుటుంబం, స్నేహితులు మనకు అండగా నిలిచినప్పుడు మనం మరింత మనోధైర్యంగా ఉంటామనే విషయాన్ని వాళ్లకు తెలియజేయడం ముఖ్యం. ఎందుకంటే వారు మన తరఫున నిలబడితే మనం మరింత బలంగా మారతాం కాబట్టి" అని అమీ చెప్పారు.

"నేను వారిని ద్వేషిస్తానేమోనని, వారితో సంబంధాలు తెంచుకుంటానేమోనని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడ్డారు. కానీ వారు చేసిన సహాయం వల్ల, ఇచ్చిన ధైర్యం వల్ల మనశ్శాంతి, ఉపశమనం కలిగింది. వారి విషయంలో ఎంతో కృతజ్ఞతతో ఉన్నా" అని అమీ చెప్పారు.

"అంతమంది నా కోసం ఆలోచిస్తారని నాకు తెలియదు. నేను వారికి రుణపడి ఉంటా." అని చెప్పారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)