కేసీఆర్ కుటుంబ భూముల వివాదం: తెలంగాణలో ఒకరు ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉండొచ్చు?

ఫొటో సోర్స్, BRS PARTY/FACEBOOK
తెలంగాణలో వ్యక్తిగత వ్యవసాయ భూముల పరిమితిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్), ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున భూములు కలిగి ఉన్నారంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అలాగే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫార్మ్ హౌస్ భూములపై విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో వ్యవసాయ భూముల సీలింగ్ విషయంపై దుమారం మొదలైంది.
ఒక కుటుంబానికి లేదా వ్యక్తికి ఎంత వ్యవసాయ భూమి ఉండాలనే విషయంపై 1973లో చేసిన 'భూ గరిష్ఠ పరిమితి చట్టం'లో కొన్ని నిబంధనలున్నాయి. కానీ పర్యవేక్షణ లోపాలతో క్షేత్రస్థాయిలో ఇది పూర్తిగా అమలు కావడం లేదని రెవెన్యూ మాజీ అధికారులు చెబుతున్నారు. ఈ చట్టం కింద భూములు స్వాధీనం చేసుకున్నట్లుగా గత కొన్నేళ్లలో ఎలాంటి దాఖలాలు లేవని అంటున్నారు.
''వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితులలో అమలవుతున్నట్లుగా కనిపించదు. 1980ల తర్వాత నుంచే ఈ పరిస్థితి వచ్చింది'' అని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, రెవెన్యూ రంగ నిపుణుడు ఏనుగు నర్సింహారెడ్డి బీబీసీతో చెప్పారు.

రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..
కేసీఆర్, ఆయన ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో తెలంగాణలోని 9 జిల్లాల్లో 439.30 ఎకరాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సెప్టెంబరు 16న ప్రకటన చేశారు.
అయితే తమపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేటీ రామారావు సహా కుటుంబ సభ్యులు, బంధువులు వేర్వేరుగా ఖండించారు.
అసెంబ్లీలో 'ఆన్ రికార్డు' రేవంత్ రెడ్డి ప్రకటించిన వివరాల మేరకు, 'కేసీఆర్ కుటుంబానికి.. అంటే కేసీఆర్, ఆయన భార్య పేరుతో 67.13 ఎకరాలు, కేటీఆర్ కుటుంబం.. అంటే కేటీఆర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె పేరుతో 123.19 ఎకరాలు, కవిత కుటుంబం.. అంటే కవిత, ఆమె భర్త పేరుతో 37.26 ఎకరాలు, హరీశ్ రావు కుటుంబం.. అంటే హరీశ్ రావు, ఆయన భార్య పేరుతో 30.16 ఎకరాలు, జోగినిపల్లి కుటుంబం.. అంటే సంతోష్, ఆయన తండ్రి, సంతోష్ భార్య పేరుతో 79.20 ఎకరాలు, నవీన్ కుమార్- కొండల్ రావు కుటుంబం.. అంటే నవీన్ కుమార్, కొండల్ రావు పేరుతో 101.14 ఎకరాలు ఉన్నాయి' అని చెప్పారు.

ఫొటో సోర్స్, REVANTH REDDY/FACEBOOK
కేటీఆర్, ఇతరులు ఏం చెప్పారంటే..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) తనతో పాటు తన కుటుంబం, కేసీఆర్ కుటుంబం సహా కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
'చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూములపై బురదజల్లే కుట్ర చేశారు. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది. కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాల్లో ఉండేది' అని చెప్పారు.
'కేసీఆర్ పుట్టిన నాటి నుంచి నేటిదాకా.. మా కుటుంబం ఆస్తులెన్ని, రేవంత్ రెడ్డి పుట్టిన నాటి నుంచి నేటి దాకా.. అతని కుటుంబ ఆస్తులు ఎన్ని అనే దానిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధం' అని అన్నారు కేటీఆర్.
తనకున్న వ్యవసాయ భూమి వివరాలు ఎన్నికల అఫిడవిట్, ఆదాయపు పన్ను రిటన్స్‌లో స్పష్టంగా చెప్పానన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.
'ఒక్క గుంట కూడా అదనంగా లేదు' అని చెప్పారాయన.
అలాగే తనకు, తన కుటుంబానికి సిద్ధిపేట జిల్లాలో ఎలాంటి భూమీ లేదని ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్ 'ఎక్స్'లో ప్రకటించారు.
మరోవైపు, తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్లుగా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 'ఎక్స్'లో ప్రకటించారు.
'ప్రభుత్వ నిబంధనలను మించి ఒక్క గజం భూమి నాకు ఎక్కువగా ఉన్నా.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికన్నా గజం భూమి అదనంగా ఉన్నా, ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను' అని కవిత చెప్పారు.

ఫొటో సోర్స్, KTR/FACEBOOK
వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం ఏం చెబుతోంది?
ఆంధ్ర ప్రదేశ్ భూ సంస్కరణలు (వ్యవసాయ భూములు కలిగి ఉండే పరిమితి) చట్టం లేదా భూ గరిష్ఠ పరిమితి బిల్లు-1973ను 1972 సెప్టెంబరులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఆమోదించాయి. 1973 జనవరి 1న ఇది రాష్ట్రపతి ఆమోదం పొందింది.
ఈ చట్టం 1975 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఎవరికి ఎన్ని వ్యవసాయ భూములు గరిష్ఠంగా ఉండొచ్చనే విషయాన్ని చెబుతుంది.
2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా 1973 నాటి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు భూ చట్టాల నిపుణుడు, గ్రామీణ న్యాయ పీఠం కో ఫౌండర్ ఎం.సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు.
'2016లో రెవెన్యూ చట్టాలపై సమీక్ష జరిగింది. ఆ సమయంలో వ్యవసాయ భూముల సీలింగ్ చట్టాన్ని తెలంగాణలో యథాతధంగా అమలు చేయాలనే నిర్ణయం జరిగింది' అని చెప్పారు. దీన్ని తెలంగాణ భూ సంస్కరణలు (వ్యవసాయ భూములు కలిగి ఉండే పరిమితి) చట్టం -1973గా పిలుస్తారు.
ఈ చట్టం 'వ్యక్తి' పేరుతో ఉండే భూములకు 'సీలింగ్' (పరిమితి) ఎంతనేది వివరిస్తుంది. వ్యక్తి అంటే 'కుటుంబ యూనిట్'గా పరిగణిస్తారని చట్టంలో ఉంది.
కుటుంబం అనేది భర్త, భార్య లేదా భార్యలు, వారి మైనర్ కుమారులు, అవివాహిత మైనర్ కుమార్తెలు.
'భర్త చనిపోయిన భార్య లేదా భార్య చనిపోయిన భర్త, మైనర్ కుమారులు, అవివాహిత మైనర్ కుమార్తెలు. విడాకులు తీసుకుని తిరిగి వివాహం చేసుకోని వ్యక్తి, వారి సంరక్షణలో ఉన్న మైనర్ కుమారులు, అవివాహిత మైనర్ కుమార్తెలు, తల్లి లేదా తండ్రి లేదా తల్లిదండ్రులిద్దరూ మరణించిన మైనర్ కుమారులు, అవివాహిత మైనర్ కుమార్తెలు' – ఇలా చట్టంలో వివిధ రకాలుగా కుటుంబానికి అర్థం చెప్పారు.
కంపెనీలు, ఫోరంలు, సొసైటీలు, సమితులను కూడా ఒక యూనిట్‌గా పరిగణించి వ్యక్తులుగా చూడాలని చట్టం చెబుతోంది.
అయితే తర్వాత దశల్లో వివిధ కంపెనీలు, ఫోరంలు సహా 'వ్యక్తులు' చట్టం నుంచి వివిధ కారణాలతో మినహాయింపులు పొందారని సునీల్ కుమార్ చెప్పారు.
మూడు రకాలుగా భూముల విభజన
భూ గరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం, భూములను మూడు రకాలుగా విభజించారు.
వెట్ ల్యాండ్ (పల్లపు భూమి), రెండు పంటలు పండే వెట్ ల్యాండ్, డ్రై ల్యాండ్ (మెట్ట భూమి).
ఇందులో భూముల సారాన్ని బట్టి, సాగు నీటి వనరుల లభ్యత ఆధారంగా వ్యవసాయ భూములను వివిధ కేటగిరీలుగా విభజించారని ఎం.సునీల్ కుమార్ చెప్పారు.
చట్టం ప్రకారం ఎన్ని భూములు కలిగి ఉండాలంటే..
భూముల కేటగిరీలు, పండే పంటల సంఖ్యను బట్టి సీలింగ్ పరిమితులను చట్టంలో వివరించారు.
దీని ప్రకారం భూములను క్లాస్ ఏ నుంచి కే వరకు చట్టంలో విభజించారు. ఇందులో క్లాస్ ఏ నుంచి ఎఫ్ వరకు 'వెట్' ల్యాండ్స్ ఉండగా, క్లాస్ జీ నుంచి కే వరకు మెట్ట భూములు ఉన్నాయి.
ఎలాంటి నీటి లభ్యత లేకుండా, ఏమాత్రం సాగుకు అనువుగా లేని, పూర్తిగా మెట్ట భూమి అయి ఉన్నప్పటికీ గరిష్ఠంగా 54 ఎకరాలకే ఒక కుటుంబం పేరుతో ఉండేందుకు వీలుంటుందని సునీల్ కుమార్ వివరించారు.
భూ గరిష్ఠ పరిమితి చట్టం-1973 ప్రకారం


'భూమి స్వరూపం అనేది జిల్లాలు, ప్రాంతాల వారీగా మారుతుంటుంది. నీటి లభ్యత, సారం ఆధారంగా ఈ సీలింగ్ వర్తిస్తుంది. రాష్ట్రమంతటా ఒకే తీరుగా సీలింగ్ ఉంటుందని చెప్పలేం. అయితే, 1973లో వచ్చిన చట్టం నాటి భూముల స్వరూపమే ఇంకా కొనసాగుతోంది' అని సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు.
అయితే, సీలింగ్ అనేది వ్యవసాయ భూమి ఎక్కడ ఉన్నా వర్తిస్తుందని, దానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉండదని చట్టం చెబుతోందని ఆయన వివరించారు.
చట్టం వచ్చిన నాటికీ, ఇప్పటికీ భూముల స్వరూపంలో ఎన్నో వ్యత్యాసాలు వచ్చాయని, నీటి లభ్యత విషయంలో, స్వరూపం మార్పు విషయంలో తేడాలు వచ్చాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Harish Rao Thanneeru/facebook
సీలింగ్‌కు మించి ఉంటే వెనక్కి తీసుకోవచ్చా?
వ్యవసాయ భూములు నిర్దేశిత సీలింగ్ కంటే ఎక్కువగా ఉంటే సంబంధిత భూ యజమాని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని మాజీ జాయింట్ కలెక్టర్, రెవెన్యూ రంగ నిపుణుడు ఏనుగు నర్సింహారెడ్డి బీబీసీతో చెప్పారు.
'సీలింగ్ కంటే భూమి ఎక్కువగా ఉంటే తనకు గరిష్ఠ పరిమితికి మించి ఉందని ఆర్డీవో ముందు భూ యజమాని డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే భూ యజమాని ఇవ్వకపోతే ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది లేదా తహసీల్దారు నేరుగా నివేదిక సమర్పించవచ్చు' అని చెప్పారు.
భూ యజమాని నుంచి వచ్చే డిక్లరేషన్ మేరకు ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు.
'నోటీసులకు సమాధానం వచ్చిన తర్వాత భూమి స్వరూపం బట్టి మిగులు ఉన్న భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వీలుంటుంది' అని ఏనుగు నర్సింహారెడ్డి చెప్పారు.
మరోవైపు, కోర్టుల ద్వారా వ్యక్తులు సీలింగ్ చట్టంలో మినహాయింపులు పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలంగాణ హైకోర్టు న్యాయవాది అశోక్ కుమార్ బీబీసీతో చెప్పారు.
'ప్లాంటేషన్ (తోటలు) ఉంటే సీలింగ్ కిందకు రాకుండా కొందరు మినహాయింపులు పొందారు. చట్టం నుంచి ఎన్నో మినహాయింపులు వచ్చిన సందర్భాలున్నాయి. అయితే, సీలింగ్ విషయంలో గరిష్ఠంగా 54 ఎకరాల పరిమితిపై ఎలాంటి మినహాయింపులు లేవు' అని అశోక్ కుమార్ వివరించారు.
చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, ఎవరికైనా నిర్దేశిత ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉండి ఆ వివరాలు దాచిపెడితే దాన్ని నేరంగా పరిగణిస్తారు.
'ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.రెండు వేల జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది' అని చట్టంలో పేర్కొన్నారు.
సీలింగ్ చట్టం కింద భూములు తీసుకున్నప్పుడు కొంతమేర పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని సునీల్ కుమార్ చెప్పారు.
'ఈ చట్టంలోని సెక్షన్ 15 కింద పరిహారం చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ, ఇది మిగిలిన ప్రాజెక్టుల తరహాలో ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇచ్చే పరిహారంలా ఎక్కువగా ఉండకపోవచ్చు. పరిహారం ఎంత ఇవ్వాలనే దానిపై భూమి స్వరూపం, విస్తీర్ణం, ప్రాంతం ఆధారంగా ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుంది' అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























