రేసు మధ్యలో దుస్తుల్లోనే మల విసర్జన, గెలిచాక క్షమాపణ.. చైనాలో హైరోక్స్ పోటీల్లో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎల్లా కిప్లింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆస్ట్రేలియా క్రీడాకారిణి దుస్తుల్లో మల విసర్జన చేసుకుని, అలాగే బీజింగ్‌లో జరిగిన హైరోక్స్ పోటీలో పాల్గొన్నందుకు క్షమాపణలు చెప్పారు.
తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆమె తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతూ విజయాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
బీజింగ్‌లో శనివారం జరిగిన ఇండోర్ ఫిట్‌నెస్ పోటీలో చోటు చేసుకున్న ఘటనపై జొయానా వీట్రిజిక్ మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలిపింది.
"ఆ సమయంలో నేను వేరే నిర్ణయం తీసుకోవాల్సింది. పోటీ నుంచి తప్పుకొని ఉండాల్సింది" అని చెప్పారు.
పోటీ కొనసాగుతున్న సమయంలోనే దుస్తుల్లో మల విసర్జన చేసుకున్న తర్వాత కూడా వీట్రిజిక్ పోటీలో కొనసాగిన దృశ్యాలు బయటకు రావడంతో పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
దీంతో పోటీలను సరిగా నిర్వహించలేకపోయినందుకు హైరోక్స్ సహ వ్యవస్థాపకుడు మోరిట్జ్ ఫ్యూర్‌స్టే క్షమాపణలు చెప్పారు.

పశ్చాత్తాపం వ్యక్తం చేసిన క్రీడాకారిణి
జొయానా వీట్రిజిక్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, "నేను ఏం చేశానో నాకు తెలుసు. నేను చేసిన పని వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడ్డారు. దీని వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నేను నిజంగా క్షమాపణలు చెబుతున్నాను" అని తెలిపారు.
దీనిపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత వీట్రిజిక్ రేసులో సాధించిన విజయాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారామె.
వీట్రిజిక్ తన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో "బీజింగ్‌లో జరిగిన రేసు సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో చైనా ప్రజలకు, నాతో పోటీలో పాల్గొన్నవారికి, ప్రేక్షకులకు, హైరోక్స్ నిర్వాహకులకు నా హృదయపూర్వక క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను"
"నేను పోటీలో పాల్గొనేంత వరకు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. అనారోగ్య సమస్య వస్తుందని ఊహించడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఇప్పుడు ఏం జరిగిందా అని చూసుకుంటే నాకే అసహ్యంగా ఉంది. అప్పుడు ట్రాక్ నుంచి తప్పుకోకపోవడంపై పశ్చాత్తాపపడుతున్నాను. అప్పుడు వేరే నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అలా పోటీలో కొనసాగినందుకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. దాని వల్ల కలిగిన అంతరాయానికి, అసౌకర్యానికి నేను తీవ్రంగా చింతిస్తున్నాను" అని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
హైరోక్స్ నిర్వాహకుల స్పందన
పోటీలలో.. జీవ సంబంధిత కలుషిత పదార్థాలు, వైద్య పరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని హైరోక్స్ స్పష్టం చేసింది. అయితే పోటీ జరుగుతున్న సమయంలో ఊహించని పరిస్థితి ఎదురైందని, అప్పుడు ఏం చేయాలనే విషయంలో స్పష్టత కొరవడిందని ఆ సంస్థ పేర్కొంది.
"ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, పోటీ జరిపే ప్రక్రియను మెరుగుపరుస్తాం" అని ఇన్‌స్టాగ్రామ్‌లో మోరిట్జ్ ఫ్యూర్‌స్టే తెలిపారు.
వీట్రిజిక్‌కు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టిన తర్వాత హైరోక్స్ కీలక ప్రకటన చేసింది. ఆమెను బెదిరిస్తూ, అసభ్యంగా దూషిస్తూ సందేశాలు పంపేవారిని భవిష్యత్‌లో జరిగే హైరోక్స్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో "మా క్రీడా సమాజంలో హింసాత్మక బెదిరింపులకు, క్రీడాకారులకు హాని కలిగించే చర్యలకు చోటు లేదు" అని స్పష్టం చేశారు.
ప్రతి హైరోక్స్ రేసులో పోటీదారులు ఒక కిలోమీటరు పరిగెత్తిన తర్వాత ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తారు. ఇలా పరుగు, వ్యాయామాలను ఒకదాని తర్వాత ఒకటి చేసి రేసును పూర్తి చేస్తారు. ఈ వ్యాయామాల్లో బరువైన స్లెడ్‌ను ముందుకు నెట్టడం, బర్పీ జంప్స్, ఇండోర్ రోయింగ్, ఇసుక బస్తాను మోస్తూ కూర్చొని లేస్తూ ముందుకు సాగాలి.
2017లో జర్మనీలోని హాంబర్గ్‌లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ పోటీలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైరోక్స్ పోటీలు జరుగుతున్నాయి. చైనాలో ఈ పోటీ 2024 చివర్లో మొదలైంది.
హైరోక్స్‌లో "ఉమ్మివేయడం, ముక్కును శుభ్రం చేసుకోవడం, చెత్త వేయడం, నీటిని దుర్వినియోగం చేయడం" వంటి చర్యలకు జరిమానాలు విధిస్తారు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ బీజింగ్ పోటీల్లో దుస్తుల్లోనే మలవిసర్జన చేసిన వీట్రిజిక్‌ను తప్పించేందుకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొందరు ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























