అమెరికా, రష్యా, చైనా కలిస్తే క్వాడ్ బలహీనపడుతుందా.. భారత్ వ్యూహం ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌
ఫొటో క్యాప్షన్, చైనాలోని షెన్‌జెన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించేందుకు ముగ్గురు వ్యక్తులు క్రిమియాలోని ఒక హాలిడే రిసార్టులో 1945 ఫిబ్రవరిలో సమావేశమయ్యారు.

అప్పుడు, నాజీ జర్మనీ పతన దశకు చేరుకుంది.

సోవియట్ దళాలు బెర్లిన్ వైపు దూసుకువస్తుండగా, మిత్రరాజ్యాల దళాలు జర్మనీ పశ్చిమ సరిహద్దును దాటాయి.

పసిఫిక్ ప్రాంతంలో, అమెరికన్లు నిరంతరం జపాన్ వైపు ముందుకు సాగుతున్నారు.

అదే సమయంలో.. ముగ్గురు అగ్రనేతలు.. నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, సోవియట్ నేత జోసెఫ్ స్టాలిన్‌లు యాల్టా అని పిలిచే ప్రదేశంలోని ఆ రిసార్టులో సమావేశం కావడానికి అంగీకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో, అటువంటి భయంకరమైన పరిస్థితి మళ్లీ జరగకుండా నివారించడంపై చర్చ జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.

మరి ఇప్పుడెందుకు మళ్లీ యాల్టాను గుర్తుకు తెచ్చుకుంటున్నారు?

ఎందుకంటే, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు చైనాలోని షెన్‌జెన్‌లో సమావేశమయ్యారు.

ఈ త్రైపాక్షిక సమావేశాన్ని యాల్టా 2.0 అంటే యాల్టా రెండవ సమావేశంగా చాలా మంది విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

అయితే, చైనా మీడియా, విశ్లేషకులు ఇటువంటి పోలికను తప్పుగా పేర్కొనడమే కాకుండా, ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి విషయమని అభివర్ణించారు.

ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న ఉన్నత స్థాయి దౌత్య చర్చల నేపథ్యంలో, ప్రపంచంలో కొత్త శక్తి సమీకరణం ఆవిర్భవిస్తోందా? మారుతున్న ఈ అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో భారత్ ఎక్కడ నిలవనుంది?

క్వాడ్ కూటమిని ఉపయోగించుకుని భారత్ స్వతంత్ర వ్యూహాత్మక శక్తిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదా? లేక ప్రపంచంలోని అగ్రరాజ్యాల మధ్య సమతుల్యతను పాటించే క్రమంలో మరిన్ని సంక్లిష్ట సవాళ్లలో చిక్కుకుపోతుందా?

ఈ ప్రశ్నలకు కలెక్టివ్ న్యూస్‌రూమ్‌ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముఖేశ్ శర్మ, ఫోర్స్ మ్యాగజీన్ సంపాదకురాలు ఘజాలా వహాబ్‌తో పాటు జర్మనీ, ఇండోనేషియా, ఇథియోపియా, ఆసియాన్ దేశాలకు భారత రాయబారిగా పనిచేసిన గుర్జీత్ సింగ్‌తో చర్చించారు.

అమెరికా, రష్యా, చైనా
ఫొటో క్యాప్షన్, ఆ మూడు దేశాలు ప్రధానంగా తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు చూస్తున్నాయని గుర్జీత్ సింగ్ భావిస్తున్నారు.

ఈ మూడు అగ్రరాజ్యాల సమావేశం వెనుకాల కారణమేంటి?

ఘజాలా వహాబ్ ప్రకారం.. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలకు అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించి, ఆ ప్రాంతంలో స్థిరత్వాన్ని తీసుకురావడం.

ఇంధన ధరలు పెరగడం, హార్ముజ్ జలసంధి మూసివేయడం వంటివి ఈ మూడు దేశాలకు ఆందోళన కలిగించే విషయాలుగా ఉన్నాయని ఘజాలా వహాబ్ చెప్పారు.

షెన్‌జెన్ సమావేశాన్ని కేవలం ప్రతీకాత్మకమైనదిగా చూడకూడదని ఘజాలా భావిస్తున్నారు.

"ఇది కేవలం ఒక సందేశాన్ని పంపే విషయం మాత్రమే కాదు. ఎందుకంటే, ప్రస్తుతం ఈ మూడు దేశాలకు ఇందులో ఉన్న ప్రయోజనాలు, వాటాలు చాలా కీలకమైనవి" అని ఘజాలా వహాబ్ పేర్కొన్నారు.

ఇది తొలి సమావేశమేనని, మరిన్ని సమావేశాలు జరగొచ్చని అన్నారు ఘజాలా వహాబ్.

ఒకవేళ ఫలితాలు సానుకూలంగా ఉంటే, డిసెంబరులో అమెరికాలో మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉందన్నారు.

ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు మధ్యప్రాచ్యంలో ఒక పరిష్కారానికి ఆశ కల్పించవచ్చని చెప్పారు.

ఇదే సమయంలో.. మాజీ దౌత్యవేత్త గుర్జీత్ సింగ్ ఈ సమావేశం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మూడు దేశాలు తమను తాము అగ్రరాజ్యాలుగా భావిస్తున్నాయని అన్నారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించే దిశగా అవి ఉమ్మడి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదని తెలిపారు.

ఆ మూడు దేశాలు ప్రధానంగా తమ సొంత సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని గుర్జీత్ సింగ్ అభిప్రాయపడ్డారు.

''అమెరికా వాణిజ్య అసమతుల్యతలు, అరుదైన ఖనిజాల సరఫరా గురించి ఆందోళన చెందుతోంది. చైనా తనపై విధించిన ఆంక్షలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి ఆందోళన చెందుతోంది. రష్యా విషయానికొస్తే, ఈ సమావేశానికి హాజరు కావడం అనేది అంతర్జాతీయ రాజకీయాల ప్రధాన స్రవంతిలో తన స్థానాన్ని తిరిగి పొందడానికి ఒక సంకేతంగా భావిస్తోంది'' అని తెలిపారు.

''ఈ మూడు దేశాలు ఏకమై, మనం ఏమి చేయాలో మనకు నిర్దేశించడం మాకు ఇష్టం లేదు" అని అన్నారు.

భారత్, ఆసియాన్, గ్లోబల్ సౌత్‌లోని ఇతర దేశాలు ఇటువంటి చర్చల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రపంచంలోని అగ్రరాజ్యాల మధ్య జరిగే నిర్ణయ ప్రక్రియల్లో ఇతర దేశాల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని గుర్జీత్ సింగ్ అభిప్రాయపడ్డారు.

క్వాడ్ ప్రాముఖ్యత తగ్గుతోందా?

షెన్‌జెన్ సమావేశం 'క్వాడ్' భవిష్యత్తుపై చర్చలకు దారితీసింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ఈ కూటమి.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఒక వేదికగా పరిగణిస్తారు.

క్వాడ్ గతంలో ఉన్నంత ప్రభావవంతంగా లేదని ఘజాలా వహాబ్ అభిప్రాయపడ్డారు. దీనికి మద్దతుగా ఘజాలా కొన్ని పరిణామాలను ఉదహరించారు.

ఈ ఏడాది భారత్ క్వాడ్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ, అది జరగలేదు.

దీనికి బదులుగా, భారత ప్రధానిని ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు.

ట్రంప్ పరిపాలనలో క్వాడ్ ప్రాముఖ్యత తగ్గిపోయిందనేందుకు ఇదే నిదర్శనమని ఘజాలా అభిప్రాయపడ్డారు.

క్వాడ్ సంయుక్త పత్రికా ప్రకటనను కూడా ప్రస్తావించారు. అది మునుపటి ప్రకటనల కంటే చాలా సంక్షిప్తంగా ఉందని ఘజాలా వహాబ్ అన్నారు.

అందులో సరిహద్దు ఉగ్రవాదాన్ని ఖండించినప్పటికీ, చైనా గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అంతేకాకుండా, ఆ ప్రకటన వాణిజ్యానికి ప్రాధాన్యతనిచ్చింది.

నాలుగు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంచి, చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే క్వాడ్ అసలు ఉద్దేశ్యమని ఘజాలా వహాబ్ చెబుతున్నారు.

ఈ నాలుగు దేశాలు ఉమ్మడి ఆయుధాలు, సైనిక విన్యాసాల ద్వారా తమ సహకారాన్ని పెంచుకుంటూ వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఈ కూటమికి సంబంధించిన సైనిక కోణం బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది.

ట్రంప్ రెండో పదవీకాలంలో, చైనాతో వాణిజ్యానికి అమెరికా అధిక ప్రాధాన్యతనిస్తోందని ఘజాలా వహాబ్ పేర్కొన్నారు. చైనాతో సైనిక ఘర్షణకు బదులుగా.. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో పోటీ ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు.

"వారి మధ్య పోటీ ఉంటుంది. కానీ, అది వాణిజ్యం, వ్యాపార రంగానికి పరిమితమై ఉంటుంది. ప్రస్తుతానికి వారు ఎటువంటి సైనిక పోటీని కోరుకోవడం లేదు" అని ఘజాలా వహాబ్ అన్నారు.

అయితే, 'క్వాడ్' పూర్తిగా రద్దు కాదని ఘజాలా భావిస్తున్నారు. భారత్ నిర్వహించే 'మలబార్' నౌకాదళ విన్యాసాలు (ఇవి క్వాడ్ ఏర్పాటుకు ముందు నుంచే జరుగుతున్నాయి), హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా సహకారం వంటివి కొనసాగుతూనే ఉంటాయి.

క్వాడ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని గుర్జీత్ సింగ్ కూడా చెప్పారు. గత ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలంలో.. విదేశాంగ మంత్రులు, షెర్పాలు, వర్కింగ్ గ్రూప్‌ల మధ్య అనేక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా క్రమంగా ముందుకు సాగుతోంది. "క్వాడ్ చేయాల్సిన పనులను అది నిశ్శబ్దంగానే చేస్తోంది" అని పేర్కొన్నారు.

చైనా, భారత్
ఫొటో క్యాప్షన్, భారత్, చైనా పొరుగు దేశాలు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా గణనీయమైన స్థాయిలో ఉంది.

చైనాకు వ్యతిరేకంగా సమతుల్యత సాధించే దేశంగా భారత్‌ను చూడటం ఎంతవరకు సమంజసం?

అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో భారత్‌ పెంచుకుంటున్న సంబంధాలను చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహంగా తరచూ భావిస్తున్నారు.

అయితే, భారత్‌ను చైనాకు వ్యతిరేకంగా వ్యూహాత్మక భాగస్వామిగా లేదా సమతుల్యత సాధించే దేశంగా చూడాలనే అభిప్రాయంతో గుర్జీత్ సింగ్ ఏకీభవించలేదు.

"భారత్, చైనా పొరుగు దేశాలు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా గణనీయమైన స్థాయిలో ఉంది. భారత్ పూర్తిగా చైనాను దూరం చేసుకోలేదు. అందువల్ల తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో సంబంధాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది" అని గుర్జీత్ సింగ్ చెప్పారు.

చైనాను ఎదుర్కొనేందుకు లేదా దాని ప్రభావాన్ని సమతుల్యం చేసేందుకు భారత్ ఎప్పుడూ తనకు తానుగా ప్రత్యేక పాత్రను నిర్దేశించుకోలేదని గుర్జీత్ సింగ్ స్పష్టం చేశారు.

చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయగల దేశంగా భారత్‌ను అమెరికా, ఆసియాన్‌లోని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో భారత్‌కు సొంత భిన్నమైన ఆలోచనా విధానంతో ఉందని అన్నారు.

ఆర్థిక ప్రయోజనాలు, భారత్-చైనా సంబంధాలపై అపనమ్మకం

భారత్-చైనా సంబంధాలలో ఆర్థిక సహకారం, వ్యూహాత్మక అపనమ్మకం రెండూ కలిసి ఉన్నాయి.

అనేక దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడినప్పటికీ, సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2020 నుంచి 2024 మధ్య కాలంలో చైనాతో సంబంధాలు స్తంభించిపోయాయని గుర్జీత్ సింగ్ చెప్పారు.

చైనాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ కోరుకుంటోందని, అయితే చైనా సమాన ప్రాతిపదికన వాణిజ్యం చేయడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.

రెండు దేశాల ఆలోచనా విధానాల్లో ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా చూస్తుండగా, చైనా మాత్రం దానిని చైనా శతాబ్దంగా భావిస్తోందని చెప్పారు.

అలాగే, షెన్‌జెన్, గ్వాంగ్‌జౌ, హాంకాంగ్, మకావు ప్రాంతాలను కలిపి ఆర్థిక సహకారానికి కొత్త కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిపాదనను కూడా గుర్జీత్ సింగ్ ప్రస్తావించారు.

''ఆసియా ఆర్థికాభివృద్ధిలో చైనా కీలక పాత్రకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, అదే వ్యవస్థలో భారత్ వంటి మరో ప్రధాన శక్తికి సమానమైన స్థానం కల్పించేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ
ఫొటో క్యాప్షన్, 1990వ దశకంలో ప్రారంభించిన భారత్ 'లుక్ ఈస్ట్ పాలసీ', 2014లో 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'గా రూపాంతరం చెందింది.

ఆసియాన్, గ్లోబల్ సౌత్ కోసం భారత్ పాత్ర

భారత్-ఆసియాన్ సంబంధాలను ముఖ్యమైనవిగా అభివర్ణించారు మాజీ దౌత్యవేత్త గుర్జీత్ సింగ్.

1990వ దశకంలో ప్రారంభించిన భారత్ 'లుక్ ఈస్ట్ పాలసీ', 2014లో 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'గా రూపాంతరం చెందింది.

ఆసియాన్ దేశాలకు చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. కానీ దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలాపాల పట్ల వారికి వ్యూహాత్మక ఆందోళనలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు.

చైనా చేస్తున్న భూభాగాలపై హక్కుల వాదనలు, ప్రాదేశిక వివాదాల కారణంగా అనేక ఆసియాన్ దేశాలు తమ భద్రత, సముద్ర హక్కుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సహకారాన్ని ఒక ప్రత్యామ్నాయ మార్గంగా అవి భావిస్తున్నాయి.

అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీలో తాము ఒంటరిగా మిగిలిపోవాలని ఆసియాన్ దేశాలు కోరుకోవడం లేదని, అందుకే ఇతర దేశాలతో వ్యూహాత్మక సహకారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని గుర్జీత్ సింగ్ చెప్పారు.

'గ్లోబల్ సౌత్' ప్రయోజనాల ప్రాతిపదికన కలిసి పనిచేయగల భాగస్వామిగా భారత్ ఉండగలదు.

ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రరాజ్యాలు తామే నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు భారత్, ఆసియాన్ , ఆఫ్రికా, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర కీలక పక్షాల పాత్ర పరిమితం కావచ్చని షెన్‌జెన్ సమావేశం విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వివిధ అంతర్జాతీయ సమూహాలలో భాగస్వామిగా ఉంటూనే తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని కోరుకోవడం భారత విదేశాంగ విధానంలోని అతిపెద్ద లక్షణాలలో ఒకటి.

క్వాడ్‌తో పాటు బ్రిక్స్, ఎస్‌సీఓ, జీ20 వంటి వేదికలలో కూడా భారత్ చురుకుగా ఉంది. అంతేకాకుండా, ఆసియాన్, ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణ పసిఫిక్, కరేబియన్‌లతో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)