ఫాస్టాగ్ పోర్టబులిటీ : కారు మీద స్టిక్కర్ మార్చకుండా బ్యాంక్ మార్చడం ఎలా?

fastag

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షేక్ అన్సారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

వాహనానికి ఉన్న ఫాస్టాగ్‌తో లింక్ అయిన బ్యాంక్‌ను మార్చుకోవాలనుకుంటే పాతది తొలగించి మళ్లీ కొత్తగా మరో ఫాస్టాగ్ తీసుకోవాల్సి వచ్చేది ఇంతకాలం.

ఇకపై అలాంటి అవసరం ఉండదు. వాహనానికి అతికించిన అదే ఫాస్టాగ్ స్టిక్కర్ ఉంచుతూనే వేరే బ్యాంక్‌కు దాన్ని అనుసంధానించుకునే వీలుగా ‘వన్ ట్యాగ్’ పేరిట సర్వీస్ తీసుకొచ్చింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ).

ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్ నంబర్ పోర్టబులిటీ, గ్యాస్ పోర్టబులిటీ తరహాలోనే ఫాస్టాగ్ పోర్టబులిటీ కూడా చేసుకోవచ్చన్నమాట.

ఇంతకీ ఫాస్టాగ్ పోర్టబులిటీ చేయాలనుకునేవారు అందుకోసం ఏం చేయాలి? ఎవరికి వారు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చా?

స్టెప్ బై స్టెప్ గైడ్ మీ కోసం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంతకీ ఏమిటీ ఫాస్టాగ్?

వాహనాలకు ముందువైపు అద్దంపై అతికించి కనిపించే ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్ స్టిక్కరే ఫాస్టాగ్.

ఇందులో రేడీయో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఉంటుంది.

టోల్ ప్లాజా దగ్గరికి వాహనం వెళ్లినప్పుడు అక్కడ ఉండే రీడర్.. ఫాస్టాగ్‌ను గుర్తించి, దానికి లింక్ అయిన బ్యాంక్/వాలెట్ నుంచి టోల్ డబ్బును ఆటోమేటిక్‌గా కట్ చేస్తుంది.

సింపుల్‌గా చెప్పాలంటే టోల్ గేట్ వద్ద వాహనం ఆగి చెల్లించాల్సిన పనిలేకుండా టోల్ ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా ఉపయోగించే స్టిక్కరే ఈ ఫాస్టాగ్.

టోల్ ప్లాజా, వాహనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫాస్టాగ్‌ ఖాతా ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు ఎలా మార్చుకోవాలి?

ఇది పూర్తిగా డిజిటల్ విధానం పూర్తి చేయదగ్గ ప్రక్రియ. బ్యాంకులకు కానీ, నేషనల్ హైవేస్ అథారిటీ కార్యాలయాలకు కానీ, టోల్ బూత్‌లకు కానీ వెళ్లి అక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు.

మొబైల్ యాప్ ఉపయోగించి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

దీనికోసం ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’కు చెందిన ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఆయా యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

ఫాస్టాగ్ పోర్టబులిటీ

ఫొటో సోర్స్, RajmargYatra App

ఇలా మార్చుకోవాలి..

స్టెప్ 1: మొబైల్ ఫోన్‌లో రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ఓపెన్ చేయాలి. మీ ఫోన్‌లో ఈ యాప్ లేనిపక్షంలో ఇన్‌స్టాల్ చేయాలి.

స్టెప్ 2: ‘చెక్ పోర్టబులిటీ’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడి నుంచి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్,ఇతర వివరాలు నింపి వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

స్టెప్ 3: ఎలిజిబిలిటీ చెక్ పూర్తయిన తరువాత ఫాస్టాగ్‌కు అనుసంధానమై ఉన్న ప్రస్తుత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుంచి వేరొక బ్యాంక్/ఆర్థిక సంస్థకు మార్చడానికి సమ్మతి తెలిపాలి.

ఫాస్టాగ్ పోర్టబులిటీ

ఫొటో సోర్స్, Rajmargyatra app

స్టెప్ 4: సమ్మతి తెలిపిన తరువాత ‘వన్ ట్యాగ్ సిస్టమ్’లో బ్యాంకులు, ఫాస్టాగ్ ఇష్యూ చేసే ఇతర ఆర్థిక సంస్థల వివరాలు కనిపిస్తాయి.

అందులో మీకు కావాల్సినది ఎంచుకోవాలి. ప్రస్తుతం శుక్రవారం(18.09.2026) నాటికి 11 బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇందులో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, లివ్‌క్విక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్య బ్యాంక్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

స్టెప్ 5: నచ్చిన బ్యాంకును ఎంచకున్న తరువాత కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

స్టెప్ 6: వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయితే మీరు కొత్తగా ఎంచుకున్న బ్యాంక్‌కు మీ ఫాస్టాగ్ మారిపోతుంది. అంటే, పోర్టబులిటీ పూర్తయినట్లు. రీచార్జ్‌లు వంటివన్నీ ఆ ఖాతా నుంచే జరుగుతాయి.

అయితే, అప్పటివరకు మీ వాహనంపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ను మాత్రం మార్చాల్సిన అవసరం లేదు.

fastag portability

ఫొటో సోర్స్, Rajmargyatra

మళ్లీ బ్యాంక్ ఖాతా మార్చుకోవాలంటే...

ఒక్కసారి ఫాస్టాగ్ మరో బ్యాంక్‌కు పోర్ట్ చేసిన తర్వాత వెంటనే మరో బ్యాంక్‌కు మార్చుకోవడం కుదరదు.

6 నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి. ఆ తర్వాత మాత్రమే మరోసారి పోర్టబిలిటీ చేసుకోవచ్చు.

పోర్టబిలిటీ పూర్తయిన వెంటనే పాత బ్యాంక్ ఫాస్టాగ్ వాలెట్‌ను మూసివేస్తుంది.

అందులో మిగిలి ఉన్న మొత్తాన్నిఅప్లికబుల్ అడ్జస్ట్‌మెంట్స్(వర్తించే సర్దుబాట్లు) చేసిన తర్వాత వినియోగదారుడికి తిరిగి చెల్లిస్తుంది.

నేషనల్ హైవే

ఫొటో సోర్స్, Getty Images

ప్రయోజనం ఏంటి?

కొత్త ఫాస్టాగ్ కోసం పదేపదే స్టిక్కర్లు తయారు చేయడం, పంపించడం, మళ్లీ జారీ చేయడం తగ్గుతుంది.

దీంతో నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది.

వినియోగదారులు కూడా తమకు నచ్చిన బ్యాంక్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

పాత ట్యాగ్ మార్చనవసరం లేదు: రవాణా శాఖ అధికారి రాజారత్నం

ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు పాత ట్యాగ్‌ను మార్చాల్సిన అవసరం లేకపోవడం ఖచ్చితంగా చాలా మంచి పరిణామమని విశాఖకు చెందిన రవాణా శాఖ ఉన్నతాధికారి రాజారత్నం బీబీసీతో అన్నారు.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వన్ ట్యాగ్' పోర్టబిలిటీ విధానం ద్వారా, వాహనదారులు తమ పాత స్టిక్కర్‌ను విండ్‌షీల్డ్ నుండి తొలగించకుండానే, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు తమ ఫాస్ట్‌ట్యాగ్ సేవలను ఆన్‌లైన్ ద్వారా సులభంగా మార్చుకోవచ్చని ఆయన చెప్పారు.

మొబైల్ సిమ్ కార్డులను పోర్ట్ చేసుకున్నట్లుగానే, ట్యాగ్ ఐడీ మారకుండానే బ్యాంక్ సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చుకునే అవకాశం లభించిందన్నారు.

ఈ కొత్త విధానం వల్ల వినియోగదారులకు శ్రమ, సమయం ఆదా అవుతుందని ఆయన అన్నారు.

గతంలో బ్యాంక్ మార్చాలంటే పాత ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ క్లోజ్ చేసి, పాత స్టిక్కర్‌ను కారు అద్దం పైనుంచి తీసేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా, రాజమార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని చెబుతున్నారని, దీనివల్ల అదనపు ఖర్చులు తగ్గుతాయని విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధి రఫీ బీబీసీతో అన్నారు.

బ్యాంకులు మారిన ప్రతిసారీ కొత్త ఫిజికల్ స్టిక్కర్ కోసం డబ్బులు చెల్లించాల్సిన (ఇష్యూ ఫీజు) అవసరం తప్పుతుందనీ. పాత స్టిక్కరే కొత్త బ్యాంకుతో లింక్ అవుతుందని అంటున్నారని నిజంగా ఇది మంచిదేనని రఫీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)