‘‘అతనితో డేటింగ్ మొదలు పెట్టినప్పుడు నేను తనకన్నా 15 ఏళ్లు పెద్దదాన్నని చెప్పలేదు. చెబితే వదిలేస్తాడేమో అనుకున్నా, అయితే.. "

ఫొటో సోర్స్, Handout
- రచయిత, జార్జ్ శాండేమాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగానే సాగుతోంది. గట్టిగా చెప్పాలంటే చాలా బావుంది.
అయితే తన వయసు తెలిస్తే అతను తమ మధ్య బంధాన్ని తెంచుకుంటాడేమో అని లెనా భయపడుతోంది.
నార్వేకు చెందిన ఈ జంట డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. కొన్ని వారాలుగా డేటింగ్ చేస్తున్నారు.
ఆ యాప్‌లో లెనా తన వయసును ప్రస్తావించలేదు. ఎందుకంటే తనకు పరిచయం అయ్యేవారు తన వయసు కారణంగా తనను ఆమోదించడం లేదా తిరస్కరించడం ఆమెకు ఇష్టం లేదు.
"మా సంబంధం మరింత బలపడిన తర్వాత, నాలో ఆందోళన పెరిగింది" అని 45ఏళ్ల లెనా చెప్పారు.

ఆమెతో డేటింగ్ చేస్తున్న షెటిల్ తాను కేవలం సరదా కోసం కాకుండా నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నట్లు అప్పటికే ఆమెకు స్పష్టం చేశారు. తొలిసారి కలిసినప్పుడే తనకు యుక్తవయస్కురాలైన కూతురు ఉందని షెటిల్తో లెనా చెప్పారు.
అయితే అది అతన్ని ఏ మాత్రం నిరుత్సాహపరచలేదు. ఆమె చాలా చిన్న వయసులోనే తల్లైందని ఆయన భావించారు. "ఆమె నాకంటే బహుశా రెండేళ్లు పెద్దదై ఉంటుందని అనుకున్నా" అని 30 ఏళ్ల షెటిల్ అన్నారు.
మొదటిసారి కలిసిన కొన్ని వారాల తర్వాత లెనా తన వయసు చెప్పినప్పుడు షెటిల్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తనకంటే 11 ఏళ్లు చిన్నదైన లీనా కూతురిని ఆయన ప్రత్యేకంగా కలిశారు. "మీ అమ్మతో డేటింగ్ చేయడం నీకు సమ్మతమేనా" అని అడిగారు. షెటిల్కు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి అనుమతులేమీ అక్కర్లేనప్పటికీ వాళ్లు తన గురించి ఏమనుకుంటారోనని లెనా ఆందోళన చెందారు.

ఫొటో సోర్స్, Handout
"వయసు పైబడిన మహిళతో మీరెందుకు డేటింగ్ చేస్తున్నారు?"
"చూసేందుకు నేను చిన్నదానిలా కనిపించవచ్చుగానీ, నువ్వు నా వయసు గురించి వాళ్లతో చెప్పద్దని షెటిల్తో చెప్పాను. ఎందుకంటే వాళ్లు 'నువ్వు ఇంత పెద్దావిడతో డేటింగ్ ఎందుకు చేస్తున్నావని అడుగుతారేమో" అని తను భయపడినట్లు లెనా చెప్పారు.
అయితే షెటిల్ స్నేహితులు వారి బంధాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.
"వాళ్లు చాలా మంచివాళ్లు" అని ఆమె అన్నారు. షెటిల్ తల్లిదండ్రులు కూడా ఆమెను తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వనించారు. ఎవరైనా వాళ్లను ఎగతాళి చేసినా, వయసు మధ్య వ్యత్యాసం గురించి ప్రస్తావించినా "నేను తిరిగి సమాధానం చెప్పేవాడిని" అని షెటిల్ అన్నారు.
తన భాగస్వామిని ఎగతాళి చేసినా లేదా విమర్శించినా వారితో స్నేహాన్ని తెంచుకోవడానికి కూడా తాను సిద్ధపడినట్లు ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి లెనా కూతురు సంగతేంటి?
"షెటిల్, నువ్వు ఇద్దరూ పెద్దవాళ్లే. కాబట్టి అతను నిన్ను సరిగ్గా చూసుకున్నంత కాలం ఏ ఇబ్బంది లేదు" అని లెనా కుమార్తె తల్లితో చెప్పారు.
షెటిల్, అతని స్నేహితుల యాసలో పలికే పదాల అర్థాన్ని లెనా కుమార్తె ఆమెకు వివరించి చెప్పేది. ఇది షెటిల్- లెనా మధ్య వయసు అంతరం తగ్గించడంలో సాయపడింది.
లెనా, షెటిల్ రెండేళ్లుగా కలిసి ఉంటున్నారు. అతని ప్రశాంతమైన వైఖరి తన తొందరపాటును, ఒత్తిడిని అదుపులో ఉంచినట్లు ఆమె చెప్పారు.
"కొన్నిసార్లు అతను నాకంటే పెద్దవాడని నేను చిన్నదాన్నని అనిపిస్తుంది. అయినప్పటికీ నేను పెత్తనం చెలాయిస్తాను" అని లెనా అన్నారు.
భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ జంట ఇటీవల నార్వేలో తీరప్రాంత నగరమైన స్టావెంజర్ సమీపంలో ఇల్లు కొన్నారు. వచ్చే వారం గృహ ప్రవేశం చేస్తున్నారు.
లీనా-షెటిల్ల వ్యవహారంలో సామాజికంగా ఎదురయ్యే అవమానాలను మించి చూడాల్సిన అంశాలున్నాయి.
షెటిల్ కంటే లెనాకు జీవితానుభవం ఎక్కువ. వాళ్లు పిల్లలను కనాలా, వద్దా అనే దానితో పాటు వారిలో ఒకరికంటే ముందు మరొకరికి వృద్ధాప్య సంరక్షణ అవసరం కావడం వల్ల ఏర్పడే సమస్యలున్నాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 'ఏజ్ ఆఫ్ అట్రాక్షన్' అనే డేటింగ్ షో విడుదలయ్యాక ఈ అంశాలపై సోషల్ మీడియాలో చర్చ మళ్లీ మొదలైంది.
ఈ షోలో 40 మంది ఒంటరి వ్యక్తులు ప్రేమలో పడతారు. తర్వాత వారి వయసుల మధ్య భారీ తేడా ఉన్నట్లు తెలుసుకుంటారు.
ఇలాంటి అనేక అంశాల గురించి తాము కూడా చర్చించినట్లు లెనా, షెటిల్లు చెప్పారు.

ఫొటో సోర్స్, John Keeble/Getty Images
దీర్ఘకాలిక ప్రణాళికలు
ఈ జంట తీవ్రంగా పరిగణిస్తున్న అంశం ఆర్థిక ప్రణాళిక.
షెటిల్ కంటే లెనా త్వరగా ముందుగా పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున వారు కొన్న కొత్త ఇంటి మీద ఎక్కువ ఖర్చు ఆమె భరించాలని నిర్ణయించారు.
ఇంటి కొనుగోలు కోసం షెటిల్ మొదట్లో తక్కువ మొత్తాలను చెల్లిస్తారు. అయితే అతను రిటైర్ అయ్యే నాటికి ఆ చెల్లింపులు ఇంటి కోసం ఇద్దరు పెట్టిన ఖర్చు సమానంగా ఉండేలా ప్లాన్ చేశారు.
"వయసులో తేడా ఎక్కువగా ఉన్న జంటలకు ఇలాంటి ప్రణాళిక కష్టమైనప్పటికీ, అది చాలా అవసరం" అని రిలేషన్షిప్ థెరపిస్ట్ సారా లూయిస్ ర్యాన్ చెప్పారు.
"వయసులో అంతరం ఉన్న సంబంధాల్లో మొదట చాలా ఉత్సాహంతో ఉంటారు. అది ఉల్లాసంగా, ఉత్తేజకరంగా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ జీవితంలోని తేడాలను విస్మరించలేనప్పుడు, అది వారి బంధం మీద ఒత్తిడి చూపిస్తుంది" అని ర్యాన్ చెప్పారు.
అలాంటి దంపతుకలు డబ్బు, పదవీ విరమణ ప్రణాళిక అవసరమని ఆమె సలహా ఇస్తున్నారు.
రిటైర్మెంట్ తర్వాతి సంవత్సరాలలో సంరక్షణ బాధ్యతలు ఎలా ఉండాలో కూడా వాళ్లు ఆలోచించుకోవాలి.
వృద్ధాప్యం విషయానికి వస్తే, తాను ఫిట్‌గా ఉండాలని లెనా భావిస్తున్నారు.
షెటిల్ తనను వృద్ధాశ్రమానికి వచ్చి చూడాల్సిన అవసరం రాదని అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Handout
"మా మధ్య మంచి అవగాహన ఉంది'
వయసు పైబడటం గురించి తన భర్త మిఖాయిల్ వేసే కొన్ని జోక్స్ తప్ప తమ సంభాషణల్లో ఎన్నడూ దీర్ఘకాలిక ప్రణాళికల ప్రస్తావనకు రాలేదని క్సెనియా చెప్పారు. అతనికి 41 ఏళ్లు. ఆమెకు 23 ఏళ్లు.
"ప్రస్తుతానికి మేము జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. 20ఏళ్లలో ఏం జరుగుతుందో ఆలోచించడం లేదు" అని జర్మనీలో ఉంటున్న క్సెనియా, బీబీసీ ప్రతినిధితో చెప్పారు.
ఈ జంట తమ స్వదేశమైన రష్యాలో డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు.
మొదట ఇద్దరూ తమ వయసుల్లో తేడా గురించి ఆందోళన చెందారు. అయితే కళలు, సంస్కృతి, డిటెక్టివ్ సినిమాల పట్ల ఆసక్తి వారిద్దరినీ ఒక్కటి చేసింది.
తన వయసు వాళ్లతో డేటింగ్ చేయడంపై క్సెనియాకు ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్లు తమ సమయంలో ఎక్కువ భాగాన్ని క్లబ్బులకు వెళ్లడం, మద్యం సేవించడం, పొగతాగడంతో గడిపేవారని ఆమె చెప్పారు.
"నాకు మ్యూజియానికి వెళ్లడం, రాజకీయాలు, సామాజిక సమస్యలపై చర్చించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త నగరాలకు, దేశాలకు ప్రయాణించడం ఇష్టం" అని ఆమె తెలిపారు.
మిఖాయిల్ గురించి మరింత తెలుసుకునే కొద్దీ తమ మధ్య "కలిసి మ్యూజియానికి వెళ్లడం, సినిమా చూడటంకన్నా చాలా లోతైన" జీవిత లక్ష్యాలు, ఆసక్తులు ఉన్నాయని క్సెనియాకు అర్థమైంది.
"అదే మా కుటుంబానికి తొలి అడుగు అయిందని" ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ 2022లో పెళ్లి చేసుకుని జర్మనీలో స్థిరపడ్డారు.
వారి సంబంధంలో ఎవరు గొప్ప అనే భావన అనే దాని గురించి క్సెనియా ఎన్నడూ ఆలోచించలేదు. అయితే ప్రపంచం ఎలా ఉందనే దానిపై మిఖాయిల్‌కు అనుభవం ఎక్కువ ఉందని ఆమెకు తెలుసు. అతని నుంచి తాను నేర్చుకోగలను అనేది ఆమె నమ్మకం.
వారిద్దరూ మాట్లాడుకునే విధానంలో తరాల మధ్య ఉన్న తేడాను క్సెనియా గమనించారు.
ఆమె నిరంతరం టెక్స్ట్ మెసేజ్‌లు పంపుతుంది. కొన్నిసార్లు రోజుకు 100 కంటే ఎక్కువ మెసేజ్‌లు కూడా పంపుతుంది.
అయితే ఆయన మెసేజ్‌లకు బదులుగా ఫోన్లో లేదా నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడతారు.
క్సెనియా స్నేహితులు, కుటుంబ సభ్యులు మిఖాయిల్‌తో రిలేషన్‌కి ఆమోదం తెలిపారు. అయితే అతనికి దగ్గర బంధువులు ఎక్కువ మంది లేకపోవడంతో మిఖాయిల్ కుటుంబంతో క్సెనియాకు పెద్దగా సంబంధాలు లేవు.
ఈ జంటకు ప్రస్తుతానికి పిల్లలను కనాలనే ఉద్దేశం లేకున్నా.. భవిష్యత్‌లో తమ సంతానం ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మిఖాయిల్ పెద్ద వయసులో తండ్రి అయితే, అతను తన బాధ్యతలను నిర్వర్తించగలడా అనే దానిపై క్సెనియాకు ఎలాంటి ఆందోళన లేదు.
"నేను వయసులో చిన్నదాన్ని. అయితే అతనిలో శక్తి ఎక్కువని నాకు అనిపిస్తుంది. తను చాలా చురుకుగా ఉంటారు. ఒకచోట నిశ్చలంగా కూర్చోవడం ఇష్టం ఉండదు .మేమిద్దరం ఒకరికొకరం చాలా బాగా సరిపోతాము" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Handout
మహిళలు 'సిగ్గుపడటం మానుకోవాలి'
భావోద్వేగాల సమతుల్యతను షెటిల్లో తాను గుర్తించినట్లు లెనా చెప్పారు.
కొన్నేళ్ల క్రితం డేటింగ్ యాప్‌లలో చేరినప్పుడు తనకంటే చిన్న వాడైన భాగస్వామిని వెతుక్కోవాలని ఆమె అనుకోలేదు. ఆ డేటింగ్ యాప్‌లలో ఆమె తన వయసు ప్రాధాన్యతలను 26-60గా పెట్టారు.
"నాకు 42 ఏళ్లు. నా జీవితంలో మనవళ్లు ఉన్న పురుషుడితో గానీ, పిల్లలు లేని పురుషుడితో గానీ డేటింగ్ చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఏదైనా ఫర్వాలేదు" అని లెనా చెప్పారు.
షెటిల్తో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడటంతో ఇతర మహిళలు కూడా తమకంటే పెద్దవారితో డేటింగ్ చేసేలా ఆమె ప్రోత్సహిస్తున్నారు.
షెటిల్తో జీవితం గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో కొన్ని నెగటివ్ కామెంట్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది వారిని ప్రోత్సహిస్తున్నారు.
మహిళలు తమ వ్యక్తిగత నిర్ణయాల విషయంలో "సిగ్గుపడటం, ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకోవాలి" అని లెనా చెబుతున్నారు. తాను ఇలాంటి వాటిని ఎదుర్కొని, అధిగమించానని అన్నారు.
కౌన్సెలింగ్, విద్యారంగంలోకి రాకముందు లెనా వృద్ధుల సంరక్షణ గృహంలో పనిచేసేవారు. అక్కడ తనకంటే 17 ఏళ్లు చిన్నవాడైన భర్త ఉన్న మహిళ ఆమెకు గుర్తున్నారు.
అతను రోజూ ఆమె దగ్గరకు పువ్వులతో వచ్చేవాడు. అతను ఆమెను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను. అదే నిజమైన ప్రేమ. వయసు ప్రేమను దూరం చేయలేదని నేను నమ్ముతాను" అని లెనా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































