లెట్రిన్ గుంతలో పడి 3 గంటల పాటు మలమూత్రాల్లో కూరుకుపోయిన మహిళ.. ఆస్ట్రేలియాలో అనుకోని ఘటన

ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతంలోపిట్ లాట్రిన్ నిర్మాణం (ఫైల్ ఫోటో)

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కెల్లీ ఎన్జీ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఆస్ట్రేలియాలోని ఒక మారుమూల ప్రాంతంలో రోడ్డు ప్రయాణం చేస్తూ టాయిలెట్ కోసం వెళ్లిన ఒక మహిళ అదే పిట్ లెట్రిన్ (గుంత లాంటి మరుగుదొడ్డి)లో పడిపోయారు.

ఆమె వెళ్లగానే ఆ పిట్ లెట్రిన్ కూలిపోవడంతో ఆ గుంతలో నడుములోతు వరకు ఆమె కూరుకుపోయారు.

'ఆమె దాదాపు 3 గంటల పాటు ఆ మలమూత్రాల గుంతలో చిక్కుకుపోయారు. చివరకు ఆ దారిలో వెళ్తున్న ఒక స్థానిక వ్యాపారి ఆమెను రక్షించారు' అని నార్తర్న్ టెరిటరీ అధికారులు చెప్పారు.

డార్విన్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాన్‌బెర్రాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా యాక్షన్ ఫర్ అలైస్ కమ్యూనిటీ ఫేస్‌బుక్ పేజీ పేర్కొంది.

హెన్‌బరీ మెటోరైట్స్ కన్వర్జేషన్ జోన్ వద్ద ఈ టాయిలెట్ ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పిట్ టాయిలెట్లు అనేవి పాతకాలపు నిర్మాణాలు. వీటికి ఫ్లష్ సౌకర్యం ఉండదు. అంటే కింద ఒక లోతైన గుంత తవ్వి, పైన కూర్చోవడానికి వీలుగా ఒక నిర్మాణం చేస్తారు. ఈ గుంతలోకి మానవ వ్యర్థాలు వెళ్తాయి.

అక్కడి మారుమూల లేదా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా ఇలాంటి మరుగుదొడ్లు కనిపిస్తాయి.

ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని ఎన్‌టీ వర్క్‌సేఫ్ ఏజెన్సీ తెలిపింది. హెన్‌బరీ కన్జర్వేషన్ జోన్‌కు సంబంధించి పని ప్రదేశాల్లో ఆరోగ్యం, భద్రతను పర్యవేక్షించే ఏజెన్సీ ఇది.

'ఆ మహిళ భర్త, దారిన వెళ్తున్న వ్యాపారికి విషయం చెప్పడంతో ఆయన సహాయానికి వచ్చారు. అతను గుంతలోకి ఒక తాడును వేసి కారుతో లాగుతూ ఆమెను బయటకు తీశారు. ఆమెను బయటకు తీసే ప్రక్రియ పూర్తి కావడానికి 45 నిమిషాలకు పైగా సమయం పట్టింది' అని ప్రత్యక్ష సాక్షిని ఉటంకిస్తూ స్థానిక వార్తా సంస్థ 'ఎన్‌టీ న్యూస్' పేర్కొంది.

వెంటనే ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు.

ఆస్ట్రేలియాలో పిట్ టాయిలెట్ల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు.

విక్టోరియా రాష్ట్రంలోని ఇండిగో వ్యాలీలో 2024 జులైలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఒక వ్యక్తి, పిట్ టాయిలెట్‌లో చిక్కుకుపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆయనను కాపాడారు.

2012లో సెంట్రల్ క్వీన్స్‌ల్యాండ్‌లో 65 ఏళ్ల మహిళ కూడా పిట్ టాయిలెట్‌లో పడిపోవడంతో ఆమె కాలు విరిగినట్లు 'ద కొరియర్ మెయిల్' పేర్కొంది.

దక్షిణాఫ్రికాలో కూడా ఇలాంటి ఘటనలు నమోదైనట్లు వార్తలు ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)