మనిషిని ‘నిషేధించిన’ చోట స్వేచ్ఛగా వృద్ధి చెందుతున్న వన్యప్రాణులు.. యుక్రెయిన్, కొరియాల్లోని ప్రమాదకర ప్రాంతాల్లో జీవవైవిధ్యం

ఫొటో సోర్స్, Vasily Fedosenko/Reuters
- రచయిత, డైసీ స్టీఫెన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాల గురించి ఆలోచించినప్పుడు అమెజాన్ వర్షారణ్యం, ది గ్రేట్ బారియర్ రీఫ్.. యెల్లోస్టోన్, యోస్‌మైట్ లాంటి నేషనల్ పార్కులు మీకు గుర్తుకు రావచ్చు.
చెర్నోబిల్ ఎక్స్‌క్లూజన్ జోన్ కానీ.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉన్న నిస్సైనికీకరణ ప్రాంతం గురించి మీ మదిలో ఆలోచన రాకపోవచ్చు.
అయితే మనుషుల సంచారానికి అనుమతి లేని ఈ ప్రాంతాలలో వన్య ప్రాణులు వృద్ధి చెందుతున్నాయి.
అనుకోకుండా జరిగిన ఈ పరిణామం వన్యప్రాణుల సంరక్షణలో ఒక పాఠం కాగలదా?
1953లో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య 4 కిలోమీటర్ల వెడల్పు, 248 కిలోమీటర్ల పొడవున్న ప్రాంతాన్ని ‘డీ మిలటరైజ్డ్ జోన్’(డీఎంజెడ్)గా ప్రకటించిన తర్వాత రెండు కొరియాల మధ్య ప్రయాణం అసాధ్యంగా మారింది.

డీఎంజెడ్ ప్రాంతంలో కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉంటాయి.
ఈ ప్రాంతమంతా మందుపాతరలతో నిండి ఉంది.
అయితే జంతువులు, చెట్లను అది ఆపలేకపోయింది.

ఫొటో సోర్స్, Google Arts & Culture/National Institute of Ecology
70 ఏళ్లుగా నిర్మానుష్య ప్రాంతం
కొరియాల మధ్య ఉన్న డీ మిలిటరైజ్డ్ జోన్‌లో 6,168 వన్యప్రాణి జాతులు నివసిస్తున్నాయి. కొరియా ద్వీపకల్పంలోని అంతరించిపోతున్న జాతులలో 38 శాతం ఇక్కడ ఉన్నాయని దక్షిణ కొరియా జాతీయ పర్యావరణ సంస్థ తెలిపింది.
70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మానవ సంచారం, జోక్యం చాలా తక్కువగా ఉంది.
ప్రస్తుతం ఇక్కడ డేగలు, కొండ మేకలు, కస్తూరి జింకలు వంటివి నివసిస్తున్నాయి.
అంతే కాకుండా కొరియాకు మాత్రమే ప్రత్యేకమైన, అక్కడ కూడా అంతరించే దశకు చేరుకున్న చెట్లకు ఆవాసం ఈ ప్రాంతం. అంటే ఈ చెట్లు భూమి మీద ఇంకెక్కడా కనిపించవు.

ఫొటో సోర్స్, Google Arts & Culture/National Institute of Ecology
"యుద్ధ విరమణ వల్ల ఈ ప్రకృతికి పరిరక్షణ అనుకోకుండా సాధ్యమైంది" అని ఈ ప్రాంత పరిరక్షణ కోసం పోరాడుతున్న 'ది డీఎంజెడ్ ఫోరమ్' సంస్థ అధ్యక్షుడు సియోంగ్ హో లీ చెప్పారు.
"అనేక జంతువులు, పక్షులు, కొన్ని ప్రత్యేక పక్షి జాతులు ఈ ప్రాంతంలో ఉంటున్నాయి. మనుషుల సంచారం చాలా వరకు లేకుండా పోయింది" అని ఆయన చెప్పారు.
డీఎంజెడ్‌లో నివసించే అనేక జంతు జాతులు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఇక్కడే ఉంటూ "ప్రపంచమంతా సంచరించే కొంగలు" కూడా వాటిలో ఉన్నాయని లీ తెలిపారు.

ఫొటో సోర్స్, Germán Orizaola/Universidad de Oviedo
వన్య ప్రాణులకు స్వర్గధామంగా ఉన్నది కొరియాల మధ్య ఉన్న నిస్సైనికీకరణ ప్రాంతం ఒక్కటే కాదు.
ఒకప్పుడు సోవియట్ రష్యాలో భాగంగా, ఇప్పుడు యుక్రెయిన్‌లో ఉన్న చెర్నోబిల్‌లోని అణు విద్యుదుత్పత్తి కేంద్రంలోని రియాక్టర్ 1986 ఏప్రిల్ 26న పేలిపోయింది.
దాంతో ప్రమాదకరమైన అణుధార్మికత వాతావరణంలోకి విడుదలైంది.
రేడియో ధార్మిక కాలుష్యం కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దీంతో ఇక్కడ నుంచి లక్షల మందిని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అక్కడ ఇప్పటికీ చాలావరకు జనావాసాలు లేవు. ప్రస్తుతం ఈ నిషేధిత ప్రాంతం 4 వేల చదరపు కిలోమీటర్ల మేర ఉంది.
ప్రపంచంలో ఎక్కువగా రేడియో ధార్మికత కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో చెర్నోబిల్ ఒకటని యూకే సెంటర్ ఆఫ్ ఎకాలజీ అండ్ హైడ్రాలజీ చెబుతోంది.

ఫొటో సోర్స్, Germán Orizaola/Universidad de Oviedo
'ఎర్ర అడవి'
చెర్నోబిల్‌లో పేలుడు జరిగిన తర్వాత ఏర్పడిన పర్యావరణ ప్రభావాలు తీవ్రమైనవని బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ జిమ్ స్మిత్ తెలిపారు.
పేలుడు ధాటికి ప్రస్తుతం రెడ్ ఫారెస్ట్ అని పిలుస్తున్న ప్రాంతంలో చెట్లు చనిపోయి "ఎరుపు-గోధుమ" రంగులోకి మారిపోయాయి.క్షీరదాలు, జలచరాలకు కూడా నష్టం కలిగిందని ఆయన చెప్పారు.
కానీ చెర్నోబిల్ నుండి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలు వేగంగా క్షీణించాయి.

ఫొటో సోర్స్, Valeriy Yurko
"రియాక్టర్ పేలుడు తర్వాత కొన్ని రోజులకు రేడియో ధార్మిక తీవ్రత వేగంగా తగ్గింది. అక్కడ మిగిలింది కొన్ని దశాబ్ధాల పాటు కొనసాగే తక్కువ స్థాయి రేడియేషన్ మాత్రమే " అని ప్రొఫెసర్ జిమ్ స్మిత్ వివరించారు.
ఈ స్థాయి రేడియేషన్ మానవ నివాసానికి సురక్షితం కాదు. కానీ ఇతర జాతులకు ఇక్కడి పరిస్థితి వేరుగా ఉంటుంది.
"చెర్నోబిల్‌లో వన్యప్రాణులు పెరుగుతున్నాయి… అందులో సందేహమే లేదు. రియాక్టర్ పేలుడుకు ముందు కంటే, ఇది నిర్మానుష్య ప్రాంతంగా మారిన తర్వాత పర్యావరణ పరంగా ఈ ప్రాంతం మరింత వైవిధ్యంగా ఉందని నాకనిపిస్తోంది" అని జిమ్ చెప్పారు.
మేం ఇక్కడి సరస్సుల్లో చేపలను పరిశీలించాం. అందులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూలింగ్ పాండ్ కూడా ఉంది. ఈ ప్రాంతంలో కాలుష్యం లేని సరస్సుల్లో చేపలు, ఇతర కీటకాలు ఎలా ఉన్నాయో, ఇక్కడ ఉన్న సరస్సులు, చెరువుల్లోని చేపలు, కీటకాలు కూడా అలాగే ఉన్నాయి" అని జిమ్ చెప్పారు.
ఈ ప్రాంతంలో క్షీరదాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి.
"కలుషిత ప్రాంతాలతో పోల్చినప్పుడు ఇక్కడున్న క్షీరదాల సంఖ్య తక్కువగా ఉందా అని పరిశీలించాం. కానీ మాకు ఎలాంటి తేడా కనిపించలేదు"అని స్మిత్ చెప్పారు.
"తోడేళ్ల జనాభాలోనే తేడా కనిపించింది. ఈ ప్రాంతంలోని ఇతర నేచర్ రిజర్వ్స్‌తో పోలిస్తే చెర్నోబిల్‌లో తోడేళ్ల జనాభా ఏడు రెట్లు ఎక్కువగా ఉంది" అని జిమ్ స్మిత్ తెలిపారు.

ఫొటో సోర్స్, Valeriy Yurko
'ప్రకృతిని ప్రకృతి లాగే ఉండనిద్దాం"
రేడియోధార్మికత ఉన్న ప్రాంతంలో వన్యప్రాణులు వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాల్లో కంటే మెరుగ్గా జీవించవచ్చనే విషయం ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
"ఇది విస్తారమైన ప్రాంతం, శబ్దం ఉండదు. కృత్రిమ వెలుగు, పురుగుమందులు, కలుపు మందులు , అటవీ నిర్వహణ , సంరక్షణ, వ్యవసాయం లాంటివేమీ లేకుండా జంతువులు ఇక్కడ స్వేచ్ఛగా సంచరించడానికి వీలుగా ఉంది" అని స్పెయిన్‌లోని ఓవియెడో యూనివర్సిటీలో జువాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జర్మాన్ ఒరిజావోలా చెప్పారు.
"మనుషుల ఒత్తిడి, ప్రకృతి ధ్వంసం లాంటివి అత్యంత భయంకరమైన అణు ప్రమాదం కంటే కూడా చాలా,చాలా ఎక్కువ హానికరం" అని ఒరిజావోలా అన్నారు.
ఈ విషయాన్ని స్మిత్ కూడా అంగీకరిస్తున్నారు.
"ఒక పర్యావరణ వ్యవస్థకు మానవ ఆక్రమణే నిజమైన నష్టం చేస్తుందని చెర్నోబిల్ నేర్పింది" అని జేమ్స్ అన్నారు.
"జంతువుల కోసం మనం నేచర్ రిజర్వ్‌లు, నేషనల్ ఫారెస్ట్‌లు, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. కానీ అక్కడ పర్యటకులు, ఉద్యోగులు ఉంటారు. వాటి వల్ల ప్రకృతి సహజ సిద్ధ ధర్మం నెరవేరదు" అని ఒరివోజాలా చెప్పారు.
"చెర్నోబిల్ అద్భుతమైన ప్రదేశం. మనం నిజంగా ప్రకృతిని కాపాడాలని అనుకుంటే భూములపైన మానవ ఒత్తిడిని తగ్గించాలి. ప్రకృతిని ప్రకృతిగానే ఉండనివ్వాలి" అని జేమ్స్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































