భారత్‌కు మద్దతుగా ఇరాన్, ట్రంప్ వివాదాస్పద పోస్ట్‌పై తీవ్ర ప్రతిస్పందన

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Will Oliver/EPA/Bloomberg via Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

భారత్, చైనాలను 'భూతల నరకకూపాలు'గా అభివర్ణిస్తున్న ఒక పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ షేర్ చేయడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి.

ట్రంప్ పోస్ట్‌‌పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. మోదీ ప్రభుత్వ స్పందన మాత్రం 'అత్యంత బలహీనంగా' ఉందని పెదవి విరిచింది.

ట్రంప్ ప్రకటనను 'జాత్యహంకారం'తో కూడుకున్నదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఈ ప్రకటన నేపథ్యంలో, ట్రంప్ తీరుపై అమెరికాలోనూ వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఇరాన్ ఈ అంశంలో భారత్‌కు మద్దతు తెలపడమే కాకుండా, భారత్ ఒక అద్భుతమైన దేశం అంటూ అభివర్ణించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలు విషయమేంటి?

పుట్టుకతో పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) గురించి రేడియో హోస్ట్, సంప్రదాయ రచయిత మైకేల్ సావేజ్‌ రాసిన వివాదాస్పద పోస్టును అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ షేర్ చేశారు.

ప్రస్తుత చట్టాలు, గర్భం దాల్చిన మహిళలు తొమ్మిదో నెలలో అమెరికాకు వలస వచ్చి, స్థానిక చట్టాల ద్వారా లబ్ధి పొందేందుకు అనుమతిస్తున్నాయని ఆ పోస్ట్‌లో సావేజ్ పేర్కొన్నారు.

"ఇక్కడ పుట్టిన బిడ్డకు తక్షణమే పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత చైనా, భారత్ లేదా ప్రపంచంలోని మరేదైనా నరకప్రాయమైన దేశం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకొస్తారు. ఇది ఎంతోదూరంలో లేదు. ఇక్కడ ఇప్పుడు ఇంగ్లిష్ మాట్లాడటం లేదు'' అని ట్రంప్ షేర్ చేసిన మైకేల్ సావేజ్ పోస్టులో ఉంది.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వివాదాస్పద సోషల్ మీడియా రీపోస్ట్ వల్ల జరిగిన నష్టాన్ని నివారించేందుకు అమెరికా ఆ తర్వాత ప్రయత్నించింది. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ, "భారత్ ఒక గొప్ప దేశమని, అక్కడ నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారని అధ్యక్షుడు అన్నారు" అని తెలిపారు.

అయితే, "భారత్‌ గొప్ప దేశం"అని ట్రంప్ ఎప్పుడు, ఎక్కడ అన్నారో స్పష్టత ఇవ్వలేదు.

ట్రంప్ షేర్ చేసిన పోస్టుపై భారత్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ కూడా గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

దీనిపై భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం రాత్రి మాట్లాడుతూ, "మేం ఆ పోస్టును, ఆ తర్వాత రాయబార కార్యాలయం స్పందనను పరిశీలించాం. ఈ వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో చేసినవి, అనుచితమైనవి. సుదీర్ఘకాలంగా పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్న భారత్, అమెరికా సంబంధాలను ఇవి ప్రతిబింబించవు" అని అన్నారు.

ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ఏమన్నది?

ట్రంప్ పోస్ట్ తర్వాత, ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ తన ఎక్స్ హ్యాండిల్‌లో ముంబయికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో గణేశ్ ఉత్సవం సహా వివిధ దృశ్యాలున్నాయి.

'భారత సంస్కృతి అర్థమయ్యేలా ఇక్కడ పర్యటించేందుకు ట్రంప్‌కు వన్ వే టికెట్ ఎవరైనా బుక్ చేస్తే బాగుంటుంది. ఇక్కడి సంస్కృతి చూసిన తర్వాతైనా ఆయన అర్థంపర్థం లేని ప్రేలాపనలు తగ్గుతాయేమో. ముందు ఇండియా వచ్చి చూసి, ఆ తర్వాత మాట్లాడండి' అంటూ కామెంట్ చేసింది.

ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ చేసిన పోస్టును రీట్వీట్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కూడా స్పందించింది.

'ముంబయిలో మాకు బాగా నచ్చేవి ఏంటంటే.. అక్కడి చాయ్, బన్ మస్కా, వడా పావ్, పావ్ బాజీలు. ఎంత చిరాకుగా ఉన్నా వీటిని టేస్ట్ చేయగానే మూడ్ అంతా సెట్ అయిపోతుంది. మేం రోటీ అండ్ రెస్పెక్ట్‌ను విశ్వసిస్తాం.

కానీ ఒక్కసారి సౌతిండియాలో అడుగుపెట్టి చూడండి.. భాయ్, అది వేరే లెవెల్. అసలైన స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది. మమ్మల్ని నమ్మండి, దక్షిణ భారతం మరింత అందంగా ఉంటుంది' అని రాసింది.

'నాగరికతకు చైనా, భారత్‌ పుట్టిళ్లులాంటివి. ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తానని బెదిరించే యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఉన్న చోటే అసలైన నరకం' అని మరో పోస్టులో ఇరాన్ అభివర్ణించింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

భారత్‌లో ప్రతిస్పందనలు

ఈ అంశంపై భారత విదేశాంగ నుంచి వచ్చిన ప్రకటన చాలా ఇబ్బందికరంగా ఉందని, అదే సమయంలో ఇరాన్ కాన్సులేట్ చాలా దీటుగా స్పందించిందని శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా దీనిపై స్పందించింది.

''నరేంద్ర మోదీ దోస్త్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. హిందూస్థాన్‌ను హెల్‌హోల్ (నరకం) అని పిలిచారు. అంతేకాదు, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లే భారతీయులను ల్యాప్‌ట్యాప్ పట్టుకొని తిరిగే గ్యాంగ్‌స్టర్లు అన్నారు. ఇంత జరిగినా, నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. మా దేశాన్ని ఇంత అవమానించడానికి మీకెంత ధైర్యం అని ఒక్కరూ ట్రంప్‌ను అనలేకపోయారు. భయపడిపోయిన, బలహీనపడిన, ఒత్తిడిలో ఉన్న ప్రధాని కారణంగానే దేశం నిరంతరం అవమానాలు ఎదుర్కొంటోంది '' అని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ట్రంప్ వాడే భాష క్రమంగా జాతి వివక్షను సాధారణంగా మార్చేసిందని దౌత్య వ్యవహారాల నిపుణులు బ్రహ్మా చెల్లానీ ఎక్స్‌లో రాశారు.

'గతంలో అమెరికా రాజకీయాల్లో కోడ్ లాంగ్వేజ్ ద్వారా జాతి వివక్ష సంకేతాలు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ట్రంప్ బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడేమో మైకేల్ సావేజ్ పాడ్‌కాస్ట్‌లోని ఒక భాగాన్ని ఆయన ప్రోత్సహించారు. హోస్ట్ ఆ పాడ్‌కాస్ట్‌లో భారత్, చైనా, ఇతర దేశాలను నరకాలుగా అభివర్ణించారు. ఇలాంటి వాటిని ట్రంప్ తన హ్యండిళ్లలో షేర్ చేయడం అంటే సార్వభౌమ దేశాలను ప్రత్యక్షంగా, ఆ దేశాల ప్రజలను పరోక్షంగా అవమానించడమే' అని ఆయన అందులో రాశారు.

జేడీ వాన్స్‌తో ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అమెరికాలో స్పందనలు ఎలా ఉన్నాయి?

కాలిఫోర్నియాకు చెందిన యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు, డెమొక్రటిక్ ఎంపీ రో ఖన్నా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఒక పోస్టులో ట్యాగ్ చేశారు.

'చైనా, భారత్ లేదా ఇతర నరకం వంటి దేశాల నుంచి వస్తున్నారంటూ ప్రవాసీయులను అధ్యక్షుడు అవమానించడం గురించి మీ స్పందన ఏంటి? మీరు కూడా భారత్ ఒక నరకం వంటిదని అనుకుంటున్నారా? చైనా, భారత వలసదారులు అమెరికాను తక్కువ చేస్తారని మీరూ భావిస్తున్నారా?' అని ఆ పోస్టులో రో ఖన్నా రాశారు.

జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ కూడా భారత సంతతికి చెందినవారే.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)