సెల్ టవర్‌పై 300 అడుగుల ఎత్తులో 18 నెలల పాటు నివాసం.. భోజనం, ఇతర అవసరాలు ఎలా తీరాయి? ఎవరీ గుర్జీత్ సింగ్? ఎందుకిలా చేశారు?

- రచయిత, సరబ్‌జీత్ సింగ్ ధలీవాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
''నేను 18 నెలల 12 రోజుల తర్వాత క్షేమంగా నేలపైకి వచ్చాను''
ఇవి పాటియాలా జిల్లా ఖేరీ నాగియా గ్రామానికి చెందిన గుర్జీత్ సింగ్ చెప్పిన మాటలు.
43 ఏళ్ల గుర్జీత్ సింగ్, 2024 అక్టోబర్ 12 నుంచి సమానా పట్టణం మధ్యలో ఉన్న ఒక మొబైల్ ఫోన్ టవర్ ఎక్కి అక్కడే చిన్న గుడారం వేసుకుని జీవించారు.
ఆయన్ను ఏప్రిల్ 24న ఉదయం సుమారు 7:45 గంటల సమయంలో టవర్ మీద నుంచి కిందకు తీసుకొచ్చారు.
'మత గ్రంథాలను అపవిత్రం చేయడం' వంటి చర్యలను కఠినంగా ఎదుర్కోవడానికి ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన టవర్ ఎక్కారు.
'నేను ఈ టవర్ ఎక్కినప్పటి నుంచి అంటే, 2024 అక్టోబర్ 12నుంచి 2026 ఏప్రిల్ 23వరకు చాలా దారుణమైన ఎండ, వాన, గాలులు ఎదుర్కొన్నాను. విపరీతమైన చలిని ఎదుర్కోవడంతో పాటు చాలా కష్టాలు పడ్డాను. కానీ, ఈ రోజు నాకు సంతోషంగా ఉంది. ఎట్టకేలకు నా డిమాండ్‌ను అంగీకరించారు' అని ఆయన అన్నారు.
(హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని ప్రమాదకర పరిస్థితులకు సంబంధించిన వివరణలు ఉన్నాయి)

'జగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ (సవరణ)-2026' బిల్లును పంజాబ్ అసెంబ్లీ 2026 ఏప్రిల్ 13న ఆమోదించింది. గవర్నర్ ఏప్రిల్ 17న సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది.
అయితే, ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పంజాబ్- హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కొత్త చట్టం లౌకికవాదానికి, ఆర్టికల్ 14కు విరుద్ధంగా ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఈ చట్టం వచ్చిన తరువాత.. పాటియాలా అధికారులు, సివిల్ డిఫెన్స్, భారత ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టి టవర్ మీద నుంచి గుర్జీత్ సింగ్‌ను కిందకు తీసుకొచ్చారు.
గుర్జీత్ సింగ్‌ను టవర్ నుంచి కిందకు దించిన తరువాత ఏప్రిల్ 24న అరెస్ట్ చేశారు.
'నేను ఆయన్ను గట్టిగా పట్టుకున్నా. తాళ్లు విప్పేశాను. తర్వాత ఒక బోనులోకి పంపించాను. ఈ ఆపరేషన్ కోసం మేం చాలా రోజులు ప్రాక్టీస్ చేశాం' అని గుర్జీత్ సింగ్‌కు కిందకు తీసుకొచ్చిన బృంద సభ్యుడు, అగ్ని మాపక సిబ్బంది కృష్ణ కుమార్ తెలిపారు.
గుర్జీత్ సింగ్‌కు కిందకు దించిన తర్వాత, ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

టవర్‌పై ఇన్ని నెలల పాటు ఎలా గడిపారు?
సమానా పట్టణం నడిబొడ్డున ఉన్న చిల్డ్రన్స్ పార్క్ దగ్గరలో ఉన్న ఈ టవర్ 18 నెలలుగా చర్చనీయమైంది.
బీబీసీ పంజాబీ టీమ్, గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో గుర్జీత్ సింగ్‌ను ఫోన్‌లో సంప్రదించింది.
'నేను నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ గుర్బానీ (సిక్కు బోధనలు) సహాయంతో చివరకు నాకు విజయం దక్కింది' అని గుర్జీత్ సింగ్ ఫోన్‌లో చెప్పారు.
ఆయనొక మాజీ సైనికుడు, ప్రస్తుతం రైతు.
2024 అక్టోబర్ 12న తాను టవర్ ఎక్కినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా పావురాలు ఇతర పక్షులు తనను బాగా ఇబ్బంది పెట్టినట్లు ఆయన తెలిపారు.
'మొదట టవర్ 100 అడుగులు ఎక్కిన తర్వాత కాసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నా. తర్వాత 200 అడుగుల వరకు వెళ్లాను. చివరకు 300 అడుగులు చేరుకున్నాక, నాకు ఆ ప్రదేశం భద్రంగా అనిపించింది' అని ఆయన చెప్పారు.
ఇదే క్రమంలో నెమ్మదిగా వస్తువులను కూడా పైకి తీసుకెళ్లినట్లు చెప్పిన ఆయన, టవర్‌పై టెంట్ వేసుకున్నట్లు తెలిపారు.
'నేనొక మాజీ సైనికుడిని. దాని వల్లే తాగడానికి చిన్న వాటర్ బాటిళ్లు, కాస్త ఆహారం, అవసరమైన ఇతర వస్తువులు పైకి తీసుకెళ్లగలిగాను. కానీ, అవన్నీ త్వరగానే అయిపోయాయి. అయిదు రోజుల తర్వాత, అధికారులు నాకోసం కొంత సామాను పంపించారు. అవి నాకు సరిపోయాయి' అని ఆయన వివరించారు.

తాను రాత్రంతా మేల్కొని ఉండి, సూర్యోదయం తర్వాత నిద్రపోయేవాడినని ఆయన తెలిపారు.
''నాకు రాత్రి సమయంలో భద్రతా పరమైన భయం ఉండేది. అందుకే ముందు జాగ్రత్తగా రాత్రంతా మేల్కొని ఉండేవాడిని'' అని ఆయన చెప్పారు.
అధికారులు తనను కిందకు దించడానికి చాలా ప్రయత్నాలు చేశారని, అయితే ఎత్తు కారణంగా వారు తన వరకు చేరుకోలేకపోయారని ఆయన అన్నారు.
''నా డిమాండ్ తీర్చాలంటూ నేను మొండిపట్టు పట్టాను. నాకు తెలిసిన వ్యక్తి ఒకరు రోజూ నాకు ఆహారం, మందులు, నీళ్లు అందించేవారు. బలమైన గాలులు వీచినప్పుడు, చీకటి పడినప్పుడు చాలా భయంగా అనిపించేది. ఎందుకంటే, ఆ సమయంలో టవర్ ఊగేది. అలాగే చలికాంలో పొగమంచు వల్ల ఏమీ కనిపించేది కాదు. విపరీతమైన చలితో కూడా బాగా ఇబ్బంది పడ్డాను' అని ఆయన వివరించారు.
ఇక వానకాలంలో వర్షానికి తన వద్ద ఉన్న దుస్తులన్నీ తడిసిపోయేవని తెలిపారు. రోజుకు ఒక రోటీ తింటూ ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ జీవించానని అన్నారు.
'నా కాళ్లు వాచిపోయాయి. చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ మతగ్రంథాలను అపవిత్రం చేసే చర్యలకు వ్యతిరేకంగా చట్టం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు' అని ఆయన తెలిపారు.

టవర్ మీదకు ఆయనకు ఆహారం ఎలా పంపేవారు?
గుర్జీత్ సింగ్ టవర్‌పై సుమారు 300 అడుగుల ఎత్తులో ఉండేవారు. అక్కడికి రోజూ భోజనం, అవసరమైన సామగ్రి పంపడం చాలా పెద్ద సవాలుగా ఉండేది.
గుర్జంత్ సింగ్ అనే యువకుడు రోజూ ఆయనకు ఆహారం చేరవేసేవారు. గుర్జంత్ సింగ్ ఒక ప్రైవేట్ కంపెనీలో టవర్లు అమర్చే పని చేసేవారు.
ఆయన రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆహారం, దుస్తులు, మందులు, బ్యాటరీలు సహా అవసరమైన ఇతర వస్తువులతో టవర్ ఎక్కేవారు.
'గుర్జీత్ సింగ్ దగ్గరకు చేరుకోవడానికి రోజూ 40 నిమిషాలు పట్టేది. ఆగుతూ విశ్రాంతి తీసుకుంటూ ఆయనను చేరుకునేవాడిని. తర్వాత ఆయనతో కాసేపు మాట్లాడేవాడిని. దాదాపు 4 గంటల తర్వాత కిందకు దిగేవాడిని' అని గుర్జంత్ సింగ్ చెప్పారు.
వాతావరణాన్ని బట్టి టవర్ రాడ్లు వేడెక్కేవని, చల్లబడేవని ఆయన తెలిపారు. ఒక్కోసారి టవర్ ఎక్కుతున్నప్పుడు తన చేతుల చర్మం ఊడిపోయేదని తెలిపారు.
వాన పడినప్పుడు, పొగమంచు ఉన్న రోజుల్లో టవర్ ఎక్కడం మరింత కష్టంగా ఉండేదని ఆయన చెప్పారు.

300 అడుగుల ఎత్తులో టెంట్ వేసుకొని..
గుర్జీత్ సింగ్ టవర్ ఎక్కి తన డిమాండ్ వినిపించగా, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు టీవీ జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, సైకాలజిస్టులు, రైతు సంఘాల నాయకులు కృషి చేశారు.
ప్రభుత్వానికి ఈయనకు మధ్య సమన్వయకర్తగా టీవీ జర్నలిస్ట్, 53 ఏళ్ల గురుప్రీత్ సింగ్ వ్యవహరించారు.
''ఫిబ్రవరి 24న నిరసన తెలపడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మొదట్లో పంజాబ్ ప్రభుత్వం దీన్ని అణచివేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ప్రజలు వెనక్కి తగ్గలేదు. బాబా బందా సింగ్ బహదూర్ చౌక్ వద్ద విజయవంతంగా నిరసన చేపట్టారు. ఏప్రిల్ 13న బిల్లు ఆమోదం పొందిన తర్వాత, నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ఆ బిల్లు ప్రతిని నిరసనకారులకు అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ అందించారు'' అని గురుప్రీత్ సింగ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































