‘ఫ్యాట్ జైల్’: ఊబకాయాన్ని తగ్గిస్తామని చెప్పే ఈ కేంద్రాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి? నిపుణుల ఆందోళన ఏంటి?

ఫొటో సోర్స్, TL Huang
- రచయిత, సారా బెల్
- హోదా, గ్లోబల్ డిజిటల్ హెల్త్
- చదివే సమయం: 6 నిమిషాలు
ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో చాలామంది ఒక పెద్ద స్పోర్ట్స్ హాల్‌లో వ్యాయామం చేస్తూ, క్యాంటీన్‌లో భోజనం కోసం క్యూలో నిలబడి, హాస్టళ్లలో నిద్రపోతూ కనిపిస్తున్నారు.
ఈ కొత్త ఫిట్‌నెస్ కేంద్రం విలాసవంతమైన స్పా రిట్రీట్ కాదు, మిలిటరీ స్టైల్‌లో బరువు తగ్గించే క్యాంప్. ఇది చైనాలో ఉంది. కొందరు దీన్ని ‘ఫ్యాట్ జైల్’ అని అంటున్నారు.
ఇక్కడ ఆహారాలపై కఠిన నియంత్రణలు ఉంటాయి. మధ్యమధ్యలో ఏదైనా తినాలనిపించినా అస్సలు తినకూడదు. రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా బరువు చూసుకోవాలి.
చైనా మీడియా నివేదికల ప్రకారం, ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగానే చైనా కూడా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటోంది.
అక్కడ ఇలాంటి క్యాంపులు సుమారు 1,000 వరకు ఉన్నాయి. వీటిలో నెలకు 600 డాలర్లు (సుమారు రూ.52వేలు) చెల్లించి హాస్టల్, భోజనం, రోజువారీ ఎక్సర్‌సైజ్ క్లాసులతో కూడిన ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

"28 రోజుల పాటు క్యాంప్ విడిచి వెళ్లడానికి అనుమతి లేదు. రోజూ బరువును చెక్ చేయాల్సిందే. అందుకే అది జైలులా అనిపించింది" అని ఎగ్‌ఈట్స్ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకునే కంటెంట్ క్రియేటర్ టీఎల్ హువాంగ్, బీబీసీ వరల్డ్ సర్వీస్ 'వాట్ ఇన్ ది వరల్డ్' పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
"మేం దొంగచాటుగా జంక్ ఫుడ్ తీసుకురాకుండా, క్లాసులు ఎగ్గొట్టకుండా మా ట్రైనర్లు ఎప్పుడూ గమనిస్తూనే ఉండేవాళ్లు. సరైన కారణం లేకుండా క్లాస్ మానేయడానికి లేదా క్యాంప్ బయటకు వెళ్లడానికి అనుమతి ఉండేదికాదు" అని హువాంగ్ చెప్పారు.
మరి ఈ శిబిరాలు ఎలా పనిచేస్తాయి, ఇంత త్వరగా ఎలా ఫేమస్ అయ్యాయి?

ఫొటో సోర్స్, TL Huang
'మారాల్సిన సమయం వచ్చింది'
చైనా దేశస్థురాలైన తన తల్లి ద్వారానే ఈ శిబిరాల గురించి తాను మొదట విన్నానని హువాంగ్ చెబుతున్నారు.
చైనాలో ఒంటరిగా తిరిగిన తర్వాత ఆరోగ్యం పాడవుతున్నట్టు అనిపించిందని, రోజువారి దినచర్యకు అంతరాయం కలిగిందని, ఎక్కువగా ఫుడ్ డెలివరీలపై ఆధారపడ్డాననీ ఆమె చెప్పారు.
"మూడేళ్లలో సుమారు 20 కిలోలు పెరిగాను. దీంతో బంధువులంతా ఏదొకటి అనడం మొదలుపెట్టారు. ఇక మారాల్సిన సమయం వచ్చిందనిపించింది" అని హువాంగ్ చెప్పారు.
"నేను లావుగా ఉండడంతో నన్ను ఎగతాళి చేస్తున్నారనిపించింది. బహుశా వారు నాపై ప్రేమను కూడా చూపించి ఉండవచ్చు, కాస్త కఠినంగా చెప్పినప్పటికీ" అని ఆమె అన్నారు.
ఆ పద్ధతి ప్రభావవంతంగా ఉందని హువాంగ్ చెప్పినప్పటికీ, అలా చేయడం శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ప్రమాదాలు కలిగిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
"కొన్ని క్యాంపులు రోజుకు ఒక కిలో బరువు తగ్గాలని లక్ష్యంగా పెడతాయి. ఈ రేటు వైద్య పర్యవేక్షణలో ఉన్న పెద్దలకు సురక్షితంగా భావించే పరిమితికన్నా ఎక్కువ" అని పర్సనల్ ట్రైనర్, న్యూట్రిషనిస్ట్ ల్యూక్ హానా చెబుతున్నారు.
ఈ క్యాంప్‌కు వెళ్లాల్సి రావడం నిజంగా ఇబ్బందికరం. కానీ ప్రజల్లో ఇది మనది అన్న భావన వచ్చేసింది. అందరూ బరువు తగ్గాలని కోరుకుంటున్నారు.
ప్రతి రోజు ఉదయం 7:30 గంటలకు బరువు చూడడంతో మొదలై, తర్వాత నాలుగు గంటల పాటు వ్యాయామం చేయాలి. స్పిన్ క్లాస్, ట్రాంపోలినింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, టబాటా, వెయిట్ ట్రైనింగ్ వంటివి ఉంటాయని ఆమె చెప్పారు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో నాలుగు ఉడికించిన గుడ్లు, అర టమాటో, రెండు దోసకాయ ముక్కలు ఉన్నాయి. ఒక వీడియోలో హువాంగ్ తన మధ్యాహ్న భోజనానికి రేటింగ్ ఇస్తూ కనిపించారు. అందులో రొయ్యలు, ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు, టోఫు లేదా ఉడికించిన చేప, చైనీస్ సెలెరీ, ఆకుకూరలు, కాలీఫ్లవర్ ఉన్నాయి.
"ఈ భోజనం రుచికరమైంది, సమతుల్యమైంది, చైనీయుల ఇంటి భోజనంలా తయారు చేశారు" అని ఆమె అన్నారు.
రాత్రి భోజనం అయ్యాక ఒక గంట స్పిన్ క్లాస్‌కు వెళ్లాలి. రాత్రి 7:30 గంటలకు రెండవసారి బరువు చూస్తారు. తర్వాత వారంతా విశ్రాంతి తీసుకోవచ్చు.
"మొదటివారం ఆ దినచర్య చాలా కొత్తగా, భిన్నంగా అనిపించింది. కానీ మరో మూడు వారాల పాటు ఇలాగే చెయ్యాలా అనుకున్నాను. స్నేహితులతో టెక్ట్స్ చేయడం, మాట్లాడడం వల్ల నేను ఉండగలిగా" అని హువాంగ్ చెప్పారు.
అది జైలులా ఉంది అని చెప్పినప్పటికీ, ఉపయోగపడిందని హువాంగ్ భావిస్తున్నారు. ఆమె 28 రోజుల్లో 6 కిలోల బరువు తగ్గారు.
"ఇది ఒక రకంగా మంచి రీస్టాట్. నాకు అవసరమైన క్రమశిక్షణను ఇచ్చింది" అని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎదుగుదలపై ప్రభావం'
అయితే ఇలా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
"ఈ క్యాంపులలో ఉపయోగించే పద్ధతులు ఆందోళన కలిగిస్తున్నాయి, ఎందుకంటే బరువు తగ్గేటప్పుడు కేవలం కొవ్వు మాత్రమే కాదు, మజిల్ టిష్యూ కూడా తగ్గుతుంది. మరీ అధిక వ్యాయామం వంటి కఠిన పద్ధతులు అనుసరిస్తే, కండరాల క్షీణత ప్రమాదం పెరుగుతుంది" అని లండన్‌కు చెందిన పర్సనల్ ట్రైనర్ ల్యూక్ హన్నా చెప్పారు.
"పిల్లలు లేదా యువత ఈ విధంగా బరువు తగ్గితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాగే సాధారణ శారీరక అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎముకల ఆరోగ్యంపై, చివరికి మీ ఎత్తు కూడా పెరగకపోవచ్చు" అని హన్నా చెప్పారు.
ఇదేకాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఉదాహరణకు ఈటింగ్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని హన్నా అన్నారు.
"కొంతమంది చాలా త్వరగా చాలా బరువు తగ్గుతారు, అది వినడానికి బానే అనిపిస్తుంది. కానీ వారిలో చాలామంది సాధారణ జీవితానికి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ బరువు పెరుగుతారు, ఎందుకంటే ఇది మూల కారణాలను లేదా సమస్యలను పరిష్కరించదు" అని హన్నా అంటున్నారు.
నెమ్మదిగా బరువు తగ్గాలని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచిస్తోంది. అంటే వారానికి అరకిలో నుంచి ఒక కిలో వరకు మాత్రమే.
దీనికి బదులుగా ప్రజలు తమ సాధారణ జీవితంలో అలవాట్లను మెల్లగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాలని, క్రమం తప్పకుండా పోషకాహారం తినాలని, పుష్కలంగా ప్రోటీన్ తీసుకోవాలని, వ్యాయామాన్ని శిక్షగా కాకుండా నేర్చుకోవడానికి, ఆడుకోవడానికి, సరదా కోసం చేయాలని హానా చెబుతున్నారు.
ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వీడియోలో ఇంటికి తిరిగి వెళ్లడం అత్యంత కష్టంగా అనిపించిందని, ఎందుకంటే ఆమె శరీరం ఇప్పుడు సాధారణ ఆహారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోలేకపోయిందని టీజే హువాంగ్ చెప్పారు.
ఆహారంలో ప్రతిరోజూ కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తూ శరీరం చురుగ్గా ఉండేలా చూసుకోవాలి.
తీపి పానీయాలకు బదులుగా నీళ్లు తాగడం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించడం కూడా సహాయపడుతుంది.

ఫొటో సోర్స్, TL Huang
వివక్ష
"చైనాలో ఈ తరహా క్యాంపులు 2000 ప్రారంభ దశలోనే ప్రారంభమయ్యాయి. ఒక టీవీ కార్యక్రమం కారణంగా ఇవి ప్రాచుర్యం పొందాయి. అందులో బరువు తగ్గించే సంస్థల లోపల ఎలా ఉంటుందో చూపించారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న కోచ్‌లు తర్వాత సొంత క్యాంపులను ప్రారంభించారు" అని బీబీసీ గ్లోబల్ చైనా యూనిట్‌కు చెందిన వాన్‌కింగ్ జాంగ్ చెప్పారు.
అయితే గత పదేళ్లలో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందండంతో ఈ క్యాంపులు వేగంగా పెరిగాయని జాంగ్ తెలిపారు.
"మీరు చైనీస్ సోషల్ మీడియాలో చూస్తే ఈ క్యాంప్ నిర్వాహకులు లేదా వీటిలో పాల్గొన్న వ్యక్తులు పోస్ట్ చేసిన చాలా కంటెంట్ కనిపిస్తుంది" అని జాంగ్ చెప్పారు.
ఈ క్యాంపులు అనేక రకాలుగా ఉంటాయని ఝాంగ్ వివరిస్తున్నారు. కొన్ని హువాంగ్ వెళ్లిన క్యాంప్‌లా చాలా కఠినంగా, క్రమశిక్షణతో ఉంటాయి. మరికొన్ని ఎంత కఠినంగా ఉంటాయంటే ఆహారం ఆర్డర్ చేయడానికి ప్రయత్నించే వారిని పట్టుకోవడానికి వసతి గృహాల బయట సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారని జాంగ్ వివరించారు.
ఇంకొన్ని క్యాంపులు వీటికి పూర్తి విరుద్ధంగా ఉంటాయని, అందమైన సరస్సును చూస్తూ ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తే, విలాసవంతమైన, ఉన్నత స్థాయి రిట్రీట్ తరహాలో ఉంటాయని జాంగ్ చెప్పారు.
ఈ క్యాంపుల పెరుగుదల వెనుక ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఊబకాయం సమస్య. దాదాపు మూడింట రెండు వంతుల దేశాలలో 50% కంటే ఎక్కువ మంది పెద్దవాళ్లు అధిక బరువు లేదా ఊబకాయం వర్గంలో ఉంటున్నారు.
సుమారు 34% మంది పెద్దవాళ్లు అధిక బరువుతో ఉండగా, 16% మందికి ఊబకాయం ఉన్నవారిగా పరిగణించినట్టు చైనా ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.
"దీనికి సాంస్కృతిక కారణం కూడా ఉంది. చైనాలో బరువు విషయంలో వైవిధ్యాన్ని అంగీకరించే సహనం తక్కువ. అంటే బరువు ఎక్కువగా ఉంటే, ఉద్యోగాల్లో లేదా డేటింగ్ ప్రపంచంలో వివక్ష ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ" అని జాంగ్ అంటున్నారు.
బియ్యం, డంప్లింగ్స్, నూడుల్స్ వంటి ఆహారాలలో ఉండే రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్లు ఒక సమస్య, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఖాళీ సమయాన్ని బయట గడపకుండా ఫోన్లు లేదా టాబ్లెట్లతో ఇళ్లకే పరిమితం కావడం కూడా సమస్యే అని జాంగ్ అన్నారు.
ఇదిలా ఉంటే హువాంగ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిసిందేమిటంటే, ఆమె ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నారు. అక్కడ ఆమె తీవ్రమైన వేడిలో రోజుకు రెండు గంటల పాటు వ్యాయామం చేస్తూ, మరో 30 రోజుల బరువు తగ్గే చాలెంజ్‌లో పాల్గొంటున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































