ఈ హాబీతో గోళ్లు కొరకడం, స్మోకింగ్ వంటి అలవాట్లు మానేయొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎలిజబెత్ బ్రౌన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
గోళ్లు కొరకడం, గంటల తరబడి ఫోన్ చూస్తుండడం నుంచి డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసైనవారు వరకు అందులోంచి బయటపడడానికి ఒక సులభమైన మార్గం ఉందంటున్నారు పరిశోధకులు. అది నిట్టింగ్.. అంటే అల్లికలు.
ఈ హాబీ అందరికీ ఉపయోగపడుతుంది.. కాకపోతే దీనివల్ల మీ ఇంట్లో స్కార్ఫ్‌లు, టోపీలు వంటివి ఎక్కువైపోవచ్చు.
నొప్పిని కలిగించే కొన్ని అలవాట్ల కారణంగా అమాండా విల్సన్ చాలాకాలం ఇబ్బండిపడ్డారు.
‘గాయం అయ్యేంతలా చర్మాన్ని పీక్కునేదాన్ని, ఇన్ఫెక్షన్ వచ్చేంతలా గోర్లు కొరుక్కునేదాన్ని’ అని ఒకప్పటి తన అలవాటు గురించి కెనడాలోని మిసిసాగాలో ఫైనాన్షియల్ వర్కర్‌గా పనిచేసే అమాండా అన్నారు.
ఆమె ఓసీడీతో బాధ పడుతున్నారు. తరువాత అమాండా అల్లికలు ప్రారంభించారు. ‘అప్పటి నుంచి నా గోళ్లు అందంగా, నా తల ఏ మచ్చ లేకుండా ఉన్నాయి’ అని అమాండా అన్నారు.

అల్లికలను వృద్ధుల హాబీగా పరిగణిస్తుంటారు కొందరు. కానీ, క్రమంగా ఇది అన్ని వయసుల వారికి మేలు చేసే ఆరోగ్యవంతమైన అలవాటుగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఎమోషనల్ రెగ్యులేషన్‌ను మెరుగుపరచడంతో పాటు విసుగు తెప్పించే చిన్న చిన్న అలవాట్ల నుంచి, ప్రాణాంతకమైన వ్యసనాలను అరికట్టేందుకు నిట్టింగ్, క్రోషె సహాయపడతాయని ప్రాథమిక అధ్యాయనాలతో పాటు వీటిని స్వయంగా ప్రయత్నించినవారు చెబుతున్నారు.
"అయితే పీటీఎస్-డీ , తీవ్రమైన ఈటింగ్ డిజార్డర్‌లు వంటి సమస్యలతో బాధపడేవారు, ఒక పరిష్కారంగా నిట్టింగ్‌ను అలవర్చుకోవడం కష్టం కావచ్చు కాని వారు ఒకసారి దీనిని అలవాటు చేసుకుంటే కచ్చితంగా మార్పును చూస్తారని" బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో సైకియాట్రీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కార్ల్ బర్మింగ్‌హామ్ అన్నారు. ఎందుకంటే అల్లికలు చాలా చవకైన హాబీ మాత్రమే కాదు ఎక్కడున్నా చేయగలిగేది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రయోజనాలకు ఆధారాలేంటి?
"మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్సల్లో ఒక బై-లాటరల్, క్రమబద్ధమైన, సైకో-సోషల్ పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, వైద్యులు అన్వేషిస్తుంటారు. కాని నిట్టింగ్ విషయానికొచ్చేసరికి వారి ఉత్సాహం నీరుగారిపోతుంది" అని ఫిజియోథెరపిస్ట్, వెల్-బీయింగ్ కోచ్‌గా పని చేస్తున్న బెట్సన్-ఖోర్కిల్ అన్నారు. నిట్టింగ్ వల్ల కలిగే చికిత్సా ప్రయోజనాలపై ఆమె ఒక అధ్యయనం చేశారు.
లండన్‌లో క్లినికల్ సైకాలజిస్ట్‌గా పని చేస్తున్న మియా నిట్టింగ్ వల్ల కలిగే చికిత్సా ప్రయోజనాల మీద ఒక పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్నారు.
సాధారణంగా నిట్టింగ్ మహిళలు చేసే పని కాబట్టి దీనిపై శాస్త్రవేత్తలు ఆసక్తి కనబరచడం లేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు మియా హాబ్స్.
దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల మీద ఎక్కువ శాస్త్రీయ అధ్యాయనాలు లేవు. నిట్టింగ్‌లో అనుభవం ఉన్న వారిని దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి అడిగే సర్వేలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. 2020లో నిర్వహించిన ఇలాంటి సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది క్రోషె వల్ల తమకు ప్రశాంతంగా అనిపిస్తుందని స్పందించారు.
కాని కొత్త డ్రగ్స్‌ను పరిచయం చేసేందుకు నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌లా నిట్టింగ్ పరిచయం లేని వారికి దాన్ని పరిచయం చేసే పరిశోధనలు అవసరమని హాబ్స్ అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ఇలాంటి సర్వేలలో ఎక్కువగా పాల్గొనేది దాదాపుగా తెల్ల జాతి మహిళలలేనని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సైకియాట్రీ ప్రొఫెసర్ బర్మింగ్‌హామ్ 2009లో అనొరెక్సియా, బులిమియా వంటి తీవ్రమైన ఈటింగ్ డిజార్డర్‌లతో బాధ పడుతున్న యువతుల కోసం ఏర్పాటైన ఒక ట్రీట్‌మెంట్ సెంటర్‌లో నిట్టింగ్‌పై చేసిన ఒక అధ్యయనం తరువాత దాని గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఆ అమ్మాయిలు చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్ పాటిస్తుండేవారు.
నిట్టింగ్ వారికి ఉత్సుకత పెంచే విధానంలా అనిపించిందని బర్మింగ్‌హామ్ అన్నారు. వారి మానసిక ఆరోగ్యంపై నిట్టింగ్ ప్రభావం చూపిందని ఆయన అన్నారు. ఆహారం చుట్టూ ఉన్న భయాన్ని తొలగించడంలో నిట్టింగ్ తమకు సహాయపడిందని దాదాపు 75 శాతం మంది యువతులు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిట్టింగ్ వల్ల ఇంత భారీ ప్రభావం ఎలా
నిట్టింగ్‌లో పదే-పదే రెండు చేతులను ఉపయోగిస్తూ చేసే కదలికను ప్రొఫెసర్ బర్మింగ్‌హామ్ ఈఎమ్‌డీఆర్ ( ఐ మూవ్‌మెంట్ డీసెన్సిటైసేషన్ అండ్ రీప్రాసెసింగ్) అనే చికిత్సా విధానంతో పోల్చారు.
ఈఎమ్‌డీఆర్‌లో ఒక లైట్ మూవ్‌మెంట్ క్రమబద్ధంగా ఎడమవైపు నుంచి కుడివైపు కదులుతుంది. దీని వల్ల మెదడులోని రెండు (కుడి- ఎడమ) భాగాలు యాక్టివేట్ అవుతాయి.
ఈ కదలికలు పారాసింపతెటిక్ నర్వస్ సిస్టంను యాక్టివేట్ చేస్తాయి. ఈ వ్యవస్థ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడిన తరువాత శరీరానికి విశ్రాంతిలో ఉంచడానికి తోడ్పడుతుంది. మనసు కుదురుకునేందుకు సహాయం చేస్తుందని హాబ్స్ అన్నారు.
నిట్టింగ్ వల్ల మెదడులో కలిగే ప్రభావాన్ని పరిశీలించేందుకు ఈఈజీను కూడా ఉపయోగించానని బర్మింగ్‌హామ్ అన్నారు. పేషెంట్ తలపై ఎలక్ట్రోడ్స్‌ను అమర్చి మెదడు లోపల ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ను ఈఈజీ ద్వారా గమనిస్తారు.
ఆయన ఫలితాలను ఒక పీర్- రివ్యూడ్ సైంటిఫిక్ స్టడీలో ప్రచురించకపోయినా, మెదడులో ఒత్తిడి స్పందనకు సంబంధించిన ఇన్సులా, అమిగ్డలా అనే భాగాలలో యాక్టివిటీని నిట్టింగ్ తగ్గించిందని ప్రాథమిక పరీక్షల ఫలితాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇలాంటి ఫలితాన్ని సాధించేందుకు మీరు ప్రొఫెషనల్ నిట్టర్ అయ్యుండాల్సిన అవసరం కూడా లేదు. "మీ అల్లికలు అందంగా లేకపోయినా ఫరవాలేదు. మీ మెదడులోని రెండు భాగాలూ పనిచేస్తే చాలు" అని బర్మింగ్‌హామ్ చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
వ్యసనాన్ని విడిచిపెట్టేందుకు నిట్టింగ్
ఏదైనా వ్యసనాన్ని విడిచిపెట్టాలని చూస్తున్నవారికి నిట్టింగ్ రెండు విధాలుగా సహాయపడుతుందని హాబ్స్ చెబుతున్నారు. అలవాటుకు దారి తీసే ప్రతికూల భావాలను ఇది ఎదుర్కొనేలా చేస్తుంది. అదే సమయంలో చేతులను మరో పనిలో నిమగ్నం చేస్తుంది.
"చాలా మంది నిట్టింగ్ తమ భావాలను ఎదుర్కునేలా చేస్తుందని వర్ణిస్తారు," అని హాబ్స్ అన్నారు. ఆ ప్రక్రియను నిట్టింగ్ సులభతరం చేస్తుందనన్నారు. ఇది "మనసులో తిరిగే ఆలోచనల నుంచి బయటికి వచ్చి చేతులతో చేసే పనిలో మునిగిపోయే" ఒక విధానం అని ఆయన అన్నారు
నిట్టింగ్‌ను హ్యాబిట్ రీప్లేస్‌మెంట్ థెరపీలో భాగంగా ఉపయోగించవచ్చు. అంటే హానికరమైన అలవాటుకు బదులుగా ఆరోగ్యకరమైన, మనసును శాంతపరిచే కార్యకలాపాన్ని అలవాటు చేయడం.

ఫొటో సోర్స్, Getty Images
‘సిగరెట్ తాగడం పూర్తిగా మానేశా’
నెదర్లాండ్స్‌కు చెందిన లోస్ వీన్‌స్ట్రా అనుభవం ఒక మంచి ఉదాహరణ. ఆమె సిగరెట్ వ్యసనాన్ని దూరంగా ఉంచేందుకు 550కు పైగా స్వెటర్లు అల్లారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న 60 ఏళ్ల టెక్నాలజీ మేనేజర్ కేసీ (ఆమె పూర్తి పేరు వెల్లడించవద్దని కోరారు), 46 సంవత్సరాలుగా రోజుకు ఒక ప్యాక్ సిగరెట్లు తాగేవారు. చివరికి నిట్టింగ్ ఆ వ్యసనాన్ని మానిపించడంలో సహాయపడిందని బీబీసీతో చెప్పారు.
కేసీ చెప్పిన వివరాల ప్రకారం, ఆమె పదేళ్ల పాటు అనేక మార్గాలను ప్రయత్నించారు. "ఒక్కసారిగా మానేయడం, మందులు, నికోటిన్ ప్యాచ్, ధ్యానం, ఆక్యుపంక్చర్, ఆరోగ్య సేవా సంస్థలు నిర్వహించిన తరగతులు వంటివేమీ ఆమె విషయంలో పనిచేయలేదు.
"నా తల్లి ఎలా చనిపోయిందో నేను కూడా అలా చనిపోవాలనుకోలేదు. ఆమె సిగరెట్ తాగుతూనే ఉండేది" అని ఆమె చెప్పారు.
ఆ తరువాత ఆమె సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో నిట్టింగ్ కోర్సులో చేరారు. మొదటి ప్రయత్నం చిన్నదే.. పాట్‌హోల్డర్ చేయాలని భావించిన ఆమె ప్రాజెక్ట్ "ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన రాంబస్ ఆకారం"గా మారింది. కానీ కొద్దిరోజుల్లోనే ఆమె పొడవైన స్కార్ఫ్‌లు అల్లడం మొదలుపెట్టారు
సిగరెట్ తాగే సమయంలో ఉండే అలవాటు విధానం, ఆచరాణాత్మక స్వభావానికి నిట్టింగ్ మంచి ప్రత్యామ్నాయం అయింది. "అది ఆ కోరికను తగ్గించింది" అని ఆమె చెప్పారు.
ఒకసారి ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి కలిగించిన ఒక ఫోన్ కాల్ తర్వాత ఆమెకు మళ్లీ సిగరెట్ తాగాలని బలంగా అనిపించింది.
"అప్పుడు నేను వెంటనే నాలుగు వరుసలు అల్లాను. కొద్దిసేపటికి సిగరెట్ తాగాలనే ఆలోచన పూర్తిగా మాయమైంది. అప్పుడే ఇది నిజంగా పనిచేస్తుందని నాకు అర్థమైంది. నేను ఏడ్చాను కూడా" అని కేసీ చెప్పారు.
ఇప్పటికే ఆమె రెండు సంవత్సరాలకుపైగా సిగరెట్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె సాక్స్, టోపీ, దుప్పటి వంటివి అల్లుతున్నారు.
2024లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, డీఅడిక్షన్ సెంటర్లలో ఉన్న మహిళలు "నిట్ టు క్విట్" కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తక్కువ సిగరెట్లు తాగినట్లు గుర్తించారు. ఇలాంటి పరిశోధనలు కూడా కొంత ఆశాజనకంగా ఉన్నాయి.
అయితే అదే సమయంలో వారు ధూమపానం వల్ల కలిగే ఆరోగ్యప్రమాదాలపై ఉపన్యాసాలు కూడా విన్నందున, ఈ మార్పుకు పూర్తిగా నిట్టింగే కారణమని కచ్చితంగా చెప్పలేమని పరిశోధకురాలు అలిసన్ వెస్ట్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పరిశోధనలు పెరగాలి’
నిట్టింగ్ వల్ల గుండె స్పందన రేటు తగ్గుతుందని, రక్తపోటు తగ్గుతుందని తరచూ వింటుంటాం. అది నిజమని భావించినా, ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపించలేదని హాబ్స్ చెబుతున్నారు.
సోషల్ మీడియా పోస్టుల్లో తరచూ ప్రస్తావించే ఒక పరిశోధన.. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కు చెందిన హెర్బర్ట్ బెన్‌సన్ ఆయన "రిలాక్సేషన్ రెస్పాన్స్" అనే భావనను వివరించారు. అయితే ఆ ఆసుపత్రిలోని బెన్‌సన్-హెన్రీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. నిట్టింగ్, గుండె స్పందన లేదా రక్తపోటు గురించి అలాంటి పరిశోధన ఎప్పుడూ నిర్వహించలేదు.
నిట్టింగ్ వల్ల అల్జీమర్స్ లేదా డిమెన్షియా వంటి జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించవచ్చనే వాదనా ఉంది. 2011లో చేసిన ఒక అధ్యయనం నిట్టింగ్ చేసే వృద్ధుల్లో జ్ఞాపకశక్తి సమస్య తక్కువగా ఉంటుందని సూచించింది. అయితే హాబ్స్ చెప్పిన వివరాల ప్రకారం, ఇది "కోడి ముందా గుడ్డు ముందా" అనే సమస్యలాంటిది వారికి జ్ఞాపకశక్తి తగ్గకపోవడం వల్లే వారు ఇంకా అల్లగలుగుతున్నారా అనేది స్పష్టంగా తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images
అల్లికలకు ప్రత్యామ్నాయంగా..
నిట్టింగ్ చేయడం ఒకటి, నిట్టింగ్ నేర్చుకోవడం మరోటి. మొదటిది మనసును ఒక 'ఫ్లో' స్థితిలోకి తీసుకెళ్లవచ్చు. కానీ రెండోది మాత్రం కాస్త చికాకుగా ఉంటుంది.తప్పిపోయిన కుట్టులను సరిచేయడం, పదేపదే ప్రయత్నించడం వంటి కష్టాలు ఉంటాయి.
ఈ దశను దాటడానికి అనుభవజ్ఞులైన నిట్టర్లు స్థానిక నిట్టింగ్ గ్రూపుల్లో చేరాలని సూచిస్తున్నారు. కొన్ని యార్న్ షాపుల్లో నిట్టింగ్ సమస్యలకు ప్రత్యేకంగా సహాయం చేసే "క్లినిక్" సమయాలు కూడా ఉంటాయని హాబ్స్ చెబుతున్నారు.
అయితే నిట్టింగ్ అందరికీ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. కొందరికి హస్త నైపుణ్యం తక్కువగా ఉండవచ్చు.
అలాంటి వారికి బర్మింగ్‌హామ్ మరో ప్రత్యామ్నాయం సూచిస్తున్నారు.. అది వీట్ బీడ్స్. ఇది శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఒక ఫిడ్జెట్ ఆటబొమ్మ. దారానికి గుచ్చిన ముత్యాలను చేతులతో కదుపుతూ మనసును కామ్ చేయడం దీని లక్ష్యం. అయితే పూర్తి ప్రయోజనం పొందాలంటే రెండు చేతులూ ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు.
నిట్టింగ్ నిజంగా ప్రధాన వైద్య సూచనగా మారాలంటే మందులపై చేసే పరిశోధనల మాదిరిగానే నియంత్రిత గ్రూపులతో, లోతైన అధ్యయనాలతో.. ఇంకా విస్తృత స్థాయిలో క్లినికల్ పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































