సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు.
"కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్, లేహ్-లద్దాఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నాయకుల సమక్షంలో 26 రోజుల తర్వాత నా నిరాహార దీక్షను విరమించాను" అని ఆస్పత్రి నుంచి ఒక ఫోటోను ‘ఎక్స్‌లో షేర్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.
"వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు నన్ను కలవడానికి వచ్చారు. నిరాహార దీక్షను విరమించాలని కోరుతూ నాకు లేఖలు రాశారు. దేశంలో హింస చెలరేగే అవకాశం ఉండడంతో, వివిధ షరతులపై సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఈ పరిస్థితులను నేను త్వరలో ఒక ప్రత్యేక వీడియోలో వివరంగా వివరిస్తాను.
అప్పటి వరకు, ఎక్కడా ఎలాంటి హింస జరగకుండా నిరోధించడానికి మీరందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను'' అని ఆ పోస్ట్‌లో ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
సీజేపీ, బీజేపీలో ఎలాంటి అభిప్రాయం ఉంది?
‘‘నేను మంత్రుల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నా. ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇస్తామని వారు రాతపూర్వక హామీ ఇచ్చారు’’ అని దీక్ష విరమించిన తర్వాత విడుదల చేసిన వీడియో సందేశంలో సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.
"26 రోజుల తర్వాత సోనమ్ సర్ తన నిరాహార దీక్షను విరమించడం మాకు ఉపశమనం, సంతోషాన్ని కలిగించింది. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. సర్, మీ ప్రాణాలను పణంగా పెట్టి యావత్ దేశ మనస్సాక్షిని కదిలించారు. ఈ దేశానికి మీ ప్రాణం అత్యంత విలువైనది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుంది'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిజిత్ దీప్కే పోస్ట్ చేశారు.
ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులతో పోలీసుల ప్రవర్తనపై.. సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించడానికి ముందే బీజేపీలో అంతర్గతంగా ప్రశ్నలు తలెత్తాయి.
"విద్యార్థుల ఆందోళనలు, సమస్యలు నిజమైనవి. వాటిని సానుభూతితో, దీర్ఘకాలిక పరిష్కారం దిశగా చూడాలి. దీనిని కేవలం బలప్రయోగంతో పరిష్కరించాల్సిన శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూడరని నేను ఆశిస్తున్నాను. మహిళలపై క్రూరమైన బలప్రయోగం చూడటం నాకు తీవ్ర బాధను కలిగిస్తోంది" అని బీజేపీ సీనియర్ నాయకుడు, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్ జోషి గురువారం సాయంత్రం 'ఎక్స్'లో రాశారు.
మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో నిర్లక్ష్యం చూపారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా గురువారం 'ఎక్స్'లో రాశారు.
"పేపర్ లీక్ కేసులో ఉదాసీనంగా ఉన్న విద్యాశాఖ కార్యదర్శిని ప్రధాని మోదీ తొలగించారు" అని నిశికాంత్ దూబే రాశారు.

ఫొటో సోర్స్, x.com/sonamwangchuk
ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ
ప్రశ్నాపత్రాల లీక్ కేసులపై కఠిన చర్యలు తీసుకునే ప్రతిపాదనను శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
''పేపర్ లీక్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటికే అనేక కఠిన చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపింది. 22 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం త్వరితగతిన మళ్లీ పరీక్షలు నిర్వహించి ఇటీవల ఫలితాలను ప్రకటించింది. పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు విధించే బిల్లుపై త్వరలో చర్చ జరగనుంది'' అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రధానమంత్రి మోదీ చెప్పారు.
"ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం ఈరోజు నేను సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చాను. ఆయా శాఖలు అవిశ్రాంతంగా పనిచేసి, రాత్రే నాకు ఒక ముసాయిదాను సమర్పించాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠినమైన శిక్షలను నిర్దేశించే ఈ ముసాయిదాను శుక్రవారం క్యాబినెట్ చర్చ కోసం ప్రవేశపెట్టనున్నాం. క్యాబినెట్ సహచరుల సూచనల తర్వాత దీనిని ఖరారు చేస్తాం. సోమవారం పార్లమెంట్ సమావేశాలు రెండోవారం ప్రారంభమవుతాయి. ఈ బిల్లును సభలో వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి" అని ప్రధాని తెలిపారు.
అంతకుముందు నీట్-యూజీ పేపర్ లీక్‌పై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించింది. గతంలో ఈ రెండు శాఖలను నిర్వహించిన వినీత్ జోషిని, తక్కువ ప్రాముఖ్యత ఉన్న పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది.
పశుసంవర్ధక శాఖ కార్యదర్శి నరేశ్ పాల్ గంగ్వార్ ఉన్నత విద్యా శాఖకు కొత్త కార్యదర్శిగా నియమితులవ్వగా టీకే అనిల్ కుమార్ పాఠశాల విద్యా శాఖకు కొత్త కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఈ మార్పులను విద్యా మంత్రిత్వ శాఖలో ఒక ప్రధాన అధికార యంత్రాంగ మార్పుగా పరిగణిస్తున్నారు. గతంలో నీట్, సీయూఈటీ ఇతర పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కి అభిషేక్ సింగ్ అధిపతిగా నియమితులయ్యారు.
ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం నేపథ్యంలో జూన్ ప్రారంభంలో సీబీఎస్ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తాలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి బదిలీ చేశారు.
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రశ్నాపత్రాల లీకేజీని పరిపాలనావైఫల్యంతో ముడిపెట్టడంగా కొందరు భావిస్తున్నారు. విద్యార్థి ఉద్యమం రాజకీయ జవాబుదారీతనం కోసం పిలుపునిస్తుండగా, ప్రభుత్వం పరిపాలనాపరమైన మార్పులు చేసింది.
"మోదీ ప్రభుత్వం పరిపాలనా చర్య తీసుకుందని కొన్ని వార్తాపత్రికలు ఒక కథనాన్ని సృష్టించవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే అంత తీవ్రమైన అవకతవకలు జరిగి ఉంటే ప్రధాని మోదీ ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి ఎందుకు తొలగించలేదు?" అని యేల్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ అయిన సుశాంత్ సింగ్ 'ఎక్స్'లో ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?
తన నిరాహార దీక్ష 21వ రోజున సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా దిల్లీలోని జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన తన నిరాహార దీక్షను విరమించలేదు.
రాజకీయ పార్టీల నాయకులు తనను కలిసి సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇస్తేనే సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమిస్తారని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ప్రకటించారు.
ఇది నేరుగా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న డిమాండ్ కాదు. అందుకే దీనిని చాలా తేలికైన షరతుగా కొందరు భావించారు.
ఇది ఏకపక్ష ప్రకటన అని, ఒక విధంగా ప్రభుత్వానికి విజయమని చాలా మంది మాట్లాడడం మొదలుపెట్టారు.
"ఇది చాలా నిరాశాజనకం. ఇప్పుడు జవాబుదారీతనం భారం ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంపైకి మారింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో విద్యను ఒక అంశంగా లేవనెత్తుతామని తన వద్దకు వచ్చి వాగ్దానం చేయమని ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీరు జవాబుదారీతనాన్ని ఇష్టపూర్వకం చేసి దానినే జవాబుదారీతనం కోరడంతో సమానం చేశారు" అని తన నిరాహార దీక్షను విరమించడానికి వాంగ్‌చుక్ పెట్టిన షరతులను దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన రాజకీయ విశ్లేషకుడు అపూర్వానంద్ విశ్లేషించారు.
జూలై 21 సాయంత్రం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం బయట ధర్నా చేసినప్పుడు గీతాంజలి దానికి మద్దతు ఇవ్వలేదు.
"ప్రధానమంత్రి నివాసం బయట జరిగిన నిరసన చిత్తశుద్ధితో కూడినది కాదు. ఆయన జంతర్ మంతర్ ద్గగర విద్యార్థుల నిరసనకు మద్దతుగా నిలవాల్సింది. ప్రజలను మోసం చేయలేరు" అని ఆమె ఇండియా టుడేతో అన్నారు.
"కనీస మర్యాద కూడా కనుమరుగవుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె ప్రతిపక్షాల నిరసనలను కించపరుస్తున్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆమె భర్తతో పాటు జంతర్ మంతర్‌కు చేరుకుని ఉద్యమానికి తమ మద్దతును తెలిపాయి. అయినప్పటికీ ఆమె వారిపై దాడి చేస్తున్నారు" అని గీతాంజలి స్పందనకు ప్రతిస్పందనగా ప్రొఫెసర్ అపూర్వానంద్ 'ఎక్స్'లో విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఏమయింది?’
దేశంలో హింస జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని తాను దీక్ష విరమించానని సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు.
అంతకుముందు వాంగ్‌చుక్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ నిరాహార దీక్ష విరమించే సమయంలో ఆయన ఈ డిమాండ్‌ను ప్రస్తావించలేదు.
మరోవైపు ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నిరాహార దీక్ష విరమించడానికి ముందే పరిపాలనాపరమైన మార్పులు జరిగాయి.
ఇప్పుడు ఈ ఉద్యమం సీజేపీది గానీ, సోనమ్ వాంగ్‌చుక్‌ది గానీ కాదని ఇది ఇప్పుడు దేశ యువత ఉద్యమంగా మారిందని కూడా పలువురు అంటున్నారు.
"ఆయన ఇంటికి తిరిగి వెళ్లి, బాగా తిని, పూర్తిగా కోలుకోవాల్సిన సమయం వచ్చింది. ఇకపై ఆయన అవసరం ఇక్కడ లేదు" అని సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను ముగించిన సందర్భంగా ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపక సంపాదకులు ప్రతీక్ సిన్హా ‘ఎక్స్‌లో రాశారు.
"ఇది నిస్సందేహంగా ఒక కీలకమైన మలుపు. దీని ప్రభావం భారత సరిహద్దులకు ఆవల కూడా కనిపిస్తుంది. భారత యువత ముఖ్యంగా జెన్-జీ, విద్యార్థులు, 'కొత్త భారత్' నిజంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తామే నిర్వచించడం మొదలయింది. వారు కేవలం తమకు దక్కాల్సిన గౌరవం, జవాబుదారీతనం డిమాండ్ చేస్తున్నారు" అని లండన్ విశ్వవిద్యాలయంలో రీడర్ అయిన అవినాష్ పాలివాల్ 'ఎక్స్'లో రాశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























