జన నాయకుడు మూవీ రివ్యూ: విజయ్ 'చివరి సినిమా' ఎలా ఉంది?

ఫొటో సోర్స్, YT/KVN PRODUCTIONS
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
తమిళనాడు ఎన్నికలకు ముందు రావాల్సిన జన నాయకుడు ఆలస్యమై ఇప్పుడొచ్చింది. ఇది ఒక రకంగా విజయ్ రాజకీయ ప్రాపగాండ సినిమా. ఎన్నికలకి ముందు వస్తే కొంచెం ఫలితం ఉండేది. కానీ, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది.
కథ ఏమంటే తళపతి వెట్రికొండన్ (టీవీకే...ఇది విజయ్ పార్టీ పేరు). జైల్లో ఉంటాడు. స్వాతంత్ర్య దినోత్సవ క్షమాభిక్ష పెట్టి ఒక పోలీస్ అధికారి (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఆయన్ను విడుదల చేయిస్తాడు. ఆ పోలీస్ అధికారికి విజ్జీ (మమిత బైజు) అనే కూతురు ఉంటుంది. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోతే, ఆ అమ్మాయిని హీరో పెంచి పెద్ద చేస్తాడు.
విజ్జీని మిలిటరీ యూనిఫాంలో చూడాలని హీరో కోరిక. అయితే, చిన్నప్పుడు తల్లి మరణం చూడడం వల్ల ఆమెకి ఒక ఫోబియా ఉంటుంది. మిలిటరీలో చేరడం ఇష్టం ఉండదు.
విజ్జీని ఒక గ్యాంగ్ టార్గెట్ చేయడంతో హీరో అలెర్ట్ అవుతాడు. ఆ గ్యాంగ్ వెనుక హిమ్లర్ (బాబి డియోల్) ఉంటాడు. ఆయనకు రాజకీయ నాయకుడు ప్రకాశ్‌రాజ్ సహకరిస్తూ ఉంటాడు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని హిమ్లర్ ప్రయత్నిస్తూ ఉంటాడు.
అసలీ హిమ్లర్ ఎవరు? ఒకప్పుడు పోలీస్ అధికారి అయిన హీరో జైలుకి ఎందుకెళ్లాడు? ఫైనల్‌గా హిమ్లర్‌ని ఎలా ఫినిష్ చేసి , దేశాన్ని ఎలా కాపాడాడు? ఇదీ మిగతా కథ.


ఫొటో సోర్స్, YT/KVN PRODUCTIONS
భగవంత్ కేసరికి రీమేక్..
ఇది బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరికి రీమేక్. అయితే, ఆ సినిమాలో బాలకృష్ణకి , శ్రీలీలకి మధ్య ఎమోషన్ డ్రామా బలంగా ఉంటుంది. జననాయకుడులో విజయ్ ఎలివేషన్స్, ముఖ్యంగా పొలిటికల్ డైలాగ్‌లు ఎక్కువగా ఉంటాయి. సెకెండాఫ్‌లో కథ పూర్తిగా రాజకీయాల మీదే నడుస్తుంది.
విజయ్ పార్టీ ప్రచారం కోసం తీసిన సినిమాగా చెప్పొచ్చు. తమిళనాడుని పాలిస్తున్న రెండు పార్టీలు, మత రాజకీయాలపై (పరోక్షంగా బీజేపీ) ఎక్కుపెట్టిన సినిమా. భ్రష్టు పట్టిన రాజకీయాలు మారాలంటే విజయ్ లాంటి నాయకుడు రావాలనే సందేశం సినిమా మొత్తం వినిపిస్తూ ఉంటుంది. నేను వస్తున్నా, నన్నెవరూ ఆపలేరు అనే డైలాగ్ విజయ్ నోటివెంట వినిపిస్తూ ఉంటుంది.
అయితే ఇది విజయ్ అబిమానులకి, తమిళ ప్రేక్షకులకి నచ్చవచ్చు కానీ, తెలుగు ప్రేక్షకులకి మాత్రం అంత ఎక్కకపోవచ్చు. మూడు గంటల సేపు రొటీన్ ఫైట్స్, పొలిటికల్ డైలాగ్స్ .. రిపీటెడ్‌గా వస్తూనే ఉంటాయి.

ఫొటో సోర్స్, KVN Productions/X
ఇది విజయ్ ఆఖరి సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా తన రాజకీయ ప్రచార లక్ష్యం నెరవేరిందేమో కానీ, కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ సినిమా కాదు. అయితే విజయ్ ఎనర్జీ, నటన చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నాయి. ఒక పాటకి అదిరిపోయే డ్యాన్స్ కూడా చేశాడు.
విలన్‌గా బాబీ డియోల్ పాత్ర చాలా సినిమాల్లో చూసిందే. ఆఫ్రికా దేశాన్ని గజగజ వణికించిన క్రూరుడిగా పరిచయమై , తర్వాత తేలిపోయాడు. పోలీస్ అధికారి నుంచి విలన్‌గా మార్పు చెందిన సన్నివేశం బాగుంది.
పొలిటికల్ విలన్‌గా ప్రకాశ్‌రాజ్ చాలా రొటీన్. పైగా డబ్బింగ్ ఆయన గొంతు కాకపోవడం ఆర్టిఫిషియల్‌గా ఉంది. జర్నలిస్ట్‌గా పూజాహెగ్డేకి కొద్దిగా స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని మమితబైజు చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించింది.
రేవతి, ప్రియమణి ఉన్నారంటే ఉన్నారు. ఎక్కడా వాళ్లకి మంచి సీన్ లేదు. ఉన్నదంతా విజయే. ఇది ఆయన వన్‌మ్యాన్ పొలిటికల్ షో.

ఫొటో సోర్స్, kvn.productions/insta
ఖర్చు బాగా పెట్టారు కానీ, సంగీతం, ఎడిటింగ్, కెమెరా ఎక్కడా చెప్పుకోదగిన రీతిలో లేవు.
ఆఖర్లో రోబోలు, డ్రోన్లు కూడా ఫైటింగ్ చేస్తాయి. వీడియో గేమ్ చూసినట్టు ఉంటుంది.
అడవిలో పెద్ద ఫైట్, జైలులో, ఆటో మొబైల్ వర్క్‌షాప్‌లో , విలన్ ఇంట్లో భారీ ఫైట్స్. రకరకాల ధర్నాలు, నిరసనలు , మహిళా సాధికారత, రాజకీయ డైలాగ్‌లు ఇలా రకరకాల సీన్స్‌తో కిచిడీలా, లేదంటే అన్ని రకాల కూరగాయలు వేసిన సాంబారులా ఉందీ సినిమా.

ఫొటో సోర్స్, kvn.productions/insta
ప్లస్ పాయింట్స్:
1.విజయ్ ఎనర్జీ, కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
1.మూడు గంటల నిడివి
2.ఆల్రెడీ చూసిన సినిమాలా ఉండడం
ఫైనల్‌గా విజయ్ అభిమానులకి విజిల్స్.
మామూలు ప్రేక్షకులకి విసుగు.
(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























