యాంటీబయాటిక్ రెసిస్టెన్స్: ప్రపంచ వైద్యరంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఈ సమస్యేంటి?

యాంటీబయాటిక్, వైద్యం, చికిత్స, రోగి, వైద్యుడు
ఫొటో క్యాప్షన్, బ్యాక్టీరియా కాలక్రమేణా కొన్ని యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు.
    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అతిపెద్ద ప్రజారోగ్య సమస్యల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) ఒకటి.

ఒకప్పుడు సాధారణ యాంటీబయాటిక్ మాత్రలతో తగ్గిపోయే అనేక బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఇప్పుడు శక్తిమంతమైన మందులు వాడినా కొన్నిసార్లు తగ్గడం లేదు.

దీంతో న్యుమోనియా, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, రక్తంలో ఇన్‌ఫెక్షన్, క్షయ వంటి వ్యాధుల చికిత్స మరింత క్లిష్టమవుతోంది.

జలుబు, గొంతునొప్పి, జ్వరం.. ఇలా ఏది వచ్చినా వెంటనే యాంటీబయాటిక్ మాత్రలు వేసుకోవడం, గతంలో వాడిన మందులనే మళ్లీ వాడడం, డాక్టర్ సూచించిన కోర్సును మధ్యలోనే ఆపేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి.

ఇది కేవలం వైద్యులకో, ఆస్పత్రులకో సంబంధించిన సమస్య కాదు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజారోగ్య సమస్య.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లను నయం చేయడానికి ఉపయోగించేవే యాంటీబయాటిక్స్. పెన్సిలిన్, అమాక్సిసిలిన్, అజిత్రోమైసిన్, సెఫిక్సిమ్, సెఫ్ట్రియాక్సోన్, సిప్రోఫ్లోక్సాసిన్ వంటి మందులు దీనికి ఉదాహరణలు.

అయితే బ్యాక్టీరియా కాలక్రమేణా కొన్ని యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. దీనినే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు.

యాంటీబయాటిక్స్‌ను అనవసరంగా లేదా తప్పుగా ఉపయోగించినప్పుడు, వాటికి సున్నితంగా ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ రెసిస్టెన్స్ కలిగిన బ్యాక్టీరియా జీవించి, వృద్ధి చెంది, ఇతరులకు కూడా వ్యాపించవచ్చు. సాధారణ మందులతో తగ్గిపోయే ఇన్‌ఫెక్షన్లు కూడా చికిత్సకు లొంగని పరిస్థితికి చేరుకోవచ్చు.

యాంటీబయాటిక్, వైద్యం, చికిత్స, రోగి, వైద్యుడు
ఫొటో క్యాప్షన్, యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే సాధారణ ఇన్‌ఫెక్షన్లు తగ్గడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు.

ప్రతి ఆరు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లలో ఒకదానికి నిరోధకత

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రచురించిన 2025 గ్లోబల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లలో సుమారు ప్రతి ఆరు ఇన్‌ఫెక్షన్లలో ఒకటి యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగి ఉంది.

2018–2023 మధ్య పర్యవేక్షించిన బ్యాక్టీరియా-యాంటీబయాటిక్ కలయికల్లో 40 శాతానికి పైగా రెసిస్టెన్స్ పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.

భారత్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) ప్రతి సంవత్సరం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నివేదికలను ప్రచురిస్తోంది.

ముఖ్యంగా ఆస్పత్రుల్లో కనిపించే ఈ-కొలి, క్లెబ్సీ నిమోనియా వంటి బ్యాక్టీరియాల్లో అనేక కీలక యాంటీబయాటిక్స్‌పై నిరోధకత కనిపిస్తోంది. దీని ఫలితంగా సాధారణ ఇన్‌ఫెక్షన్లకు కూడా కల్చర్ పరీక్షలు, ఖరీదైన యాంటీబయాటిక్స్, ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

యాంటీబయాటిక్, వైద్యం, చికిత్స, రోగి, వైద్యుడు
ఫొటో క్యాప్షన్, యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై పనిచేస్తాయి కానీ వైరస్‌లపై పనిచేయవు.

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కు ప్రధాన కారణాలు

1. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడటం

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు వచ్చినప్పుడు మెడికల్ షాపులో మందులు కొనుక్కొని వాడటం చాలామందికి అలవాటు. ఇది మంచిది కాదు. ముఖ్యంగా గతంలో వాడిన యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వాడడం ప్రమాదకరం.

2. వైరల్ ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ వాడటం

జలుబు, ఫ్లూ, చాలా గొంతునొప్పులు, వైరల్ జ్వరాలు వైరస్‌ల వల్ల వస్తాయి. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై పనిచేస్తాయి కానీ వైరస్‌లపై పనిచేయవు.

3. సూచించిన చికిత్సను సరిగా పాటించకపోవడం

డాక్టర్ సూచించిన మోతాదు, సమయాలను పాటించకపోవడం, స్వయంగా మందుల మోతాదు తగ్గించడం, పెంచడం లేదా చికిత్సను మార్చడం వంటివి సమస్యను పెంచొచ్చు. వైద్యుడిని సంప్రదించకుండా చికిత్సను ఆపకూడదు లేదా పొడిగించకూడదు.

4. ఇతరుల మందులు వాడటం

కుటుంబ సభ్యులకు గతంలో ఇచ్చిన యాంటీబయాటిక్స్‌ మనకు కూడా ఉపయోగపడతాయని భావించి వాడడం తప్పు. ఒకే రకమైన లక్షణాలు ఉన్నప్పటికీ వాటి వెనుక కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు.

5. ఆసుపత్రుల్లో యాంటీబయాటిక్స్ అధిక వినియోగం

అవసరం లేకపోయినా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ ఉపయోగించడం, కల్చర్ పరీక్షల ఫలితాలను పట్టించుకోకుండా చికిత్స కొనసాగించడం కూడా రెసిస్టెన్స్ పెరగడానికి కారణమవుతుంది.

6. వ్యవసాయం, పశుపోషణలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం

పశువులు, కోళ్లు, చేపల పెంపకంలో అవసరానికి మించి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల రెసిస్టెంట్ బ్యాక్టీరియా పర్యావరణంలోకి చేరి మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు (యూటీఐ), న్యుమోనియా, క్షయవ్యాధి (ట్యుబర్‌క్యులోసిస్), ఆస్పత్రుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు - ముఖ్యంగా ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండేవారు, వెంటిలేటర్‌పై ఉన్నవారు, క్యాన్సర్ చికిత్స పొందేవారు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వచ్చే ఇన్ఫెక్షన్లు, సెప్సిస్‌లో ఈ రెసిస్టెన్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే ఏమవుతుంది?

  • సాధారణ ఇన్‌ఫెక్షన్లు తగ్గడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు.
  • ఖరీదైన, శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ అవసరం కావొచ్చు.
  • ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావొచ్చు.
  • చికిత్స ఖర్చులు పెరుగుతాయి.
  • శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, అవయవ మార్పిడి వంటి ఆధునిక వైద్య విధానాల సమయంలో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
  • తీవ్రమైన సందర్భాల్లో సెప్సిస్, అవయవ వైఫల్యం, మరణం సంభవించవచ్చు.

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ను ఎలా గుర్తిస్తారు?

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ను కేవలం జ్వరం తగ్గకపోవడం ద్వారా నిర్ధరించలేం. వైరల్ ఇన్‌ఫెక్షన్, తప్పు నిర్ధరణ, మందుల శోషణలో సమస్యలు, ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.

అవసరాన్ని బట్టి వైద్యులు కొన్ని పరీక్షలు సూచిస్తారు.

కల్చర్ టెస్ట్: రక్తం, మూత్రం, కఫం లేదా ఇతర ఇన్‌ఫెక్షన్ నమూనాల్లో బ్యాక్టీరియాను గుర్తించడం.

యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్: ఏ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి, ఏవి పనిచేయవో తెలుసుకోవడం.

రక్త పరీక్షలు: సీబీసీ, సీఆర్పీ, అవసరాన్ని బట్టి ప్రొకాల్సిటోనిన్ (Procalcitonin) వంటి పరీక్షలు.

మాలిక్యులర్ టెస్టులు: కొన్ని ఇన్‌ఫెక్షన్లలో రెసిస్టెన్స్ జన్యువులను గుర్తించడానికి ఉపయోగపడతాయి.

అయితే ప్రతిసారీ జలుబు, జ్వరం, గొంతునొప్పికి కల్చర్ పరీక్షలు అవసరం లేదు. ఇన్‌ఫెక్షన్ రకం, రోగి పరిస్థితిని బట్టి వైద్యుడు నిర్ణయిస్తారు.

యాంటీబయాటిక్, వైద్యం, చికిత్స, రోగి, వైద్యుడు
ఫొటో క్యాప్షన్, భారత ప్రభుత్వం యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి రెడ్ లైన్ క్యాంపెయిన్ చేస్తోంది.

యాంటీబయాటిక్స్ వినియోగం: చేయాల్సినవి, చేయకూడనివి

చేయాల్సినవి

  • వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి
  • సూచించిన మోతాదు, సమయం, చికిత్స వ్యవధిని పాటించాలి
  • మందులు వాడుతున్నప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్యుడికి తెలియజేయాలి
  • అవసరమైతే కల్చర్, సెన్సిటివిటీ పరీక్షలు చేయించుకోవాలి
  • చేతులను సబ్బుతో తరచుగా శుభ్రం చేసుకోవాలి
  • అవసరమైన టీకాలు వేయించుకోవాలి
  • ఆహారం, తాగునీటి పరిశుభ్రత పాటించాలి
  • చికిత్సకు స్పందన లేకపోతే తిరిగి వైద్యుడిని సంప్రదించాలి
  • చేయకూడనివి
  • జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలకు స్వయంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు
  • ఇతరులకు ఇచ్చిన మందులను మనం వాడకూడదు
  • మిగిలిపోయిన యాంటీబయాటిక్ మాత్రలను భవిష్యత్తులో ఉపయోగించకూడదు
  • డాక్టర్ సలహా లేకుండా మోతాదును తగ్గించకూడదు, పెంచకూడదు
  • మందులు పనిచేస్తున్నట్టు అనిపించినా స్వయంగా చికిత్సను నిలిపివేయకూడదు
  • అవసరం లేకుండా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ అడగకూడదు
  • ఒకే యాంటీబయాటిక్‌ను పదేపదే స్వయంగా వాడకూడదు
  • యాంటీబయాటిక్స్‌ను ఇతరులతో పంచుకోకూడదు

భారత్‌లో 'రెడ్ లైన్' ప్రచారం – ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం

భారత ప్రభుత్వం యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి రెడ్ లైన్ క్యాంపెయిన్ చేస్తోంది.

కొన్ని యాంటీబయాటిక్ మందుల స్ట్రిప్‌లపై ఎరుపు రంగు నిలువు గీత ఉంటుంది. ఆ మందును వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉపయోగించకూడదనే హెచ్చరిక అది.

అందువల్ల మెడికల్ షాపులో మందు అందుబాటులో ఉందని, అది సురక్షితంగా, స్వయంగా వాడుకోవచ్చని భావించకూడదు.

యాంటీబయాటిక్స్ అవసరాన్ని తగ్గించడంలో టీకాల పాత్ర

ఇన్‌ఫెక్షన్లు రాకుండా నివారించడం కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో కీలకం.

న్యుమోకాకల్ వ్యాక్సీన్ కొన్ని రకాల న్యుమోనియాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సీన్.. ఫ్లూ, దాని వల్ల వచ్చే కొన్ని ద్వితీయ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టైఫాయిడ్ వ్యాక్సీన్ టైఫాయిడ్ నివారణకు ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు జాతీయ టీకా కార్యక్రమం ప్రకారం అన్ని టీకాలూ వేయించాలి. చేతుల పరిశుభ్రత, దగ్గేటప్పుడు నోరు కప్పుకోవడం, సురక్షితమైన ఆహారం, శుభ్రమైన తాగునీరు ఉండేలా చూసుకోవాలి.

టీకాలు అన్ని ఇన్‌ఫెక్షన్లను నివారించలేవు. కానీ నివారించగల ఇన్‌ఫెక్షన్లు తగ్గడం ద్వారా యాంటీబయాటిక్స్ అవసరం కూడా తగ్గుతుంది.

యాంటీబయాటిక్, వైద్యం, చికిత్స, రోగి, వైద్యుడు
ఫొటో క్యాప్షన్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ను అరికట్టడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకం.

వన్ హెల్త్ – మనుషులు, జంతువులు, పర్యావరణం అన్నీ అనుసంధానమే

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్యను కేవలం మనుషులకు అందించే వైద్యంతోనే పరిష్కరించలేం. మనుషులు, జంతువులు, పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి సమగ్రంగా చర్యలు తీసుకోవాలి. దీనినే వన్ హెల్త్ (వన్ హెల్త్) విధానం అంటారు.

పశువులు, కోళ్లు, చేపల పెంపకంలో అవసరం లేని యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించాలి. పశువులకు యాంటీబయాటిక్స్‌ను వెటర్నరీ వైద్యుల సూచనల మేరకే ఇవ్వాలి. ఆస్పత్రుల వ్యర్థాలు, ఔషధ పరిశ్రమల వ్యర్థాలను సక్రమంగా శుద్ధి చేయాలి. పర్యావరణంలోకి యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా చేరకుండా చర్యలు తీసుకోవాలి.

భారత ప్రభుత్వం 2025లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0ను రూపొందించింది. ప్రజల్లో అవగాహన, ఇన్‌ఫెక్షన్ నివారణ, నిఘా వ్యవస్థల బలోపేతం, సముచిత యాంటీబయాటిక్ వినియోగం దీనిలో ముఖ్యమైన అంశాలు.

వైద్యుల బాధ్యతా కీలకమే

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ను అరికట్టడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకం.

- అవసరం ఉన్నప్పుడే యాంటీబయాటిక్స్ సూచించాలి

- వీలైనప్పుడు స్థానిక యాంటీబయాటిక్ సెన్సిటివిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి

- తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లలో అవసరమైనప్పుడు కల్చర్ పరీక్షలు చేయించాలి

- కల్చర్ ఫలితాలు వచ్చిన తర్వాత చికిత్సను సమీక్షించి తగిన యాంటీబయాటిక్‌ను ఎంచుకోవాలి

- అవసరమైన దానికంటే ఎక్కువకాలం చికిత్స కొనసాగించకూడదు

- ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, చేతుల పరిశుభ్రత, యాంటీబయాటిక్ స్టీవార్డ్‌షిప్ కార్యక్రమాలను అమలు చేయాలి.

యాంటీబయాటిక్, వైద్యం, చికిత్స, రోగి, వైద్యుడు
ఫొటో క్యాప్షన్, చిన్న పిల్లల పాఠ్యాంశాల్లో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ గురించి చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రభుత్వం ఏం చేయాలంటే...

ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను ప్రిస్క్రైబ్ చేయడం అరికట్టాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా షాపుల్లో మందులు అమ్మడంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

చిన్న పిల్లల పాఠ్యాంశాల్లో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ గురించి చేర్చాలి.

యాంటీబయాటిక్స్ వైద్యరంగంలో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఒకప్పుడు ప్రాణాంతకంగా మారిన అనేక బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నయం చేయగలిగే స్థాయికి వైద్యశాస్త్రం చేరుకుంది. కానీ ఈ మందులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే వాటి ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది.

భవిష్యత్తులో సాధారణ న్యుమోనియా, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, శస్త్రచికిత్స తర్వాత వచ్చే ఇన్‌ఫెక్షన్లకు కూడా సమర్థవంతమైన మందులు దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.

యాంటీబయాటిక్స్ అనేవి సాధారణ జ్వరం తగ్గించే మాత్రలు కావు. అవి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు మాత్రమే ఉపయోగపడే విలువైన ప్రాణరక్షక మందులు. వాటిని అవసరమైనప్పుడు, సరైన మోతాదులో, వైద్యుల సూచనల ప్రకారం ఉపయోగించడం మనందరి బాధ్యత.

ఈరోజు మనం యాంటీబయాటిక్స్‌ను బాధ్యతగా ఉపయోగిస్తేనే రేపటి తరాలకు వాటి ప్రయోజనం అందుతుంది.

(గమనిక: రచయిత వైద్యురాలు. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)