డీలిమిటేషన్ బిల్లులో ఏముంది, దక్షిణాది బలం పెరుగుతుందా, తగ్గుతుందా?

డీలిమిటేషన్, పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభనకు ఉద్దేశించిన డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నవంబరు 30, డిసెంబరు 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.

మరోవైపు, దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

కేంద్రం తీసుకురానున్న పునర్విభజన బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లుగా డీఎంకే, బీఆర్ఎస్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీలు ప్రకటించాయి.

నవంబరు 27న సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు- 2026కు ఆమోదం తెలిపినట్లు ది హిందూ రిపోర్టు చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు తీసుకురావడానికే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డీలిమిటేషన్, పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, నవంబరు 27న సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026 ప్రకారం, దేశంలో లోక్ సభ స్థానాలు గరిష్ఠంగా 850, ఒక రాష్ట్ర శాసనసభ పరిధిలోని సీట్లు గరిష్ఠంగా 650 మించకూడదని స్పష్టం చేస్తోంది.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం స్థానాలు రిజర్వ్ చేసే బిల్లులోని ఆర్టికల్ 334ఏ ను సవరించే బిల్లును కూడా కేంద్రం ప్రతిపాదించింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పుడు లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు 50శాతం సీట్లు పెంచేందుకు బిల్లులో ప్రతిపాదించినట్లుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

పునర్విభజన బిల్లుతో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టి, 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే వాటిని అమలు చేయాలని కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇ.వెంకటేశు బీబీసీతో చెప్పారు.

''మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించాల్సి వస్తే ఇప్పటికే ఉన్న 543 సీట్లలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే పురుషులకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికే ఉన్న చాలామంది ఎంపీలు తమ సిట్టింగ్ స్థానాలను కోల్పోయే వీలుంది. వారి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండాలంటే సీట్లు పెంచాలనేది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది'' అని చెప్పారు.

816 సీట్లకు పెరిగే అవకాశం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా రాష్ట్రాల వారీగా ఇప్పుడున్న సీట్లకు 50శాతం పెరగడం ద్వారా లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య 816కు చేరుకుంటాయని అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు.

2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేసే రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(3)(ఐ)ను కేంద్రం సవరించనుంది. కొత్త బిల్లు ద్వారా 2051 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల గణాంకాలు ప్రచురించే వరకు లోక్ సభ సీట్ల పునర్విభజన జరగకుండా 'ఫ్రీజ్' విధించనుంది.

అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీ స్థానాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే ఉన్న '2001 జనాభా లెక్కల ఆధారం' క్లాజ్ మార్చి 132వ రాజ్యాంగ సవరణ బిల్లు అమల్లోకి వచ్చిన నాటికి ఉన్న జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పునర్విభజన చేసేలా బిల్లు వీలు కల్పించనుందని అర్జున్ రామ్ మేఘావాల్ ప్రకటించారు.

అయితే, 2051 వరకు సీట్లను ఫ్రీజ్ చేయడం సమంజసమైన నిర్ణయం కాదని ప్రొఫెసర్ ఇ.వెంకటేశు చెప్పారు.

''రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 81, 82 అనేవి ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలని సూచిస్తున్నాయి. గత 50ఏళ్లుగా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. ఇప్పుడు పెంచినా సరే, మరో పాతికేళ్లు ఫ్రీజ్ చేయాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఇది దేశ రాజకీయ ముఖచిత్రానికి మంచి పరిణామం కాదు'' అని చెప్పారు.

ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో పెరుగుదల ఇలా..

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 129 సీట్ల నుంచి 195కు పెరుగుతాయి.

ఇప్పుడున్న సీట్ల ప్రకారం చూస్తే 23.76శాతం ఉండగా, పెరిగిన సీట్ల శాతం 23.90కు చేరుకుంటుందని కేంద్ర చెబుతోంది.

ఉత్తర, మధ్య భారతంలోని పది రాష్ట్రాల సీట్ల సంఖ్య ఇప్పుడున్న 231 నుంచి 349కు చేరుకుంటాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఝార్ఖండ్, ఛతీస్‌గఢ్, ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్ ఈ పది రాష్ట్రాలలోని లోక్‌సభా స్థానాలు మొత్తం 231 ఉండగా, అవి 349కు చేరుకోనున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం లోక్‌సభ మొత్తం 543 స్థానాలతో పోల్చితే ఈ రాష్ట్రాల భాగస్వామ్యం 42.54 శాతం ఉండగా, లోక్‌సభ స్థానాలు మొత్తం 816 స్థానాలకు చేరి, ఈ రాష్ట్రాల లోక్‌సభా స్థానాలు 349కి పెరిగితే, పార్లమెంటులో వీటి భాగస్వామ్యం స్వల్పంగా 42.77శాతానికి పెరుగుతుంది.

దక్షిణాదిలో సీట్లు ఎలా మారనున్నాయంటే..

దక్షిణాది రాష్ట్రాలుగా పేరున్న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలో ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి. 50 శాతం చొప్పున పెంచితే ఈ సంఖ్య 195కు చేరనుంది. దాదాపు 66 సీట్లు అదనంగా పెరగబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 50శాతం పెంచితే 13స్థానాలు పెరిగి ఆ సంఖ్య 38కు చేరుకునే అవకాశం ఉంది.

ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే ఏపీలో 175 స్థానాలున్నాయి. సీట్ల సంఖ్యను 50శాతం పెంచితే 88 స్థానాలు పెరిగి 263కు చేరుకునే వీలుంది.

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 9 స్థానాలు పెరిగి మొత్తం స్థానాల సంఖ్య 26కు చేరుకునే వీలుంది. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే 119 స్థానాలున్నాయి. 50 శాతం పెరుగుదల ద్వారా 179కు చేరుకునే వీలుంది.

అయితే, అసెంబ్లీ సీట్ల సంఖ్య విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీనివల్ల 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సరిహద్దులు నిర్ణయిస్తే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పునర్విభజన చేస్తారా.. లేదా కొత్త జిల్లాలకు తగ్గట్టుగా చేస్తారా.. అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి.. అది ఇచ్చే ప్రతిపాదనల తర్వాత సీట్ల పునర్విభజనపై స్పష్టత వస్తుందని ప్రొఫెసర్ ఈ.వెంకటేశు బీబీసీతో చెప్పారు.

కాగా, లక్షదీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, లద్దాఖ్, చండీఘర్ వంటి చోట్ల ప్రస్తుతం ఉన్న ఒక లోక్ సభ స్థానం రెండు అయ్యే అవకాశం ఉంది.

డీలిమిటేషన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
ఫొటో క్యాప్షన్, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి.

కొత్త బిల్లుపై దక్షిణాది పార్టీలు ఏమంటున్నాయి?

నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది నుంచి ప్రధానంగా విమర్శలు వ్యక్తమమయ్యాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం ద్వారా జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని కొన్ని ప్రధాన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాయి.

తాజా ప్రతిపాదనల ద్వారా ఇప్పుడున్న స్థానాలకు 50 శాతం పెంచే బిల్లును కేంద్రం తీసుకురానున్న నేపథ్యంలో పార్టీలు తమ నిర్ణయాలు మార్చుకుంటున్నాయి.

కేంద్రం తీసుకువస్తున్న పునర్విభజన బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లుగా డీఎంకే ప్రకటించింది.

రాజ్యసభలో బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లుగా బీఆర్ఎస్ ప్రకటించింది.

వైఎస్సార్సీపీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పింది.

మరోవైపు, టీడీపీ, జనసేన, జేడీయూ ఎన్డీఏ భాగస్వాములుగా ఉండటంతో ఆ పార్టీల మద్దతు లభించనుంది.

డీలిమిటేషన్, పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందలేదు.

నియోజకవర్గాల పునర్విభజన అంటే..

ప్రస్తుతం దేశంలో లోక్ సభ నియోజకవర్గాలు 543. ఇందులో 423 జనరల్, 79 ఎస్సీ, 41 ఎస్టీ స్థానాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే దేశంలో లేదా శాసనభ వ్యవస్థ కలిగిన రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయించే విధానం.

ఈ విధానాన్ని పునర్విభజన కమిషన్ లేదా బౌండరీ కమిషన్ అనే ఉన్నత స్థాయి మండలి ద్వారా నిర్ణయిస్తారు.

ఇప్పటివరకు భారత్‌లో నాలుగుసార్లు పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. అవి 1952, 1963, 1973, 2002.

పునర్విభజన కమిషన్ తీసుకునే నిర్ణయాలను ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేసే అవకాశం ఉండదు.

దేశంలో చివరిసారిగా 2002లో పునర్విభజన కమిషన్ ఏర్పడగా.. 2009లో జరిగిన ఎన్నికల నుంచి ప్రతిపాదిత నియోజకవర్గాలు అమల్లోకి వచ్చాయి. ఇక లోక్ సభ సీట్ల సంఖ్య విషయానికి వస్తే, 543 స్థానాలనేవి 1973లో జరిగిన పునర్విభజన తర్వాత నుంచి ఎలాంటి మార్పు రాలేదు.

నియోజకవర్గాలు చాలా పెద్దవిగా ఉండటంతో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న లెక్కల ప్రకారం, 2001 నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం 19 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. ఇప్పుడది 27 లక్షలకు చేరిందని వివరించారు.

''కొత్తగా డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా 18 లక్షల మంది జనాభాకు ఓ ఎంపీ చొప్పున ప్రాతినిధ్యం వహించే పరిస్థితి వస్తుంది'' అని చెప్పారు.

డీలిమిటేషన్ కారణంగా 50 శాతం మేర సీట్లు పెరిగితే అందరికీ ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.

డీలిమిటేషన్, పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటోలు)

ఏప్రిల్‌లో తీసుకొచ్చిన బిల్లులో ఏముంది?

నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్‌లో పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది.

మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.

  • రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు, 2026
  • కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు, 2026
  • నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, 2026

2011 జనాభా లెక్కల ప్రకారం లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచేందుకు బిల్లుల ద్వారా ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ బిల్లుల చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో మాట్లాడారు.

ఇప్పుడున్న లోక్ సభ స్థానాలకు 50శాతం సీట్లను పెంచుతామని ప్రకటించారు. ఈ విషయాన్ని అప్పటి బిల్లులో కేంద్ర ప్రతిపాదించలేదు.

ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 వీగిపోయాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)