ఇప్పటిదాకా లోక్‌సభలో ముస్లిం మహిళల భాగస్వామ్యం ఎంత?

ముస్లిం మహిళా ఎంపీలు, లోక్‌సభ, మొహిసినా కిద్వాయ్, కాంగ్రెస్ , బీజేపీ
ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి ఇక్రా హసన్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు.
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

డిసెంబర్‌, 1954లో అప్పటి యుగోస్లోవియా అధ్యక్షుడు మార్షల్ టిటో భారత పర్యటనకు వచ్చారు. అప్పుడాయనకు మధ్యప్రదేశ్‌లోని కోట్రి ఎమ్మెల్యే మైమునా సుల్తాన్ స్వాగతం పలికారు. ఆ సమయంలో ఆమెను చూడగానే ప్రధాని నెహ్రూ ఆమె ఉండాల్సింది అసెంబ్లీలో కాదని, లోక్‌సభలోనని భావించారు.

దీంతో ఆమెకు 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. మైమునా ఎన్నికల్లో గెలిచారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల కమిటీ‌ చైర్‌పర్సన్‌గానూ వ్యవహరించారు.

ఆమె 1958లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించారు.

మైమునా టీవీ న్యూస్ రీడర్ సల్మా సుల్తాన్‌కు అక్కయ్య. ఆమె భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఆమె 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

రషీద్ కిద్వాయ్, అంబర్ కుమార్ ఘోష్ రాసిన 'మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్, ముస్లిం విమెన్ ఇన్ లోక్‌సభ' అనే పుస్తకంలో మైమునా సుల్తాన్ మినహా లోక్‌సభకు ఎన్నికైన మిగతా 17 మంది ముస్లిం మహిళా ఎంపీల జీవితాల గురించి రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

లోక్‌సభలో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం

"1951లో మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కేవలం 18 మంది ముస్లిం మహిళలు మాత్రమే లోక్‌సభలో అడుగు పెట్టారు. దేశ జనాభాలో 7శాతం ఉన్న ముస్లిం మహిళలను పరిగణనలోకి తీసుకుంటే ఇది ఆలోచించాల్సిన అంశం’’అని రషీద్ కిద్వాయ్, అంబర్ కుమార్ ఘోష్ తమ పుస్తకంలో వివరించారు.

‘‘ఇప్పటి వరకు లోక్‌సభకు 18సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదుసార్లు అసలు ఒక్క ముస్లిం మహిళ కూడా లోక్‌సభలో అడుగు పెట్టలేదు" అని వివరించారు.

1951 నుంచి దాదాపు ఏడున్నర వేల మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో ముస్లిం మహిళల సంఖ్య 0.6 శాతం మాత్రమే.

మోఫిదా అహ్మద్

లోక్‌సభలో తొలి ముస్లిం మహిళా ఎంపీలలో మోఫిదా అహ్మద్ ఒకరు. 1957లో జరిగిన ఎన్నికల్లో అస్సామ్‌లోని జోర్హాత్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున పోటీ చేసిన రాజేంద్రనాధ్ బారువా మీద 907 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1962లో జరిగిన భారత్ – చైనా యుద్ధ సమయంలో తన ఆభరణాలన్నింటినీ జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇవ్వడం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చారు.

1962లో గుజరాత్‌లోని బనస్కాంత పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జోహ్రాబెన్ అక్బర్‌భాయ్ చావ్డా గెలిచారు. జోహ్రాబెన్ గాంధీజీ చూపిన మార్గంలో నడిచేవారు. ఆమె మహాత్మా గాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్‌లో పని చేశారు.

భిల్ గిరిజనుల కోసం ఆమె తన భర్తతో కలిసి 1948లో సర్వోదయ ఆశ్రమాన్ని ప్రారంభించారు.

బేగం అక్బర్ జహాన్

కశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా ‌భార్య బేగం అక్బర్ జహాన్ రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలిసారి 1977లో శ్రీనగర్ నుంచి రెండోసారి 1984లో అనంతనాగ్ నుంచి ఎంపీ అయ్యారు.

కశ్మీర్ ప్రజలు ఇప్పటికీ ఆమెను "కరుణామయురాలిగా" గుర్తిస్తారు. 2000 సంవత్సరంలో ఆమె చనిపోయినప్పుడు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, హోంమంత్రి ఎల్‌కే అద్వానీ ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్రీనగర్ వెళ్లారు.

ఆమె మృతి పట్ల కేంద్ర మంత్రి మండలి సంతాపం వ్యక్తం చేసింది.

షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి కొడైకెనాల్‌లో ఉంచినప్పుడు ఆమె కూడా రెండేళ్ల పాటు అక్కడే ఉన్నారు.

మాజీ మంత్రి మోయిన్ ఉల్ హక్ చౌధురి భార్య రషిదా హక్ చౌధురి 1977లో సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ముస్లిం కేంద్ర మహిళా మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వంలో ఆమె సంక్షేమ శాఖ సహాయమంత్రిగా పని చేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేవరాజ్ ఉర్స్ తిరుగుబాటు చేసినప్పుడు ఉర్స్ కాంగ్రెస్‌లో చేరారు. 1980లో సిల్చార్ నుంచి ఆమె ఉర్స్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.

అయితే అదే స్థానం నుంచి పోటీ చేసిన ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ మోహన్ దేవ్ చేతిలో ఓడిపోయారు.

ముస్లిం మహిళా ఎంపీలు, లోక్‌సభ, మొహిసినా కిద్వాయ్, కాంగ్రెస్ , బీజేపీ
ఫొటో క్యాప్షన్, మొహిసినా కిద్వాయ్ 1980,1984 ఎన్నికల్లో మీరఠ్ నుంచి ఎంపీగా గెలిచారు.

మొహిసినా కిద్వాయ్, ఆజంగఢ్ ఉపఎన్నిక

1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓటమి తర్వాత ఆమె తిరిగి అధికారంలోకి వస్తారనే సంకేతాలిచ్చింది ఆజంగఢ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా మొహిసినా కిద్వాయ్ పోటీ చేశారు. ఇందిర అధికారంలోకి లేకపోవడంతో ఆజంగఢ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

అప్పట్లో ఇందిరా గాంధీ విషయంలో తనకు ఎదురైన అనుభవం గురించి మొహిసినా కిద్వాయ్ బీబీసీకి వివరించారు.

"ఆ సమయంలో ఆజంగఢ్ బాగా వెనుకబడిన ప్రాంతం. ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఇక్కడ హోటళ్లు, రెస్టారెంట్లు లేవు. నేను ఇందిర కోసం ప్రభుత్వ అతిథి గృహంలో రూమ్ బుక్ చేశాను. అయితే రూమ్ అటెండెంట్ ఆమెకు గది ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక్కడ మంత్రి ఉంటున్నారు. గది ఎవరికీ ఇవ్వద్దని చెప్పారని గది ఇవ్వలేదు. దీంతో నేను ఎవరు వస్తున్నారో తెలుసా అని అడిగాను. అతను తెలియదని అన్నారు. ఇందిరా గాంధీ కారులో ఉన్నారని చెప్పాను. ఆ మాట విన్న వెంటనే ఆ అటెండర్ తన ఉద్యోగం పోయినా పర్వాలేదంటూ మంత్రిని తిడుతూ , ఇందిరాగాంధీ కోసం గది తలుపులు తెరిచాడు’’ అని చెప్పారు.

దీని తర్వాత మొహిసినా కిద్వాయ్ 1980,1984లో మేరఠ్ నుంచి గెలిచారు.

రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆమె పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత ఆమె ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

ముస్లిం మహిళా ఎంపీలు, లోక్‌సభ, మొహిసినా కిద్వాయ్, కాంగ్రెస్ , బీజేపీ
ఫొటో క్యాప్షన్, దివంగత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ భార్య అబిదాబేగగం బరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన అబిదా బేగం

బరేలీ ఎంపీగా ఉన్న మిస్రయార్‌ఖాన్ 1981లో చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున అబిదా బేగాన్ని పోటీలోకి దించారు. ఆమె దివంగత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ భార్య.

బీజేపీ అభ్యర్థి సంతోష్ గంగ్వార్ మీద అబిదా బేగం విజయం సాధించి లోక్‌సభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1984 ఎన్నికల్లోనూ గెలిచారు. 1989లో ఓటమితో ఆమె క్రమేపీ రాజకీయాలకు దూరమయ్యారు.

ముస్లిం మహిళా ఎంపీ నూర్ బానో 1990లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

"రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నూర్‌బానో ఎప్పుడూ తెల్లటి షిఫాన్ చీర కట్టుకునే వారు. ఫుల్ స్లీవ్ జాకెట్ వేసుకునేవారు" అని రషీద్ కిద్వాయ్, అంబర్ కుమార్ ఘోష్ తమ పుస్తకంలో రాశారు.

ఆమె భర్త నవాబ్ సయ్యద్ జుల్ఫీకర్ అలీఖాన్‌కు మికీ మియాన్‌గా గుర్తింపు ఉంది. ఆయన 1967 నుంచి 1989 వరకు రాంపూర్‌కు ప్రాతినిధ్యం వహించారు. సంస్థానాధీశులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన వారిని మికీ మియాన్‌గా పిలుస్తారు.

1952లో జరిగిన ఎన్నికల్లో రాంపూర్ నుంచి పోటీ చేసి గెలిచిన మౌలానా ఆజాద్ దేశంలో తొలి కేంద్ర విద్యాశాఖమంత్రిగా పన చేశారు. ఆయన కారణంగా ఈ నియోజకవర్గానికి గుర్తింపు వచ్చింది.

మికీ మియాన్ మరణం తర్వాత నూర్ బానో 1996 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.

అయితే 2004లో జయప్రద చేతిలో ఓడిపోయిన తర్వాత ఆమె పొలిటికల్ కెరీర్ ముగిసింది.

ముస్లిం మహిళా ఎంపీలు, లోక్‌సభ, మొహిసినా కిద్వాయ్, కాంగ్రెస్ , బీజేపీ
ఫొటో క్యాప్షన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ లోక్‌సభ సీటు నుంచి ఎన్నికయ్యారు.

కశ్మీర్ నుంచి లోక్‌సభకు రెండో ముస్లిం మహిళా ఎంపీ

2004 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలోకి అడుగు పెట్టిన ఎంపీల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి గెలిచిన రుబాబ్ సయేదా ఒక్కరే ముస్లిం మహిళ.

సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆమె బహ్‌రుచ్ నుంచి గెలిచారు. అయితే 2009లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెను సిట్టింగ్ సీటు నుంచి కాకుండా శ్రావస్తి నుంచి బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి కూడా లోక్‌సభ సభ్యురాలిగా పని చేశారు.

2014లో ఆమె అనంత్‌నాగ్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

ముస్లిం మహిళా ఎంపీలు, లోక్‌సభ, మొహిసినా కిద్వాయ్, కాంగ్రెస్ , బీజేపీ
ఫొటో క్యాప్షన్, 2018లో కైరానా లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఆర్ఎల్డీ తరపున పోటీ చేసిన తబుస్సుం హసన్ విజయం సాధించారు.

తబుస్సం హసన్, మౌసం బెనజీర్ నూర్ రాజకీయ వారసత్వం

తబుస్సం హసన్ 2018 మేలో ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రీయ లోక్‌దళ్ తరపున పోటీ చేసి గెలిచారు. ఉప ఎన్నికలో ఆమెకు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూడా మద్దతిచ్చాయి. 2009లో ఆమె బీఎస్పీ తరపున కైరానా ఎంపీగా ఎన్నికయ్యారు.

అయితే బీజేపీ అభ్యర్థి చేతిలో 2019లో ఆమె ఓటమి పాలయ్యారు.

మౌసమ్ బెనజీర్ నూర్ పశ్చిమబెంగాల్ ‌లోని మాల్దాలో ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె మాల్దా నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో తన బంధువు ఇషాఖాన్ చౌధురిపై పోటీ చేశారు. అయితే వీరిద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో ఇక్కడ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఖజెన్ ముర్ము గెలిచారు.

2009 ఎన్నికల్లో యూపీలోని సీతాపూర్ లోక్‌సభ సీటు నుంచి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఖైసర్ జహాన్ పోటీ చేసి గెలిచారు. 2014లోనూ ఆమె అదే స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు ఓట్లు పెరిగినప్పటికీ బీజేపీ అభ్యర్థి రాజేష్ వర్మ చేతిలో ఓడిపోయారు.

ముస్లిం మహిళా ఎంపీలు, లోక్‌సభ, మొహిసినా కిద్వాయ్, కాంగ్రెస్ , బీజేపీ
ఫొటో క్యాప్షన్, క్రీడల్లో గుర్తింపు వచ్చిన తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టిన కొద్ది మంది మహిళల్లో ముంతాజ్ సంఘమిత్ర ఒకరు.

క్రికెటర్, ఎంపీ

కోల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నుర్ ఆలం చౌధురి భార్య ముంతాజ్ సంఘమిత్రను 2014లో తృణమూల్ కాంగ్రెస్ బుర్ద్వాన్ – దుర్గాపుర్ లోక్‌సభ స్థానం నుంచి రంగంలో దించింది. ఆమె ఈ స్థానం నుంచి గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు.

పశ్చిమబెంగాల్‌లోని ఉలుబెరియా లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుల్తాన్ అహ్మద్ మరణించడంతో 2018లో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.

ఉప ఎన్నికలో తృణమూల్ అభ్యర్థిగా సుల్తాన్ అహ్మద్ భార్య సజ్దా అహ్మద్‌కు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలో సజ్దా అహ్మద్ విజయం సాధించారు .

ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లోనూ ఆమె ఎంపీ అయ్యారు.

క్రీడల్లో పేరు సంపాందిచుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మహిళలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు.

అలాంటి వారిలో రాణి నారా ఒకరు. 2012లో ఆమె మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ సహాయమంత్రిగా పని చేశారు.

అస్సాం రాష్ట్ర జట్టులో రాణి ప్రముఖ ఆల్ రౌండర్, కెప్టెన్ కూడా.

ఆమె అస్సాంలోని లఖీంపూర్ సీటు నుంచి గెలిచి లోక్‌సభ సభ్యురాలయ్యారు.

ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు.

ముస్లిం మహిళా ఎంపీలు, లోక్‌సభ, మొహిసినా కిద్వాయ్, కాంగ్రెస్ , బీజేపీ
ఫొటో క్యాప్షన్, ఇక్రా హసన్ కైరానా పార్లమెంటరీ స్థానం నుంచి 18వ లోక్‌సభలో అడుగు పెట్టారు.

లండన్‌లో చదువుకున్న ఇక్రా హసన్

బెంగాలీ సినిమా స్టార్ నుస్రత్ జహాన్‌ 2019 ఎన్నికల్లో బసిర్హాత్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 50వేలఓట్ల మెజార్టీతో గెలిచారు.

అయితే ఆమె పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో ఆమె హాజరు 22 శాతం మాత్రమే ఉంది. కేవలం 11 చర్చల్లోనే పాల్గొన్నారు.

ఇక్రా హసన్ కైరానా నియోజకవర్గం నుంచి 18వ లోక్‌సభలో అడుగు పెట్టారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున గెలిచిన ఇక్రా హసన్ యువ ఎంపీల్లో ఒకరు.

లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ నుంచి ఇక్రా హసన్ అంతర్జాతీయ రాజకీయాలు, న్యాయ విద్యలో డిగ్రీ పట్టా పొందారు.

దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదివారు. లోక్‌సభలో ఆమె ప్రసంగాలు రాజకీయ విశ్లేషకుల్ని ఆకర్షించాయి.

ఇక్రా హసన్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాతయ్య చౌదురి అక్తర్ హసన్ కైరానా లోక్‌సభ స్థానం నుంచి 1984లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో మాయావతిని ఓడించారు.

ఆమె తండ్రి మునావర్ హసన్ 1996లో కైరానా నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆయన బీఎస్పీలో చేరారు.

ఇక్రా హసన్ తల్లి తబుస్సుమ్ హసన్ కూడా కైరానా నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆమె సోదరుడు నహిద్ హసన్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే

ఈ 18 మంది ముస్లిం మహిళా ఎంపీల్లో 13 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఇందులో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

భారత్‌లోని 101 స్థానాల్లో ముస్లిం ఓటర్లు 20 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు.

కానీ ఇప్పటిదాకా కేవలం 18 మంది ముస్లిం మహిళలు మాత్రమే లోక్‌సభ ఎంపీలు కావడం దేశంలో మహిళా సాధికారత, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై ప్రశ్నల్ని సంధిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)