తిరుప్పరంకుండ్రం: సుప్రీంకోర్టు ఆదేశాలతో శిఖరంపై వెలిగిన కార్తిక దీపం

మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై శనివారం సాయంత్రం (నవంబర్ 28) 5 గంటలకు కార్తిక దీపం వెలిగించారు. భారీ దూది వత్తి, కర్పూరం ఉపయోగించి ఈ దీపాన్ని వెలిగించారు. సుప్రీంకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తులు వైద్యనాథన్ పార్థిబన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
విశ్రాంత న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన పరిపాలనా కమిటీ, మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద శనివారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలకు కార్తీక దీపాన్ని వెలిగించనున్నట్లు ప్రకటించింది.
ఈమేరకు రిటైర్డ్ న్యాయమూర్తులు ఎస్. వైద్యనాథన్, వీ. పార్థిబన్ తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి దీపం వెలిగించడానికి కొండపైకి చేరుకున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపం వెలిగించే కార్యక్రమానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) తిరుప్పరంకుండ్రం ఆలయం, కొండ ప్రాంతాల్లో మోహరించింది.
మరోవైపు, అదే కొండపై ఉన్న సికందర్ దర్గాలో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు.


దీపం సామగ్రితో కొండపైకి వెళ్లిన న్యాయమూర్తుల బృందం
తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయానికి సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తులు ఎస్. వైద్యనాథన్, వీ. పార్థిబన్ శనివారం చేరుకున్నారు.
ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అక్కడున్న భక్తులు పూలు చల్లుతూ 'వెట్రివేల్ మురుగన్ హరోహరా, 'వెట్రివేల్ వీరవేల్' అంటూ స్మరించారు. ఆ తర్వాత కొండపై దీపం వెలిగించడానికి అవసరమైన మట్టి ప్రమిద, నెయ్యి తదితర సామగ్రిని న్యాయమూర్తులు స్వయంగా పరిశీలించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ దీపం వెలిగించడానికి అవసరమైన వస్తువులను తీసుకెళ్తున్నట్లు జస్టిస్ వైద్యనాథన్ మీడియాకు చెప్పారు.
ఆ తర్వాత ఇద్దరు న్యాయమూర్తులు దీపం సామగ్రితో కొండపైకి వెళ్లే మార్గంలో నడక ప్రారంభించారు.కొండ మార్గంలో కోట్టై వీధి, పెరియ రథ వీధి ప్రాంతాల ప్రజలు న్యాయమూర్తుల బృందంపై పూలు చల్లి, హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
సీఆర్పీఎఫ్ భద్రత మధ్య న్యాయమూర్తుల బృందం కొండపైకి వెళ్లింది. కొండ దిగువ నుంచి పళని ఆండవర్ ఆలయం వరకు వెళ్లిన న్యాయమూర్తులు తమ వద్ద ఉన్న మట్టి ప్రమిద సహా దీపం సామగ్రిని ఆలయ సిబ్బందికి అప్పగించారు.

కొండపైకి పది మందికే అనుమతి
తిరుప్పరంకుండ్రం శిఖరంపై దీపం వెలిగించే కార్యక్రమానికి సంబంధించి మైకుల ద్వారా ప్రజలకు ముఖ్యమైన ప్రకటన చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం, కొండపైకి కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తారు. ఈ పది మంది జాబితాను జిల్లా కలెక్టర్ ద్వారా ఆలయ యాజమాన్యానికి అందించారు. వారిని మాత్రమే న్యాయమూర్తుల నేతృత్వంలోని కమిటీతో పాటు పైకి వెళ్లి దీపం వెలిగించేందుకు అనుమతించారు.
భక్తులు కొండపైకి, ముఖ్యంగా పళని ఆండవర్ ఆలయం పైనున్న ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు .
భద్రతా కారణాలతో ఈ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.

సీఆర్పీఎఫ్ దళాల మోహరింపు
తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించనున్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆలయం, కొండ ప్రాంతాల్లో మోహరించారు. కొండపై దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న ప్రాంతంలోనూ సీఆర్పీఎఫ్ జవాన్లను భద్రత కోసం నియమించారు.
కొండపైకి వెళ్లే భక్తులు, ప్రజల నుంచి ఆధార్ నంబర్ సహా ప్రాథమిక వివరాలను సేకరిస్తున్నారు. భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే వారిని కొండపైకి అనుమతిస్తున్నారు.

సికందర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అదే కొండపై ఉన్న సికందర్ దర్గాలో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. వీటిలో పాల్గొనేందుకు కేరళ సహా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు.
మహిళలు, పురుషులు, యువత సహా వంద మందికి పైగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 6.15 గంటల తర్వాత అక్కడికి వచ్చిన వారిని పోలీసులు వరుసలో నిలబెట్టి వివరాలు సేకరించారు. అనంతరం భద్రతా తనిఖీలు నిర్వహించి ఒక్కొక్కరిని కొండపైకి అనుమతించారు.
తిరుప్పరంకుండ్రం ప్రజలు ఏమంటున్నారు?
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ నివసించే హిందువులు, ముస్లింలతో బీబీసీ మాట్లాడింది. తమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నదే తమ ప్రధాన ఆకాంక్ష అని రెండు మతాలకు చెందిన పలువురు చెప్పారు. దీపం ఎక్కడ వెలిగించినా దాని వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదని కోరుకున్నారు.
వరుసగా జరుగుతున్న పరిణామాల వల్ల తిరుప్పరంకుండ్రం ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతంగా చిత్రీకరణ అవుతోందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారి, తిరుప్పరంకుండ్రం మళ్లీ ప్రశాంతమైన ప్రాంతంగా గుర్తింపు పొందాలని వారు కోరుకుంటున్నారు.
ముఖ్యంగా, నేటి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియాలన్నదే స్థానికుల ఆకాంక్షగా ఉంది.
‘సుప్రీం తన ఆదేశాలను పునఃపరిశీలించాలి’
తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు సమాఖ్య సూత్రాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా అధికారాల పరిధి, మత సామరస్యానికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అన్నారు.
''మత విశ్వాసాలు, ఆరాధన హక్కులను గౌరవించడంతో పాటు వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని, తమిళనాడులో కొనసాగుతున్న ప్రశాంత సామాజిక వాతావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత'' అని మాణికం ఠాగూర్ ఎక్స్ పోస్టులో రాశారు.
''ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ నిర్వహణకు సంబంధించి కోర్టు తీసుకున్న చర్యలు.. న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఆలయ నిర్వహణ వ్యవస్థల అధికారాల పరిధిపై కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి'' అన్నారు.
దేశంలో చట్టబద్ధ పాలన కొనసాగడంతో పాటు తమిళనాడులో శాంతి, మత సామరస్యం, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నదే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ వైఖరి అని మాణికం ఠాగూర్ తెలిపారు.

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం నేపథ్యం ఏమిటి?
గతంలో తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయం తరఫున ఉచిపిళ్లయార్ మండపంలోనే కార్తీక దీపం వెలిగించేవారు. అయితే, కొండపై ఉన్న వివాదాస్పద రాతి స్తంభంపై కూడా దీపం వెలిగించాలనే డిమాండ్ మొదలైంది. ఈ మేరకు ఒక వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది.
కేసును విచారించిన సుప్రీంకోర్టు, కార్తీక దీపం పండుగ రోజైన 2026 నవంబర్ 24న కొండపై ఉన్న రాతి స్తంభంపై ఒక్కసారి దీపం వెలిగించేందుకు ఈనెల 20న అనుమతించింది. అయితే, ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించారు. కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద వెలిగించలేదు.
దీంతో, ఆదేశాలను అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సుప్రీంకోర్టు, నవంబర్ 28న కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించాలని మరోసారి ఆదేశించింది.
దీపం వెలిగించే కార్యక్రమానికి అవసరమైన భద్రతను సీఆర్పీఎఫ్ కల్పించాలని, ఆలయ నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించాలని కూడా ఆదేశించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































