‘విష రసాయనాలు అమ్మి మీ ఆత్మీయుల మరణాలకు కారణమైనందుకు పశ్చాత్తాపపడుతున్నా...నన్ను క్షమించండి’

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, బ్రాండన్ డ్రెనాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఆన్‌లైన్ ఫోరమ్‌ల ద్వారా 40 దేశాల్లో విషపూరిత రసాయనాలు విక్రయించిన కెనడాకు చెందిన కెన్నెత్ లా.. బాధితుల కుటుంబాలకు కోర్టులో క్షమాపణలు చెప్పారు.
తాను చేసిన పనులపై తీవ్ర పశ్చాత్తాపం ఉందని ఇకపై మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పని చేయనని అన్నారు.
శుక్రవారం(నవంబర్ 27) శిక్ష ఖరారు కోసం విచారణ సందర్భంగా కెన్నెత్ లా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తిని కోరారు.
కెనడాలోని ఒంటారియోలో 14 మంది ఆత్మహత్యలకు సహకరించినట్టు నమోదైన 14 అభియోగాలను 61 ఏళ్ల కెన్నెత్ లా మేలో అంగీకరించారు.
ఇంగ్లండ్, వేల్స్‌లో కూడా పలువురి మరణాలకు తానే కారణమని ఆయన అంగీకరించారు.
అయితే కెనడా అధికారులతో కుదిరిన ఒప్పందం ప్రకారం మరింత తీవ్రమైన అభియోగాలను స్థానిక అధికారులు ఉపసంహరించుకున్నారు.
దీంతో బ్రిటన్‌లో ఆయనపై ఎలాంటి కేసులు నమోదు చేయరు. బ్రిటన్‌లో మరణాలకు సంబంధించి కూడా ఆయనపై చర్యలు ఉండవు.

కెన్నెత్ లా బాధితుల్లో చాలామంది యువకులని, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారని శుక్రవారం ఒంటారియో కోర్టులో జరిగిన శిక్ష ఖరారు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్ కోరిన శిక్షే కెన్నెత్ లాకు విధిస్తే 2023 మేలో అరెస్టయినప్పటి నుంచి ఇప్పటికే జైలులో గడిపిన కాలాన్ని మినహాయించిన తర్వాత ఆయన మరో 20 ఏళ్లకాలం కన్నా కొంచెం తక్కువగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను వేటాడే వేటగాడిగా కెన్నెత్ లాను ప్రభుత్వ తరఫు న్యాయవాది కాథ్లీన్ డోహెర్టీ అభివర్ణించారు. శుక్రవారం కోర్టులో కాథ్లీన్ వాదనలు వినిపించారు.
'బాధితులకు సాయం కావాల్సిన సమయంలో కెన్నెత్ లా వాళ్లకు విషం ఇచ్చారు'
"వారికి కావాల్సింది సహాయం. కానీ వారికి ఎదురైంది కెన్నెత్ లా, ఆయన విక్రయించిన మరణానికి సంబంధించిన ఉత్పత్తులు" అని కాథ్లీన్ డోహెర్టీ అన్నారు.
లావాదేవీల వెనుక కెన్నెత్ ఉద్దేశం డబ్బు సంపాదించడమేనని కూడా ఆమె చెప్పారు.
"డబ్బు చెల్లించేవారికి ఆ ఉత్పత్తులను విక్రయించేవారు. తాను ఎవరితో వ్యవహరిస్తున్నారో, వారి పరిస్థితి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. బాధితుల వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నమే చేయలేదు" అని ఆమె అన్నారు.
అయితే కెన్నెత్ తరఫు న్యాయవాది మాథ్యూ గౌర్లే ఈ వాదనలను తోసిపుచ్చారు. మానసిక అనారోగ్యంతో బాధితులు ఎదుర్కొన్న సమస్యలకు తన క్లయింట్ కారణం కాదని వాదించారు.
"ఈ సంఘటనలన్నింటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైన విషాదం. వాటన్నింటిలోనూ కెన్నెత్ లా ఒక ఉమ్మడి అంశం కావచ్చు. కానీ బాధితులు మొదట ఆయన ఉత్పత్తుల కోసం వెతికేలా చేసిన మానసిక సమస్యలు, కష్టాలకు ఆయన కారణం కాదు" అని గౌర్లే అన్నారు.
తాను బాధితులకు సహాయం చేస్తున్నాననే తప్పుడు నమ్మకంతో కెన్నెత్ ఈ పని చేశారని ఆయన చెప్పారు.
కెన్నెత్ తరఫు న్యాయవాది ఆయనకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కోర్టును కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
1,200 ప్యాకెట్ల విషపూరిత పదార్థాలను విక్రయం
బాధితుల ఆత్మహత్యలకు సహకరించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని విచారణ ముగిసే సమయంలో కోర్టుకు కెన్నెత్ తెలిపారు.
"బాధితుల కుటుంబ సభ్యులారా... మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏ మాటలూ తీర్చలేవు. మీకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నా చర్యలపై ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించండి" అని అన్నారు.
శిక్ష ఖరారు విచారణకు ముందు సెప్టెంబర్‌లో కొన్ని రోజుల పాటు భావోద్వేగభరితమైన వాంగ్మూలాలు నమోదయ్యాయి. కెన్నెత్ వల్ల తాము ఎదుర్కొన్న బాధను మరణించిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కోర్టుకు వివరించారు.
వారు చెప్పిన విషయాలను శిక్ష ఖరారు సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే శిక్ష ఎప్పుడు ప్రకటిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.
ఆత్మహత్యకు సంబంధించిన ఆన్‌లైన్ ఫోరమ్‌లలో పరిచయమైన వ్యక్తులకు కెన్నెత్ సుమారు 1,200 ప్యాకెట్ల విషపూరిత పదార్థాలను విక్రయించినట్టు అధికారులు తెలిపారు. వీటిని 40 దేశాలకు పంపించారు. వాటిలో దాదాపు నాలుగో వంతు ప్యాకెట్లు యూకేకు చేరాయి.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























