మెక్‌డొనాల్డ్స్‌లో లైంగిక వేధింపులు: 'బాలికలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఎదురుచూస్తారు'

మెక్‌డొనాల్డ్స్ మాజీ ఉద్యోగి, హోప్, లైంగిక వేధింపులు
ఫొటో క్యాప్షన్, మెక్‌డొనాల్డ్స్‌లో లైంగిక వేధింపుల ఘటనలు పునరావృతం కాకుండా సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉద్యోగిని డిమాండ్ చేశారు.
    • రచయిత, నూర్ నాంజీ, జోయ్ కాన్వే
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

కస్టమర్లు తనను లైంగికగా వేధిస్తున్న సమయంలో రక్షణ కల్పించడంలో మేనేజర్ విఫలమయ్యారని మెక్‌డొనాల్డ్స్ మాజీ ఉద్యోగిని ఆరోపించారు. యువ ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరును సంస్థ మార్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

2023లో బ్రిటన్‌లో వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని ఓ మెక్‌డొనాల్డ్స్ శాఖలో పనిచేసిన హోప్.. అక్కడ 16, 17 ఏళ్ల వయసున్న ఉద్యోగినుల పట్ల సీనియర్ ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరును కూడా బీబీసీ న్యూస్‌కు వివరించారు.

ఆ అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాత వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటున్నట్లు కొందరు పెద్ద వయసు ఉద్యోగులు మాట్లాడుకోవడం చూశానని ఆమె చెప్పారు.

మెక్‌డొనాల్డ్స్‌పై వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు చేస్తున్న వందలాది మంది ఉద్యోగుల్లో హోప్ కూడా ఒకరు. తమపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేయాలంటూ మెక్‌డొనాల్డ్స్ చేసిన ప్రయత్నాన్ని ఈ వారం ఓ న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని హోప్ స్వాగతించారు.

"మా రెస్టారెంట్లు, కార్యాలయాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడం మా ప్రాధాన్యత" అని మెక్‌డొనాల్డ్స్ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

17 ఏళ్ల వయసున్న ఉద్యోగులు సహా పలువురు మెక్‌డొనాల్డ్స్ సిబ్బంది లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనను ఎదుర్కొంటున్నట్లు 2023లో బీబీసీ నిర్వహించిన ఓ పరిశోధనాత్మక కథనంలో తెలిసింది.

తాము ఇంకా లైంగిక వేధింపులు, దాడులను ఎదుర్కొంటున్నామని గత ఏడాది కూడా మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగులు బీబీసీకి తెలిపారు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న హోప్.. తాను పనిచేసిన మెక్‌డొనాల్డ్స్ శాఖలో లైంగికపరమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో కూడిన పరిస్థితి ఉండేదని చెప్పారు.

ఓసారి మేనేజర్ వెనుక నుంచి వచ్చి తన భుజాలపై చేతులు వేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఆ మేనేజర్ తనవైపు రావడం కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేదానిని అని ఆమె చెప్పారు.

"అక్కడి నుంచి వీలైనంత త్వరగా బయటపడ్డాను" అని హోప్ తెలిపారు.

మరో సందర్భంలో రాత్రి షిఫ్టులో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు కస్టమర్లు తనను లైంగికంగా వేధిస్తూ, ఒక వస్తువులా చూశారని హోప్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం మేనేజర్‌కు చెప్పినా.. "అదంతా భరించి, నీ పని నువ్వు చేసుకో" అని ఆయన సమాధానమిచ్చారని ఆరోపించారు.

అయితే, చిన్న వయసున్న టీనేజర్ల పరిస్థితిపైనే ఎక్కువ ఆందోళన ఉండేదని. వారి బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదని హోప్ అన్నారు.

"18 ఏళ్లు నిండే రోజు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు అక్కడ మరికొందరు ఉన్నారని స్పష్టంగా తెలిసేది. 'ఇప్పుడు అది చట్టవిరుద్ధం కాదు కదా' అనే ధోరణి వారిలో కనిపించేది. వారిలో చాలామంది ఇలాగే ఆలోచించేవారు" అని ఆమె చెప్పారు.

"అలా ఎందుకు ఆలోచిస్తారు? అప్పటికీ వారు పిల్లలే కదా" అని హోప్ అన్నారు.

మెక్‌డొనాల్డ్స్‌, కోర్టు, బ్రిటన్
ఫొటో క్యాప్షన్, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌లో మెక్‌డొనాల్డ్స్‌ కేసుల విచారణ జరిగే అవకాశం ఉంది.

విచారణకు 450 కేసులు

ప్రస్తుతం, గతంలో మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేసిన వంద మంది ఉద్యోగులు ఆ సంస్థపై వివక్షకు సంబంధించిన న్యాయపోరాటం చేస్తున్నారు. తమపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేయాలని సంస్థ ప్రయత్నించింది. అయితే, ఈ వారం లండన్ సెంట్రల్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌లో విచారణ సందర్భంగా న్యాయమూర్తి గ్లెన్నీ ఆ ప్రయత్నాన్ని తిరస్కరించారు. మొత్తం 450 కేసుల విచారణకు అనుమతించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌లో ఈ కేసుల విచారణ జరిగే అవకాశం ఉంది.

అయితే, ఈ 450 కేసులు లైంగిక వేధింపులకు సంబంధించినవి కావని, పరోక్ష వివక్షకు సంబంధించినవని బీబీసీకి తెలిసింది.

ఈ న్యాయపోరాటంలో తాను డబ్బు కోసం పాల్గొనడం లేదని హోప్ చెప్పారు. ఈ కేసుల్లో తమకు పరిహారం వస్తుందో లేదో కూడా తెలియదని అన్నారు. యువ ఉద్యోగుల పట్ల సంస్థ వ్యవహరించే తీరును మార్చాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని ఆమె చెప్పారు.

"ఇది యువ ఉద్యోగుల పట్ల వారు వ్యవహరించే తీరును మారుస్తుంది. ఫిర్యాదులపై స్పందించే విధానంలోనూ మార్పు వస్తుంది. సంస్థలోని మొత్తం అంతర్గత వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. తొలిసారి ఉద్యోగాల్లో చేరుతున్న యువతకు పని వాతావరణాన్ని మరింత సానుకూలం చేస్తుంది. ముఖ్యంగా వారికి మరింత భద్రత కల్పిస్తుంది. నేటి యువత భద్రతకు వెల కట్టలేం" అని హోప్ అన్నారు.

కేసులను కొట్టివేయాలని కోరడం ద్వారా మెక్‌డొనాల్డ్స్ తప్పించుకోలేక పరిణామాన్ని ఆలస్యం చేయాలని చూస్తోందని కూడా ఆమె ఆరోపించారు.

"అయితే, న్యాయమూర్తి వారి వాదనలను పరిశీలించి, 'లేదు.. అలా జరగనివ్వం' అని సరైన నిర్ణయం తీసుకున్నారు" అని హోప్ అన్నారు.

ప్రస్తుతం, గతంలో మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేసిన ఉద్యోగుల తరఫున 'లీ డే' అనే న్యాయ సంస్థ ఈ కేసులను దాఖలు చేసింది.

పని ప్రదేశాల్లో యువ ఉద్యోగులు, మహిళా సిబ్బంది ఎదుర్కొనే ప్రమాదాలు, వారి అసురక్షిత పరిస్థితులే ఈ ఫిర్యాదుల్లో ప్రధాన అంశాలు. బ్రిటన్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో విస్తృతంగా వేధింపులు, వివక్ష జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులు నమోదయ్యాయి.

"ఈ కేసులపై పూర్తిస్థాయి విచారణ జరగడానికి న్యాయమూర్తి అనుమతించడం సంతోషంగా ఉంది. బాధితులకు న్యాయం అందుబాటులో ఉండాలంటే ఇలాంటి కేసుల విచారణ జరగడం చాలా ముఖ్యం" అని లీ డే సంస్థ భాగస్వామి కిరణ్ దౌర్కా బీబీసీతో అన్నారు.

మెక్‌డొనాల్డ్స్‌
ఫొటో క్యాప్షన్, ఉద్యోగుల పట్ల తమ నిబద్ధతలో భాగంగా పలు విస్తృత, సమర్థవంతమైన చర్యలను అమలు చేసినట్లు మెక్‌డొనాల్డ్స్ తెలిపింది.

మెక్‌డొనాల్డ్స్ ఏమంటోంది?

కొనసాగుతున్న న్యాయపరమైన విచారణకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై తాము వ్యాఖ్యానించలేమని మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి తెలిపారు.

అయితే, ఉద్యోగుల పట్ల తమ నిబద్ధతలో భాగంగా పటిష్ఠమైన, విస్తృతమైన అనేక చర్యలను సంస్థ అమలు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.

"ఎలాంటి వేధింపులు, వివక్ష, అనుచిత ప్రవర్తననైనా మేం అంగీకరించం. మా రెస్టారెంట్లు, కార్యాలయాల్లో వాటికి చోటు లేదు. బయటి నిపుణుల మార్గదర్శకత్వం, సహకారంతో మా సంస్థ, ఫ్రాంచైజీలు పరిశ్రమలోనే అత్యుత్తమ భద్రతా చర్యలను అమలు చేస్తున్నాయని మేం విశ్వసిస్తున్నాం" అని మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)