విశాఖ మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి ఎవరు?

విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి
ఫొటో క్యాప్షన్, ముక్కా శ్రావణి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మహా విశాఖ నగరపాలక సంస్థ మేయరుగా కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి గెలుపొందారు.

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. తన సమీప అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణిపై 2.30 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

శ్రావణి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్.. ఆమె వయసు 32 సంవత్సరాలు.

ముక్కా శ్రావణి 2015లో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత 2021 విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 26 వార్డు నుంచి కార్పొరేటరుగా గెలుపొందారు.

శ్రావణిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.

ఆమె తండ్రి ముక్కా ముత్యాల నాయుడు టీడీపీ సీనియర్ నాయకుడు.

పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చురుగ్గా కొనసాగుతున్నారు. గతంలో ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కార్పొరేటర్లుగా పనిచేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముక్కా శ్రావణి
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ముక్కా శ్రావణి 2015లో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.

డాక్టర్ ముక్కా శ్రావణి 2015లో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో అక్కయ్యపాలెం పరిధిలోని 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు.

‘‘2021 కార్పొరేషన్ ఎన్నికలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 26వ వార్డు నుంచి పోటీ చేశాను. ఆ నియోజకవర్గంలో 17 వార్డులుంటే...అందులో టీడీపీ గెల్చుకున్న ఏకైన వార్డు నాదే’’ అని ముక్కా శ్రావణి చెప్పారు.

ఒక వార్డు రిజర్వేషన్ కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన ముక్కా శ్రావణి...ఐదేళ్లలో నగర ప్రథమ పౌరురాలిగా ఎదిగారు.

జీవీఎంసీ మేయర్ స్థానం 2026‌లో జనరల్ మహిళా కేటగిరీకి రిజర్వ్ కావడంతో, సుదీర్ఘ చర్చల అనంతరం టీడీపీ అధిష్టానం ఆమెను కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసింది.

విశాఖ మేయర్‌గా ఎన్నికైనట్టు ధృవీకరణపత్రం అందుకుంటున్న ముక్కా శ్రావణి
ఫొటో క్యాప్షన్, విశాఖ మేయర్‌గా ఎన్నికైనట్టు ధ్రువీకరణపత్రం అందుకుంటున్న ముక్కా శ్రావణి

‘ ఆ రిజర్వేషనే నన్నింత దూరం తెచ్చింది’

విశాఖ మేయర్ గా ఎన్నికైన ముక్కా శ్రావణి తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో బీబీసీతో చెప్పారు.

"నిజానికి 2021 ఎన్నికల్లో మా అన్నయ్య కార్పొరేటర్‌గా పోటీ చేద్దామనుకున్నారు. మా నాన్న 2000లో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచారు. ఆయన రాజకీయ వారసుడిగా మా అన్నయ్య 26వ వార్డు నుంచి బరిలో దిగుదామనుకున్నారు. కానీ ఆ వార్డు మహిళలకు రిజర్వ్ కావడంతో నేను పోటీ చేయాల్సి వచ్చింది." అని శ్రావణి బీబీసీతో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు.

ఆ నిర్ణయయమే ఇప్పుడు తనను విశాఖ మేయర్ పీఠంపై నిలిపిందన్నారు.

Mukka Sravani
ఫొటో క్యాప్షన్, ముక్కా శ్రావణి

‘కార్పొరేటర్ అనుభవం మేయర్‌గా ఉపయోగం’

కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఇప్పుడు విశాఖ మేయరుగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని శ్రావణి అన్నారు.

"కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. జీవీఎంసీ సమావేశాల్లోనూ అనేకసార్లు పాల్గొన్నా. అందుకే విశాఖ నగర సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నెలవారీ సమీక్షలు నిర్వహించడంతో పాటు సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, రహదారుల మరమ్మతులపై దృష్టి పెడతా. సముద్రంలోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటా. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయడం, వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్లు, ఆటస్థలాలను మెరుగుపరచడం ద్వారా విశాఖను మరింత అభివృద్ధి చేస్తా" అని ముక్కా శ్రావణి తెలిపారు.

"విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ప్రతి వార్డులో ఆటస్థలాలను అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తాను" అని శ్రావణి తెలిపారు.

ముక్కా శ్రావణి
ఫొటో క్యాప్షన్, విశాఖకు మూడో మహిళా మేయర్, జీవీఎంసీకి టీడీపీ నుంచి తొలి మహిళా మేయర్ శ్రావణి

విశాఖకు మూడో మహిళ మేయర్...

ముక్కా శ్రావణి విశాఖ నగరానికి మూడో మహిళా మేయర్. ఆమె కంటే ముందు ఇద్దరు మహిళలు ఈ పదవిలో పనిచేశారు.

రాజాన రమణి (కాంగ్రెస్) - 2000 నుంచి 2005 వరకు విశాఖ నగరానికి తొలి మహిళా మేయర్.

గొలగాని హరి వెంకట కుమారి (వైఎస్సార్‌సీపీ) - 2021 నుంచి 2025 వరకు మేయర్‌గా పనిచేశారు.

అనంతరం ఇప్పుడు ముక్కా శ్రావణి (టీడీపీ) 2026లో ఎన్నికయ్యారు.

ఆమె విశాఖకు మూడో మహిళా మేయర్, జీవీఎంసీకి టీడీపీ నుంచి తొలి మహిళా మేయర్.

2000లో రాజాన రమణి మేయర్‌గా ఉన్నప్పుడు విశాఖపట్నం.. మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ)గా ఉండేది. 2005లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)గా ఏర్పడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)