ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడిన బాలికకు తీవ్రమైన కిడ్నీ వ్యాధి, దర్యాప్తు చేస్తున్న కేరళ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అష్రఫ్ పడన్నా, శర్లీన్ మోలన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ తయారీ సంస్థపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రీమ్ వాడిన 17 ఏళ్ల బాలికకు తీవ్రమైన కిడ్నీ సమస్య తలెత్తినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
క్రీమ్‌లో ప్రమాదకర స్థాయిలో పాదరసం (మెర్క్యురీ) ఉండటం వల్ల కిడ్నీల సామర్థ్యం దెబ్బతినే వ్యాధి ఆమెకు వచ్చినట్లు బాలికకు చికిత్స అందించిన వైద్యుడు మీడియాకు తెలిపారు.
బాలిక గుర్తింపును కాపాడేందుకు ఆమె పేరు వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ ప్రకటన చూసి మొటిమలు, ముఖంపై నల్లమచ్చలు తగ్గించుకోవడానికి ఆమె ఈ క్రీమ్ కొనుగోలు చేసినట్లు రిపోర్టులు వచ్చాయి.
దేశంలో ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను విక్రయించే బ్రాండ్లు భారీగా పెరిగాయి. అయితే వీటిలో చాలా ఉత్పత్తులకు సరైన నియంత్రణ లేదు. కొన్ని క్రీమ్‌లలో పాదరసం, సీసం(లెడ్) వంటి విషపూరిత లోహాలు ఉండే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాటిని వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విక్రయిస్తుండటంతో సంబంధిత బ్రాండ్లు అధికారుల తనిఖీల నుంచి తప్పించుకుంటున్నాయని అంటున్నారు.
ధ్రువీకరణ లేని, పరీక్షలు నిర్వహించని ఉత్పత్తులను సైతం యువతకు లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
వైద్యులు ఏం చెప్పారు?
బాలికకు చికిత్స అందించిన మలప్పురం జిల్లాలో ఉన్న ఆస్టర్ మిమ్స్ మదర్ ఆసుపత్రి ప్రకటన ప్రకారం, బాలిక వాడిన క్రీమ్‌ను ప్రయోగశాలలో పరీక్షించగా, అందులో 12,500 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) పాదరసం ఉన్నట్లు తేలింది. చర్మం తెల్లబడేందుకు వాడే ఉత్పత్తుల్లో పాదరసం పరిమితి 1 పీపీఎం కంటే తక్కువగా ఉండాలి. కానీ, ఈ క్రీమ్‌లో ఆ పరిమితికి మించి అత్యధిక స్థాయిలో పాదరసం ఉంది.
బాలికకు మెంబ్రేనస్ నెఫ్రోపతి అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి వచ్చినట్లు ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సతీశ్ తెలిపారు.
ఈ వ్యాధి కారణంగా కిడ్నీల్లో రక్తాన్ని వడపోసే పొరలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తంలోని ప్రొటీన్లు పెద్ద మొత్తంలో మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఇది ప్రాణాపాయానికి దారితీసే వ్యాధి.
చర్మం ద్వారా శరీరంలోకి చేరిన పాదరసం కిడ్నీల్లోని వడపోత వ్యవస్థను దెబ్బతీయవచ్చని వైద్యులు తెలిపారు. దీనివల్ల రక్తంలో విషపదార్థాలు పేరుకుపోతాయని, సకాలంలో చికిత్స అందకపోతే కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో పాటు నాడీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సుమారు ఏడాది క్రితం సోషల్ మీడియా యాప్ ద్వారా ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్ కొనడం ప్రారంభించినట్లు బాలిక తెలిపింది. ఏడాది కాలంలో మూడు బాటిళ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
"ప్రతిరోజూ రాత్రి క్రమం తప్పకుండా ఈ క్రీమ్ వాడితే మొటిమలు, నల్లమచ్చలు తగ్గుతాయనీ, క్రమం తప్పకుండా వాడితే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని కంపెనీ హామీ ఇచ్చింది" అని బాలిక 'ఆన్ మనోరమ' వార్తాపత్రికకు తెలిపింది.
ఆ పత్రిక కథనం ప్రకారం, కొన్ని నెలల పాటు క్రీమ్ వాడిన తర్వాత ఆమెకు అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం, నిద్రలేమి వంటి సమస్యలు మొదలయ్యాయి. కాళ్లు, ముఖం వాపు వచ్చాయి. కనీసం నిటారుగా నిలబడటం కూడా కష్టంగా మారిందని బాలిక వివరించింది.
"తీవ్రమైన వాపు, అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు" అని ఆసుపత్రి తెలిపింది.
"వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించాం. అయితే, లక్షణాలు అసాధారణంగా తీవ్రమవుతుండటంతో శరీరంలో ఏదైనా విషపదార్థం చేరిందా అనే అనుమానం వైద్యులకు కలిగింది. ఆ తర్వాత నిర్వహించిన రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షల్లో ఆమె శరీరంలో పాదరసం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించాం" అని ఆసుపత్రి ప్రకటన పేర్కొంది.
చర్మం ద్వారా పాదరసం బాలిక రక్తంలోకి చేరి ఉండవచ్చని వైద్యులు అనుమానించారు. దీంతో ఆమె వాడిన ఫెయిర్‌నెస్ క్రీమ్ నమూనాను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
సౌందర్య ఉత్పత్తులకు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) నిర్దేశించిన భద్రతా పరిమితుల కంటే ఈ క్రీమ్‌లో పాదరసం చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని ఆసుపత్రి తెలిపింది.
వైద్యులు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే మందులు అందించడంతో పాటు కిడ్నీ సమస్యలకు చికిత్స చేశారు.
సుమారు నెల రోజుల చికిత్స తర్వాత బాలికను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.
అయితే, ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, చదువుకోవడం కూడా కష్టంగా ఉందని సోమవారం ఆమె బీబీసీకి తెలిపారు.
"చికిత్స ప్రారంభించినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. అయితే ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు" అని డాక్టర్ సతీశ్ చెప్పారు.
పోలీసుల దర్యాప్తు
మరోవైపు, ఈ ఘటనపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫెయిర్‌నెస్ క్రీమ్ తయారీ సంస్థపై కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా కేసు నమోదు చేసింది.
ఈ ఘటనతో దేశంలో తెల్లని చర్మంపై ఉన్న మోజు మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెల్లగా మారుస్తామనే హామీతో సరైన నియంత్రణ లేని క్రీమ్‌లను కూడా మహిళలు కొనుగోలు చేస్తున్న ధోరణి దీనితో మరోసారి వెలుగులోకి వచ్చింది.
దేశంలో ముదురు చర్మవర్ణంపై వివక్ష చాలా లోతుగా పాతుకుపోయింది. తెల్లని చర్మం లేని వారు అనేక సందర్భాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, తెల్లని చర్మమే అందానికి గుర్తనే భావనను వ్యతిరేకిస్తూ ఇటీవలి సంవత్సరాల్లో సామాజిక కార్యకర్తలతో పాటు బాలీవుడ్ నటులు కూడా గళమెత్తుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























