మెడ నొప్పిని తగ్గించే 5 వ్యాయామాలు

మెడ నొప్పి, వ్యాయామాలు,
ఫొటో క్యాప్షన్, జీవితంలో ఏదో ఒక దశలో 60 నుంచి 80 శాతం మందికి మెడ నొప్పి వస్తుంది.
    • రచయిత, డేవిడ్ కాక్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆధునిక ప్రపంచం మన మెడకు ఓ సవాలుగా నిలుస్తోంది. కానీ ఓ ఐదు వ్యాయామాలు ఈ సమస్యను ఎదుర్కొనేలా చేస్తాయి.

మనం నిటారుగా కూర్చున్నప్పుడు లేదా నిల్చున్నప్పుడు మన తల మన మెడపై సుమారు 12 పౌండ్ల (5.4 కిలోల) బరువును మోపుతుందని లండన్‌లోని క్వీన్స్‌ హాస్పిటల్‌లో యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్)కు చెందిన స్పైనల్ న్యూరోసర్జన్ ఆంథోనీ ఘోష్ చెప్పారు. సరైన భంగిమలో ఉంటే ఈ బరువును మెడ తేలికగా భరిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజులో గణనీయమైన సమయాన్ని ముందుకు వంగిన శరీర భంగిమలోనే గడుపుతున్నారు.

ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లను చూస్తూ ముందుకు వంగినప్పుడు మన మెడపై పడే బరువులో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఇలా అసౌకర్యంగా తలను కిందకు వంచి చూసే భంగిమలో తల మెడపై మోపే భారం సుమారు 60 పౌండ్లకు, అంటే 27.2 కిలోలకు పెరుగుతుందని ఘోష్ చెబుతున్నారు.

అంటే "మీ మెడ భరించాల్సిన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది" అని ఘోష్ చెబుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సాధారణ సమస్య

సింపుల్‌గా చెప్పాంటే, ఆధునిక జీవన శైలి మన మెడ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అయితే వయసుతో సంబంధం లేకుండా మెడను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించగల ఐదు సులభమైన వ్యాయామాలు ఉన్నాయి.

వయసు పెరుగుతున్న కొద్దీ మన కండరాలు, ఎముకలు, కీళ్ల వ్యవస్థలో చోటుచేసుకునే సహజ మార్పుల వల్ల కొన్ని మెడ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల మెడలో వ్యాకోచగుణం తగ్గి, కణజాలాల్లో బిగుతు పెరుగుతుంది.

‘‘నలభై ఏళ్లుదాటిన వారిలో వెన్నెముకకు సంబందించిన ఎంఆర్ఐ స్కానింగ్ పూర్తి సాధారణంగా ఉండేవారు ఎవరు ఉండరు’’ అని ఘోష్ చెబుతున్నారు. "ప్రతి ఒక్కరిలోనూ వెన్నుపూసల మధ్య ఉండే కుషన్ల వంటి డిస్కులు కొంత అరిగిపోతాయి. మెడ వెనుక భాగంలోని కీళ్లు కూడా కొద్దిగా మందంగా మారి, బిగుసుకుపోతాయి" అని ఆయన వివరిస్తున్నారు.

దీనికి తోడు మనం రోజూ వాడే సాంకేతిక పరికరాల వినియోగం కూడా మెడపై ప్రభావం చూపుతుంది.

ఎలక్ట్రానిక్ పరికరాలను తదేకంగా చూస్తున్నప్పుడు మనం ముందుకు వంగిన భంగిమలో ఉంటాం. పైవీపు గుండ్రంగా మారి మూపురంలా మారుతుంది. గడ్డం, తల భుజాలకు నేరుగా ఉండాల్సింది పోయి ముందుకు చొచ్చుకొస్తాయి. దీనివల్ల మెడ కండరాలతో పాటు వెన్నెముక పైభాగంలోని వెన్నుపూస కీళ్లపై కూడా ఎక్కువ ఒత్తిడి పడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80 శాతం మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు మెడ నొప్పితో బాధపడతారు. వీరిలో దాదాపు 50 శాతం మందికి ఈ సమస్య తరచుగా లేదా మళ్లీ మళ్లీ ఎదురవుతుంటుంది. మొదట్లో పైవీపులో బిగుతు పెరగడం, కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఆ తర్వాత అసౌకర్యం క్రమంగా పెరిగి, నిరంతర సమస్యగా మారవచ్చు.

ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, మెడ, వీపు పైభాగానికి సంబంధించిన సమస్యలు ఇప్పుడు చిన్న వయసులోనే మొదలవుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

2025లో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన సమాచారంపై నిర్వహించిన ఒక పెద్ద విశ్లేషణ ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో స్కోలియోసిస్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది.

స్కోలియోసిస్‌లో వెన్నెముక అసాధారణంగా పక్కకు వంగుతుంది. దీంతో తలను నిటారుగా ఉంచేందుకు మెడ కండరాలు అదనపు ఒత్తిడిని భరించాల్సి వస్తుంది.

అయితే, మెడ సమస్యలు రాకుండా నివారించడానికి మనం చాలా చర్యలు తీసుకోవచ్చు. ప్రత్యేకమైన కుర్చీలు లేదా ఇతర ఎర్గోనామిక్ పరికరాలపై డబ్బు ఖర్చు చేయడం కంటే, ఎక్కువగా కదులుతూ ఉండాలని, స్క్రీన్లను చూస్తూ గడిపే సమయానికి మధ్యలో తరచుగా విరామాలు తీసుకోవాలని ఘోష్ సూచిస్తున్నారు. "వెన్నెముక ఎప్పుడూ కదులుతూ ఉండటాన్నే కోరుకుంటుంది. అలా కదలడం వల్ల దానిలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలకు కూడా బలం, దృఢత్వం పెరుగుతాయి" అని ఆయన అంటున్నారు.

ముఖ్యంగా, కింద పేర్కొన్న వ్యాయామాలు కీళ్ల బిగుతును తగ్గించడానికి, తప్పుడు శరీర భంగిమను సరిచేయడానికి, స్క్రీన్‌ను చూస్తూ ముందుకు ఉండే భంగిమ వల్ల ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేలా మెడ కండరాలను దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. కొత్త వ్యాయామ పద్ధతిని ప్రారంభించే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించండి.

మెడ నొప్పి, వ్యాయామాలు,
ఫొటో క్యాప్షన్, కొత్తగా ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యులని సంప్రదించాలి.

1. తలను పక్కకు తిప్పడం

మీరు మెడ నొప్పితో బాధపడుతుంటే, మెడ కండరాలకు మళ్లీ బలం చేకూర్చడానికి, కదలికలను మెరుగుపరచడానికి ఒక సులభమైన వ్యాయామాన్ని బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ సూచించింది.

నిటారుగా కూర్చుని లేదా వెల్లకిలా పడుకుని, తలను వీలైనంత వరకు కుడివైపునకు తిప్పి రెండు సెకన్ల పాటు అలాగే ఉంచాలి. అప్పుడు మెడకు ఎడమవైపు సాగదీత అనిపించాలి. తిరిగి మొదటి స్థితికి వచ్చి, ఆ తర్వాత తలను వీలైనంత వరకు ఎడమవైపునకు తిప్పాలి.

ఈ వ్యాయామాన్ని రెండు లేదా మూడు సార్లు చేయాలి. మీకు ఎంతవరకు సౌకర్యంగా ఉంటే, రోజులో అంత తరచుగా చేయవచ్చు.

2. సరైన భంగిమలో ఉండటం

మెడను సరైన భంగిమలో ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే, తప్పుడు భంగిమ వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పడుతుంది. మన మెడ అన్ని దిశల్లోనూ కదిలేలా నిర్మితమైంది. కాబట్టి రోజులో ఎప్పటికప్పుడు మెడను వివిధ దిశల్లో కదిలిస్తూ ఉండటం ఒక మంచి అలవాటు.

అయితే, మెడకు అత్యంత అనువైన భంగిమ వెన్నెముకకు అనుగుణంగా తటస్థ స్థితిలో ఉండటం.

భుజాలు, వీపును విశ్రాంతిగా ఉంచి, మెడను నిటారుగా ఉంచాలి. గడ్డాన్ని ముందుకు చాచడం, భుజాలను ముందుకు వంచడం వంటివి చేయకూడదు. అలాగే తలను ఒకవైపునకు తిప్పి లేదా వంచి ఎక్కువసేపు ఉంచకూడదు.

కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా వాహనం నడుపుతున్నప్పుడు ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో ఈ సరైన శరీర భంగిమను పాటించడం మంచిది.

3. గడ్డం ముందుకు చాచే భంగిమను సరిచేసుకోవాలి

మెడ నొప్పి, వ్యాయామాలు,
ఫొటో క్యాప్షన్, శతాబ్దాల పాటు వాలుగా ఉండే బల్లలు సాధారణంగా ఉండేవి.

ఏళ్ల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌ను చూస్తూ గడపడం వల్ల తల భుజాలకు నేరుగా పైన ఉండాల్సింది పోయి ముందుకు పొడుచుకొచ్చే భంగిమ అలవడవచ్చు.

అయితే, కూర్చునే పద్ధతిని మార్చుకోవడం, కొన్ని సులభమైన వ్యాయామాలు చేయడం ద్వారా ఈ భంగిమను సరిచేసుకోవచ్చు.

ఇందుకోసం గడ్డాన్ని కొద్దిగా వెనక్కి తీసుకుంటూ మెడను మెల్లగా పైకి పొడిగించడం ఒక మార్గం.

ఇలా చేస్తున్నప్పుడు గడ్డం కింద మెత్తని పీచ్ పండు ఉందని ఊహించుకోండి. దాన్ని నలిపేసేంత గట్టిగా గడ్డాన్ని లోపలికి లాగకండి. అదే సమయంలో అది కింద పడిపోయేంతగా గడ్డాన్ని వదులుగా ఉంచకండి.

రెండు కాలర్ బోన్ల మధ్య భాగాన్ని వెడల్పుగా ఉంచినట్లు భావిస్తూ, భుజాల వెనుక భాగంలోని ఎముకలను (షోల్డర్ బ్లేడ్స్) మెల్లగా కిందికి, వెనక్కి, వెన్నెముక మధ్య భాగం వైపు లాగాలి. అదే సమయంలో పొత్తికడుపులోని కింది భాగం కండరాలను కూడా మెల్లగా లోపలికి బిగించాలి.

ఇలా చేయడం వల్ల కింది వీపులో సహజంగా ఉండే స్వల్ప వంపు అలాగే కొనసాగుతుంది.

కర్మాగారాలు, యంత్రాలు రాకముందే చదువుకున్నవారుఅనేక గంటలపాటు గ్రంథాలను చదువుతూ, రాస్తూ గడిపేవారు.

అయితే, అప్పటి చిత్రాలను పరిశీలించినప్పుడు వారు సుమారు 45 డిగ్రీల కోణంలో వాలుగా ఉండే రాతిపీఠాలు, లేదా బల్లలపై చదవడం, రాయడం చేసేవారని ఘోష్ గుర్తించారు. ఇలాంటి పద్ధతిలో మెడపై ఒత్తిడి తక్కువగా ఉండేది.

"ఈక కలాలను సిరాలో ముంచి రాయడానికి వాలుగా ఉండే బల్లలు అనువుగా ఉండేవి. అందుకే శతాబ్దాల పాటు వాటి వినియోగం సాధారణంగా ఉండేది" అని ఘోష్ చెబుతున్నారు.

కాగితాన్ని చదునుగా ఉంచినప్పుడు సిరా సరిగా పడకుండా, అక్షరాలు కొద్దిగా మసకబారే అవకాశం ఉండేదని ఆయన వివరిస్తున్నారు.

టైప్‌రైటర్లు, ఆ తర్వాత కంప్యూటర్ల వినియోగం పెరగడంతో గత వందేళ్లలోనే చదునైన బల్లలు మరింత సౌకర్యవంతమైనవిగా మారాయి. వాటితో పాటు మెడ నొప్పులూ కొత్తగా మొదలయ్యాయి.

మెడ నొప్పి, వ్యాయామాలు,
ఫొటో క్యాప్షన్, ఇప్పుడు రోజులో ఎన్నో గంటలు స్క్రీన్‌లను చూస్తూ గడుపుతున్నాం.

4. మెడ కండరాల సామర్థ్యం పెరిగేలా...

ఇప్పుడు రోజులో అనేక గంటలపాటు స్క్రీన్లను చూస్తూ గడుపుతున్నాం. అందువల్ల మెడను వంచే కండరాల సామర్థ్యాన్ని, ఎక్కువసేపు పనిచేయగలిగే శక్తిని పెంచుకోవడం మంచిదని ఘోష్ చెబుతున్నారు.

ఈ కండరాలు మెడ స్థిరత్వానికి తోడ్పడటంతో పాటు, తల బరువును మోయడంలో సహాయపడతాయి.

ఈ కండరాలకు వ్యాయామం చేయడానికి, మోకాళ్లను వంచి, పాదాలను మంచంపై ఆనించి వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత గడ్డాన్ని ఛాతీ వైపునకు మెల్లగా లోపలికి లాగాలి.

తల వెనుక భాగంపై ఒక చేతిని ఉంచి, తలను మంచంపై నుంచి సుమారు ఒక అంగుళం పైకి ఎత్తాలి. ఆ తర్వాత చేతిని తీసేసి, సాధ్యమైనంత ఎక్కువసేపు అదే స్థితిలో ఉండాలి. మొదట్లో కొన్ని సెకన్ల పాటు అలా ఉండేలా ప్రయత్నించాలి. క్రమంగా ఆ సమయాన్ని 30 సెకన్లకు పెంచుకోవాలి.

5. మెడ‌ను ధృడంగా మార్చేలా..

మెడను వంచే కండరాలకు చురుగ్గా వ్యాయామం చేయడానికి మరో పద్ధతి కూడా ఉంది. ఇందుకోసం హెడ్‌రెస్ట్ ఉన్న కుర్చీని ఉపయోగించాలి.

కుర్చీలో కూర్చుని నేరుగా ముందుకు చూడాలి. మొదట తలను వెనక్కి జరిపి హెడ్‌రెస్ట్‌కు ఆనించాలి. ఆ తర్వాత గడ్డాన్ని ఛాతీ వైపునకు వంచి, కొద్దిసేపు అలాగే ఉంచాలి. తిరిగి మొదటి స్థితికి రావాలి. ఈ వ్యాయామాన్ని పలుమార్లు చేయాలి.

ఇదే వ్యాయామాన్ని మరింత కఠినమైన పద్ధతిలో రెసిస్టెన్స్ బ్యాండ్‌తో కూడా చేయవచ్చు. ఇది వ్యాయామాల కోసం ఉపయోగించే సాగే రబ్బరు పట్టీ. ముందుగా దాన్ని తల ఎత్తులో ఉన్న ఒక వస్తువుకు కట్టాలి. ఆ బ్యాండ్‌ను చేత్తో పట్టుకుని, నుదుటి చుట్టూ చుట్టాలి. ఆ తర్వాత ముందుకు రెండు అడుగులు వేసి, బ్యాండ్‌లో కొంత ఒత్తిడి ఏర్పడేలా నిలబడాలి.

నిటారుగా నిలబడి, మెడను వంచుతూ తలను కిందికి తీసుకురావాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, మెడ కండరాలను విశ్రాంతి పరచాలి. తిరిగి మొదటి స్థితికి వచ్చి, ఈ వ్యాయామాన్ని మళ్లీ చేయాలి.

కాలక్రమేణా ఈ వ్యాయామాలు 21వ శతాబ్దపు జీవనశైలి వల్ల ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా మీ మెడను మరింత దృఢంగా మార్చడంలో సహాయపడతాయి.

* ఈ వ్యాసంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య నిపుణులు అందించే సలహాకు ప్రత్యామ్నాయంగా పరిగణించకూడదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)