వెల్లింగ్టన్ టెస్ట్: ఇంకా 15 ఓవర్లున్నా భారత్ మ్యాచ్ డ్రాకు ఎందుకు అంగీకరించింది, సిరాజ్‌ను ఎందుకు ఆడించలేదు?

ఫొటో సోర్స్, Kerry Marshall/Getty Images
వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. భారత జట్టు ఎంపిక, బౌలర్ల వైఫల్యం వంటి వాటిని అభిమానులు తప్పుబడుతున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో భారత్ గెలవలేకపోయింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ టెస్ట్ మ్యాచ్ తుది జట్టులో మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడాన్ని సునీల్ గావస్కర్, హర్షా భోగ్లే, వసీం జాఫర్ వంటి క్రికెట్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు సిరాజ్‌తో పాటు జట్టులో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడంపై జట్టు యాజమాన్యం, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను అందరూ ప్రశ్నిస్తున్నారు.
మ్యాచ్‌లో ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగా న్యూజిలాండ్ చేతిలో కేవలం 5 వికెట్లు మాత్రమే ఉన్నప్పటికీ భారత్ ఎందుకు డ్రాకు అంగీకరించిందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


ఫొటో సోర్స్, Hagen Hopkins/Getty Images
మ్యాచ్‌లో ఏం జరిగింది?
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో ఆ జట్టు 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలు చేయడంతో కివీస్ జట్టు 350 పరుగుల మార్కును దాటగలిగింది.
న్యూజిలాండ్ పుంజుకోవడానికి భారత బౌలింగ్‌లో 'పదును లేకపోవడమే' కారణమని నిపుణులు, క్రికెట్ అభిమానులు అప్పుడే విమర్శించారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ చక్కటి సెంచరీలు చేశారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
352 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 120 ఓవర్లు బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
చివరి రోజు ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ న్యూజిలాండ్ కెప్టెన్ డారిల్ మిచెల్‌తో కరచాలనం చేసి మ్యాచ్‌ను ముగించడానికి అంగీకరించారు.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపైనా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, Kerry Marshall/Getty Images
శుభ్‌మన్ గిల్ వాదన ఏంటి?
ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగానే డ్రాకు అంగీకరించాలన్న నిర్ణయాన్ని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సమర్థించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు బాగా అలసిపోయారని తర్వాతి టెస్ట్‌కు ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం లేదని చెప్పాడు.
"పిచ్ నుంచి ఇంకొంచెం సహకారం ఉండి ఉంటే బహుశా మేం గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లం. కానీ ఫాస్ట్ బౌలర్లు అలసిపోయారు. మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ దాదాపు 50 ఓవర్లు బౌలింగ్ చేశారు" అని గిల్ చెప్పాడు.
"తర్వాతి మ్యాచ్‌కు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. రేపే మేం ప్రయాణం చేయాలి. అందుకే మా బౌలర్లందరినీ తాజాగా ఉంచాలనుకున్నాం. మరో ఐదు-పది ఓవర్లు అదనంగా బౌలింగ్ చేసినంత మాత్రాన పెద్దగా మార్పు వస్తుందనుకోలేదు" అని ఇండియన్ కెప్టెన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
ఈ పిచ్‌పై పది వికెట్లు తీయడం కష్టంగా మారిందని కూడా గిల్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు కొన్ని అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని గిల్ చెప్పాడు.
మ్యాచ్‌లో ఉపయోగించిన బంతి నాణ్యతపై కూడా గిల్ ప్రశ్నలు లేవనెత్తాడు.
"బంతి కచ్చితంగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మా మొదటి బంతి కూడా దాదాపు 25-30 ఓవర్ల తర్వాత చాలా మెత్తబడిపోయింది. ప్రత్యర్థి జట్టు కూడా దీనిపై ఫిర్యాదు చేసిందనుకుంటున్నాను. ఇంగ్లండ్‌లో కూడా మేము ఇదే చూశాం. అక్కడ మొదటి మూడు-నాలుగు మ్యాచ్‌లలో బంతి చాలా త్వరగా మెత్తబడిపోయింది" అని గిల్ అన్నాడు.
"బంతుల నాణ్యత తగ్గిందో లేక మరేదైనా కారణమో నాకు తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో, పిచ్ బౌలర్లకు సహకరించనప్పుడు, బంతి మెత్తబడినప్పుడు వికెట్లు తీయడం వారికి చాలా కష్టమవుతుంది" అని గిల్ అభిప్రాయపడ్డాడు.
వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా గిల్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో మెసేజ్ పోస్ట్ చేశారు.
"బంతి నాణ్యత విషయంలో శుభ్‌మన్ గిల్ చెప్పింది ముమ్మాటికీ నిజం. 25-30 ఓవర్ల తర్వాత బంతి మెత్తబడకూడదు. ఐసీసీ దీనిపై సీరియస్‌గా దృష్టి సారించాలి. వెల్లింగ్టన్ మ్యాచ్ చివరి రోజున బౌలర్లకు పిచ్ నుండి ఎలాంటి సహకారం లేదు. పిచ్ నిర్జీవంగా ఉంది, బంతి మెత్తబడింది, సీమ్ మూవ్మెంట్ కూడా లేదు. ఇది క్రికెట్‌కు మంచిది కాదు" అని భోగ్లే రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Sameera Peiris/Getty Images
సిరాజ్‌ను పక్కన పెట్టడంపై వివరణ
మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం కూడా ఈ మ్యాచ్‌లో పెద్ద చర్చనీయాంశమైంది.
తుది జట్టును ప్రకటించిన తర్వాత, సిరాజ్‌ను పక్కన పెట్టడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విదేశీ పిచ్‌లపై సిరాజ్ అనుభవం, బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు.
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ నిర్ణయాన్ని 'చాలా కఠినమైనది' గా అభివర్ణించారు.
వ్యాఖ్యాత హర్షా భోగ్లే సైతం తుది జట్టులో సిరాజ్ లేకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
మ్యాచ్ అనంతరం సిరాజ్‌ను జట్టు నుండి తప్పించాలన్న నిర్ణయాన్ని గిల్ సమర్థించుకున్నాడు.
"సిరాజ్ గొప్ప ఆటగాడు. గొప్ప బౌలర్. భారత్ తరపున అద్భుతంగా రాణించాడు. అన్నింటికంటే ముందు అతను నాకు మంచి స్నేహితుడు. అతన్ని జట్టు నుండి తప్పించే నిర్ణయం తీసుకోవడం నాకు కూడా చాలా కష్టమైంది. కానీ ఏ బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారో కూడా మనం చూసుకోవాలి" అని గిల్ అన్నాడు.
"మ్యాచ్‌కు ముందే నేనీ విషయంపై అతనితో మాట్లాడాను. ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని చెప్పాను. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని, మరొక ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశామో అతను అర్థం చేసుకున్నాడు" అని గిల్ వివరించాడు.
సిరాజ్, రవీంద్ర జడేజా ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం మారి ఉండేదా అని అడిగిన ప్రశ్నకు, ' ‘అలా అనుకోవడం లేదు' అని గిల్ బదులిచ్చాడు.

ఫొటో సోర్స్, Samir Hussein/WireImage
జట్టు ఎంపికపై గంగూలీ ప్రశ్నలు
మ్యాచ్ డ్రా అయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టు ఎంపికపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"ఈ సిరీస్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ముందుగా వైట్-బాల్ క్రికెట్లో, ఇప్పుడు రెడ్-బాల్ క్రికెట్లోనూ రాణించింది. బ్యాటర్లు తమ బాధ్యతలను నిర్వర్తించిన తీరు ప్రశంసనీయం. కానీ విదేశీ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లు గెలవాలంటే, ముఖ్యంగా ఆట సాగేకొద్దీ ఫ్లాట్‌గా మారే పిచ్‌లపై ఒక మంచి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండటం చాలా ముఖ్యమని వారు అర్థం చేసుకోవాలి. టెస్ట్ క్రికెట్లో కచ్చితంగా ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాలి. వాషింగ్టన్ సుందర్ ఆల్-రౌండర్‌గా ఆడగలడు" అని సౌరవ్ గంగూలీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో రాశారు.
కుల్దీప్ యాదవ్ లేదా మానవ్ సుతార్‌లను జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Kerry Marshall/Getty Images
భారత బౌలర్ల ప్రదర్శనపై ప్రశ్నలు
తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ కృష్ణకు ఒక వికెట్ దక్కింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజీలాండ్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. డెవాన్ కాన్వే 65, రచిన్ రవీంద్ర 37 పరుగులు చేశారు. కాన్వేను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా, రవీంద్రను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ పంపాడు.
ఆ తర్వాత డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్ల కోసం భారత బౌలర్లను తీవ్రంగా శ్రమించేలా చేశారు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ అజేయంగా 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిచెల్ 186 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ఫిలిప్స్ 126 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ ఇద్దరూ దాదాపు 50కు పైగా ఓవర్లు ఆడారు.
రెండో ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. ఆకాశ్ దీప్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
దీని అర్థం భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ, న్యూజిలాండ్‌కు చెందిన ఐదు వికెట్లను మాత్రమే పడగొట్టగలిగారు.
చివరి రోజు మిచెల్, ఫిలిప్స్ క్రీజులో పాతుకుపోయి చేసిన డిఫెన్సివ్ బ్యాటింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది.
ఈ ప్రదర్శన తర్వాత సిరాజ్‌ను జట్టు నుండి తప్పించడంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తు తున్నాయి. సుదీర్ఘ స్పెల్స్ వేయగల సామర్థ్యం, ప్రత్యర్థులపై నిరంతరం ఒత్తిడి పెంచగల నైపుణ్యం సిరాజ్ సొంతం.
2025లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అతను 23 వికెట్లు పడగొట్టాడు.
స్పిన్ బౌలింగ్‌పై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ టెస్ట్‌లో భారత్ ఏకైక స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది.
రవీంద్ర జడేజా తుది జట్టులో లేడు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ కూడా జట్టులో లేడు.
రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ 35 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































