న్యూజీలాండ్‌తో మ్యాచ్ మధ్యలో తిలక్, నితీశ్ తెలుగులో ఏం మాట్లాడుకున్నారు?

తిలక్, నితీశ్ తెలుగు మాట్లాడుకోవడం, న్యూజీలాండ్ వర్సెస్ భారత్ టీ20
ఫొటో క్యాప్షన్, క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తిలక్, నితీశ్ రెడ్డి తెలుగులో మాట్లాడుకున్నారు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

'నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే'

'రేయ్.. రెండు అని చెప్పురా పోనీ'

న్యూజీలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇద్దరు భారత క్రికెటర్ల మధ్య మైదానంలో నడిచిన ఆసక్తికర సంభాషణ ఇది.

కివీస్‌ గడ్డపై తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి సమయోచిత బ్యాటింగ్‌తో భారత జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా, మైదానంలో తెలుగులో మాట్లాడటంతో, అంతర్జాతీయ మ్యాచ్‌లో తెలుగులో మాట్లాడుకున్న కుర్రాళ్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తిలక్, నితీశ్ తెలుగు మాట్లాడుకోవడం, న్యూజీలాండ్ వర్సెస్ భారత్ టీ20
ఫొటో క్యాప్షన్, కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో ఛేదించింది.

ఆ క్షణంలో ఏం జరిగింది?

భారత్ బ్యాటింగ్ చేస్తుండగా 17వ ఓవర్‌ను లుకీ ఫెర్గూసన్ వేశాడు. తొలి బంతిని నితీశ్ రెడ్డి థర్డ్ మ్యాన్ వైపు ఆడి వేగంగా మొదటి పరుగు పూర్తి చేశాడు. రెండో పరుగు కోసం పిచ్ మధ్యలో వరకు వచ్చేశాడు. కానీ, రెండో పరుగు కోసం తొలుత ఆసక్తి చూపించిన తిలక్, ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. దీంతో నితీశ్ రనౌట్ అయ్యేలా కనిపించినా, ఫీల్డర్, కీపర్ త్రో మధ్య నితీశ్ డైవ్ చేస్తూ సురక్షితంగా క్రీజులోకి చేరుకున్నాడు.

ఈ చిన్న గందరగోళం తర్వాత నాన్-స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నితీశ్... తిలక్‌ వైపు చూస్తూ, ''వచ్చేసేయ్‌.. '' అన్నాడు.

ఆ తర్వాత ఇద్దరి మధ్య తెలుగులో సంభాషణ జరిగింది.

తిలక్: 'నువ్వు కాల్ ఇవ్వలేదు'

నితీశ్: 'నువ్వు వచ్చేసేయ్‌.. నేను వచ్చేస్తా ఆరాంసే'.

తిలక్: 'రేయ్ రెండు అని చెప్పురా పోనీ.. నేను ముందొచ్చి వెయిట్ చేస్తున్నా నీకోసం'.

వీరిద్దరి మధ్య సాగిన ఈ సరదా సంభాషణ మైక్ స్టంప్‌లో స్పష్టంగా రికార్డైంది. మైదానంలో ఆటగాళ్లు ఇలా తమ మాతృ భాషలో మాట్లాడుతూ తమ వ్యూహాలు ప్రత్యర్థి జట్టుకు అంతుచిక్కకుండా జాగ్రత్తపడుతుంటారు.

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో ఛేదించింది. తిలక్ వర్మ(51 పరుగులు), నితీశ్ కుమార్ రెడ్డి(26 పరుగులు) జోడీ ఏడో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శన, మ్యాచ్ మధ్యలో తెలుగులో మాట్లాడుకోవటంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ''ఇద్దరూ చక్కనైన తెలుగులో మాట్లాడుకుంటూ సమన్వయంతో మ్యాచ్‌ను ముగించారు. తెలుగోడి సత్తా, తెలుగు భాష మాధుర్యం న్యూజీలాండ్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హృదయపూర్వక అభినందనలు'' అని తెలిపారు.

తిలక్, నితీశ్ తెలుగు మాట్లాడుకోవడం, న్యూజీలాండ్ వర్సెస్ భారత్ టీ20
ఫొటో క్యాప్షన్, నితీశ్ రెడ్డితో కలిసి మ్యాచ్‌ను ముగించడం పట్ల తిలక్ సంతోషం వ్యక్తం చేశాడు

'హైదరాబాద్ కుర్రాళ్లం'

''చివరి వరకు బ్యాటింగ్ చేయాలనే ఆలోచనతోనే బరిలోకి దిగాను. మ్యాచ్‌కు ముందు గౌతమ్ సర్, కోటక్ సర్‌తో మాట్లాడాను. భారత్ మొత్తం నన్ను నమ్ముతోందని, చివరి వరకు బ్యాటింగ్ చేస్తే మనం గెలవగలమని వారు చెప్పారు. నా ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది'' అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం తిలక్ వర్మ అన్నాడు.

నితీశ్ రెడ్డితో కలిసి మ్యాచ్‌ను ముగించడం పట్ల తిలక్ సంతోషం వ్యక్తం చేశాడు. ''ఈ రోజు హైదరాబాద్ కుర్రాళ్లం , నేను నితీశ్ ఆడాం. మ్యాచ్‌ను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది'' అన్నాడు.

బ్యాటింగ్ సమయంలో అనుసరించిన వ్యూహాన్ని కూడా తిలక్ వివరించాడు.

''మాకు ఒక ప్రణాళిక ఉంది. బంతి అనుకూలంగా వచ్చినప్పుడు దూకుడుగా ఆడాలనుకున్నాం. మిగతా సమయంలో ఖాళీ ప్రదేశాల్లోకి బంతిని ఆడి వేగంగా పరుగులు తీయాలనుకున్నాం. అదే చేశాం'' అని చెప్పాడు.

స్పిన్నర్లను తెలివిగా ఎదుర్కొన్నామని, ఫాస్ట్ బౌలర్లపై భారీ షాట్లు ఆడగలమనే నమ్మకం ఉందని తిలక్ అన్నాడు.

''ఇంత పెద్ద మైదానంలో సిక్సర్లు కొట్టాలంటే బంతికి వేగం అవసరం. అందుకే ఫాస్ట్ బౌలర్ల కోసం ఎదురుచూశాం. చివరకు మ్యాచ్‌ను ముగించాం'' అని తిలక్ వర్మ చెప్పాడు.

భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ చక్కటి పోరాట పటిమను కనబరిచి మ్యాచ్‌ను మలుపు తిప్పారని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.

ఆ ఇద్దరూ ఒత్తిడిని తట్టుకుని జట్టును విజయతీరాలకు చేర్చారని తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్‌లో నమన్ ధీర్ ప్రదర్శననూ ప్రశంసించాడు.

‘బాల్ రా మామా’ అన్న శుభ్‌మన్ గిల్

తెలుగు క్రికెటర్లే కాదు ఈ మధ్య కాలంలో మిగిలిన టీమిండియా క్రికెటర్లు కూడా కొన్ని తెలుగు మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

ముఖ్యంగా 2025లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి చక్కని బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపడమే కాక, జో రూట్‌కు వేసిన ఓ చక్కని బంతిని చూసి, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ‘బాల్ రా మామా’ అనడం స్టంప్ మైక్‌లో వినిపించింది.

ఇక అడపాదడపా రోహిత్ శర్మ తెలుగు మాటలు మాట్లాడటం సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. ముంబయి ఇండియన్స్ టీమ్ 2024లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ‘మేము వచ్చేస్తాము... ఎంఐ ఫాన్స్ పదండి ఉప్పల్‌కు ’ అంటూ రోహిత్ మాట్లాడిన వీడియో అప్పట్లో వైరల్ అయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)