పాకిస్తాన్‌లోని భార్యా పిల్లలను కలుసుకోవాలనే తపనతో బయల్దేరిన భర్త చివరకు శవంగా చేరాడు

కశ్మీర్, ఇర్ఫాన్ హసన్ షా, పాక్ పాలిత కశ్మీర్, నీలం నది
ఫొటో క్యాప్షన్, ఎడమవైపు ఇర్ఫాన్ హసన్ షా, కుడివైపు నీలం నది తీరం (ఫైల్ ఫొటో)
    • రచయిత, నసీర్ చౌధరి
    • హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

భార్య, పిల్లలను కలుసుకోవడానికి బయల్దేరిన జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన ఇర్ఫాన్ హసన్ షా పాక్ పాలిత కశ్మీర్‌లో శవంగా కనిపించాడు.

నీలం నది నుంచి బయటకుతీసిన ఇర్ఫాన్ మృతదేహాన్ని పాకిస్తాన్ అధికారులు ముజఫరాబాద్‌లో నివసిస్తున్న ఆయన భార్య, పిల్లలకు అప్పగించారు.

అధికారుల వివరాలమేరకు ఇర్ఫాన్ హసన్ షా కశ్మీర్‌లో బారాముల్లా జిల్లాకు చెందిన వ్యక్తి . అయితే, పాక్ పాలిత కశ్మీర్‌లో ఉంటున్న భార్య, పిల్లలను కలుసుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నీలం నదిలో మునిగి చనిపోయారు.

పహల్గాం‌లో 2025 ఏప్రిల్‌లో దాడి జరిగిన తర్వాత, జమ్మూకశ్మీర్‌లో నివసిస్తున్న ఇర్ఫాన్ భార్య, పిల్లలను పాకిస్తాన్ పౌరులనే కారణంతో భారత ప్రభుత్వం వారి దేశానికి తిప్పి పంపించింది. అప్పటి నుంచి ఆయన కుటుంబం ముజఫరాబాద్‌లో ఉంటోంది. అయితే, ఇర్ఫాన్ భారత పౌరుడు కావడంతో బారాముల్లా జిల్లాలోనే ఉండిపోయారు.

బారాముల్లాలో ఉంటున్న తమ తండ్రి ఎప్పటికప్పుడు తమతో మాట్లాడేవారని ఇర్ఫాన్ పిల్లలు చెబుతున్నారు. చివరిసారిగా సుమారు 15 రోజుల కిందట మాట్లాడినప్పుడు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తానని ఇర్ఫాన్ చెప్పాడని అన్నారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలానికి నీలం నదిలో ఇర్ఫాన్ మృతదేహం లభ్యమైనట్లు వారికి తెలిసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇర్ఫాన్ మృతదేహం లభించిన తర్వాత దాన్ని ఎవరికి అప్పగించాలనే అంశంపై వివాదం మొదలైంది. ఆయన భారత పౌరుడు కావడంతో భారత అధికారులకు అప్పగించాలా? లేక ముజఫరాబాద్‌లో ఉంటున్న భార్య, పిల్లలకు ఇవ్వాలా? అనే చర్చ జరిగింది.

జమ్మూకశ్మీర్‌లో నివసిస్తున్న ఇర్ఫాన్ సోదరులు, సోదరీమణుల అంగీకారం తీసుకున్న తర్వాత మృతదేహాన్ని ముజఫరాబాద్‌లో ఉంటున్న భార్య, పిల్లలకు అప్పగించినట్లు అసిస్టెంట్ కమిషనర్ అత్కమామ్ చౌధురి బషారత్ బీబీసీ ఉర్దూకు తెలిపారు.

మరణించిన వ్యక్తికి భార్య, పిల్లలు ఉంటే వారసత్వ హక్కుల ప్రకారం వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు. అందుకే అవసరమైన అనుమతులు, చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వివరించారు.

స్థానికుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఒక ఘటన మాత్రమే కాదు. విడిపోయిన కుటుంబం పడిన వేదన, నిస్సహాయత, చివరిసారిగా అయినా కలుసుకోవాలన్న ఆశకు నిదర్శనం.

అయితే, పాక్ పాలిత కశ్మీర్‌లో ఇర్ఫాన్ హసన్ షా ఎలా వివాహం చేసుకున్నారు? ఆయన మృతదేహం అధికారులకు ఎలా లభించింది? దాన్ని కుటుంబానికి అప్పగించే విషయంలో వివాదం ఎందుకు తలెత్తింది?

కశ్మీర్, ఇర్ఫాన్ హసన్ షా, పాక్ పాలిత కశ్మీర్, నీలం నది
ఫొటో క్యాప్షన్, నవంబర్ 23 ఉదయం సహాయక చర్యల అనంతరం ఇర్ఫాన్ హసన్ షా మృతదేహాన్ని వెలికితీశారు.

నీలం నదిలో గుర్తుతెలియని మృతదేహం

నవంబరు 23న పాక్ పాలిత కశ్మీర్‌లోని నీలం జిల్లా అధికారులకు ఒక సమాచారం అందింది. కేరన్ ప్రాంతం మీదుగా ప్రవహించే నీలం నదిలో ఓ మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు.

మొదట్లో అధికారులు, స్థానికులు నది ఉద్ధృత ప్రవాహానికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉంటారని భావించారు.

నీలం జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి అఖ్తర్ అయూబ్ వివరాల ప్రకారం, నవంబరు 23వ తేదీ ఉదయం సుమారు 11 గంటలకు నీలం నది నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. విపత్తు నిర్వహణ సంస్థ బృందం, షార్దా ప్రాంతంలోని 'కశ్మీర్ బోటింగ్ క్లబ్', పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కేరన్ యూనిట్, స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీసుకొచ్చారు.

మృతుడి జేబులో భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు లభించిందని అఖ్తర్ అయూబ్ తెలిపారు. దానిపై వ్యక్తి పేరు, ఇతర వివరాలు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించారు.

ఆ గుర్తింపు కార్డులోని వివరాల ఆధారంగా మృతుడు భారత్‌లోని కశ్మీర్‌లో బారాముల్లా జిల్లా రఫియాబాద్‌లోని డంగివచ్ఛా ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ హసన్ షాగా గుర్తించారు.

ప్రజలకు సమాచారం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఇర్ఫాన్ గుర్తింపు కార్డు, మృతదేహం ఫొటో, ఇతర వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

దీంతో ముజఫరాబాద్‌లో ఉంటున్న ఆయన భార్య, పిల్లలకు ఈ విషయం తెలిసింది. వారు అధికారులను సంప్రదించి, మృతదేహం తమ తండ్రిదేనని గుర్తించారు.

భార్య, పిల్లలను కలుసుకోడానికి ఇర్ఫాన్ బారాముల్లా నుంచి నీలం జిల్లా వరకు వచ్చి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు.

ఏదో విధంగా నీలం నదిని దాటి కుటుంబం దగ్గరకు చేరుకోవచ్చని ఆయన భావించి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నది కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ రేఖగా కూడా ఉంది.

కొన్ని రోజుల క్రితం ఎలాగైనా పాకిస్తాన్ చేరుకుంటానని ఇర్ఫాన్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నది అవతలి ఒడ్డుకు చేరుకోలేక, ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుపోయి ఉంటారని కుటుంబ సభ్యులు, అధికారులు భావిస్తున్నారు.

కశ్మీర్, ఇర్ఫాన్ హసన్ షా, పాక్ పాలిత కశ్మీర్, నీలం నది
ఫొటో క్యాప్షన్, ఇర్ఫాన్ హసన్ షా మృతదేహం లభించిన తర్వాత దాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో వివాదం తలెత్తింది.

మృతదేహాన్ని అప్పగించడంలో ఆలస్యం ఎందుకు?

ఇర్ఫాన్ హసన్ షా మృతదేహం లభించిన తర్వాత దాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో మృతదేహాన్ని అప్పగించడం, అంత్యక్రియలు నిర్వహించడం ఆలస్యమయ్యాయి.

భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల పౌరుల మృతదేహాలను అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి వీలైనంత త్వరగా వారి దేశాలకు పంపించాలి.

నదిలో మృతదేహం లభించిన తర్వాత, గుర్తింపు నిర్ధరించి దాన్ని అధికారుల వద్ద ఉంచినట్లు నీలం డిప్యూటీ కమిషనర్ బీబీసీ న్యూస్‌కు తెలిపారు.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం మృతదేహాన్ని భారత్‌కు పంపించాలా? లేక ముజఫరాబాద్‌లో నివసిస్తున్న ఆయన భార్య, పిల్లలకు అప్పగించాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

ఇర్ఫాన్‌కు ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారని.. వారంతా పాక్ పాలిత కశ్మీర్‌లో ముజఫరాబాద్‌లో నివసిస్తున్నారని చెప్పారు.

భారత్‌లోని కశ్మీర్‌లో ఉంటున్న ఇర్ఫాన్ సోదరులు, సోదరీమణుల అంగీకారం తీసుకున్నామని అసిస్టెంట్ కమిషనర్ అత్కమామ్ చౌధురి బషారత్ బీబీసీ ఉర్దూకు తెలిపారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక మృతదేహాన్ని ముజఫరాబాద్‌లో ఉంటున్న భార్య, పిల్లలకు అప్పగించినట్లు చెప్పారు.

ఈ మొత్తం ప్రక్రియకు మూడు రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ముజఫరాబాద్‌లో ఇర్ఫాన్‌కు నమాజ్-ఎ-జనాజా నిర్వహించారు.

కశ్మీర్, ఇర్ఫాన్ హసన్ షా, పాక్ పాలిత కశ్మీర్, నీలం నది
ఫొటో క్యాప్షన్, 20 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్ పాలనలోని కశ్మీర్‌కు చేరుకున్న ఇర్ఫాన్ హసన్ షా (ఫైల్ ఫొటో)

పాక్ పాలిత కశ్మీర్‌లో ఇర్ఫాన్ వివాహం ఎలా జరిగింది?

పాక్ పాలిత కశ్మీర్‌లో ముజఫరాబాద్‌లో నివసిస్తున్న ఇర్ఫాన్ భార్య సోదరుడు అఖ్తర్ బీబీసీతో మాట్లాడారు. 1992లో నియంత్రణ రేఖ దాటి ఇర్ఫాన్ పాక్ పాలిత కశ్మీర్‌కు వచ్చారని అన్నారు.

''ఇర్ఫాన్ హసన్ షా భారత పాలిత కశ్మీర్‌లో బారాముల్లా జిల్లా రఫియాబాద్‌లోని డంగివచ్ఛా ప్రాంతానికి చెందినవారు'' అని అఖ్తర్ చెప్పారు.

1992లో 20 ఏళ్ల వయసులో ఇర్ఫాన్ నియంత్రణ రేఖ దాటారని అఖ్తర్ వివరించారు. అక్కడికి చేరుకున్న తర్వాత కశ్మీర్‌లోని మీర్‌పూర్ జిల్లాలో చదువుకున్నారు. 1998 నుంచి 2002 మధ్య ఎఫ్ఏ, గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశారు.

''ఆ తర్వాత ఇర్ఫాన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పాక్ పాలిత కశ్మీర్‌లోనే స్థిరపడ్డారు. ముజఫరాబాద్‌లోని చకార్ ప్రాంతంలో ఆయన వివాహం జరిగింది'' అని అఖ్తర్ తెలిపారు.

అఖ్తర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇర్ఫాన్ 2008 వరకు పాక్ పాలిత కశ్మీర్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత భార్య, పిల్లలతో కలిసి నేపాల్ మార్గంలో తిరిగి భారత్‌లోని కశ్మీర్‌కు వెళ్లారు. అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

పాక్ పాలిత కశ్మీర్‌లో ఇర్ఫాన్ చాలా సంతోషంగా గడిపారని, వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని ఇర్ఫాన్ భార్య మరో బంధువు ఫారూక్ మీర్ చెప్పారు.

ఇర్ఫాన్ తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు ఇప్పటికీ భారత్‌లోని కశ్మీర్‌లోనే నివసిస్తున్నారని ఫారూక్ మీర్ చెప్పారు. అందుకే పాక్ పాలిత కశ్మీర్‌లో 16 ఏళ్లు గడిపిన తర్వాత తిరిగి వెళ్లాలని ఇర్ఫాన్ నిర్ణయించుకున్నారని వివరించారు.

2025 మార్చిలో జరిగిన పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని ఫారూక్ మీర్, అఖ్తర్ తెలిపారు. ఈ పరిణామాల ప్రభావం ఇర్ఫాన్ కుటుంబంపైనా పడిందని చెప్పారు.

పాకిస్తాన్‌తో సంబంధాలున్న వారిని తిరిగి వారి దేశాలకు పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రకారం ఇర్ఫాన్ భార్య, కుమారులను కూడా పాకిస్తాన్‌కు పంపించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇర్ఫాన్ మాత్రం భారత్‌లోని కశ్మీర్‌లోనే ఉండిపోయారు. ఇర్ఫాన్ భార్య ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్‌లో తన సోదరుడితో కలిసి ఉంటున్నారు.

తల్లిదండ్రులు చనిపోవడం, భార్యాపిల్లలకు దూరం కావడంతో ఇర్ఫాన్ తన స్వస్థలంలో ఒంటరిగా మిగిలిపోయారని పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్‌లో నివసిస్తున్న ఇర్ఫాన్ భార్య బంధువు మక్సూద్ ముంతజిర్ చెప్పారు.

''ఒంటరితనం గురించి ఆయన తరచూ భార్య, పిల్లలతో మాట్లాడేవారు'' అని తెలిపారు.

ఫోన్‌లో పిల్లలతో మాట్లాడిన తర్వాత ఇర్ఫాన్ మరింత బాధపడేవారని ముంతజిర్ చెప్పారు. కుటుంబాన్ని కలుసుకునేందుకు మార్గాల గురించి నిరంతరం ఆలోచించేవారని వివరించారు. బహుశా నీలం నదిని దాటితే మళ్లీ భార్య, పిల్లలను కలుసుకోవచ్చని ఇర్ఫాన్ భావించి ఉండొచ్చని ముంతజిర్ అన్నారు.

కశ్మీర్, ఇర్ఫాన్ హసన్ షా, పాక్ పాలిత కశ్మీర్, నీలం నది
ఫొటో క్యాప్షన్, ఇర్ఫాన్ హసన్ షా అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు.

పిల్లల వద్దకు తండ్రి మృతదేహం

ఇర్ఫాన్ షా మృతదేహాన్ని మొదట సీమ్‌హెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత, ఆయన మృతదేహాన్ని భార్య, పిల్లలు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ముజఫరాబాద్‌లోని ఈద్గాలో ఇర్ఫాన్‌కు నమాజ్-ఎ-జనాజా నిర్వహించారు.

పాక్ పాలిత కశ్మీర్‌లోని వివిధ శిబిరాల్లో సుమారు 48 వేల మంది కశ్మీరీ శరణార్థులు నివసిస్తున్నారు. నియంత్రణ రేఖకు ఇరువైపులా కుటుంబ సభ్యులు విడిపోయిన కుటుంబాలే వీరిలో ఎక్కువగా ఉన్నారు.

ఇర్ఫాన్ షా తన స్నేహితుడని శరణార్థి నాయకుడు హమీద్ కశ్మీరీ బీబీసీతో చెప్పారు. ఇర్ఫాన్ పాక్ పాలిత కశ్మీర్‌లో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవారమని ఆయన తెలిపారు. భార్య, పిల్లలను పాకిస్తాన్‌కు పంపించినప్పటి నుంచి వారిని కలుసుకునేందుకు ఇర్ఫాన్ ప్రయత్నిస్తున్నారని హమీద్ కశ్మీరీ చెప్పారు.

ఆయన బతికి ఉండగా కుటుంబం దగ్గరకు చేరుకోలేకపోయినా, చివరికి ఆయన మృతదేహం మాత్రం భార్య, పిల్లల వద్దకు చేరిందని అన్నారు.

శరణార్థి శిబిరాల్లో ఇలాంటి అనిశ్చితి మధ్య చాలా కుటుంబాలు జీవిస్తున్నాయని ఆయన చెప్పారు. విడిపోయిన కుటుంబ సభ్యులను మళ్లీ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకోగలమో తెలియక వారు ఎదురుచూస్తున్నారని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)