నాహీద్ ఇస్లాం: బంగ్లా ప్రధానిని కలిసిన తరువాత ‘భారత్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలి’ అంటూ ఎందుకు పిలుపు నిచ్చారు?

ఫొటో సోర్స్, Zakir Hossain/NurPhoto via Getty Images
బంగ్లాదేశ్‌ను అస్థిరత పరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆ దేశంలోని నేషనల్ సిటిజెన్స్ పార్టీ (ఎన్సీపీ) కన్వీనర్ నాహిద్ ఇస్లాం ఆరోపించారు.
బంగ్లాదేశ్ ప్రస్తుత పోరాటం భారత ఆధిపత్యానికి వ్యతిరేకంగానే అని నాహిద్ ఇస్లాం అన్నారు. అందుకోసం ప్రజలు, రాజకీయ పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారని బీబీసీ బంగ్లా తెలిపింది.
బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఆ దేశ ప్రధాని తారిక్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో నలుగురు ఎన్సీపీ నేతలు నాహిద్ ఇస్లాం, సీనియర్ జాయింట్ కన్వీనర్ హస్నత్ అబ్దుల్లా, మెంబర్ సెక్రటరీ అక్తర్ హుస్సేన్, పొలిటికల్ కౌన్సిల్ మెంబర్ అక్రమ్ హుస్సేన్ సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నాహిద్ ఇస్లాం... ప్రజలను, రాజకీయ శక్తులను ఏకం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. షేక్ హసీనాను తిరిగి రప్పించే ప్రక్రియకు భారత్ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. అయితే ఇది చట్టపరమైన అంశమని, దీనిని నిబంధనల ప్రకారమే పరిష్కరిస్తామని భారత్ పదేపదే స్పష్టం చేస్తూ వస్తోంది.
బంగ్లాదేశ్‌తో నిర్మాణాత్మక, సానుకూల సంబంధాలను పెంపోందించుకోవాలని భారత్ గట్టిగా చెబుతోంది.


ఫొటో సోర్స్, Bangladesh Prime Minister
"భారత్ ఓ హంతకురాలికి ఆశ్రయం కల్పిస్తోంది"
షేక్ హసీనాను ఉద్దేశించి మాట్లాడిన నాహిద్ ఇస్లాం... "భారత్ ఓ హంతకురాలికి ఆశ్రయం కల్పిస్తోంది. తన భూభాగంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పనిచేసేందుకు ఓ పార్టీకి అనుమతించింది. మన పోరాటం ఇక ఎంతమాత్రం అవామీ లీగ్‌పై కాదు. భారత్ ఆధిపత్యంపైనే ఇక మన పోరు. ఆగస్టు 5నే అవామీ లీగ్‌పై గెలిచాం. బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచేందుకు భారత్ యత్నిస్తోంది. అందుకే ప్రజలు, రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలి"అన్నారు.
"జులైలో మనం చేసిన పోరాటం ఇంకా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థాగతం చేయకపోతే ప్రజల విశ్వాసాన్ని పొందలేం. జులై బాధితులకు న్యాయం జరగాలని, ఆ పోరాటంలో పాల్గొన్నవారికి భద్రత కల్పించాలని ఇదివరకే స్పష్టం చేశాం. ప్రభుత్వం ఐక్యత గురించి మాట్లాడుతోంది. బంగ్లాదేశ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మేము కూడా అందరూ కలిసి రావాలని సూచిస్తున్నాం" అని నాహిద్ పేర్కొన్నారు.
నాటి ప్రధానమంత్రి షేక్ హసీనా (79) నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024 జులైలో బంగ్లాదేశ్‌లో తిరిగుబాటు జరిగింది. దీంతో షేక్ హసీనా ఆ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆమె నాటి నుంచి భారత్‌లోనే నివసిస్తున్నారు.
జులై తిరుగుబాటు అనంతరం అధికారం కోల్పోయిన అవామీ లీగ్, ఇటీవలే చేపట్టిన నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో క్రియాశీల రాజకీయ పార్టీలతో సంఘీభావం పెంపొందించుకుంటామని ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రకటించారు. అందులో భాగంగానే ఈ చర్చలను నిర్వహిస్తున్నారు.
చర్చల మొదటి రోజైన సోమవారం మధ్యాహ్నం ఎన్సీపీ నేతలను ప్రధాని కలిశారు.

ఫొటో సోర్స్, Salahuddin AHMED / AFP via Getty Images
"హసీనాను అరెస్ట్ చేస్తాం"
భారత్ నుంచి తిరిగి వస్తే మాజీ ప్రధాని షేక్ హసీనాను అరెస్ట్ చేస్తామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం ఆదివారం రాయిటర్స్‌తో అన్నారు.
ఈ డిసెంబర్లో బంగ్లాదేశ్ రావాలని హసీనా యోచిస్తుండటం... ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. వీధుల్లో మళ్లీ హింస చెలరేగుతోంది.
భారత్ నుంచి హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుకుంటోందని షమా అన్నారు. ప్రస్తుతం ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ తమ డిమాండ్‌ను నెరవేరుస్తుందని బంగ్లాదేశ్ ఆశిస్తోంది.
హసీనాకు బంగ్లాదేశ్‌లో మరణ శిక్ష విధించారు. 2024 తిరుగుబాటు అనంతరం ఆమె సుదీర్ఘ పాలను ముగియడం సహా అవామీ లీగ్ పార్టీపై నిషేధం పడింది.
ఐక్యరాజ్య సమితి ప్రకారం, ఆ హింసల్లో 1400ల వరకు ప్రాణాలు కోల్పోయారు.
హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 2024లో దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ఆమె ఢాకా విడిచి వెళ్లారు. ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాకు తిరిగి రావాలనే ప్రయత్నాల్లో ఉన్న హసీనా... కొత్త పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వాటిని బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది.
అవామీ లీగ్ బంద్ పిలుపుతో ఉద్రిక్తత
హసీనా పార్టీ అవామీ లీగ్ గతవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన తర్వాత, పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.
నిషేధిత అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థలు, బీఎన్పీ కార్యకర్తలకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో కనీసం నలుగురు వ్యక్తులు చనిపోయారని బంగ్లాదేశ్ వార్త పత్రికలు పేర్కొన్నాయి.
గత తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిని కూడా తగులబెట్టినట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.
విధ్వంసం, అశాంతికి ప్రేరేపించారనే ఆరోపణలపై మాజీ విద్యా శాఖ మంత్రి నూరుల్ ఇస్లాం నాహిద్ సహా పలువురు అవామీ లీగ్ నేతలను అరెస్ట్ చేశారు.
"ఇక జరిగింది చాలు"
బంగ్లాదేశ్‌ను అస్థిరతపరిచేందుకు అవామీ లీగ్ కుట్ర పన్నిందని ఆ దేశ ప్రధాని తారిక్ రెహమాన్ సైతం ఆరోపించారు.
"దేశం నుంచి పారిపోయినప్పటికీ, వారు మరోసారి దహనకాండ, హత్యా రాజకీయాలను మొదలుపెట్టారు. వెనుక నుంచి దాడి చేస్తూ ప్రజలను హతమారుస్తున్నారు" అని భారత్ పేరను ప్రస్తావించకుండా రెహమాన్ అన్నారు.
ఇక జరిగింది చాలు. ఈ ఉగ్రవాదులకు, హంతకులకు, దహనకాండకు పాల్పడేవారికి తగిన జవాబు చెప్పాలి అని ఆయన పేర్కొన్నారు.
భారత్ ఏమంటోంది?
నాహిద్ ఇస్లాం తాజా ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
తారిఖ్ రెహమాన్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించినప్పుడు, "బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలపై భారత్ స్పందించాలని అనుకోవడం లేదు" అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నవంబర్ 20న అన్నారు.
"బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక, భవిష్యత్‌పై దృష్టి సారించే సంబంధాలనే కలిగి ఉండాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. ఈ సంబంధాలు ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, ప్రజల ఉమ్మడి సంస్కృతి, విలువల ఆధారంగా ఉండాలి" అని జైస్వాల్ పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























