బంగారంలో కల్తీని గుర్తించడానికి ‘హాల్‌మార్క్’పై ఆధారపడటం మంచిదేనా, బంగారు ఆభరణాల స్వచ్ఛతను నిర్థరించుకోవడం ఎలా?

బంగారం
ఫొటో క్యాప్షన్, హాల్‌మార్కింగ్‌పై పర్యవేక్షణ కొరవడిందని ఇటీవల వెలువడిన కాగ్ ముసాయిదా నివేదిక పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
    • రచయిత, గుర్‌ప్రీత్ సైనీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఇది పెళ్లిళ్ల సీజన్. చాలా కుటుంబాలు ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాయి. బంగారాన్నికొనేటప్పుడు చాలామంది తమ ఆభరణాల స్వచ్ఛతను నిర్ధరించుకోవడానికి హాల్‌మార్కుపై ఆధారపడతారు.

ఇటీవల వెలువడిన ముసాయిదా కాగ్ రిపోర్టును ఉటంకిస్తూ, హాల్‌మార్కింగ్‌పై పర్యవేక్షణ కొరవడిందని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.

రిజిస్టర్డ్ బంగారు వ్యాపారుల వద్ద 83శాతానికి పైగా 2020-21, 2024-25 మధ్య కాలంలో బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ) నిర్ణీత వార్షిక తనిఖీలు చేయలేదని ఆ రిపోర్ట్స్ చెప్పాయి.

తనిఖీ జరగనంత మాత్రాన మార్కెట్‌లో అమ్మే ప్రతి ఆభరణం స్వచ్ఛత తక్కువ ఉంటుందని అర్థం కాదు. అయితే, హాల్‌మార్కింగ్ తర్వాత నిబంధనల అమలు ఎంతవరకు పర్యవేక్షిస్తున్నారన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న.

మరోవైపు.. రేనియం వంటి భారలోహాలను బంగారానికి కలుపుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే.. ఈ లోహం ఏంటి? దానిపై ఉన్న వాదనలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీఐఎస్ ఏం సూచించింది?

మూడు నెలల్లో బంగారం ధరలు 15 శాతానికి పైగా పడిపోయాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపింది. అయితే, ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ ఆభరణాలను డిమాండ్‌ను పెంచగలదు.. అందుకే... బంగారం స్వచ్ఛతను ఎలా పరీక్షిస్తారో కొనుగోలుదారులు తెలుసుకోవడం ముఖ్యం.

బంగారం ఆభరణాల మెరుపు మాత్రమే కాకుండా.. వాటి ప్రామాణికతను నిర్ధరించుకోవాలని బీఐఎస్ ఒక సోషల్ మీడియా పోస్టులో వినియోగదారులను కోరింది. నకిలీ హాల్‌ మార్కింగ్‌ను తప్పించుకోడానికి బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఆభరణాలపై ఉన్న హెచ్‌యూఐడీని ధ్రువీకరించుకోవాలని బీఐఎస్ సూచించింది.

అయితే, ఒక సాధారణ సలహాగా మాత్రమే ఈ పోస్టు చేసింది. కానీ, దీనిలో రేనియం గురించి, కాగ్ రిపోర్టు గురించి ప్రస్తావించలేదు.

బంగారం
ఫొటో క్యాప్షన్, హాల్‌మార్కింగ్ అంటే ఆభరణాలలోని బంగారు శాతాన్ని తనిఖీ చేసి, దానిని అధికారికంగా నమోదు చేయడం.

హాల్‌మార్క్ అంటే ?

హాల్‌మార్కింగ్ అంటే.. ఆభరణాల్లో బంగారం శాతం ఎంత ఉందో ధ్రువీకరించడం. ఆభరణాల అధికారిక రికార్డును నిర్వహించడం.

దీనికోసం.. ఆభరణాల వ్యాపారి బీఐఎస్ వద్ద నమోదు చేసుకోవాలి. బీఐఎస్ అక్రిడేటెడ్ ఏహెచ్‌సీకి (అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్‌కు) ఆ ఆభరణాన్ని పంపించాలి. అక్కడే బంగారం స్వచ్ఛతను పరీక్షిస్తారు. ఆ అభరణానికి నిర్దేశించిన ప్రమాణాలు ఉంటే, దానిపై హాల్ మార్క్ వేస్తారు.

చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఎస్ఐ) హాల్‌మార్క్‌ లైసెన్స్ ఇస్తుంది. 2021 జూలై 1 నుంచి హాల్‌మార్క్‌లో మూడు రకాల అంశాలు ఉంటాయి.. ఒకటి బీఐఎస్ లోగో, ఇంకొకటి 22కే,916 లాగా క్యారెట్‌ను, స్వచ్ఛతను సూచించే నెంబర్, మరొకటి ఆరు అక్షరాలు, ఆరు అంకెలు కలిగిన హెచ్‌యూఐడీ కోడ్.

22 క్యారెట్ల అంటే.. ఆ ఆభరణంలో సుమారు 91.6 శాతం బంగారం ఉందని అర్థం.

రేనియం
ఫొటో క్యాప్షన్, చైనాలో కూడా బంగారంలో రేనియం కల్తీ జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి.

రేనియం గురించి చర్చ ఎందుకు?

గత వారం దైనిక్ భాస్కర్ జరిపిన ఒక పరిశోధనలో .. బంగారంలో రేనియం పౌడర్‌ను కలిపిన తర్వాత కూడా ఆ ఆభరణం స్వచ్ఛతా పరీక్షను నెగ్గిందని వెల్లడైంది.

ఈ వాదనలను అధికారులు స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. అయితే.. ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా బంగారంలో కల్తీ జరుగుతోందనడానికి ఆధారంగా భావించరాదని కూడా మీడియా కథనాలు స్పష్టం చేశాయి.

అయితే.. రేనియానికి సంబంధించిన ఆందోళనలు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. రేనియం కలిపిన బంగారానికి సంబంధించిన ఫిర్యాదులు చైనాలో కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ ఈ విషయంపై ఏప్రిల్ 26న ఒక కథనాన్ని ప్రచురించిందని ది స్ట్రయిట్స్ టైమ్స్ పేర్కొంది.

రేనియానికి ముందు కూడా.. ఇతర లోహాలు బంగారంలో కలుపుతూ కల్తీ చేస్తున్నారనే ఆందోళనలు వినిపించాయి.

రుథేనియం, ఇరిడియం వంటి లోహాలతో జరిగే కల్తీని గుర్తించేందుకు తన ప్రమాణాలను బీఐఎస్ సవరించిందని 2005లో లోక్‌సభలో ప్రభుత్వం తెలిపింది.

రేనియం అనేది వెండిలా తళుక్కుమనే భారలోహం. దీన్ని 3,186 డిగ్రీల సెల్సియస్ వద్దనే కరిగించగలరు. ఒకే పరిమాణంలో ఉన్న ముక్కలను పోల్చినప్పుడు, రేనియం స్వచ్ఛమైన బంగారం కంటే కొద్దిగా బరువుగా ఉంటుంది.

దీన్ని జెట్ ఇంజిన్ టర్బైన్ బ్లేడ్లకు సూపర్ అలోయ్స్‌గా ఉపయోగిస్తారు. పెట్రోలియం రిఫైనింగ్ వంటి ఇండస్ట్రీయల్ అప్లికేషన్లలో వాడతారు.

బంగారం కంటే చాలా చౌకగా ఉండటం వల్ల కూడా దీనిని కల్తీలో ఉపయోగిస్తారని చెబుతారు.

బంగారం
ఫొటో క్యాప్షన్, బంగారంలో రేనియం పొడిని కలిపిన తర్వాత కూడా బంగారం స్వచ్ఛత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని ఓ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.

మెషిన్ ఎలా తప్పు చేస్తుంది?

బంగారాన్ని గ్రాముల లెక్కన విక్రయిస్తారు. ఎవరైనా తక్కువ ధర కలిగిన, బరువైన లోహాన్ని బంగారానికి కలిపితే, ఆభరణం బరువు మారదు కానీ అందులో ఉండే అసలు బంగారం పరిమాణం తగ్గుతుంది. ఇలా, తక్కువ బంగారం వాడటం ద్వారా మిగిలిన విలువ వారి జేబులోకి చేరుతుంది.

ఆభరణంలో ఇలాంటి లోహాలను కలిపిన కేసులు అంతకుముందు కూడా వెలుగులోకి వచ్చాయని ఆల్ ఇండియా జ్యూవెల్లర్స్, గోల్డ్‌స్మిత్స్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా చెప్పారు.

''అంతకుముందు అలాంటి పౌడర్లను ఎక్స్‌ఆర్ఎఫ్ పరీక్షలో గుర్తించేవారు. అందువల్ల, దాని గురించి ఎప్పుడూ పెద్దగా ఆందోళన చెందలేదు'' అని తెలిపారు.

ఎక్స్‌ఆర్ఎఫ్ అంటే 'ఎక్స్-రే ఫ్లోరోసెన్స్' . ఈ పద్ధతిలో, ఆభరణాల ఉపరితలంపై ఉన్న లోహాలను, వాటి పరిమాణాలను తెలుసుకోవడానికి ఎక్స్-కిరణాలను ఉపయోగిస్తారు.

రేనియంతో ఉన్న సమస్య భిన్నమైందని పంకజ్ అరోరా అన్నారు. ''బంగారాన్ని సుమారు 1,064 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తారు. అయితే, రేనియాన్ని కరగదీసేందుకు.. 3 వేల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. దీంతో, బంగారంలో రేనియం పూర్తిగా కరగకుండా, ఆభరణాలలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండిపోతుంది'' అని పంకజ్ అరోరా చెప్పారు.

'' మొత్తం ఆభరణాన్ని మెషిన్ స్కాన్ చేయదు. ఎక్కడైతే మెషిన్ పెడతారో ఆ ప్రదేశంలో మాత్రమే తనిఖీ చేస్తుంది. దానిపై ఏ భాగాన్ని ఉంచితే, ఆ భాగాన్ని మాత్రమే పరీక్షిస్తుంది. హాల్‌మార్కింగ్ కేంద్రంలో కూడా ఆభరణంలోని కొన్ని భాగాలను మాత్రమే పరీక్షిస్తారు'' అని తెలిపారు.

"పరీక్షించే ప్రదేశంలో ఆ పొడి లేకపోతే, ఆభరణం పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. మెషిన్ కచ్చితమైన ఫలితాలనే ఇచ్చినప్పటికీ, అది పరీక్షిస్తున్న ప్రాంతంలో ఆ పొడి లేకపోవచ్చు" అని అన్నారు.

మీడియా కథనాల ప్రకారం.. ఎక్స్‌ఆర్ఎఫ్ పరీక్షలో కొన్ని సాంకేతిక పరిమితులు ఉన్నాయని తెలిసింది. పరీక్ష సమయంలో వాడే మెషిన్, దాని సెట్టింగ్స్, పరీక్ష సమయంలోని పరిస్థితులపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

అయితే, ఇలాంటి కల్తీని గుర్తించకుండా తప్పించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయంతో నిపుణులందరూ ఏకీభవించడం లేదు.

ఇలాంటి కల్తీని హాల్‌మార్కింగ్, ఎక్స్‌ఆర్ఎఫ్ టెస్టింగ్ ద్వారా గుర్తించవచ్చని ఆల్ బులియన్ అండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేష్ సింగ్లా ఐఏఎన్ఎస్‌కు చెప్పారు. ఈ వానదలు అనవసరమైన భయాందోళనలను సృష్టిస్తున్నాయని తెలిపారు.

ఇరిడియం, రుథేనియానికి సంబంధించిన ఆందోళనలు చాలా దశాబ్దాలుగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

మీ ఆభరణం ప్రమాదంలో ఉందా?

ప్రస్తుతం ఇలాంటి కల్తీ పెద్ద ఎత్తున వ్యాపించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని బీఐఎస్ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపింది.

బంగారు ఆభరణాల్లో కల్తీ జరిగిందని అనుమానం ఉంటే, జీజేసీకి లేదా నేరుగా బీఐఎస్‌కి ఫిర్యాదు చేయవచ్చని జీజేసీ అధ్యక్షుడు రాజేష్ రోక్డే తెలిపారు.

ప్రజలు విశ్వసనీయమైన ఆభరణాల దుకాణాల్లోనే నగలు కొనుగోలు చేయాలని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా హాల్‌మార్క్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించారు.

వివాహం వంటి ముఖ్యమైన సందర్భాల్లో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా హాల్‌మార్క్‌ను తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం
ఫొటో క్యాప్షన్, ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా వాలిడ్ జీఎస్‌టీ బిల్లును తీసుకోవాలి.

కొనుగోలు చేసేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి?

బీఐఎస్ కేర్ యాప్‌లో హెచ్‌యూఐడీని తనిఖీ చేయొచ్చు. బీఐఎస్ ప్రకారం.. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి బీఐఎస్ కేర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ''వెరిఫై హెచ్‌యూఐడీ'' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆభరణంపై ఉన్న ఆరు అక్షరాల హెచ్‌యూఐడీ కోడ్‌ను దానిలో నమోదు చేయాలి.

అప్పుడు, యాప్‌లో చూపించే సమాచారాన్ని ఆభరణంపై ఉన్నదానితో పోల్చిచూసుకోవాలి. దీనిలో వర్తక వ్యాపారి రిజిస్ట్రేషన్ నెంబర్, ఆభరణాన్ని పరీక్షించిన హాల్‌మార్కింగ్ సెంటర్, ఆభరణం రకం, బంగారం స్వచ్ఛత వంటివి ఉంటాయి.

ఆభరణం మొత్తం బరువు, హాల్‌మార్క్ పేజీ, ఆభరణం ఫోటోను కూడా తనిఖీ చేసుకోవచ్చని బీఐఎస్ ప్రతిపాదిస్తోంది. ఏదైనా సమాచారం దీనిలో సరిపోకపోతే.. వెంటనే యాప్ ద్వారా ఫిర్యాదు దాఖలు చేయచ్చు.

ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా వాలిడ్ జీఎస్‌టీ బిల్లును తీసుకోవాలి. ఆ బిల్లులో బంగారం క్యారెట్లు, బరువు, హెచ్‌యూఐడీ కోడ్ స్పష్టంగా పేర్కొనాలి. సరైన వివరాలు లేని సాధారణ బిల్లు తీసుకుంటే, భవిష్యత్తులో సమస్య తలెత్తినప్పుడు అత్యంత ముఖ్యమైన ఆధారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల స్వచ్ఛతపై అనుమానం ఉంటే, వాటిని మరోసారి పరీక్షించుకోవచ్చు. బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రంలో స్వల్ప రుసుముతో ఆభరణాలను పరీక్షించుకోవచ్చు. అక్కడి నుంచి ఆ పరీక్షకు సంబంధించిన రాతపూర్వక నివేదికను కూడా పొందవచ్చు.

మీ హక్కుల గురించి తెలుసుకోవాలి. బీఐఎస్ నిబంధనల ప్రకారం.. హాల్‌మార్క్ వేసిన ఆభరణం దానిపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉంటే.. ఆభరణాల వ్యాపారి వినియోగదారుడికి స్వచ్ఛతలో ఉన్న లోటుకు సంబంధించిన పరిహారాన్ని రెండింతలు చెల్లించాలి. దీనికి అదనంగా పరీక్షల కోసం చెల్లించిన రుసుమును కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

కల్తీ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది?

బ్యాంకుల ద్వారా వచ్చే బంగారంతో ఎలాంటి సమస్యా ఉండదని పంకజ్ అరోరా చెప్పారు. దేశంలో 11 నుంచి 12 నిర్దేశిత ఏజెన్సీలు బ్యాంకుల ద్వారానే బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయని తెలిపారు. ప్రతి బారుపైన నెంబర్ ఉంటుంది. ఇది ఎవరు ఎగుమతి చేశారన్నది గుర్తించేందుకు సాయపడుతుంది.

సమస్యంతా అక్రమంగా రవాణా అవుతున్న బంగారంలోనే ఉందని ఆయన అన్నారు. "దిగుమతి సుంకం పెంచిన తర్వాత, అక్రమ బంగారం రావడం మొదలైంది. దీనికి జవాబుదారీతనం లేదు, దాని స్వచ్ఛతకు ఎవరూ హామీ ఇవ్వరు" అని ఆయన అన్నారు.

ఇది ఆయన సొంత అంచనా. బీబీసీ హిందీ దీనిని స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఇండియన్ బులియన్ అండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ఒక మెమోరాండాన్ని బీఐఎస్‌కి సమర్పించిందని ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. దీనిలో ప్రకటించకుండా తనిఖీలకు వెళ్లడం, కఠినమైన తనిఖీలు చేపట్టడం చేయాలని డిమాండ్ చేసిందని తెలిపింది. రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్న సుమారు 4,000 రిఫైనరీలను తమ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావాలని కూడా బీఐఎస్‌ను ఈ అసోసియేషన్ కోరింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)