‘ఆడుకుంటున్న కొడుకు అనుకోకుండా తండ్రి వృషణాలపై తన్నాడు, వారం రోజులైనా నొప్పి తగ్గలేదు.. చివరకు అదే ఆయన ప్రాణాలనే కాపాడింది’

- రచయిత, ఒవైన్ క్లార్క్, మాథ్యూ బాసెట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
బెన్ లిడ్జీ తన నాలుగేళ్ల కొడుకుతో గార్డెన్‌లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఆయన వృషణాలపై కొడుకు తన్నాడు. అయితే, అదే ఘటన బెన్ ప్రాణాలను కాపాడి ఉండొచ్చని ఇప్పుడు తెలుస్తోంది.
వారం రోజులైనా నొప్పి తగ్గకపోవడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. అప్పుడే ఆయనకు వృషణాల క్యాన్సర్ (టెస్టికులర్ క్యాన్సర్) ఉందని తేలింది.
వేల్స్‌లో మూడింట ఒక వంతు మంది పురుషులు 75 ఏళ్లు నిండక ముందే మరణిస్తున్నారని పురుషుల స్వచ్ఛంద సంస్థ 'మూవెంబర్' తాజా రిపోర్ట్ పేర్కొంది. పురుషుల ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వేల్స్ ప్రభుత్వాన్ని కోరింది.
పురుషులు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను పరిష్కరించడానికి ఆత్మహత్యల నివారణ, స్వీయ హాని నియంత్రణ, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ సంబంధిత వ్యూహాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని వేల్స్ ప్రభుత్వం తెలిపింది.

బెన్ లిడ్జీ కార్డిఫ్ ప్రాంతానికి చెందినవారు. తన వృషణాలపై కుమారుడు తన్నిన తర్వాత, నొప్పి దానంతట అదే పోతుందని డాక్టర్‌ని సంప్రదించలేదని బెన్ వెల్లడించారు.
"కుటుంబంతో బిజీగా ఉన్నాను, ఇద్దరు చిన్న పిల్లలున్నారు.. ఇంకా ఎన్నో విషయాలు చూసుకోవాల్సి ఉండేది" అన్నారాయన.

క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కొత్త సమస్య..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత బెన్ మరో సమస్యను ఎదుర్కొన్నారు.
"నేను బాగానే ఉన్నా అనుకున్నా. కానీ, ఐదేళ్ల తర్వాత నాలో ఏదో సమస్య ఉందని, ఎవరినైనా సంప్రదిస్తే మంచిదని నా భార్య సూచించింది. నేను మునుపటి కంటే మౌనంగా మారడం, ఎక్కువగా వాదించడం, ఇతరులపై ఓపిక తగ్గడం ఆమె గమనించింది. నేను గతంలో ఉన్నట్లుగా లేనని తెలిపింది" అని బెన్ తెలిపారు.
కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత బెన్‌లో పురోగతి కనిపించింది. పురుషులు, బాలల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇప్పుడు ఆయన చురుకుగా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Callum Tipton
సాధారణంగా పురుషులు తక్కువ వయసులోనే మరణించడానికి వారు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలపై సహాయం కోరేందుకు వెనుకాడటం ఒక కారణంగా తరచూ చెబుతుంటారు.
మూవెంబర్ రిపోర్ట్ ప్రకారం, 2024లో వేల్స్‌లో దాదాపు 7,000 మంది పురుషులు 75 ఏళ్లు నిండకముందే మరణించారు. మహిళల్లో ముందస్తు మరణాల రేటు 28 శాతంగా ఉంది. క్యాన్సర్లు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో పాటు డ్రగ్స్, మద్యం, ఆత్మహత్యల వంటి నివారించదగిన లేదా ముందుగా గుర్తిస్తే నయమయ్యే సమస్యలతోనే పురుషులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు.

"ముఖ్యంగా యువకులు శారీరకంగా ప్రమాదకరమైన పనులు చేసి గాయపడుతుంటారు, మరణిస్తుంటారు. శారీరకంగా బలంగా ఉండాలనే అంచనా కూడా దీనికి ఒక కారణం" అని కార్డిఫ్ యూనివర్సిటీలో సోషల్ కేర్ ప్రొఫెసర్ జోనాథన్ స్కౌర్‌ఫీల్డ్ అన్నారు.
సామాజిక సంబంధాలను పెంచుకోవడం ఎంత ముఖ్యమో కొంతమంది పురుషులు పట్టించుకోకపోవచ్చని, ఆ బాధ్యతను మహిళా భాగస్వామిపై వదిలేస్తున్నారని ఆయన చెప్పారు.
"ఒకవేళ భాగస్వామిని కోల్పోయినా, ఉద్యోగ విరమణ చేసినా ఒంటరితనంతో ఇబ్బంది పడతారు" అన్నారు.
"ఆహారం అనేది చాలా కీలకమైన అంశం... పండ్లు, కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడాన్ని మగవాళ్లకు సంబంధించిన విషయంగా పెద్దగా పరిగణించరు. కానీ, ఆరోగ్యానికి హాని చేసే మితిమీరిన మద్యపానం లాంటి అలవాట్లను మాత్రం, ఒక అబ్బాయి మగవాడిగా మారుతున్నాడనడానికి సంకేతంగా చూస్తారు" అని జోనాథన్ వివరించారు.

వృషణాల క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు ఏమిటి?
- వృషణంలో గడ్డ లేదా వాపు రావడం
- వృషణం పరిమాణం పెరగడం
- వృషణం లేదా స్క్రోటమ్‌లో (వృషణాలను కప్పి ఉంచే చర్మం) నొప్పి రావడం
- స్క్రోటమ్ బరువుగా, బిగుతుగా, గట్టిగా అనిపించడం
వృషణాల క్యాన్సర్ సాధారణంగా ఒక వృషణానికే వస్తుంది. కానీ, కొన్నిసార్లు రెండింటికీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. అయితే, శరీరంలో ఏవైనా మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.
"సమస్య తీవ్రమయ్యే వరకు చూడకుండా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు సహాయం కోరేలా పురుషులను ప్రోత్సహిస్తూ, నివారణ, ముందస్తు జోక్యంపై ఇప్పటికే దృష్టి సారిస్తున్నాం. ఇందులో మానసిక ఆరోగ్య సేవలను ముందుగానే అందించడం, క్యాన్సర్ స్క్రీనింగ్‌కు వచ్చే వారి సంఖ్యను పెంచడం కూడా ఉన్నాయి" అని వేల్స్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























