దానం నాగేందర్: అనర్హత వేటు వేసిన హైకోర్ట్.. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక తప్పదా

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, Telangana Assembly

ఫొటో క్యాప్షన్, దానం నాగేందర్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం ఇది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసన సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది.

ఆయన శాసనసభ సభ్యత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు తెలంగాణ హైకోర్టు సెప్టెంబరు 18న (శుక్రవారం) తీర్పు వెలువరించింది.

''దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచి తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు'' అని హైకోర్టు తన తీర్పులో తెలిపిందని 'ది హిందూ' తెలిపింది.

హైకోర్టు తీర్పును దానం నాగేందర్ స్వాగతించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీఆర్ఎస్ నుంచి గెలిచి.. కాంగ్రెస్ తరఫున పోటీ..

దానం నాగేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఆ తర్వాత 2024 మార్చి 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పటి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

అనంతరం అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు.

అయితే దానం నాగేందర్‌ను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హుడిగా ప్రకటించాలని లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా తెలంగాణ స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు.

స్పీకర్ నిర్ణయంలో జాప్యం జరుగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్‌తో పాటు పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు.

ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు నిర్ణయం ప్రకటించాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది.

అయితే, బీఆర్ఎస్, బీజేపీ వేసిన పిటిషన్లపై విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవంటూ ఈ ఏడాది మార్చి 11న పిటిషన్లను కొట్టివేశారు.

దీనిపై కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ మేరకు విచారణ జరిపి రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం అనర్హత వేటు వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు సెప్టెంబరు 18న తీర్పు చెప్పింది.

''ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యిందని హైకోర్టు ప్రకటించింది. తీర్పు కాపీని తెలంగాణ స్పీకర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపించింది'' అని హైకోర్టు న్యాయవాది కరుణాసాగర్ చెప్పారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికలు వస్తే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

''నాకు పోరాటం కొత్త కాదు. ఎన్నికలు వస్తే తప్పకుండా పోరాడతా.. విజయం సాధిస్తా'' అని చెప్పారు.

సుప్రీంకోర్టుకు వెళ్లే విషయం గురించి ఏమీ ఆలోచించలేదని చెప్పారు.

గతంలో టీడీపీ నుంచి గెలిచి.. కాంగ్రెస్‌లో చేరి..

తెలంగాణ రాజకీయాల్లో దానం నాగేందర్ ఓ సీనియర్ నాయకుడు.

ఆయన 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆసిఫ్‌నగర్ శాసనసభ స్థానం నుంచి గెలిచారు.

2004లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆసిఫ్‌నగర్ స్థానం నుంచి గెలిచారు. తర్వాత తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

2009లో ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్యల కేబినెట్లలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగారు.

2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోగా, తర్వాత బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచారు.

ఉప ఎన్నిక తప్పదా?

దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.

ఎలక్షన్ కమిషన్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తే, అక్కడ ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రెండు ఉప ఎన్నికలు జరిగాయి.

2023 శాసనసభ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి గెలిచిన లాస్య నందిత, జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆయా స్థానాల్లో గతంలో ఉప ఎన్నికలు జరిగాయి.

ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కంటోన్మెంట్ స్థానంలో శ్రీగణేశ్, జూబ్లీహిల్స్ నుంచి నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, ఎన్నికయ్యారు

కేటీఆర్, బీఆర్ఎస్

ఫొటో సోర్స్, Facebook/KTR

ఫొటో క్యాప్షన్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ ఏమంటోందంటే..

దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దుపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

''హైకోర్టుకు బీఆర్ఎస్ తరఫున ధన్యవాదాలు. రెండున్నరేళ్లుగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి దక్కిన విజయం ఇది. ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది'' అని చెప్పారు.

దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) ఎక్స్ వేదికగా స్పందించారు.

''సత్యమేవ జయతే. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుంది'' అని పోస్ట్ చేశారు.

తీర్పును స్వాగతిస్తున్నామన్న బీజేపీ

దానం నాగేందర్‌ అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతించింది.

''న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడింది. హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలి'' అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)