వచ్చే పదేళ్లలో మానవ జాతిని ఏఐ చంపేస్తుందా? 10 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉందంటున్న ఆంథ్రోపిక్ రీసెర్చర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ జెర్కెన్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన టాప్ సేఫ్టీ రీసెర్చర్ ఒకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మానవ జాతికి తీవ్రమైన ముప్పు కానుందంటూ హెచ్చరించారు.
ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే.. రానున్న దశాబ్ద కాలంలో అది మానవ జాతిని నిర్మూలించే అవకాశం పది శాతం కంటే ఎక్కువే ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఉన్న మోడళ్ల వల్ల ముప్పు తక్కువే అయినప్పటికీ ఈ సాంకేతికత త్వరలోనే తనను తాను మెరుగుపరుచుకునే స్థాయికి చేరి మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారే ప్రమాదం ఉందని తాను ఆందోళన చెందుతున్నానని ఇవాన్ హ్యూబింగర్ అనే ఆ సేఫ్టీ రీసెర్చర్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
ఏఐ వల్ల కలిగే నష్టాలను అంచనా వేసే ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఒకటైన యూకేకు చెందిన ఏఐ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ (ఏఐఎస్ఐ)కి ఆంథ్రోపిక్ తమ సరికొత్త మోడల్‌ను ఇవ్వకుండా నిలిపివేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ విషయమై స్పందన కోసం బీబీసీ ఆంథ్రోపిక్ సంస్థను సంప్రదించింది.

తాజా మోడల్‌ను ఏఐఎస్ఐకి ఇవ్వకుండా ఆపారా లేదా అనే విషయంలో క్యాబినెట్ కార్యాలయ ప్రతినిధి నేరుగా స్పందించలేదు. దానికి బదులుగా, మోడళ్లను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఆంథ్రోపిక్ సహా ఇతర ఇండస్ట్రీ పార్ట్‌నర్స్‌తో తాము నిరంతరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మెషిన్ లెర్నింగ్ ప్రొఫెసర్ అయిన నీల్ లారెన్స్ బీబీసీ రేడియో 4 టుడే కార్యక్రమంతో మాట్లాడుతూ.. ఈ నివేదిక నమ్మదగినదిగానే ఉందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అమెరికా తమకు, చైనాకు మధ్య జరుగుతున్న పోటీగా భావిస్తూ ఒంటరి విధానాల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. తమ మిత్రదేశాలతోనూ సహకారాన్ని తగ్గించుకోవాలని అక్కడి యంత్రాంగం భావిస్తుండడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆయన అన్నారు.
కోటికి పైగా వ్యూస్ ఉన్న తన పోస్ట్‌లో హ్యూబింగర్.. ఏఐ వల్ల మానవ జాతి మనుగడకే ముప్పు పొంచి ఉందనే విషయాన్ని తాము ఎంతగానో విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్‌ఇంటెలిజెన్స్ కోసం ఎటువంటి ప్రణాళికా లేదు
ఆంథ్రోపిక్ తన వంతుగా అత్యుత్తమ ప్రయత్నం చేస్తోందని తాను నమ్ముతున్నానని, అయినప్పటికీ సూపర్‌ఇంటెలిజెన్స్ అలైన్మెంట్ సమస్యను పరిష్కరించడానికి ఇంకా సరైన ప్రణాళిక లేదని, దాన్ని సాధించే దిశగా స్పష్టమైన పురోగతి కూడా కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సాంకేతికత వల్ల ఎదురయ్యే భద్రతా ముప్పుపై ఏఐ రంగానికి చెందిన అనేక మంది ఏళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. 2023లోనే ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్, ఆంథ్రోపిక్ అధినేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే, ఏఐని నియంత్రించడంలో సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయనే ఆధారాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో ఈ హెచ్చరికల తీవ్రత మరింత పెరిగింది.
గత వేసవిలో స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం ఉన్న ఏఐ ఏజెంట్లు సైబర్ దాడులకు పాల్పడిన ఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి.
తమ ఏఐ సాధనాలు సైబర్ దాడులకు పాల్పడిన విషయాన్ని ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, మెటా సంస్థలు వెల్లడించాయి.
అలాగే సెప్టెంబర్‌లో ఓపెన్ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకబ్ పచోకి మాట్లాడుతూ.. భవిష్యత్ నియంత్రణ మానవుల చేతుల్లోనే ఉండాలంటే మరింత జోక్యం అవసరం కావచ్చని, ఏఐ పురోగతి విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని హెచ్చరించారు.
ఆంథ్రోపిక్ ఉన్నతాధికారులు డారియో అమోడై, జారెడ్ కప్లాన్ సహా ఈ రంగంలోని ప్రముఖులు గత కొద్ది నెలలుగా ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏఐ సంస్థలకు చెందిన 1,300 మంది ఉద్యోగులు సంతకం చేసిన ఒక బహిరంగ లేఖలో, ఆటోమేటెడ్ ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా విధానాలను రూపొందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు అమెరికా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























