చైనా, తుర్కియే సాయంతో పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న కొత్త రక్షణ వ్యవస్థ భారత బ్రహ్మోస్‌ను ఎదుర్కోగలదా?

ఫొటో సోర్స్, DGPR_PAF
- రచయిత, మునజ్జా అన్వర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
డ్రోన్లు, యూఏవీ ఆయుధాల వాడకం పెరగడంతో ప్రపంచంలోని సైన్యాలకు గగనతల రక్షణ మరింత సవాల్‌గా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో తయారయ్యే చిన్న డ్రోన్లతో పెద్ద ఎత్తున జరిగే భారీ దాడులను ఎలా అడ్డుకోవాలన్నది కీలక ప్రశ్నగా మారింది.
ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక దళం తన స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను (షార్ట్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే షోరాడ్) బలోపేతం చేసుకోవడానికి చైనా, తుర్కియేల సాయం తీసుకుంటోంది.
క్షిపణులు, ఆటోమేటిక్ తుపాకులు, డ్రోన్లను ఎదుర్కునే టెక్నాలజీ ఇందులో ఉన్నాయి.
పాకిస్తాన్ వైమానిక దళం సెప్టెంబర్ 7న విడుదల చేసిన ఒక వీడియోలో మూడు రకాల వైమానిక రక్షణ వ్యవస్థలు కనిపిస్తున్నాయి.

- చైనాలో తయారైన హెచ్‌క్యూ-17ఏఈ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ.
- తుర్కియేకు చెందిన అసెల్సాన్ కొర్కుట్ 35 ఎంఎం ఆటోమేటిక్ గగనతల రక్షణ వ్యవస్థ.
- తుర్కియేకు చెందిన అసెల్సాన్ షాహిన్ 40 ఎంఎం యాంటీ డ్రోన్ సిస్టమ్.
ఈ వ్యవస్థలన్నీ కలిసి ఒక సమీకృత రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయి.
డ్రోన్లు, యూఏవీ ఆయుధాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలతో సహా వివిధ రకాల వైమానిక ముప్పుల నుంచి కీలకమైన సైనిక స్థావరాలను రక్షించడం దీని లక్ష్యం.

ఫొటో సోర్స్, DGPR_PAF
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ముప్పును ఎదుర్కోవడానికి ఒకే ఆయుధంపై ఆధారపడకుండా వేర్వేరు దూరాలలో వేర్వేరు రక్షణ వ్యవస్థలను ఉపయోగించడమే మూడు అంచెల స్వల్ప-శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలో ప్రధాన విషయం.
దీంతో వైమానిక దాడి లక్ష్యం తన లక్ష్యప్రాంతానికి చేరుకునేలోపే దాన్ని గుర్తించడం, వెంబడించడం, ధ్వంసం చేయడం వంటి అనేక అవకాశాలుంటాయి.
డ్రోన్లు, ఇతర తక్కువ ఎత్తులో వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కునేందుకు పాకిస్తాన్ వైమానిక దళం చైనాలో తయారైన హెచ్‌క్యూ-17ఏఈ క్షిపణి వ్యవస్థతో పాటు తుపాకుల ఆధారిత రక్షణ వ్యవస్థలను పలు అంచెలుగా ఏర్పాటు చేసే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
డ్రోన్లను ఎదుర్కునే ఈ రక్షణ వ్యవస్థలో తుపాకీ ఆధారిత రక్షణకు చెందిన మూడు వేర్వేరు అంచెలున్నాయి.
షాహిన్ 40ఎంఎం వ్యవస్థను సుమారు 700 మీటర్ల దూరం వరకు తక్కువ పరిధిలో చిన్న డ్రోన్లను ఎదుర్కొనేందుకు ఉపయోగించవచ్చు.
కొర్కుట్ 35 ఎంఎం వ్యవస్థ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రభావవంతమైన పరిధి ఉన్నది.
76 ఎంఎం ఎల్డీ-76 తుపాకీ ఆధారిత రక్షణ వ్యవస్థ సుమారు పది కిలోమీటర్ల పరిధితో మరో అదనపు బాహ్యరక్షణ అంచెను అందించగలదు.
పాకిస్తాన్ వైమానిక దళం విడుదల చేసిన వీడియోలో ఎల్డీ-76ను అధికారికంగా చూపించలేదని ఫారూక్ తెలిపారు. వైమానికదళం అధికారిక చిహ్నం ఉన్న ఫోటో ఒకటి కొన్ని వారాల కిందట బయటకు వచ్చిందని, అందులో పాకిస్తాన్, చైనా జెండాలతోపాటు ఎల్డీ-76 కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ఈ వ్యవస్థను పాకిస్తాన్ కొనుగోలుచేసే అవకాశముందని దీని ఆధారంగా ఆయన భావిస్తున్నారు.
ఈ తుపాకీ ఆధారిత రక్షణ వ్యవస్థలకు చైనాలో తయారైన హెచ్‌క్యూ-17A స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ అదనపు రక్షణను అందిస్తుంది.
ఈ వ్యవస్థ సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఎదుర్కోగలదు. తుపాకులతో అడ్డుకోలేని ఇతర వైమానిక ఆయుధాలపై కూడా దీనిని ఉపయోగించవచ్చు.
చైనాలో తయారైన హెచ్‌క్యూ-17ఏఈ
హెచ్‌క్యూ-17ఏఈ బాహ్యరక్షణను అందిస్తుంది.
ఇది చైనాలో తయారైంది. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ.
విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక లక్ష్యాలను ఎదుర్కొనేలా దీన్ని రూపొందించారు. దీనిని ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించి మోహరించవచ్చు.
ఈ రక్షణ వ్యవస్థలో హెచ్‌క్యూ-17ఏఈ కొంత ఎక్కువదూరంలో ఉన్న వైమానిక ముప్పులను లక్ష్యంగా చేసుకుని కీలక సైనిక స్థావరాలకు మొదటి రక్షణ అంచెగా పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Serhat Cagdas/Anadolu via Getty Images
తుర్కియేలో తయారైన కొర్కుట్
రెండో రక్షణ అంచెలో తుర్కియే కంపెనీ అసెల్సాన్ తయారు చేసిన కొర్కుట్లో 35ఎంఎం ఆటోమేటిక్ ఎయిర్ డిఫెన్స్ గన్ సిస్టమ్ ఉంటుంది.
చక్రాల బదులు ట్రాక్‌లపై నడిచే వాహనంలో ఏర్పాటుచేసిన ఈ వ్యవస్థలో రెండు 35 ఎంఎం ఆటోమేటిక్ తుపాకులుంటాయి.
గాల్లో పేలేలా ప్రోగ్రామ్ చేయగల మందుగుండు సామగ్రిని కొర్కుట్లో ఉపయోగిస్తారు. ఇవి గాలిలో పేలిపోయినప్పుడు అనేక చిన్న ముక్కలుగా విడిపోయి లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇది డ్రోన్లు, హోవర్‌క్రాఫ్ట్‌లు, తక్కువ ఎత్తులో ఎగిరే ఇతర లక్ష్యాలను ఛేదించగలదు.
భారీ స్థాయి డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ ప్రత్యేకంగా సమర్థవంతమైనదిగా పరిగణిస్తారు.
తక్కువ ఖర్చుతో కూడిన వైమానిక ముప్పులపై ఖరీదైన క్షిపణులను ఉపయోగించడం కంటే ఇది మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Serhat Cagdas/Anadolu via Getty Images
చివరి రక్షణ అంచె తుర్కియేలో తయారైన షాహిన్
అత్యంత లోపలి రక్షణ అంచెలో 40 ఎంఎం కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ఉంటుంది.
చిన్న, అతి చిన్న మానవరహిత వైమానిక వాహనాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.
షాహిన్ వ్యవస్థలో రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సర్లు, ఆటోమేటిక్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నాయి. ఇది లక్ష్యాన్ని చేరగానే గాలిలోనే పేలిపోయే 40-ఎంఎం ఎయిర్‌బరస్ట్ గ్రెనేడ్లను ఉపయోగిస్తుంది.
కీలక ప్రదేశాల చుట్టూ చివరి రక్షణ శ్రేణిగా పనిచేస్తూ, మొదటి రెండు రక్షణ అంచెలను దాటుకుని వచ్చిన చిన్న వైమానిక ముప్పులను అడ్డుకోవడం ఈ వ్యవస్థ లక్ష్యం.
మారుతున్న పాకిస్తాన్ వైమానిక దళం వ్యూహం
పాకిస్తాన్ వైమానిక దళం 2025 వరకు గగనతల రక్షణ కోసం యుద్ధవిమానాలు, ఇతర వైమానిక సామర్థ్యాలపైనే ఆధారపడిందని రక్షణ విశ్లేషకులు ఫారుక్ చౌధరి తెలిపారు.
డ్రోన్లు, ఇతర వైమానిక ఆయుధాల నుంచి పెరుగుతున్న ముప్పు కారణంగా తన వ్యూహాన్ని మార్చుకుని భూ-ఆధారిత వైమానిక రక్షణపై భారీగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు.
పాకిస్తాన్ వైమానిక దళం ఇటీవల ప్రదర్శించిన మూడు అతి తక్కువ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలు (షోరాడ్) వ్యవస్థలు సమగ్ర వ్యూహంలో భాగమని ఆయన అన్నారు.
ఈ వ్యూహంలో భాగంగా డ్రోన్లను ఎదుర్కొనేందుకు స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టడానికి పాకిస్తాన్ వైమానిక దళం ప్రాధాన్యత ఇస్తోంది.
మే 2025 తర్వాత ఒక సంవత్సరంలోపే పాకిస్తాన్ వైమానిక దళం ఈ వ్యవస్థలను తన రక్షణ వ్యవస్థలో చేర్చుకోవడం గమనించదగ్గ విషయం.

ఫొటో సోర్స్, DGPR_PAF
డ్రోన్లను ఎదుర్కొనేందుకు బహుళ-అంచెల రక్షణ వ్యవస్థ
భారత్, అఫ్గానిస్తాన్‌లతో పాకిస్తాన్‌కు ఇటీవల జరిగిన సంఘర్షణల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని పాకిస్తాన్ రక్షణ విశ్లేషకులు తెలిపారు.
ఈ ఘర్షణల్లో డ్రోన్లు, యూఏవీ ఆయుధాల వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ గగనతలరక్షణ వ్యవస్థల్లోని లోపాలు బయటపడ్డాయి. వాటికి కొత్త సవాళ్లు ఎదురయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలు ఇప్పుడు వైమానిక ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోగల బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటుచేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
దూసుకొచ్చే ప్రతి డ్రోన్ లేదా వైమానిక ముప్పుపై ఖరీదైన క్షిపణులను ఉపయోగించడానికి బదులుగా, బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు క్షిపణులు, వైమానిక రక్షణ తుపాకులు, డ్రోన్ నిరోధక వ్యవస్థలను కలిపి ఉపయోగిస్తాయి.
ముప్పు స్వభావం, దూరం, పరిమాణాన్ని బట్టి క్షిపణులు, ఆటోమేటిక్ తుపాకులు లేదా కౌంటర్ -డ్రోన్ వ్యవస్థల్లో ఏది ఉపయోగించాలో ఈ వ్యూహం ద్వారా నిర్ణయించవచ్చు. దీంతో రక్షణ వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ఫొటో సోర్స్, DGPR_PAF
చైనా క్షిపణులు-తుర్కియే తుపాకులు
తుర్కియేలో తయారైన తుపాకీ సాంకేతికతను చైనా క్షిపణి వ్యవస్థలతో కలిపి ఒక సమీకృత స్థావర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ వైమానిక దళం భావిస్తోందని ఫారూక్ చౌధరి తెలిపారు. దీనిని సీఐడబ్ల్యూఎస్(క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్)అని పిలుస్తారు.
ఈ విధానంలో డ్రోన్ల నుంచి తక్కువ ఎత్తులో వచ్చే క్రూయిజ్ క్షిపణులు, సుదూర బాంబుల వరకు వివిధ రకాల వైమానిక ఆయుధాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పాకిస్తాన్ వైమానిక దళం పొందాలని కోరుకుంటోందని ఆయన చెప్పారు.
చైనా, తుర్కియేలతో పాకిస్తాన్‌కు పెరుగుతున్న రక్షణ సంబంధాలకు కూడా ఇది ఒక నిదర్శనం.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని రకాల వైమానిక ముప్పులను ఎదుర్కోడానికి ఇవి సరిపోతాయా?
ఈ వ్యవస్థలు ప్రధానంగా స్వల్ప-శ్రేణి, తక్కువ ఎత్తులో వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి రూపొందాయి కాబట్టి వీటిని పాకిస్తాన్‌కు పూర్తిస్థాయి గగనతల రక్షణ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.
భారత్‌కు చెందిన బ్రహ్మోస్ వంటి అత్యంత వేగంగా ప్రయాణించే క్రూయిజ్ క్షిపణుల నుంచి ఈ వ్యవస్థలు రక్షణ కల్పించలేవు. ఇలాంటి ముప్పులను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ వైమానిక దళం బహుశా ఇతర రక్షణ సామర్థ్యాలపై ఆధారపడాల్సిఉంటుంది.
పాకిస్తాన్ వైమానిక దళం తన సమీకృత రక్షణ వ్యవస్థలో స్వల్ప-శ్రేణి క్షిపణులు, ఆటోమేటిక్ ఫిరంగులు, డ్రోన్ నిరోధక సాంకేతికతను చేర్చడం వైమానిక రక్షణ ప్రాధాన్యతలను డ్రోన్లు ఎంతగా మార్చాయో తెలియజేస్తోంది.
ఇప్పుడున్న సవాలు కేవలం వేగంగా దూసుకెళ్లే యుద్ధ విమానాలను లేదా క్రూయిజ్ క్షిపణులను అడ్డుకోవడమే కాదు. తక్కువ ఖర్చుతో తయారై పెద్ద సంఖ్యలో ఉపయోగించగల చిన్న డ్రోన్లను ఎదుర్కోవడం కూడా.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























