‘బ్లాక్ విలేజ్’: నేపాల్ వరదలకు ఈ గ్రామంలోకి చుక్క నీరు రాలేదు.. కానీ ఈ ఊరికి చెందిన 29 మంది గల్లంతయ్యారు

క్యాబేజీ పంట

ఫొటో సోర్స్, Nima Norbu Tamang

ఫొటో క్యాప్షన్, గట్లాంగ్ గ్రామంలో క్యాబేజీ పంట
    • రచయిత, ఘని అన్సారీ
    • హోదా, బీబీసీ న్యూస్ నేపాలీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

భోటేకోషి-త్రిశూలి ప్రాంతంలో తీవ్రమైన ఆకస్మిక వరదల వల్ల రసువాకు చెందిన ఓ గ్రామం తీవ్రంగా దెబ్బతింది.

ఒకవైపు, ఆ భయంకరమైన వరదలో తమ పంటలు, బంధువులు సహా సర్వస్వం కోల్పోయిన వారు కొందరైతే.. మరోవైపు, పంటలకు ఏమీ కాకపోయినా వరదలో తమ ఆప్తులను కోల్పోయిన వారు మరి కొందరు.

రసువాలోని అమచోడింగ్మో రూరల్ మున్సిపాలిటీ-3లోని గట్లాంగ్ గ్రామాన్ని స్థానిక ప్రజలు 'బ్లాక్ విలేజ్' అని పిలుస్తారు. వరదల కారణంగా ఈ గ్రామంలో కనీసం 29 మంది గల్లంతయ్యారని స్థానిక ప్రజా ప్రతినిధులు తెలిపారు.

వరద నీరు గ్రామానికి చేరకపోయినప్పటికీ, చాలా మంది నివాసితులు వరద నీటిలో చిక్కుకున్నారు. వీరు గ్రామానికి సమీపంలో ఉన్న మార్కెట్‌లో పని చేయడానికి వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు.

గట్లాంగ్ గ్రామానికి చెందిన కంటైనర్ డ్రైవర్లు, రసువా-టిబెట్ సరిహద్దులోని దుకాణదారులు, సరఫరాదారులు ఆ ఆకస్మిక వరదలో ప్రాణాలు కోల్పోయారని స్థానిక ప్రతినిధులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'ఒకవేళ ఆ రోడ్డు నిర్మించకపోతే.. '

ఈ గ్రామంలో తమాంగ్ వర్గానికి చెందిన వారు నివసిస్తున్నారు. వరదల్లో ఆప్తులను కోల్పోవడమే కాకుండా, ఈ గ్రామం ఇప్పుడు మరో ఆందోళనను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఆ గ్రామ రోడ్డు తెగిపోయింది.

రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తమ పొలాల్లో పండించిన లక్షల రూపాయల విలువ చేసే క్యాబేజీ అమ్ముడుపోకుండా కుళ్లిపోతే, తమ జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

గట్లాంగ్‌కు చెందిన 40 ఏళ్ల ఫుర్పు వాంగ్మో తమాంగ్, ఈ ఆకస్మిక భారీ వరదలు సంభవించిన కొన్ని రోజుల తర్వాత శనివారం తన పొలానికి చేరుకున్నారు. వెంటనే ఆమె తన పొలాన్ని శుభ్రం చేయడం ప్రారంభించారు.

"రాబోయే 15-20 రోజుల్లో క్యాబేజీ పంట కోతకు వస్తుంది. కానీ, ఇంకా రోడ్డు నిర్మించలేదు. అంతా కుళ్లిపోతుందేమోనని భయంగా ఉంది" అని ఫుర్పు వాంగ్మో తమాంగ్ బీబీసీ న్యూస్ నేపాలీకి తెలిపారు.

''అప్పటిలోగా రోడ్డు నిర్మించకపోతే పంట పాడైపోతుంది. క్యాబేజీ అమ్మి ఆహారం కొనుగోలు చేసుకునే రైతులు ఇబ్బందుల్లో పడతారు. క్యాబేజీ అమ్ముడుపోకపోతే, ఈ ప్రాంతంలో ఆహార కొరత ఏర్పడుతుంది'' అని చెప్పారు.

రైతులు బియ్యం, ఉప్పులు, నూనెలు కొనాలంటే క్యాబేజీ అమ్ముకోవాల్సిందేనని తెలిపారు. అప్పుడే తమ పిల్లల్ని చదివించగలమని అన్నారు.

"వాళ్లు ఏం తింటారు, తమ పిల్లలకు ఎలా చదువు చెప్పిస్తారు? నాకు చాలా ఆందోళనగా ఉంది" అని తెలిపారు.

"పోయినేడాది మేం 2 లక్షల రూపాయల విలువైన క్యాబేజీని అమ్మాం. గత సంవత్సరం కంటే ఎక్కువ క్యాబేజీని ఈ ఏడాది పండించాం" అని ఫుర్పు చెప్పారు.

ఫుర్పు భర్త నీమా నోర్బు తమాంగ్, స్థానిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ఖాళీ సమయంలో ఆయన తన భార్యకు వ్యవసాయ పనులలో సహాయం చేస్తారు.

క్యాబేజీ పంట

ఫొటో సోర్స్, Nima Norbu Tamang

ఫొటో క్యాప్షన్, వచ్చే 15 నుంచి 20 రోజుల్లో ఫుర్పు తమాంగ్ పంట కోతకు వస్తుంది.

ఫుర్పు, నీమా గత ఐదేళ్లుగా క్యాబేజీని పండిస్తున్నారు. ఆ కుటుంబం గత మూడేళ్లుగా ఉత్పత్తిని పెంచింది.

''గతేడాది అమ్మకాలు బాగున్నాయి. అందుకే, ఈ ఏడాది ఇతర రైతులు కూడా క్యాబేజీని ఎక్కువగా పండించారు. కానీ, ఈసారి ఈ విపత్తు సంభవించింది. ఒకవేళ అమ్మకాలు లేకపోతే, మేం పశువులకు మేత కూడా వేయలేం'' అని నీమా చెప్పారు.

గత కొన్నేళ్లుగా గట్లాంగ్ ప్రజలు ప్రతి ఏడాది కోట్ల రూపాయలకు పైగా విలువైన క్యాబేజీని అమ్ముతున్నారని నీమా తెలిపారు.

ఈసారి గ్రామ రైతులు మునుపెన్నడూ లేనంత ఎక్కువగా క్యాబేజీని పండించారు.

రైతులు మంచి ఆదాయం వస్తుందనే ఆశతో ఇతర పంటలు వేయకుండా క్యాబేజీ పండించారని నీమా చెప్పారు.

కానీ ఆ వరదలు గ్రామాన్ని ప్రపంచం నుంచి పూర్తిగా వేరు చేస్తాయని వారికి అస్సలు తెలియదు. గ్రామంలోని రహదారి వ్యవస్థ పూర్తిగా కొట్టుకుపోయింది.

"కొంతమంది రైతులు తమ బంధువులను కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వారు నాటిన పంటలు కుళ్లిపోతాయేమోనని కూడా భయపడుతున్నారు" అని నీమా అన్నారు.

క్యాబేజీ పంట

ఫొటో సోర్స్, Nima Norbu Tamang

'గ్రామమంతా ఆందోళనలో..'

గట్లాంగ్‌కు చెందిన 31 ఏళ్ల టెన్పి నిమా తమాంగ్, తన బంధువులతో సహా మరో ఆరుగురితో కలిసి ఈ ఏడాది ఎక్కువ ఎకరాల్లో క్యాబేజీని సాగు చేశారు.

గత ఏడాదితో పోలిస్తే గ్రామం మొత్తం మీద ఎక్కువ క్యాబేజీ పండిందని, దీనిని అమ్మగలిగితే ఈ ఏడాది మంచి ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.

"ఈ సీజన్‌లో గ్రామం మొత్తం 8 నుంచి 9 కోట్ల రూపాయల విలువైన క్యాబేజీని పండించింది. మాకు మంచి ధర లభిస్తే, మేం సుమారు 3 కోట్ల రూపాయలు సంపాదిస్తాం" అని టెన్పి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, రోడ్డు గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు.

"ప్రధాన ఆందోళన రోడ్డు గురించే. పసాంగ్ లాము హైవే దెబ్బతినడంతో, మా ప్రజలు కాఠ్‌మాండూ, పోఖరా, హెటౌడా, బిర్‌గంజ్, భైరహవా, బుట్వాల్, ఇతర ప్రాంతాలకు ఎలా ప్రయాణిస్తారు?" అని ఆయన అన్నారు.

ఒకవేళ వారు పండించిన క్యాబేజీ అమ్ముడుపోకపోతే, మరింత ఆందోళన చెందాల్సి ఉంటుంది. వారు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

"క్యాబేజీగా అమ్మితే వచ్చే డబ్బుతోనే మేం బియ్యం కొంటాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కడతాం. వాళ్లకు చికిత్స చేయిస్తాం. ఆ డబ్బు రాకపోతే మేమేం చేస్తాం? ఊరంతా చాలా ఆందోళనగా ఉంది" అని తెలిపారు.

అమచోడింగ్మో రూరల్ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ చందికా తమాంగ్ మాట్లాడుతూ... గ్రామస్తుల సమస్యల పట్ల తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు.

''రోడ్డు నిర్మించకపోతే, రైతుల పంటలు నాశనమవుతాయి. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుంది'' అని బీబీసీ న్యూస్‌తో అన్నారు.

రసువాలోని స్యాఫ్రుబేసిని సానో భర్ఖుతో కలిపే రోడ్డు పూర్తిగా అదృశ్యమైందని ఆయన అన్నారు.

"మనం వెంటనే బెయిలీ వంతెన నిర్మిస్తే, ఆ నష్టాన్ని భరించాల్సిన అవసరం ఉండదు. లేకపోతే, మనం భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది" అని చందికా చెప్పారు.

క్యాబేజీ పంట

ఫొటో సోర్స్, Tenpi Nhima Tamang

గట్లాంగ్‌లోనే కాకుండా.. అమచోడింగ్మో రూరల్ మున్సిపాలిటీలోని ఇతర వార్డుల రైతులు కూడా పెద్ద మొత్తంలో క్యాబేజీని పండిస్తున్నారు.

"నేను కచ్చితమైన ప్రాంతాన్ని చెప్పలేను. కానీ, ఈ సీజన్‌లో క్యాబేజీ సాగు చాలా ఎక్కువగా జరిగింది" అని తెలిపారు.

నేపాల్-చైనా సరిహద్దు వెంబడి సంభవించిన భారీ ఆకస్మిక వరదల వల్ల రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

రసువా నుంచి నువాకోట్, ధాడింగ్ వరకు ఉన్న జిల్లాల్లో జరిగిన నష్టం తీవ్రతను బట్టి చూస్తే, నేపాల్ పునర్నిర్మాణానికి చాలా కాలం పట్టవచ్చని నిపుణులు అంటున్నారు.

ఫుర్పు, టెన్పి, నీమా వంటి రైతులు తమ ఆశను వదులుకోలేదు. వారు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టిన పంటను అమ్ముకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అది నిజంగా వారికి జీవనాధారానికి సంబంధించిన విషయం.

తన గ్రామం నుంచి త్వరలోనే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుందని నీమా ఆశిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)