కాపీరైట్ పేరుతో బ్లాక్ మెయిల్: ఇన్‌స్టా క్రియేటర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న స్కామర్లు

సైబర్​ మోసం, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లపై కాపీరైట్ స్ట్రైక్స్, నకిలీ కాపీరైట్స్​, మెటా

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఇమ్రాన్ రెహ్మాన్ జోన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తప్పుడు కాపీరైట్ దావాల వల్ల తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు రద్దవడమే కాకుండా, లక్షల రూపాయల ఆదాయం కూడా కోల్పోయామని పలువురు కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు.

మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో.. కొందరు మోసగాళ్లు ఇతరుల పోస్టులపై కావాలనే తప్పుడు కాపీరైట్ ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. పదేపదే ఇలాంటి ఫిర్యాదులు వస్తే తమ ఖాతాలు శాశ్వతంగా బ్లాక్ అవుతాయనే భయంతో యూజర్లు వాళ్లు అడిగినంత ఇచ్చుకుంటున్నారు.

15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్, తన ఖాతాను కాపాడుకోవడానికి ఒక మోసగాడికి 50 డాలర్లు (రూ. 4700) చెల్లించినట్లు బీబీసీకి తెలిపారు. మెటా అప్పీల్ ప్రక్రియకు వారాల సమయం పడుతుందని, ఆ ప్రాసెస్‌లో వెళ్తే తనకు గతంలో వేల రూపాయల ఆదాయం పోయిందని ఆయన అన్నారు.

"ఈ పరిస్థితి బాధితులకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు అర్థమవుతోంది, ఇలాంటివి జరగకుండా నిరోధించేలానే మా వ్యవస్థలను తీర్చిదిద్దాం" అని మెటా ప్రతినిధి వివరించారు.

"మా విచారణ తర్వాత, సదరు కంటెంట్‌ను మళ్లీ యథాస్థితికి తెచ్చాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఖాతాలకు అదనపు భద్రతను కూడా కల్పించాం" అని తెలిపారు.

కానీ, ఏది నిజమైన ఫిర్యాదో, ఏది నకిలీదో గుర్తించడంలో మెటా పనితీరు పేలవంగా ఉందని క్రియేటర్లు అంటున్నారు. నెలవారీ ఫీజు చెల్లించే క్రియేటర్ల అప్పీళ్లకు తప్ప, సాధారణ యూజర్ల ఫిర్యాదులకు సంస్థ త్వరగా స్పందించడం లేదని వారు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'స్పష్టంగా నకిలీ కాపీరైట్స్​'

'లాస్ట్ ఇన్ టైమ్ హిస్టరీ' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పాత చారిత్రక చిత్రాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి 15 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిని నడిపే ఓలి ( పూర్తి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు), తాను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న చిత్రాలను లేదా హక్కుదారుల అనుమతి ఉన్నవాటినే పోస్ట్ చేస్తున్నట్లు బీబీసీకి చెప్పారు.

అయినా సరే, ఈ ఏడాదిలో అతనికి ఇప్పటివరకు డజన్ల కొద్దీ "స్పష్టంగా నకిలీ" కాపీరైట్ ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు వచ్చిన వెంటనే మెటా వాటి వాస్తవాన్ని చెక్ చేయదు. కాబట్టి ఎవరి ఖాతాపైనైనా ఇలా వరుసగా ఫిర్యాదులు వస్తే వాళ్ల అకౌంట్ తాత్కాలికంగా ఆగిపోతుంది.

ఒకే ఈమెయిల్ ఐడీ నుంచి ఒకేసారి తన పలు పోస్టులపై కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయని ఓలి చెప్పారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి, టెలిగ్రామ్ లాంటి ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌లోకి రమ్మని మెసేజ్ చేస్తాడు.

"వాళ్లు కొంత డబ్బు డిమాండ్ చేస్తారు" అని ఓలి తెలిపారు.

ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటే సాధారణంగా కొన్ని వందల డాలర్లు అడుగుతారని చెప్పారు. డబ్బు అడగడం లేదా భవిష్యత్తులో మరిన్ని కాపీరైట్ ఫిర్యాదులు చేస్తామని బెదిరించడం లాంటి మెసేజ్‌లను బీబీసీ కూడా పరిశీలించింది.

ఇన్‌స్టాగ్రామ్ తాత్కాలికంగా ఆపేసిన తన అకౌంట్‌ను తిరిగి తెచ్చుకోవడానికి ఓలి చివరికి ఒక మోసగాడికి క్రిప్టోకరెన్సీ రూపంలో 50 డాలర్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇలా డబ్బులు ఇస్తే నేరగాళ్లను ప్రోత్సహించినట్లే అవుతుందని, కాబట్టి డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు బాధితులకు సూచిస్తున్నారు.

మెటాను సంప్రదించి ఖాతాను వెనక్కి తెచ్చుకోవాలంటే వారాల కొద్దీ సమయం పడుతుంది కాబట్టి, వేగంగా పనైపోతుందనే ఉద్దేశంతోనే తాను "చివరి ప్రయత్నంగా" డబ్బు కట్టానని ఓలి అన్నారు. కానీ డబ్బు ఇచ్చిన వెంటనే మళ్లీ అతనికి కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి.

"అదే అత్యంత బాధాకరమైన విషయం" అన్నారు ఓలి.

"మనల్ని అంతలా టార్చర్ చేసినవాళ్లకే డబ్బులు సమర్పించుకోవడం, ఆ వెంటనే మళ్లీ వాళ్లు అదే పని చేయడం మనకు ఎంతో నరకంగా అనిపిస్తుంది" అన్నారు.

కాపీరైట్ దావాలు ఎక్కువగా రావడంతో ఓలి ఖాతాకు మానిటైజేషన్ ఆగిపోయింది. అంటే, అతని పోస్టులు ఎంత వైరల్ అయినా ఇన్‌స్టాగ్రామ్ నుంచి అతనికి నయాపైసా రాదు.

"ఇది వేధింపులా కాదా అని తెలుసుకోవడానికి లేదా అసలు ఏం జరుగుతుందో కనిపెట్టడానికి (మెటా నుంచి) వ్యవస్థలో కనీస విచారణ కూడా జరగడం లేదు" అని ఓలి అన్నారు.

చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు కూడా ఇలాంటి అనుభవాలనే పంచుకున్నారు.

"క్రియేటర్ల కోసమే తాము ఉన్నామని మెటా పైకి చెబుతున్నప్పటికీ, ఈ ప్రాసెస్‌లో వాళ్లు కనీస సాయం కూడా చేయలేదు. పైగా కస్టమర్ సపోర్ట్ కోసం డబ్బులు కట్టమంటారు" అని 'మోర్బిడ్ క్యూరియాసిటీ' పేజీని రన్ చేస్తున్న అభిన్ టామ్ సెబాస్టియన్ అన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 'బ్లూ టిక్' (వెరిఫైడ్) కావడానికి మెటా నెలవారీ ఫీజు వసూలు చేస్తుంది, దీనివల్ల లైవ్ చాట్ ద్వారా 24 గంటలూ కస్టమర్ సపోర్ట్ దొరుకుతుంది.

"నాకు రావాల్సిన అత్యంత కీలకమైన బ్రాండ్ కాంట్రాక్ట్‌లు వేరే క్రియేటర్ చేతికి వెళ్లిపోవడంతో నేను కోలుకోలేని దెబ్బ తిన్నాను. ఇలాంటివి మళ్లీ జరగవని చెప్పి మెటా నుంచి నాకు ఎలాంటి భరోసా గానీ సపోర్ట్ గానీ దొరకలేదు" అని సెబాస్టియన్ అన్నారు.

కాగా, అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వాళ్లు నియమించుకున్న ప్రతినిధులు మాత్రమే కాపీరైట్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయగలరని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. బాధితులు నేరుగా ఆ హక్కుదారులనే సంప్రదించాలని సూచిస్తోంది. ఓలి, సెబాస్టియన్ లాంటి వారి ఉదాహరణలతో బీబీసీ మెటాను సంప్రదించిన తర్వాత, వారి ఖాతాలకు అదనపు భద్రత కల్పించామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని మెటా తెలిపింది. యూజర్లను, వ్యాపారాలను మోసం చేసే వారిపై దృష్టి పెడతామని పేర్కొంది.

సైబర్​ మోసం, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లపై కాపీరైట్ స్ట్రైక్స్, నకిలీ కాపీరైట్స్​, మెటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దోపిడీదారులను సంప్రదిస్తే ఏమన్నారంటే..

అసలు కాపీరైట్ హక్కులు లేకపోయినా, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లపై కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తున్న ముగ్గురితో బీబీసీ మాట్లాడింది. ఈ ముగ్గురూ ఇండియాలో లేదా చుట్టుపక్కల దేశాల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

తాము అకౌంట్లను బ్లాక్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నామనే వాదనను వారు తిరస్కరించారు. తాము అసలైన కాపీరైట్ ఓనర్ల తరపునే చట్టబద్ధంగా ఫిర్యాదులు చేస్తున్నామని చెప్పారు.

కానీ ఒక స్ట్రైక్‌ను వెనక్కి తీసుకోవడానికి 900 డాలర్లు (రూ. 85,000) అడిగిన ఆధారాలను బీబీసీ పరిశీలించింది. ఇది తమ సర్వీస్‌కు తీసుకుంటున్న ఫీజు అని వారు సమర్థించుకున్నారు, ఆ డబ్బులన్నీ తామే ఉంచుకున్నామని కూడా ఒప్పుకున్నారు. మిగిలిన ఇద్దరు మాత్రం తాము అసలు డబ్బే తీసుకోలేదని చెప్పారు.

తమకు కొన్ని అకౌంట్లను పంపి వాటిపై ఫిర్యాదు చేయమని అడుగుతారని ఒకరు చెప్పారు.

"వాళ్లు వేరే వాళ్ల కంటెంట్‌ను వాడుతున్నారని నేను గుర్తిస్తే, అందరి మంచి కోసం నేను కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తాను" అని వారు అన్నారు.

ఖాతా యజమాని లేదా వేరే ప్రతినిధి ద్వారా తమకు ఫిర్యాదు చేయాల్సిన అకౌంట్లు లేదా పోస్ట్‌ల లింకులు వస్తాయని మరొకరు చెప్పారు.

అయితే, క్లయింట్ల తరపున కాపీరైట్ స్ట్రైక్స్ వేయడానికి డబ్బులు తీసుకునే చట్టబద్ధమైన ఏజెన్సీలు నిజంగానే ఉన్నాయి.

పెరుగుతున్న సైబర్ మోసాలు

ఇలాంటి కాపీరైట్ మోసాలు కొత్తేమీ కాదని, ఇంటర్నెట్ పుట్టిన కొత్తలోనూ ఇలాంటివి ఉండేవని ససెక్స్ యూనివర్సిటీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా రీడర్, డిజిటల్ కాపీరైట్ నిపుణుడు ఆండ్రెస్ గ్వాడముజ్ తెలిపారు.

ఆన్‌లైన్‌లో వాడిన ఫోటోల కాపీరైట్ తమదేనని, చట్టపరమైన చర్య తీసుకోకూడదంటే డబ్బులు ఇవ్వాలంటూ అప్పట్లో వెబ్‌సైట్ యజమానులకు మెయిల్స్ లేదా లెటర్స్ పంపేవాళ్లు. యూట్యూబ్ యూజర్లపైనా ఇలాంటి స్ట్రైక్స్ ప్రయోగించారు.

కానీ ఈ మధ్య కాలంలో ఈ మోసాలు పెరగడానికి కృత్రిమ మేధస్సు కారణం కావొచ్చని, ఏఐతో వీటిని సులభంగా పెద్ద ఎత్తున చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఇదంతా కేవలం నంబర్స్ గేమ్" అని గ్వాడముజ్ బీబీసీకి చెప్పారు.

"ఇప్పుడు ఎవరైనా సరే ఏఐని వాడి ఈ ప్రాసెస్‌ను ఈజీగా ఆటోమేట్ చేయగలరు" అన్నారు.

కోట్ల కొద్దీ యూజర్లు ఉన్న ప్లాట్‌ఫారమ్‌లకు ఈ రాకెట్‌ను అడ్డుకోవడం, ఏది నిజమైన ఫిర్యాదో ఏది నకిలీదో గుర్తించడం సంస్థలకు కష్టంగా మారింది.

" కాపీరైట్ స్ట్రైక్ క్లెయిమ్ చేసే వ్యక్తి చట్టబద్ధమైనవాడే అనే అంచనాతోనే ఈ వ్యవస్థను డిజైన్ చేశారు" అని గ్వాడముజ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)