ఆన్ ఫ్రాంక్: 13 ఏళ్ల వయసులో ఈ అమ్మాయి రాసిన డైరీ అహ్మదాబాద్‌లో ఎందుకు వివాదాస్పదమైంది?

ఫొటో సోర్స్, Alamy
ఇటీవల అహ్మదాబాద్‌లోని ఆనంద్ నికేతన్ పాఠశాలలో ఆహారంలో 'గాజు ముక్కలు' కలిసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ పాఠశాలలో మలాలా యూసఫ్‌జాయ్, ఆన్ ఫ్రాంక్ పుస్తకాలను బోధించడంపై కొందరు తల్లిదండ్రులు, సంస్థల నుంచి నిరసన వ్యక్తమైంది.
ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో కొందరు వ్యక్తులు వస్త్రాపూర్‌లోని ఒక పార్కులో 'ఐ యామ్ మలాలా', ఆన్ ఫ్రాంక్ డైరీ పుస్తకాలను చదివించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ బజరంగ్‌దళ్‌కు ఆందోళన నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పుస్తకాలను గుజరాత్‌లో చదవడానికి అనుమతించకూడదని బజరంగ్ దళ్ కార్యకర్తలు వాదించారు. ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది.
ఈ ఘటనల తర్వాత 'ఐ యామ్ మలాలా', ఆన్ ఫ్రాంక్ డైరీ అనే పుస్తకాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆన్ ఫ్రాంక్ డైరీలో అసలు ఏముంది? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆన్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మొదట తన కూతురు డైరీని ప్రచురించడానికి ఇష్టపడలేదు. ఆమె రాసిన డైరీలోని విషయాలను చదవడానికి ఆయన భయపడ్డారు.
‘ఆన్ ఫ్రాంక్ డైరీ’ 1947 జూన్ 25న తొలిసారి ప్రచురితమైంది. ఆ తరువాత అది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా నిలిచింది.
కూతురు డైరీని ప్రచురించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో వివరించడానికి ఒట్టో ఫ్రాంక్ 1976లో బీబీసీ 'బ్లూ పీటర్' స్టూడియోకు వచ్చారు.

"నిజానికి ఆమె ఏంటో డైరీ ద్వారానే తెలుసుకున్నాను" అని ఒట్టో అన్నారు. తన కూతురు స్వయంగా రాసిన రచనలను స్టూడియలో చూపించారు.
ఒట్టో ఫ్రాంక్ తన కూతురు ఆన్‌కు ఆమె 13వ పుట్టిన రోజు సందర్భంగా ఒక ఆటోగ్రాఫ్ బుక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆమె దాన్ని రోజువారీగా తనకు ఎదురైన అనుభవాలను, భావాలను రాసుకునేందుకు డైరీలాగా ఉపయోగించారు.
జీవితంలో జరుగుతున్న ఘటనలను ఓ స్నేహితురాలితో మాట్లాడుతున్నట్లుగా... ఆమె అందులో రాసుకుంటూ వచ్చారు.
‘‘నేను ఇప్పటివరకు ఎవరినీ నమ్మలేదు. కానీ నిన్ను పూర్తిగా నమ్ముతున్నా. నువ్వు నాకు అండగా, నా రహస్యాలను పంచుకునే స్నేహితురాలిగా ఉంటావని కోరుకుంటున్నా" అని తొలిపేజీలో రాసినట్లు ఒట్టో ఫ్రాంక్ ఆ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్ ఫ్రాంక్ డైరీలో ఏముంది?
జర్మనీ ఎన్నికల్లో నాజీ పార్టీ విజయం సాధించి, అడాల్ఫ్ హిట్లర్ చాన్సలర్‌గా నియమితులైన తరువాత, ఒట్టో 1933లో తన కుటుంబంతో కలిసి ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు పారిపోయారు. అప్పటికి ఆన్‌కు మూడేళ్లు.
ఆమ్‌స్టర్‌డామ్‌లో తమకు లభించిన భద్రత, నాజీల భయంతో పోలిస్తే ఒట్టో కుటుంబానికి తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే నిలిచింది.
1940లో అధికారం చేపట్టిన హిట్లర్, తనను తాను సర్వోన్నత నాయకుడిగా ప్రకటించుకున్న తరువాత నెదర్లాండ్స్‌పై కూడా దాడి చేశాడు.
ఈ ఆక్రమణతో అనేక యూదు వ్యతిరేక చర్యలు అమల్లోకి వచ్చాయి. యూదులను వ్యాపారాలు చేయకుండా నిషేధించారు. గుర్తింపు కోసం వారు పసుపు రంగు నక్షత్రాలను ధరించాల్సి వచ్చింది. రాత్రివేళ బయటకు రావడంపై ఆంక్షలు విధించారు.
చాలా మంది యూదుల మాదిరిగానే ఒట్టో కూడా 1938 నుంచి అమెరికాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అప్పట్లో ఆశ్రయం కల్పించే విధానం లేకపోవడంతోపాటు వీసా పొందే ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉండేది.
నాజీలు జర్మనీ ఆక్రమించిన అన్ని ప్రాంతాల్లోని అమెరికా కాన్సులర్ కార్యాలయాలను మూసివేశారు. దానికంటే ముందే అమెరికా వెళ్లిపోవాలన్న వారి ప్రయత్నాలు ఫలించలేదు.
1942లో, ఆన్ పుట్టినరోజుకు కేవలం ఒక నెల ముందు, ఒట్టో పెద్ద కూతురు మార్గోకు జర్మన్ కార్మిక శిబిరానికి రావాలంటూ పిలుపు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఒట్టో కుటుంబం మొత్తం ఆమ్‌స్టర్‌డామ్‌లో తమ కుటుంబం వ్యాపారం నిర్వహిస్తున్న ఆఫీసు పైన ఉన్న ఒక రహస్య ప్రదేశానికి వెళ్లిపోయింది.
తరువాత రెండేళ్లపాటు ఫ్రాంక్ కుటుంబం, మరో స్నేహితుడు, ఆయన కుటుంబంతో కలిసి అక్కడే దాక్కుంది. అక్కడ నివసించిన ప్రతి ఒక్కరూ పగటిపూట ఊపిరాడని పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చేది.
రాత్రివేళ కార్యాలయం ఖాళీ అయ్యే వరకు వారు పగటిపూట మరుగుదొడ్డిని కూడా ఉపయోగించలేకపోయేవారు. నమ్మకమైన కొందరు వ్యక్తులు వారికి ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను అందించేవారు.
కుటుంబం రహస్య ప్రదేశంలో దాక్కుని ఉన్న సమయంలో ఆన్ తన ఆలోచనలను రహస్యంగా డైరీలో రాసేది. తన వయసు వారితో స్నేహం చేయాలని ఆన్ ఎంతగానో కోరుకునేది. అందుకే ‘కిట్టీ’ వంటి కల్పిత పాత్రలను సృష్టించి వాటి గురించి రాసేది.
ఆందోళనలు, ఆశయాలు, చిన్న ప్రదేశంలో ఇతరులతో కలిసి ఇరుకుగా జీవించిన అనుభవాలు, రోజువారీ అసంతృప్తుల గురించి ఆమె డైరీలో వివరంగా రాసింది.
ఈ డైరీలో చివరి రికార్డు 1944 ఆగస్టు 1 తేదీతో ఉంది. జర్మన్ పోలీసులు ఆన్ కుటుంబముంటున్న రహస్య స్థావరాన్ని తనిఖీ చేసి అక్కడ నివసిస్తున్న వారందరినీ అరెస్టు చేశారు. పోలీసులు వారి ఆచూకీ ఎలా కనుగొన్నారన్నది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది.
ఒట్టో ఫ్రాంక్ కుటుంబాన్ని నిర్బంధ శిబిరానికి (కాన్సన్‌ట్రేషన్ క్యాంప్) తరలించారు. అక్కడ భార్య ఎడిత్, కుమార్తెలు మార్గో, ఆన్‌ల నుంచి ఒట్టో విడిపోయారు.
ఆయన తన భార్య, పిల్లలను మళ్లీ చూడలేదు. ఆ ముగ్గురి జీవితాలు శిబిరంలోనే ముగిశాయి. ఆన్‌ను ఆమె సోదరి మార్గోతో కలిసి బెర్గెన్-బెల్సెన్‌కు తరలించారు. 1945 మార్చిలో, శిబిరానికి విముక్తి లభించడానికి కొన్ని వారాల ముందు ఆన్ టైఫస్ వ్యాధితో మరణించింది.

ఫొటో సోర్స్, STAN HONDA/AFP via Getty Images
ధైర్యానికి ప్రతీకగా నిలిచిన కథ
అలా ఆ రహస్య ప్రదేశంలో నివసించిన వారిలో ఒట్టో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. యుద్ధం ముగిసిన తరువాత ఆయన తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆమ్‌స్టర్‌డామ్‌కు వచ్చారు. తన కుటుంబానికేమైందో తెలుసుకున్నారు. వారి కుటుంబానికి చెందిన ప్రతిదాన్నీ దోచుకున్నారని ఆయనకు అర్థమైంది.
ఆన్ స్నేహితులు మీప్ గీస్, బెప్ వోస్కుయిజెల్ లు ఈ రహస్య స్థావరం నుంచి ఆన్ రాసిన డైరీని, ఉత్తరాలను జాగ్రత్త చేయగలిగారు. వాటిని ఒట్టోకు ఇచ్చారు. తీవ్ర విషాదంలో ఉన్న ఒట్టో వాటిని తెరవడానికి కూడా సాహసించలేకపోయారు.
"దాన్ని చదివే శక్తి కూడా నాకు లేదు" అని 1945 ఆగస్టు 22న స్విట్జర్లాండ్‌లో ఉన్న తన తల్లికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
చివరకు ఒట్టో డైరీ పేజీలను తెరిచి చదవడానికి ధైర్యం చేసినప్పుడు, అందులోని రచనలు ఆయనకు కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాయి. అత్యంత భయానక పరిస్థితుల్లో యుక్త వయస్సులోని సంక్లిష్టతలను ఎదుర్కొంటున్న తన కూతురు మనసులోకి తొంగిచూసే అవకాశం ఆయనకు లభించింది.
తల్లితో జరిగిన గొడవలు, తన సోదరి పట్ల ఉన్న అసంతృప్తి, మారుతున్నతన శరీరం గురించి ఆందోళనలను ఆన్ వివరంగా రాసింది. రహస్య ప్రదేశంలో నిర్బంధ జీవితం, అక్కడ నెలకొన్న నిశ్శబ్దం తనను ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేసేవి అన్నదానితోపాటు, తనతో కలిసి నివసిస్తున్న వ్యక్తులపై తనకున్న అసంతృప్తులను కూడా ఆమె రాసింది.
ఒంటరితనం గురించి, ఎక్కడ దొరికిపోతామో అన్న నిరంతర ఆందోళన గురించి వివరంగా రాసింది.
"రెక్కలు కత్తిరించిన పక్షిలా, దట్టమైన చీకటిలో బోనులో ఇనుప ఊచలకు పదేపదే కొట్టుకుంటున్నట్లు" తనకు అనిపించేదని ఆన్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'మానవాళికే ఒక గొప్ప బహుమతి లాంటి రచన'
అయితే ఒట్టోకు తన కుమార్తె ఆన్ సంతోషంగా ఉన్న కొన్ని క్షణాలూ డైరీలో కనిపించాయి. కిటికీలోంచి ప్రకృతిని గమనించిన ఆన్, తనతో కలిసి నివసిస్తున్న పీటర్ వాన్ డెన్ అనే బాలుడిపై తన ఇష్టం పెరుగుతున్నట్లు గుర్తించింది.
స్విట్జర్లాండ్‌లో స్కేటింగ్ చేయాలన్న తన కలలు, తన పుస్తకాన్ని ప్రచురించాలన్న ఆకాంక్షల గురించి ఆన్ రాసింది. తన వ్యక్తిత్వం, నిజ జీవితంలోని స్నేహితులు, కల్పిత స్నేహితులతో తన సంబంధాల గురించి తన ఆలోచనలను ఆమె డైరీలో నమోదు చేసింది.
ఆన్‌లో పరిపక్వత చెందుతున్న సంక్లిష్టమైన మనసును ఒట్టో అర్థం చేసుకోవడం ప్రారంభించారు.
డైరీలోని చివరి రికార్డుల్లో ఒకదానిలో "నేను ఇకపై అలా ఎప్పటికీ రాయలేను. ఏడాదిన్నర తరువాత నా డైరీని మళ్లీ చదువుతున్నప్పుడు, నాలో ఉన్న చిన్నపిల్లల అమాయకత్వం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేను ఎంతగా కోరుకున్నా, ఇకపై ఎప్పటికీ అంత అమాయకంగా ఉండనని నాకు కచ్చితంగా తెలుసు" అని రాసింది:
"డైరీ చదివిన తరువాత దాని ప్రతిని తయారు చేయించి నా స్నేహితుడొకరికి ఇచ్చాను. ఆయన స్నేహితుల్లో ఒకరు ఒక ప్రచురణ సంస్థలో పనిచేసేవారు. ఈ డైరీని వ్యక్తిగత ఆస్తిగా ఉంచుకునే హక్కు మీకు లేదని ఆయన నాతో చెప్పారు. ఇది మానవాళికి సంబంధించిన రచన. మీరు దీన్ని ప్రచురించాలి. అందుకే నేను ఆన్ డైరీని ప్రచురించాను" అని 1976లో బీబీసీ కార్యక్రమంలో ఒట్టో చెప్పారు.
ఆన్ డైరీలోని రికార్డులు, ఇతర రచనల సమాహారమైన 'ది సీక్రెట్ అనెక్స్' 1947 జూన్ 25న ప్రచురితమైంది. ఆన్ చేసిన కొన్ని భాషాపరమైన తప్పులను ఒట్టో సరిచేశారు. ఆమె తల్లిదండ్రుల వివాహానికి సంబంధించి ఆన్‌కు ఉన్న కొన్ని అపోహలు, ఆమె సెక్సువాలిటీ సంబంధించిన కొన్ని భాగాలు, ప్రముఖ వ్యక్తుల గురించి ఆమె రాసిన కొన్ని అసభ్యకరమైన రచనలను కూడా ఆయన సవరించారు.
ఈ పుస్తకం గొప్ప ప్రచురణగా నిలిచింది. నాజీ మారణహోమం కలిగించిన ఊహకందని విధ్వంసాన్ని, దాని విస్తృతికి అద్దం పడుతూ ఒక ఒంటరి బాలిక స్వరాన్ని ఆ పుస్తకం ప్రపంచానికి అందించింది.
1952లో 'ఆన్ ఫ్రాంక్: ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్' అనే పేరుతో ఈ పుస్తకం ఆంగ్లంలో ప్రచురితమైంది. 1956లో ఈ పుస్తకం పులిట్జర్ బహుమతి గెలుచుకున్న నాటకంగా రూపొందింది. మూడేళ్ల తరువాత సినిమాగా కూడా తెరకెక్కింది.
ఆన్ జీవితం చిన్నదే అయినా, ఆమె రచనలు మాత్రం మరచిపోలేనివి. ఈ పుస్తకాన్ని 70కి పైగా భాషల్లోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా పాఠకులను ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంది.
కూతురు వ్యక్తిగత ఆలోచనలను ప్రచురించి, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంగీకరించడంపై తనకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని బీబీసీ 'బ్లూ పీటర్' కార్యక్రమ వ్యాఖ్యాత జడ్ అడిగినప్పుడు "నేను చనిపోయిన తరువాత కూడా జీవించి ఉండాలని కోరుకుంటున్నాను. ఆన్ తన డైరీ ద్వారా అనేకమంది ప్రజల హృదయాల్లో ఒక విధంగా సజీవంగానే ఉంది" అని ఒట్టో ఫ్రాంక్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























