ఫ్రాన్స్‌ ఆందోళనలు: విద్యార్ధుల కోపానికి కారణమేంటి?

ఫ్రాన్స్, విద్యార్ధుల ఆందోళనలు, స్కూళ్ల మూసివేత, యూనివర్సిటీలు
ఫొటో క్యాప్షన్, స్కూళ్లలో సంస్కరణలు కోరుతూ ఫ్రాన్స్‌లో విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు.
    • రచయిత, హెన్రీ ఎస్టీయర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

విద్యారంగంలో నిధుల కొరతను వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.

సెప్టెంబర్ చివరి వారం నుంచి మొదలైన ఈ నిరసనలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి.

చాలావరకు హైస్కూళ్లకు వెళ్లే మార్గాలను విద్యార్థులు అడ్డుకున్నారు. నిరసనల్లో హింస చెలరేగడంతో వందల సంఖ్యలో విద్యార్థులు, టీచర్లు, పోలీసులు గాయపడ్డారు.

ఉద్యమానికి సంబంధం లేకుండా బయటి నుంచి వచ్చి అల్లర్లు సృష్టించినవారు సహా వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశంలోని లైసీల్లో(15 నుంచి18 ఏళ్ల వయసువారి కోసం నిర్వహించే అప్పర్ లెవల్ సెకండరీ స్కూల్స్) సిబ్బంది, సదుపాయాల కొరతపై నిరసనకారులు ఫిర్యాదు చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్రాన్స్, విద్యార్ధుల ఆందోళనలు, స్కూళ్ల మూసివేత, యూనివర్సిటీలు
ఫొటో క్యాప్షన్, విద్యార్ధుల ఆందోళనల్లో అనేక చోట్ల పోలీసులు విద్యార్ధుల మధ్య ఘర్షణ చెలరేగింది.

కాగా నిరసనల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం తొలిసారి స్పందించింది. రానున్న రోజుల్లో 3,000 మంది అదనపు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇచ్చింది.

ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి ఎడ్వర్డ్ జెఫ్రే తాజాగా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఈ ప్రతిపాదనను ప్రకటించారు.

ద్వితీయ శ్రేణి విద్యలో మరిన్ని వనరులు కల్పించాలనే డిమాండ్లతో నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 6,877 మంది అరెస్టయ్యారని, అందులో 86 శాతం మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసువారేనని ప్రభుత్వం తెలిపింది.

ఫ్రాన్స్, విద్యార్ధుల ఆందోళనలు, స్కూళ్ల మూసివేత, యూనివర్సిటీలు
ఫొటో క్యాప్షన్, యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు మనోన్ అబ్రి విద్యార్ధుల ఆందోళనకు మద్దతు పలికారు.

మూడు వారాల ఈ ఉద్యమానికి యూనియన్లు యాక్ట్ ఫోర్ అని పేరు పెట్టాయి.

గురువారం ఫ్రాన్స్‌వ్యాప్తంగా దాదాపు 71,000 మంది నిరసనల్లో పాల్గొనగా పారిస్‌లోని బాస్టిల్ వద్ద 24,000 మంది గుమిగూడారు.

రాళ్లు, బాణసంచాతో దాడి చేసిన గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

బోర్డోలో ఆందోళనకారులు ఒక లైసీని ధ్వంసం చేశారు. మార్సెయ్ నగరంలో ఒక డిప్యూటీ హెడ్‌పై దాడి చేసి కొట్టారు.

శుక్రవారం మొత్తం 3,500 లైసీలలో సుమారు 140 పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి.

అయితే, గత కొన్ని రోజులతో పోల్చితే ఇది చాలా తక్కువ.

ఫ్రాన్స్, విద్యార్ధుల ఆందోళనలు, స్కూళ్ల మూసివేత, యూనివర్సిటీలు
ఫొటో క్యాప్షన్, 2026 అక్టోబర్ 8న బాస్టిల్ స్క్వేర్ వద్ద పా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో గుమికూడారు.

ఫ్రాన్స్‌వ్యాప్తంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్న తరుణంలో.. పారిస్‌కు చెందిన మాడలేనా అనే విద్యార్థిని 'బీబీసీ'తో మాట్లాడారు.

ఇటీవల హీట్‌వేవ్ సమయంలో స్కూల్ బిల్డింగ్‌లలో తాము వేడిలో మగ్గిపోయామని చెప్పారు.

విద్యార్థులు అనేక విషయాలపై ఫిర్యాదు చేస్తున్నారు.

కొందరు మొబైల్ ఫోన్లను నిషేధించడంపై అసంతృప్తి వ్యక్తంచేయగా మరికొందరు సాయంత్రం 6 గంటల వరకు స్కూల్ కొనసాగటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

''ఇంటికి వెళ్లేసరికి 7 గంటలవుతుంది.. హోంవర్క్ చేయడానికి, నిద్రపోవడానికి కూడా సమయం చాలదు' అంటూ ఫ్రాన్స్ 2 చానల్‌తో ఓ విద్యార్థి చెప్పారు.

ఉన్నత విద్యలో సీట్లు కేటాయించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ పర్‌కోర్సుప్‌పై విద్యార్థులు ఆగ్రహిస్తున్నారు.

ఈ అసంతృప్తికి లోతైన కారణాలు ఉన్నాయి.

ప్రతి బ్యాచ్‌లో దాదాపు 80% మంది ఇప్పుడు బకలారియా పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నారు. ఇది విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రవేశానికి అర్హత కల్పిస్తుంది.

అయితే అది తప్పనిసరిగా వారి ప్రాధాన్య కోర్సు కాకపోవచ్చు.

దాంతో డిమాండ్ ఉన్న కోర్సుల కోసం తీవ్రమైన పోటీకి దారితీస్తుంది.

అలాగే చాలామంది అస్పష్టమైనదిగా భావించే పర్‌కోర్సుప్ విధానం ఆందోళనకు కారణమవుతోంది.

ఫ్రాన్స్, విద్యార్ధుల ఆందోళనలు, స్కూళ్ల మూసివేత, యూనివర్సిటీలు
ఫొటో క్యాప్షన్, పారిస్‌లో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఆందోళనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి.

అయితే, ఫ్రాన్స్‌లో విద్యార్థులు నిరసనలకు దిగడానికి కారణాలు ఇవేనా? ఇతర దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్ విద్యావ్యవస్థ భిన్నమైనదా?

అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన ఓఈసీడీ ఇటీవలి నివేదిక ప్రకారం.. యూరోపియన్ యూనియన్ సగటుతో పోలిస్తే ఫ్రెంచ్ ప్రభుత్వం ఒక్కో లైసీ విద్యార్థిపై ఉన్నత మాధ్యమిక పాఠశాలల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోంది.

ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే అయినా, ఇతర ప్రాంతాల కంటే అధ్వానంగా ఏమీ లేదు.

ఓఈసీడీ ప్రమాణాల ప్రకారం, ఫ్రెంచ్ ఉపాధ్యాయులకు లభించే వేతనాలు తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ ఖాళీ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల పరిస్థితి మెరుగ్గానే ఉంది.

అయితే, స్కూల్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉండడమనేది కొంత సమస్య కావొచ్చు.

ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే సెలవులు తక్కువ. మధ్యాహ్న భోజన విరామం ఎక్కువ సమయం ఉండడం, సంక్లిష్టమైన టైమ్‌టేబుల్స్ కారణంగా స్కూల్ సమయం ఎక్కువ ఉంటుంది.

ఎక్కువ సమయం పాఠశాలలో గడపడం అనేది ఫ్రెంచ్ విద్యా విధానంలో ఎప్పటినుంచో ఉంది.

కాబట్టి ప్రస్తుత నిరసనలకు అదొక్కటే కారణమని చెప్పలేం.

చాలా ఐరోపా దేశాలలో 80 నుంచి 90 శాతం మంది యువత మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్నారు.

మంచి యూనివర్సిటీల్లో సీట్ల కోసం ఉండే పోటీ మిగతా చోట్ల కూడా విద్యార్థుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది.

నిధుల కొరత, శిథిలావస్థకు చేరిన భవనాలు, భవిష్యత్తు గురించిన భయాలు విద్యార్థుల అసంతృప్తికి కారణమైనా.. నిరసనలు తీవ్రరూపం దాల్చడం, హింసాత్మకంగా మారడానికి వారు చెబుతున్న ఫిర్యాదులే కారణమని చెప్పలేమని ఇంటీరియర్ మినిస్టర్ లారెంట్ నునెజ్ అన్నారు.

ఫ్రాన్స్, విద్యార్ధుల ఆందోళనలు, స్కూళ్ల మూసివేత, యూనివర్సిటీలు
ఫొటో క్యాప్షన్, నిధులు విడుదల చేయడం కష్టమని ప్రధాానమంత్రి లెకొర్ను చెబుతున్నారు.

నిరసనకారుల తెగింపు వల్లే ఈ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున సాగుతోంది.

బలవంతంగా లేదా బెదిరింపులతో స్కూల్ లేదా యూనివర్సిటీలను నడవకుండా అడ్డుకోవడం చట్టరీత్యా నేరం. దీనిపై పోలీసులు కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నిరసనకారులను అదుపు చేసే ప్రక్రియలో తరచుగా పోలీసులు-విధ్వంసకారుల నడుమ విద్యార్థులు చిక్కుకుపోతారు.

"పోలీసు బలగాలను మోహరించింది హై స్కూల్ విద్యార్థులను ఎదుర్కోవడానికి కాదు, శాంతి భద్రతలను పరిరక్షించడానికి మాత్రమే." అని ప్రధాని సెబాస్టియన్ స్పష్టం చేశారు.

ఫ్రాన్స్‌లో ప్రభుత్వం వద్ద ఎంత అధికారం ఉందో ప్రజల వద్దా అంతే ఉంది. అక్కడి ప్రజా ఉద్యమాలు అనేకసార్లు సంస్కరణలకు దారితీశాయి. ఈ విషయం విద్యార్థులకు కూడా బాగా తెలుసు.

1990 అక్టోబర్‌లో పారిస్‌కి సమీపంలోని ఓ పాఠశాలలో జరిగిన ఓ అత్యాచార ఘటన పెద్దఎత్తున నిరసనలకు దారితీసింది. పాఠశాలల్లో నిధులు, సిబ్బంది కొరతపైనా ఆందోళనకారులు గళమెత్తారు. దీంతో నాటి ప్రభుత్వం ప్రస్తుత విలువ ప్రకారం 1 బిలియన్ పౌండ్లు (సుమారు రూ.12, 800 కోట్లు) విడుదల చేసింది.

1998లోనూ ఇదే తరహా డిమాండ్లతో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫలితంగా ప్రభుత్వం 14 వేల మంది అదనపు సిబ్బందిని నియమించడం సహా పాఠశాలల పునరుద్ధరణకు 1 బిలియన్ యూరోలను (దాదాపు రూ.10, 800 కోట్లు) ప్రకటించింది.

అనేక ఇతర సందర్భాల్లోనూ ప్రభుత్వ సంస్కరణలను విద్యార్థులు వెనక్కి తీసుకునేలా చేశారు.

ఇంధనంపై పెంచిన పన్నులను వ్యతిరేకిస్తూ 2018-19లో చేపట్టిన 'ఎల్లో వెస్ట్స్' తిరుగుబాటు సైతం నాడు హింసాత్మకంగా మారింది. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి పన్నుల పెంపును రద్దు చేసింది. కొనుగోలు శక్తిని పెంచేందుకు 10 బిలియన్ యూరోలను (దాదాపు రూ.1 లక్షా 8 వేల కోట్లు) ప్రకటించింది.

అన్నిసార్లు ఉద్యమాలదే గెలుపు కాదు .1968లో విద్యార్థుల తిరుగుబాటు ఎన్నికలతో సద్దుమణిగింది.

అయితే, ఫ్రాన్స్ రాజకీయ సంస్కృతిలో ఎన్నికైన నేతలతో పాటు విద్యార్థులను కూడా ప్రజా గొంతుకలుగానే భావిస్తారు.

తాజా పరిణామాల ప్రకారం, విద్యార్థులదే పైచేయిగా కనిపిస్తోంది. బీఎఫ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన ఓ సర్వేలో విద్యార్థుల డిమాండ్లు సరైనవే అని 72 శాతం, వారి ఉద్యమానికి 55శాతం మంది ఫ్రాన్స్ ప్రజలు మద్దతు తెలిపారు.

విద్యార్థుల ఆందోళనలకు ఉపాధ్యాయులు, లేబర్ యూనియన్లు, వామపక్ష రాజకీయ నేతలు మద్దతిస్తున్నారు.

మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం ఇంత బలహీనంగా ఎన్నడూ లేదు. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ మరోసారి అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనడానికి లేదు.

సెబాస్టియన్ సైతం ఫ్రాన్స్ 'చరిత్రలోనే బలహీనమైన' ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన బడ్జెట్‌ని సైతం పార్లమెంట్ ద్వారా ఆమోదింపజేసే స్థితిలో లేరు.

కానీ, ఈ నిస్సహాయతే విద్యార్థుల నుంచి ఆయనను కాపాడవచ్చు. అప్పు చేసేందుకు పెరిగిన వడ్డీ ఖర్చులు, జీడీపీలో 5.4శాతం లోటు, ప్రభుత్వ అప్పులు 1940ల నుంచి ఇప్పటివరకు, ఇప్పుడే అధికంగా ఉన్నాయి. దీంతో రాజకీయంగా, ఆర్థికంగా సెబాస్టియన్ చేతులు కట్టేసినట్లు అయ్యింది.

తన కన్నా ముందు అధికారంలో ఉన్న వారి కంటే, ఉద్యమాలకు తలొగ్గి, ప్రజలకు ఇవ్వడానికి సెబాస్టియన్ వద్ద ఏమీ లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)