మురసు: నెల్లూరుకు 100, కావలికి 120 , తిరుపతికి 160 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

మురసు
ఫొటో క్యాప్షన్, మురసు తుపాను కదలికల శాటిలైట్ చిత్రం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మురసు తీవ్రతుపాను గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 10 కిమీ వేగంతో క‌దులుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఈ తుపాను ప్రస్తుతం నెల్లూరుకు 100 కి.మీ, కావలికి 120 కి.మీ, తిరుపతికి 160 కి.మీ, ఒంగోలుకు 160 కి.మీ, బాపట్లకు 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది.

సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని ఆ సంస్థ వెల్లడిచింది.

దీని కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ సంస్థ తెలిపింది.

తుపాను తీరం దాటే సమయంలో 100-120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ రుషికొండ సమీపంలో తీరానికి కొట్టుకొచ్చిన బోటు
ఫొటో క్యాప్షన్, విశాఖ రుషికొండ సమీపంలో తీరానికి కొట్టుకొచ్చిన బోటు

'మురసు' తుపాను కారణంగా సోమవారం(నవంబర్ 2) ఉదయం విశాఖ రుషికొండ తీరానికి ఒక మెకనైజ్డ్ బోట్ కొట్టుకు వచ్చింది.

నెల్లూరులో కూడా ఒక బోటు తీరానికి కొట్టుకొని వచ్చిందని, అందులో ఉన్నవారిని రక్షించామని అధికారులు ప్రకటించారు.

పరిస్థితి చక్కబడే వరకు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో వాతావరణం మారిపోయింది. జోరుగా వానలు పడుతున్నాయి.

రుషికొండ తీరంలోని మత్స్యకారులు, చిల్లర వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు చేరుకునే సమయానికి బోటులో నుంచి కొందరు దిగుతూ తీరం వైపు రావడం కనిపించింది. వారంతా మత్స్యకారులుగా గుర్తించారు.

ఈ బోటు డ్రైవర్ నరసింహంతో ‘బీబీసీ’ మాట్లాడింది.

"మేం 30 తేదీన వేటకు వెళ్లాం. చాలా దూరం వెళ్లం. చీపురుపల్లి, విజయనగరం, భీమిలీ ఇలా ఈ చుట్టూనే తిరుగుతున్నాం. తుపాను వార్తలు తెలిసిన వెంటనే విశాఖ తీరానికి బయలుదేరాం.

అయితే ఇదిగో ఈ రుషికొండ దగ్గరకు రాగానే బోటు ఇంజను పాడైంది. దాన్ని రిపేరు చేసుకుంటున్నాం. అయితే గాలులు తీవ్రతకి ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చేసింది. మేం ఆరుగురం బోటు నుంచి సురక్షితంగానే బయటపడ్డాం" అని నరసింహం చెప్పారు.

ఒడ్డుకు చేరిన మత్స్యకారులు
ఫొటో క్యాప్షన్, ప్రమాదంలో చిక్కుకున్న బోటు నుంచి సురక్షితంగా బయటపడిన మత్స్యకారులు

"గాలులు బలంగా వచ్చాయి. భయమేసింది. ఒక వైపు ఇంజను రిపేరు,మరో వైపు బోటును లాక్కెళ్లిపోతున్న గాలులతో కంగారు వచ్చేసింది. ఒడ్డు వైపుకే కొట్టుకుని వస్తుండటంతో కాస్త ధైర్యం అనిపించింది" అని బోటులో తమ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నరసింహం.

2020 అక్టోబర్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతికి బంగ్లాదేశ్ నౌక విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ దగ్గర తీరానికి కొట్టుకొని వచ్చి ఇసుకలో చిక్కుకుంది.

ఆ సమయంలో ఆ నౌకలో 15 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటికీ ఆ నౌక తెన్నేటి పార్కు బీచ్‌లోనే ఉంది. దీనిని పర్యాటకుల కోసం హోటల్‌గా మారుస్తున్నారు.

"సముద్రంలో ఉండే వేటకు వెళ్లే బోట్ల, కార్గో షిప్పులకు తుపాను, వాయుగుండం సమయాల్లో సముద్రం మీదుగా వీచే తీవ్ర గాలులతో ప్రమాదం ఎక్కువే. గాలి ఏ దిశగా వీస్తే ఆ దిశకు బోట్లు కొట్టుకుని వచ్చేస్తాయి. రుషికొండలో కొట్టుకొచ్చిన బోటు కూడా అలాంటిదే. మురసు తుపాను ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉన్నా...గాలుల తీవ్రత ఉత్తరాంధ్రపై కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం తీవ్రతుపానుగా మారిన వేళ గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది." అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖ రీజియన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, విశాఖపట్నం,
ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ప్రభుత్వ సన్నద్ధత...

తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ తెలిపారు.

సోమవారంనాడు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు...ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే వీలుందన్నారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు...అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. సహాయక చర్యల కోసం ముందస్తుగా ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఆరు, ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఏడు బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఘాట్ రోడ్డు ప్రయాణాలు 3, 4, 5 తేదీల్లో పూర్తిగా మానుకోవాలని అలర్ట్ చేశారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, కొండలపై నుంచి రాళ్లు దొర్లిపడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

తుపాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యా పేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, విశాఖపట్నం,
ఫొటో క్యాప్షన్, మురసు' తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

దీని ప్రభావం ఎక్కడెక్కడంటే...

మురసు' తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు పలు జిల్లాలపై తుపాను ప్రభావం ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నేడు నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

తుపాను ప్రభావంతో కృష్ణా, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షం పడుతోంది. దీంతో నగర వీధులు జలమయమయ్యాయి. తునిలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం, అంబాజీపేట ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, విద్యుత్‌, తాగునీరు, వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అర్నబ్‌ తుపానుతో ఇప్పటికే పంటలు దెబ్బతినగా.. తాజాగా మరో తుపాను ముప్పు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణా జిల్లాలో వరితోపాటు మినుము, వేరుశనగ, పత్తి, చెరకు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ముంపు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు కురిస్తే పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

cyclone arnab
ఫొటో క్యాప్షన్, అక్టోబర్ చివరి వారంలో అర్నబ్ తుపాను కారణంగా కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ప్రభావితమైంది.

'మనమిత్ర' ద్వారా సాయం

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవ 'మనమిత్ర' ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

విద్యుత్‌ అంతరాయం, చెట్లు లేదా గోడలు కూలిపోవడం, వరద నీరు చేరడం వంటి సమస్యలను ఈ సేవ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు.

ఫిర్యాదు చేయడం ఎలా?

  • 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్‌ చేయాలి.
  • అందులోని సేవల జాబితాలోకి వెళ్లి 'మురసు సైక్లోన్ ఇష్యూస్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • 'Report Issue' ఎంపిక చేసి, 'Confirm' ద్వారా నిర్ధారించాలి.
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పేరు, జిల్లా, మండలం వివరాలు నమోదు చేయాలి.
  • తుపాను కారణంగా ఎదురవుతున్న సమస్యను వివరించి, అవసరమైతే ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేయవచ్చు.
  • నమోదైన ఫిర్యాదును సంబంధిత ప్రాంత అధికారులకు పంపించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
  • అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్లు: 112 లేదా 1070 లేదా 18004250101
ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, విశాఖపట్నం,
ఫొటో క్యాప్షన్, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

విద్యుత్ శాఖ సమీక్ష

మురసు తుపాను వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో 48 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని విద్యుత్ సంస్థల సీఎండీలకు సూచించారు. అవసరమైతే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

తుపాను సమయంలో విద్యుత్ సరఫరా సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా 1912 కాల్ సెంటర్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

cyclone Murasu
ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావం వల్ల 32 రైలు సర్వీసుల్ని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రైళ్లు, విమాన సర్వీసులపై ప్రభావం...

మురసు తుపాను ప్రభావంతో రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 2026 నవంబర్ 2 ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేయగా, విమానయాన సంస్థలు కూడా పలు సర్వీసులను రద్దు చేశాయి.

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతం మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 32 రైళ్లను నిలిపివేయడం జరిగింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.

చెన్నై విమానాశ్రయం నుంచి విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుచ్చి మధ్య నడిచే ఇండిగోకు చెందిన 11 విమాన సర్వీసులను నవంబర్ 2న రద్దు చేశారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల్లోనూ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు ఇండిగో ప్రకటించింది. విశాఖ విమానాశ్రయ కార్యకలాపాలపైనా ప్రభావం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

రైలు, విమాన ప్రయాణానికి బయలుదేరే ముందు సంబంధిత రైల్వే, విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లలో తాజా సమాచారం తనిఖీ చేసుకోవాలి. విమాన ప్రయాణికులు తమ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే సందేశాలను కూడా గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)