లైవ్ , SIRలో తొలగించిన పేర్లున్న భారీ బ్యానర్‌తో ర్యాలీకి హాజరైన కార్యకర్తలు

సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లు ముద్రించిన బ్యానర్లతో కొంతమంది కార్యకర్తలు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు .

సారాంశం

  • జర్మనీలో జీవన వ్యయం పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
  • ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలోని దుకాణాలను ఆందోళనకారులు దోచుకున్నారు. ఇతర నగరాల్లోనూ పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
  • దిల్లీలో ప్రతిపక్షాలు ఆదివారం(నేడు) భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి.
  • ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
  • ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంచుకున్న రోజు సరైనది కాదని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిప్రాయపడింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది.
  • 13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 79 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
  • నేడు హామిల్టన్ వేదికగా భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.

లైవ్ కవరేజీ

  1. ‘ఇండియా’ కూటమి ర్యాలీలో ‘10 లక్షల మంది ఎక్కడున్నారు?’ అని ప్రశ్నించిన బీజేపీ

    బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా
    ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా

    దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ర్యాలీ అనంతరం బీజేపీ విలేఖరుల సమావేశం నిర్వహించి ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుంది.

    ర్యాలీకి 10 లక్షల మంది హాజరయ్యారన్న వాదనను బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ప్రశ్నించారు.

    ‘‘ఆ పది లక్షల మంది ఎక్కడున్నారు? మాకు చూపించండి. ఇలాంటి ఎత్తుగడలతో ఎవరూ నాయకుడు లేదా ప్రధానమంత్రి అవ్వలేరు. ఇన్ని పార్టీలను, జెండాలను ఏకతాటిపైకి తెచ్చినప్పటికీ కనీసం పది లక్షల మందిని కూడా సమీకరించలేకపోయారు’’ అని సంబిత్ పాత్ర ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేశారు.

    ‘‘పీఎం అంటే కేవలం ప్రధానమంత్రి అని కాదు. ఇందులో 'పీ' అంటే చెమట (పసీనా), 'ఎం' అంటే కఠోర శ్రమ (మెహనత్). ఏ ప్రధానమంత్రి అయినా చెమట, కఠోర శ్రమతోనే తయారవుతారు’’ అని సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు.

  2. బంగ్లాదేశ్: కనీస వేతన బోర్డు ఏర్పాటు కోసం వస్త్ర కార్మికుల నిరసనలు

    ఢాకాలో నిరసనలు
    ఫొటో క్యాప్షన్, ఢాకాలో నిరసనలు

    బంగ్లాదేశ్‌లోని ఢాకాలో, మీర్‌పూర్, ఘాజీపూర్‌లలోని వస్త్ర కార్మికులు 30,000 టాకాల వేతన పెంపు కోరుతూ నిరసనలకు దిగారు.

    అయితే, మీర్‌పూర్‌లో కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

    నిరసనకారులు ఒక పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు. పోలీసులు పలువురు నిరసనకారులను అరెస్టు చేశారు.

    మరోవైపు, కార్మికుల డిమాండ్ల మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఆరుగురు సభ్యులతో కూడిన వేతన బోర్డును ఏర్పాటు చేసింది.

    బంగ్లాదేశ్ కార్మిక శాఖ మంత్రి అరిఫుల్ హక్ చౌధరి ఆదివారం ఉదయం వేతన బోర్డు ఏర్పాటును ప్రకటిస్తూ, కార్మికులు తమ నిరసనలను విరమించుకుని తిరిగి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు.

    ‘‘అస్థిర వాతావరణాన్ని సృష్టించేందుకు కొన్ని రాజకీయ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేయిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు, కార్మికులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అన్నారు అరిఫుల్ హక్ చౌధరి.

  3. రూ. 450.42 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన డైనోసార్ అస్థిపంజరం... ఏమిటి దీని ప్రత్యేకత?

    డైనోసార్ అస్థిపంజరం
    ఫొటో క్యాప్షన్, డైనోసార్ అస్థిపంజరం

    ఓ డైనోసార్ అస్థిపంజరం దాదాపు 450 కోట్లరూపాయలకుపైగా ఎందుకు అమ్ముడుపోయింది. అస్థిపంజరానికి అంత ధర ఎందుకు చెల్లించారు. ఇలాంటి అస్థిపంజరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండొచ్చా? దీనిపై శాస్త్రవేత్తల ఆందోళన ఏమిటో ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

  4. IND vs Nz: భారత్‌పై 7 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ గెలుపు, 3-2తో సిరీస్ భారత్ వశం

    భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన అయిదో టి20 మ్యాచ్ దృశ్యం
    ఫొటో క్యాప్షన్, భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన అయిదో టి20 మ్యాచ్ దృశ్యం

    హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజీలాండ్‌తో జరిగిన చివరిదైన అయిదో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ చేతిలో ఓడిపోయింది.అయితే ఈ సిరీస్‌లో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లు గెలిచి 3-2తో సిరీస్ సొంతం చేసుకుంది.

    ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది.

    ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

    ఓపెనర్లు సంజూ శామ్సన్ (4), అభిషేక్ శర్మ (1), తిలక్ వర్మ (6) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు.

    నమన్ ధిర్ (33), నితీశ్ కుమార్ రెడ్డి (22) రాణించారు.

    ప్రత్యర్థి బౌలర్లలో ఆడమ్ మిల్నే 4 వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్‌నర్ చెరో 2 వికెట్లు తీశారు.

    అనంతరం న్యూజీలాండ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్నిఅందుకుంది.

    ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

    గ్లెన్ ఫిలిప్స్ అజేయంగా 65 పరుగులు చేశాడు.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ తీశారు.

  5. SIRలో తొలగించిన పేర్లున్న భారీ బ్యానర్‌తో ర్యాలీకి హాజరైన కార్యకర్తలు

    దిల్లీ రామ్ లీలా మైదాన్

    దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి ర్యాలీకి ఉదయం నుంచే కార్యకర్తలు రావడం మొదలైంది.

    అయితే, మధ్యాహ్నం అక్కడ వైవిధ్యభరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

    సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లు ముద్రించిన బ్యానర్లతో కొంతమంది కార్యకర్తలు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు .

    దిల్లీ రామ్ లీలా మైదాన్
    ఫొటో క్యాప్షన్, SIR ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను ముద్రించిన బ్యానర్‌తో కార్యకర్తలు

    ‘‘ఒక్క రాష్ట్రంలోనే లక్షల మంది పేర్లను తొలగించారు. కార్యకర్తలు బ్యానర్లపై తొలగించిన ఆ పేర్లను ముద్రించుకుని రామ్‌లీలా మైదాన్‌కు చేరుకుంటున్నారు’’ అని సోషల్ మీడియా ఎక్స్‌లో కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా మాజీ హెడ్ శ్రీవత్స ట్వీట్ చేశారు.

    ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ప్రతిపక్షాల ర్యాలీ

    ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు ఊరుకోం’’

    'వోట్ బచావో దేశ్ బచావో ర్యాలీ'కి వచ్చిన ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు.

    ఆయన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.

    "ప్రధాని మోదీ తన శిష్యుడిని ఇక్కడ నిలబెట్టి అందరి ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించడానికే మేం అందరం ఇక్కడికి వచ్చాం. ఆయనను పదవి నుంచి తొలగించే వరకు మేం విశ్రమించం’’ అని ఖర్గే అన్నారు.

  6. మురసు తుపాను: సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన రద్దు, అధికారులతో సమీక్ష

    నారా చంద్రబాబు నాయుడు

    పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశమున్న ‘మురసు’ తుపాను ప్రభావంపై ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం, వర్షాలు, గాలుల అంచనా, జలాశయాల పరిస్థితిపై చర్చించారు. మురసు తుపాను నేపథ్యంలో ఆయన తన దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

    విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకారం..నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం

    • తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు
    • నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు.
    • నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
    • అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం ఉన్నాయి.
    • నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో సుమారు 179 మిల్లీ మీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చని అంచనా
    • బుడమేరు వద్ద నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం రావచ్చని అంచనా. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో భారీ వరదకు అవకాశం
    • బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ముందస్తు అంచనా
  7. ఏపీ వైపు ముంచుకొస్తున్న ‘మురసు’ తుపాను

    మురసు తుపాను

    బంగాళాఖాతంలో మురసు తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

    ప్రస్తుతం చెన్నైకి 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్లు, ఒంగోలుకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

    ఇది రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది.

    రేపు అర్ధరాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము మధ్య నెల్లూరు, నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి తెలిపారు.

    తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  8. గుడ్ ఆఫ్టర్‌నూన్

    నేను బీబీసీ ప్రతినిధి శారద మియాపురం. ఇప్పటినుంచి రాత్రి 10 గంటల వరకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

  9. పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ పై జర్మనీలో నిరసనలు హింసాత్మకం, దుకాణాల లూటీ

    జర్మనీలో జీవన వ్యయం, నిరసనలు
    ఫొటో క్యాప్షన్, ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలోని దుకాణాలను ఆందోళనకారులు దోచుకున్నారు.

    జర్మనీలో జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు తొలుత ప్రశాంతంగా సాగినా.. శనివారం అర్ధరాత్రి తర్వాత హింసాత్మకంగా మారాయి. ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలోని దుకాణాలను ఆందోళనకారులు దోచుకున్నారు. ఇతర నగరాల్లోనూ పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి.

    జర్మనీ ఆర్థిక కేంద్రంగా పేరొందిన ఫ్రాంక్‌ఫర్ట్‌తో పాటు బెర్లిన్, కొలోన్, హాంబర్గ్ నగరాల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. అత్యవసర సేవల సిబ్బందిపై నిరసనకారులు బాణసంచా, రాళ్లు, సీసాలతో దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించినట్లు తెలిపారు.

    పాఠశాలలకు తగినంత నిధులు కేటాయించకపోవడం, జీవన వ్యయం పెరగడం, ప్రభుత్వ వ్యయాల్లో కోతలు, సైనిక సేవను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ 'జెన్ జెడ్ రేగెల్ట్' అనే ప్రచార సంస్థ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు.

    ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో పలువురు నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి ఒకరు వెల్లడించారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. పగటిపూట నిరసనలు చాలావరకు ప్రశాంతంగా జరిగినప్పటికీ.. రాత్రి సమయంలో హింసాత్మకంగా మారాయి. నగర కేంద్రంలో హింసాత్మక అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని ఫ్రాంక్‌ఫర్ట్ పోలీసులు ఎక్స్‌లో పోస్టు చేశారు. నిరసనకారులు పలు దుకాణాల అద్దాలను ధ్వంసం చేశారని, అత్యవసర సేవల సిబ్బందిపై పెట్రోల్ బాంబులు విసిరారని పోలీసులు వెల్లడించారు.

    జర్మనీలో జీవన వ్యయం, నిరసనలు
    ఫొటో క్యాప్షన్, ఫ్రాంక్‌ఫర్ట్‌లో బ్యాట్‌మ్యాన్ వేషధారణలో ఉన్న నిరసనకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    అయితే, శాంతి, స్వేచ్ఛ కోసం ఈ నిరసనలు చేపట్టామని 'జెన్ జెడ్ రేగెల్ట్' ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ తెలిపారు. ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు మెరుగైన మద్దతు కల్పించడమే తమ ప్రధాన డిమాండ్ అని ఆమె చెప్పారు. తప్పనిసరి సైనిక సేవను వ్యతిరేకిస్తున్నామని, సమాజంలోని ప్రతి ఒక్కరిపై పడే భారం సమానంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

  10. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు ప్రారంభమైన పోలింగ్

    92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
    ఫొటో క్యాప్షన్, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 79 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయగా, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  11. సీఈసీ రాజీనామా కోరుతూ నేడు దిల్లీలో ప్రతిపక్షాల భారీ ర్యాలీ

    కాంగ్రెస్, దిల్లీలో ప్రతిపక్షాల భారీ ర్యాలీ
    ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది (ఫైల్ ఫోటో).

    దేశ రాజధాని దిల్లీలో ప్రతిపక్షాలు ఆదివారం(నేడు) భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

    ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది. దీనికి పది లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

    కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటామని ప్రకటించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) కూడా ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించింది.

    దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లను తొలగించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ర్యాలీ జరగనుంది.

    మరణించినవారు, తమ నమోదిత చిరునామాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను నవీకరించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెబుతోంది.

    నవంబర్ 1న ఈ ర్యాలీ , కాంగ్రెస్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
    ఫొటో క్యాప్షన్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

    అయితే, ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంచుకున్న రోజు సరైనది కాదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిప్రాయపడింది.

    "వారు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, నవంబర్ 1న ఈ ర్యాలీ నిర్వహించడాన్ని కూటమి నాయకులు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే దిల్లీ చరిత్రలో నవంబర్ 1 అత్యంత సున్నితమైన రోజు. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నవంబర్ 1న దిల్లీలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సిక్కు సోదరులపై దాడులు జరిగాయి. రక్తపాతం చోటుచేసుకుంది.అలాంటి రోజునే రాహుల్ గాంధీ ర్యాలీకి ఎంచుకున్నారు" అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు.

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి