గుడ్ నైట్
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ కవరేజీని ముగిస్తున్నాం.
మరిన్ని ముఖ్యమైన కథనాలు వివరంగా చదవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకత్వాన్ని తొలగించండి’ మార్చ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ కవరేజీని ముగిస్తున్నాం.
మరిన్ని ముఖ్యమైన కథనాలు వివరంగా చదవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ పోస్టు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని బహిరంగ చర్చకు పిలిచారు.
ఇంగ్లిష్ వార్తా వెబ్సైట్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన ఓ వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. “మోదీజీ, ఈ దేశానికి అబద్ధాలు చెప్పడం ఆపండి” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ షేర్ చేసిన వార్తకు సంబంధించిన కథనంలో.. దేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, పుకార్లు వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు ఉంది.
గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. “మీరు విదేశీ సాయంతోనే ప్రధానమంత్రి అయ్యారు. విదేశీ మద్దతుతోనే ఇప్పటికీ ప్రధానిగా కొనసాగుతున్నారు. మీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విదేశీయుల నియంత్రణలో, వారి మద్దతుతో నడుస్తోంది. విదేశీ సోషల్ మీడియా కూడా పూర్తిగా మీకు మద్దతుగా నిలుస్తోంది” అని ఆరోపించారు.
ఈ అంశంపై మీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు.
“ఏ వేదికపైనైనా, ఎప్పుడైనా చర్చకు నేను సిద్ధం. మీకు ధైర్యం ఉంటే రండి. కానీ మీరు రారని నాకు తెలుసు. ఎందుకంటే మీ గురించి నాకు తెలిసిన విషయాలను చూసి మీరు భయపడుతున్నారు” అని రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI Video Grab
హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకత్వాన్ని తొలగించండి’ మార్చ్‌లో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ సంస్థాగత బలాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర స్థాయిలోనూ, యువతలోనూ పార్టీ బలంగా ఉందని అమిత్ షా అన్నారు.
తెలంగాణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీని ఓడించగలడని అమిత్ షా వ్యాఖ్యానించారు.
“రాహుల్ జీ.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. ఓటర్ల జాబితా నుంచి ఒక్కో చొరబాటుదారుడి పేరును తొలగించేలా చర్యలు తీసుకుంటాం. కేవలం 'సర్' (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) వల్లే మేం గెలిచామని ఆయన అంటున్నారు. 2014లో మోదీ గెలిచారు. అప్పుడు 'సర్' జరగలేదు కదా? మరి మోదీ 'సర్' వల్లే గెలిచారా?” అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు అమిత్ షా.
2019లోనూ మోదీ విజయం సాధించారని, ఆ సమయంలో కూడా 'సర్' జరగలేదని ఆయన అన్నారు.
“2024 తర్వాత మహారాష్ట్రలో భారీ మెజారిటీతో విజయం సాధించాం. హరియాణాలోనూ అత్యధిక మెజారిటీతో గెలిచాం. 30 ఏళ్ల తర్వాత దిల్లీలో విజయం సాధించాం. బిహార్‌లోనూ భారీ మెజారిటీతో గెలుపొందాం. పశ్చిమ బెంగాల్లో దీదీ (మమతా బెనర్జీ) రాజకీయ ఆధిపత్యానికి కూడా తెరపడింది” అని అమిత్ షా అన్నారు.
“కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెంటిలేటర్‌పై ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న ఈ పార్టీ మోదీజీతో కలిసి మారథాన్‌లో పరుగెత్తగలదా?” అని అమిత్ షా విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు నటుడు ఇమ్రాన్ ఖాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ-సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.
భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనబోనని అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆయన్ని ఆదేశించినట్లు లైవ్‌లా వెబ్సైట్ తెలిపింది.
ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈ నటుడికి జారీ చేసిన “లీవ్ ఇండియా నోటీసు”పై స్టేను కూడా కోర్టు పొడిగించింది.
ఈ నోటీసుకు స్పందించడానికి ఇమ్రాన్ ఖాన్‌కు అవకాశం లభించే వరకు ఈ స్టే అమలులో ఉంటుంది.
అక్టోబర్ 28 లోగా భారతదేశం విడిచి వెళ్ళిపోవాలని ముంబైలోని ఎఫ్ఆర్ఆర్ఓ జారీ చేసిన ‘లీవ్ ఇండియా నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత విచారణ సందర్భంగా, సోమవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఎఫ్ఆర్ఆర్ఓ కోర్టుకు హామీ ఇచ్చారు. ఇమ్రాన్‌ఖాన్‌కు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఉంది. అమెరికా పౌరసత్వం ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఓసీఐ కార్డు ద్వారా 40 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఆయన ఎస్ఐఆర్కు వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొని ఉండకూడదని కోర్టు తెలిపింది.
ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 7న జరగనుంది.

ఫొటో సోర్స్, Sartaj Alam
ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా జిల్లా గమ్హరియా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మహిళపై అత్యాచారం కేసులోప్రధాన నిందితుడైన వైర్లెస్ ఆపరేటర్‌తో సహా ముగ్గురు పోలీసులను అరెస్టు చేసి జైలుకు పంపారు.
జిల్లా ఎస్పీ మనోజ్ స్వర్గియారి దీన్ని ధృవీకరించారు. ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారని ఆయన బీబీసీతో చెప్పారు.
“నిర్లక్ష్యం, అజాగ్రత్త, క్రమశిక్షణారాహిత్యంపై చర్యల్లో భాగంగా 12 మంది పోలీసులను సస్పెండ్ చేశాం” అని ఆయన తెలిపారు.
భర్తతో గొడవ జరిగిన తర్వాత స్థానిక గమ్హరియా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు బాధిత మహిళ చెప్పారు. ఆమెను నిర్బంధించిన గదిలో వైర్లెస్ ఆపరేటర్ ఆమెపై అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.
“ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన సిట్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటాం” అని ఎస్పీ అన్నారు.
అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదిక నిర్ధరించిందా అని పోలీస్ సూపరింటెండెంట్‌ను అడగ్గా “వైద్య పరీక్ష జరిగింది. రిపోర్ట్ ఇంకా రాలేదు. మేము దాని కోసం ఎదురుచూస్తున్నాం" అని ఎస్పీ చెప్పారు.
ఇప్పటి వరకు బీబీసీ కరస్పాండెంట్ ప్రభాకర్ వద్ది మీకు లైవ్ పేజ్ వార్తలను అందిస్తూ వచ్చారు. ఇప్పుడు బీబీసీ ప్రతినిధి పద్దయ్య పారా రాత్రి 10 గంటల వరకు మీకు వార్తలను అందిస్తారు.
కింద ఇచ్చిన లింకులు క్లిక్ చేసి బీబీసీ తెలుగులో ముఖ్యమైన వార్తలను చదవండి.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె సమీప సముద్రంలో చేపల వేటకు వెళ్లి బోటు ఇంజన్ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు ఏడుగురు మత్స్యకారులు.
వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
‘వీళ్లంతా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లారు. నెల్లూరు సముద్ర తీరానికి చేరుకునేసరికి వాతావరణ మార్పులు గమనించి తిరిగి వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారి బోటు ఇంజన్ పాడైపోయింది. దీంతో హార్బర్ మౌత్ పాయింట్‌కు సుమారు అర కిలోమీటరు దూరంలోనే ఉండేపోవాల్సి వచ్చింది.
వారిని గుర్తించిన సర్వైలెన్స్ సిబ్బంది విషయాన్ని సంబంధిత అధికారులకు చేరవేసి రక్షణ చర్యలు ప్రారంభించారు. అలల ఎగసిపడుతుండటంతో తొలుత బోటు వద్దకు చేరుకోవడం కష్టతరంగా మారింది. లంగరు తెగిపోవడంతో ఆ బోటు పాతకడపాలెం గ్రామం వైపు కొట్టుకుపోయింది. ఆ బోటును అధికారులు అనుసరిస్తూ రక్షణ చర్యలు కొనసాగించారు. చివరకు బోటును పాతకడపాలెం తీరానికి సురక్షితంగా చేర్చి అందులో ఉన్న ఏడుగురిని బయటకు తీసుకొచ్చారు’ అని కలెక్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI Video Grab
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఏఎన్ఐరిపోర్ట్ చేసింది.
తుపాను కారణంగా నెల్లూరులో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది సముద్ర కూడా పోటుమీద ఉందని, అలలు భారీగా ఎగసిపడుతున్నట్టు పేర్కొంది.
నెల్లూరు- నర్సాపురం మధ్యే అర్థరాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తన్నారు.

ఫొటో సోర్స్, @naralokesh
బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలిక కోలుకుంటున్నట్టు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
రాప్తాడులో రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా ఆయన వివరాలు వెల్లడించారు.
“మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై శుభవార్త: ఆమె చికిత్సలో స్థిరమైన పురోగతిని ఉందని వైద్యుల బృందం గమనించింది. చిన్నారి స్పృహలో ఉంది, ఆమె తల్లి కూడా పరామర్శించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో, ఈ సాయంత్రం వెంటిలేటర్ సపోర్టు తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఆమె పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తూనే ఉంటాము” అని లోకేశ్ పోస్టు పెట్టారు.
మరోవైపు బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని గురించి కూడా లోకేశ్ ట్వీట్ చేశారు. “ఒక వ్యక్తి చైన్సాతో వారి పాఠశాలలోకి ప్రవేశించినప్పుడు, లక్ష్మి పారిపోలేదు. ఆమె ముందుకు అడుగు వేసి తన స్నేహితురాలిని కాపాడటానికి ప్రయత్నించింది, ఆ క్రమంలో తీవ్రంగా గాయపడింది. ఆమె తనను తాను కాపాడుకోగలిగేది, కానీ తన స్నేహితురాలికి అండగా నిలబడాలని నిర్ణయించుకుంది.
ఈ రోజు ఇద్దరు బాలికలు ఆసుపత్రిలో ఉన్నారు. లక్ష్మి తన గాయాలకు చికిత్స పొందుతోంది. ఆమె చర్యలు స్నేహం, ధైర్యం నిజమైన అర్థం ఏంటో మనకు గుర్తు చేస్తాయి. మా ప్రభుత్వం రెండు కుటుంబాలకు అండగా నిలుస్తుంది. వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సంరక్షణ అందేలా చూస్తాము. ఆంధ్రప్రదేశ్‌లో ఏ బిడ్డ కూడా తరగతి గదిలో అభద్రతకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హ్యాకర్లు రెండు దేశాల పౌరులకు రేడియేషన్ ప్రమాదాలు, అణు దాడుల గురించి నకిలీ హెచ్చరికలు పంపి, కాసేపు భయాందోళనలు సృష్టించారు.
హెచ్చరిక యాప్‌పై భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడి వల్ల హ్యాకర్లు తప్పుడు సమాచారం పంపడానికి అవకాశం ఏర్పడి ఉండవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే, ప్రస్తుతానికి ప్రజా హెచ్చరిక వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చినట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అదే సమయంలో, యుక్రెయిన్ వైమానిక దాడి హెచ్చరిక యాప్‌పై కూడా సైబర్ దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో, దాని నుంచి నకిలీ హెచ్చరికలు పంపినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ సైబర్ దాడికి రష్యానే కారణమని యుక్రెయిన్ వ్యూహాత్మక సమాచార కేంద్రం ఆరోపించింది.
ఈ సంస్థ, యుక్రెయిన్ వైమానిక దాడి యాప్‌లో కనిపిస్తున్న కొన్ని హెచ్చరికల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఫొటో సోర్స్, ANI Video grab
ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్‌లోని థారువా దీహ్ ప్రాంతం సమీపంలో ఆదివారం రాత్రి ఓమ్ని వ్యాన్, ట్రైలర్ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.
ఇద్దరు గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ వర్మ మాట్లాడుతూ, "ప్రమాదం జరిగిన సమయంలో ఓమ్ని వ్యాన్‌లో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ఇద్దరిని చికిత్స ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకుంటాం" అని తెలిపారు.
కుషినగర్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయాలని ఆదేశించారని పీటీఐవార్తా సంస్థ పేర్కొంది.
అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని, సహాయక, రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ మధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావం విమాన సర్వీసులపై పడింది. గన్నవరం, భోగాపురం, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల నుంచి బయల్దేరే సర్వీసులపై తుపాను ప్రభావం ఉంటుందని ఇండింగోసంస్థ ప్రకటించింది.
తుపాను కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సిన పది సర్వీస్‌లు రద్దు చేసినట్టు విజయవాడ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
విమానాశ్రయ అధికారులు చెప్పినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ కూడా ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టింది. మురసు ప్రభావంతో గన్నవరం నుంచి బయల్దేరాల్సిన సర్వీస్‌లను రద్దు చేసినట్టు తెలిపింది.
విమానాశ్రయానికి చేరుకోక ముందే ప్రయాణికులు తమ విమానాల స్టేటస్ తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తుపాను ముప్పు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానయాన సంస్థ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది విమానాశ్రయ అధికారులు వెల్లడించినట్టు వివరించింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ఇండిగో సంస్థప్రకటించింది.
టేకాఫ్, ల్యాండింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవచ్చని, కొన్ని రద్దు కూడా కావచ్చని వెల్లడించింది. దీని వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగవచ్చని తెలిపింది.

ఫొటో సోర్స్, @aaivjaairport

ఫొటో సోర్స్, @APSDMA
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు గురించి ఆంధ్రప్రదేశ్ విపత్తుల కేంద్రం, ఆర్టీజీఎస్ మరో అప్డేట్ ఇచ్చాయి. పది గంటలకు విడుదలైన బులెటిన్‌లో ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్టు పేర్కొన్నారు.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారిన మురసు గడచిన 6 గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు తెలిపాయి.
ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు.
తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరుకు 160 కిలోమీటర్లు, చెన్నైకి 180 కి.మీ, కావలికు 180 కి.మీ., ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ ‘బీబీసీ’తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌కు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై అధికారులు తాజాగా బులెటిన్ విడుల చేశారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు.
హైదరాబాద్‌లో ఇవాళంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్‌లో గరిష్టంగా 33 డిగ్రీల ష్ణోగ్రత నమోదు అయితే కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని కూడా చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో పలు ప్రాంతల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలో 8 కేంద్రాల్లో రీపోలింగ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కడప నగరపాలక సంస్థ, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ (సోమవారం (నవంబర్ 2) రీపోలింగ్ జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
కడప నగరపాలక సంస్థలోని 15వ వార్డు పరిధిలో పోలింగ్ కేంద్రం నంబర్ 15/2లో, జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 3వ, 17వ, 29వ వార్డులకు చెందిన 3/2, 17/1, 29/1 పోలింగ్ కేంద్రాల్లో, పులివెందుల మున్సిపాలిటీలోని 1, 3, 7, 8వ వార్డులకు చెందిన 1/1, 3/1, 7/1, 8/1 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు (నవంబరు 2) హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మహా పాదయాత్ర’ కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మీడియాకుచెప్పారు.
‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ఆందోళనలు చేస్తున్న వేళ బీజేపీ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని పారదోలండి’’ నినాదంతో పాదయాత్ర చేస్తున్నారు.
మొదట అమిత్ షా.. మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 4 గంటలకు బషీర్‌బాగ్‌లోని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకుని.. ఎంజె మార్కెట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడతారని బీజేపీ తెలంగాణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, @kishanreddybjp
పాదయాత్ర జరిగే రూట్ మ్యాప్‌ను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పరిశీలించారు.
మరోవైపు అమిత్ షా పర్యటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
‘‘తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల విషయంలో అమిత్ షా గతంలో అవమానకరంగా మాట్లాడారు. హైదరాబాద్ రావడానికి ముందుగానే తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పాక హైదరాబాద్ కు రావాలి.’’ అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు.

ఫొటో సోర్స్, ANI
తీవ్ర మురసు తుపాను ఈ అర్థరాత్రికి తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది.
ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లను అధికారులు మోహరిస్తున్నారు.
ఇందులో భాగంగానే మూడు ఎన్డీఆర్ఎస్ టీమ్‌లు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి.
తమిళనాడులోని రాణిపేట్ జిల్లా, అరక్కోణం సమీపంలో ఉన్న నగరికుప్పం నుంచి ఈ బృందాలు బయల్దేరాయి.
మురసు తుపాను ఈ అర్థరాత్రి ఒంగోలుకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
మురసు తుపాను ముంచుకొస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
సన్నద్ధతలో భాగంగా విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ సహాయం కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు.
మురసు తుపాను వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ పోల్స్ దెబ్బ తింటాయని, పునరుద్ధరణకు సిబ్బందిని, యంత్రాలను పంపాలని కోరారు.
దీనికి తమిళనాడు సీఎం దీనికి సానుకూలంగా స్పందించారని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో పేర్కొంది.
ఇటీవలే విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సహాయం తీసుకుంది.
విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సిబ్బందిని, సామగ్రిని పంపించింది. ఇప్పుడు తమిళనాడు సహాయం తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఫొటో సోర్స్, @ANI
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను సోమవారం అర్ధరాత్రి తరువాత ఒంగోలు వద్ద తీరం దాటనుందని ఐఎండీ పేర్కొంది.
"పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను, గత 6 గంటలుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తూ, తీవ్ర తుపానుగా బలపడింది’ అని భారత వాతావరణ శాఖ తన ఎక్స్ ఖాతాలోపేర్కొంది.
‘నవంబర్ 2, 2026న తెల్లవారుజామున 2.30 గంటల సమయానికి, ఇది 13.6° ఉత్తర అక్షాంశం, 82.5° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నైకి (తమిళనాడు) తూర్పు-ఈశాన్యంగా సుమారు 260 కి.మీ, నెల్లూరుకు (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 290 కి.మీ, మచిలీపట్నానికి (ఆంధ్రప్రదేశ్) దక్షిణ-ఆగ్నేయంగా 320 కి.మీ, కావలికి (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ, ఒంగోలుకు (ఆంధ్రప్రదేశ్) ఆగ్నేయంగా 330 కి.మీ. విశాఖపట్నానికి (ఆంధ్రప్రదేశ్) దక్షిణంగా 470 కి.మీ దూరంలో ఉంది’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇది మరింతగా వాయువ్య దిశగా పయనించి, నవంబర్ 2 అర్ధరాత్రి (11.30 గంటలకు) నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున (4గంటల) మధ్య, నెల్లూరు, నర్సాపురం మధ్య ముఖ్యంగా ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
ఈ సమయంలో గాలి వేగం గంటకు 100 నుంచి 110 కి.మీ వరకు ఉండి, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఫొటో సోర్స్, @APSDMA
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
మురసు ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మురసు ప్రస్తుతం చెన్నైకి 260 కి.మీ, నెల్లూరుకు 290 కి.మీ, మచిలీపట్నానికి 320 కి.మీ, కావలికి 310 కి.మీ, ఒంగోలుకు 330 కి.మీ, విశాఖపట్నానికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ తుపాను నవంబర్ 3న తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటవచ్చని అధికారులు చెబుతున్నారు.