సముద్రంలో అత్యవసరంగా దిగిన విమానం... ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులను ఎలా రక్షించారంటే..

ఫొటో సోర్స్, Handout Air Force Reserve Command 920th Rescue Wing
- రచయిత, అనా ఫాగుయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
విమాన పైలట్‌గా పాతికేళ్ల అనుభవం ఉన్న ఇయాన్ నిక్సన్ ఎన్నడూ ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోలేదు. ఈ ప్రమాదం కారణంగా ఫ్లోరిడా తూర్పు తీరంలో ఆయనతో పాటు 10 మంది ప్రయాణికులు గంటల తరబడి అట్లాంటిక్ మహాసముద్రంలో చిక్కుకుపోయి, తమల్ని ఎవరైనా కాపాడుతారేమో అని ఎదురు చూడాల్సి వచ్చింది.
మంగళవారం బహామాస్‌లోని రెండు దీవుల మధ్య సాధారణంగా 20 నిమిషాలు సాగాల్సిన విమాన ప్రయాణంలో నిక్సన్ ఒక ప్రమాదం తర్వాత మరో ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు.
తొలుత నావిగేషన్ వ్యవస్థ విఫలమైంది. ఆ తర్వాత రేడియో, ఆ తర్వాత ఇంజిన్.. చివరికి మరొకటి... ఇలా నిక్సన్ విమానం ప్రమాదంలో చిక్కుకుంది.
''కొంతసేపు రేడియో ద్వారా నేనెవర్నీసంప్రదించలేకపోయాను'' అని పైలట్ నిక్సన్ తెలిపారు. ''ఫ్రీపోర్టుకు (బహామాస్), మియామి రేడియోకు కాల్ చేసేందుకు ప్రయత్నించాను. వారు నా మాటలు వింటున్నారో లేదో తెలియదు. కానీ, నాకు ఎటువంటి సమాధానం రాలేదు'' అని బీబీసీ యూఎస్ న్యూస్ పార్టనర్ సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు నిక్సన్.
ఈ విమానం బహామస్ అబాకో దీవుల్లోని మార్ష్ హార్బర్ నుంచి గ్రాండ్ బహామాలోని ఫ్రీపోర్టుకు వెళుతోంది.
విమానాన్ని దించడానికి ఎక్కడా చోటు లేక, మరో అవకాశం కనిపించక చివరకు మియామీకి ఉత్తరంగా 289 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేశారు నిక్సన్.

''నేను సముద్రాన్ని తాకగానే .. వెంటనే హమ్మయ్యా.. 'మేం చనిపోలేదు' అనిపించింది'' అని నిక్సన్ చెప్పారు.
రెస్క్యూ సిబ్బంది వారిని కనిపెట్టేవరకు పైలట్, ప్రయాణికులు గంటల తరబడి లైఫ్ రాఫ్ట్లోనే గడపాల్సి వచ్చింది.
నిక్సన్ వారందరిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించారు.
'''మరో 10 నిమిషాల్లో, ఒక విమానం రానుంది’ అని వారికి చెప్పాను'' అని నిక్సన్ తెలిపారు. అప్పుడు ఒక ప్రయాణికుడు.. 'ఆగండి, నాకేదో శబ్దం వినిపిస్తున్నట్లు ఉంది?''' అని అన్నారు.
అది అమెరికా ఎయిర్ ఫోర్స్ 920వ రెస్క్యూ వింగ్‌కు చెందిన హెలికాప్టర్ శబ్దం దూరం నుంచి వినిపిస్తోంది.

ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ సిగ్నల్ ప్రమాద పరిస్థితి గురించి అమెరికా కోస్ట్ గార్డును అప్రమత్తం చేసింది. ఈ సిగ్నల్ అందుకున్న వెంటనే శిక్షణలో ఉన్న ఈ రక్షణ విభాగాన్ని గాలింపు, సహాయక చర్యల కోసం పంపించారు.
''వారు అప్పటికే ఐదు గంటల పాటు రాఫ్ట్‌లో ఉన్నారు'' అని కెప్టెన్ రోరీ విపుల్ చెప్పారు.
''వారిని చూడగానే శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోయారని మీకు తెలిసిపోతుంది'' అని తెలిపారు.
హెలికాప్టర్‌కు తిరిగి ఇంధనం అవసరయ్యేలోపే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక సిబ్బంది సమయం చూసుకోకుండా పనిచేశారు.
''మహాసముద్రంలో విమానం అత్యవసర పరిస్థితుల్లో దిగిన తర్వాత ఎవరైనా ప్రాణాలతో బయటపడటం నేను ఎన్నడూ చూడలేదు'' అని సహాయక చర్యల్లో పాల్గొన్న ఎయిర్‌క్రాఫ్ట్ కమాండర్ మేజర్ ఎలిజబెత్ పియోవాటి చెప్పారు. ''నేను చూసినంత వరకు, వీరందరూ ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతం'' అని అన్నారు.
మొత్తం 11 మంది ప్రయాణికులను ఫ్లోరిడా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
''మేం చనిపోతున్నామని మాకనిపించిన సమయంలో మేం సురక్షితంగా బయటపడ్డామని తెలిసి ప్రతి ఒక్కరూ సంతోషించారు'' అని విమానంలోని ప్రయాణికుల్లో ఒకరు ఒలింపియా అవుటెన్ చెప్పారు. ''అదంతా చూస్తుంటే అదొక సినిమాలాగా అనిపించింది'' అని అన్నారు.
బహామాస్ అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























