NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ అతిపెద్ద ఐపీఓ ఇన్నేళ్లు ఎందుకు వాయిదా పడింది? స్కాండల్ నుంచి పుట్టుకొచ్చిన ఈ ఎక్స్ఛేంజీ కథేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ తెలుగు
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు రాబోతుంది.
సెప్టెంబర్ 17న (గురువారం) తమ కంపెనీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై.. సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని ఎన్‌ఎస్ఈ ప్రకటించింది. సెప్టెంబర్ 24న మార్కెట్లో లిస్ట్ కానున్నట్టు పేర్కొంది.
ఐపీఓలో ఈ ఎక్స్ఛేంజీ ధరల శ్రేణి ఒక్కో షేరు రూ.1700 నుంచి రూ.1785 మధ్యలో ఉంది. 8 షేర్లు కలిగిన ఒక్కో లాట్ కొనుగోలుకు రూ.14,280ను రిటైల్ ఇన్వెస్టర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఐపీఓలో ఎన్‌ఎస్ఈ ఇష్యూ సైజు రూ.22,562 కోట్లుగా ఉంది.
ఈ ఐపీఓ నేపథ్యంలో అసలు ఎన్ఎస్ఈ ఎప్పుడు ఏర్పాటైంది? ఎన్ఎస్ఈ ఐపీఓ ఎలా ఉండబోతుంది? ఈ ఐపీఓ పదేళ్ల పాటు ఆలస్యం ఎందుకు అయింది? టెక్నాలజీ పరంగా బీఎస్ఈతో పోలిస్తే ఎన్ఎస్ఈ ఎంత తేడా? వంటి విషయాలను బిజినెస్ నిపుణులు ‘నాగేంద్ర సాయి కుందవరం’ బీబీసీకి వివరించారు.

ఎన్ఎస్ఈ పుట్టుక
1990 ప్రారంభంలో భారత్ అతిపెద్ద ఆర్థిక మార్పు అంచున నిలిచింది. ఆ సమయంలో ట్రేడింగ్ అంతా సంప్రదాయ ఎక్స్ఛేంజీల చుట్టూనే కేంద్రీకృతమైంది. బ్రోకర్లు, ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లోని వారు, గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉండేవారని, సరైన పరిపాలనా అధికారం లేకపోవడంతో, అవకతవకలు సర్వసాధారణమయ్యాయని బ్రిటానికా మనీ పేర్కొంది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ 1991లో మనోహర్ ఫెర్వాని నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీన్నే ఫెర్వాని కమిటీ అని కూడా పిలిచేవారని బ్రిటానికా మనీ వెల్లడించింది. 1991లో ఫెర్వాని కమిటీ సిఫార్సుల మేరకు.. 1992లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఏర్పాటైంది. అప్పటికీ ప్రభుత్వం ఈ స్టాక్ ఎక్స్ఛేంజీని గుర్తించలేదు.
సరిగ్గా ఇదే సమయంలో అంటే 1992లోనే హర్షద్ మెహతా స్కామ్ వెలుగులోకి వచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలోని ఇతర బ్యాంకర్లు, రాజకీయ నేతలతో కలిసి మెహతా మార్కెట్ మానిపులేషన్‌కు పాల్పడటం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణం భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాలలో ఒకటిగా నిలిచింది.
మెహతా బ్యాంకు రశీదులను ఉపయోగించి, బ్యాంకుల నుంచి అన్‌సెక్యూర్డ్ లోన్స్ పొంది, ఆ నిధులను స్టాక్ మార్కెట్లోకి మళ్లించి కృత్రిమంగా షేర్లను ధరలను పెంచారు. ఈ స్కామ్ బయటపడగానే, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో సహా చాలా బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయని బ్రిటానికా మనీ పేర్కొంది.
ఈ ఆర్థిక కుంభకోణం వ్యవస్థాగత లోపాలను బయటపెట్టడంతో, భారత మార్కెట్లను ఆధునీకరించేందుకు, నియంత్రించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయని తెలిపింది.
ఈ క్రమంలోనే 1993లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) దీన్ని గుర్తించింది. హోల్‌సేల్ డెట్ మార్కెట్ లాంచ్‌తో 1994 నుంచి తన కార్యకలాపాలను సాగించినట్లు ఈ ఎక్స్ఛేంజీ పేర్కొంది.
ఆ తర్వాత వెంటనే క్యాష్ మార్కెట్ సెగ్మెంట్‌ను లాంచ్ చేసినట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడింగ్ మధ్య తేడాలేంటి
ఎన్ఎస్ఈ తన తొలి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.హెచ్ పాటిల్ నేతృత్వంలో పూర్తిగా ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది. అంటే పూర్తిగా ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారానే షేర్లను అమ్మడం, కొనుగోలు చేయడం చేసుకోవచ్చు. దీంతో.. దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజీగా ఎన్ఎస్ఈ నిలిచింది. ఆ తర్వాతనే బీఎస్ఈ ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారింది.
దేశవ్యాప్తంగా ట్రేడింగ్ కంప్యూటర్‌లను అనుసంధానించడానికి ఇది శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించింది. దీనివల్ల దేశంలో ఎక్కడి నుంచైనా ట్రేడింగ్‌లో పాల్గొనడం సాధ్యపడిందని బ్రిటానికా మనీ పేర్కొంది.
ప్రస్తుతం ఈక్విటీలు, డెరివేటివ్‌లు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ అండ్ డెట్ ప్రొడక్టులు, పబ్లిక్ ఇష్యూలు వంటి వాటిల్లో ట్రేడ్ చేసుకునేందుకు ఎన్‌ఎస్ఈ అవకాశం కల్పిస్తోంది.
అత్యంత పురాతన స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన బీఎస్ఈలో ప్రస్తుతం 5,700కి పైగా కంపెనీలు లిస్ట్ అయి ఉండగా.. ఎన్ఎస్ఈలో 2025 మార్చి నాటికి 2,700కిపైగా కంపెనీలు లిస్ట్ అయ్యాయి.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఆ ప్లాట్‌ఫామ్ ఆపరేట్ అవుతుంది. అయితే, 15 నిమిషాలు ముందుగానే ప్రీఓపెనింగ్ సెషన్ మొదలవుతుంది. దీపావళి వంటి పండుగల్లో ముహురత్ ట్రేడింగ్ వంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లను చేపడుతుంది.
''ఎన్ఎస్ఈ విభిన్న విభాగాల్లో వినూత్నమైన ట్రేడింగ్ తీసుకువచ్చింది. ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ వీక్లీ, నిఫ్టీ మంత్లీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్, కరెన్సీ, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్.. ఇలా మార్కెట్ పార్టిసిపెంట్స్ విస్తృతంగా ట్రేడ్స్ చేసుకునేందుకు అవసరమైన అనేక ట్రేడింగ్ సాధనాలను పరిచయం చేసింది. పాత ఎక్స్ఛేంజీ అయినప్పటికీ బీఎస్ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ విభాగంలో బాగా వెనుకబడిపోయింది'' అని బిజినెస్ నిపుణులు ‘నాగేంద్ర సాయి కుందవరం’ బీబీసీకి వివరించారు.
‘‘దేశంలో అత్యంత పటిష్టమైన టెక్నాలజీతో నడుస్తున్న వ్యవస్థ ఇది. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రియల్ టైమ్ మార్కెట్ డేటా, రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్లయన్స్ విభాగాల్లో సత్తాను చూపించింది’’ అని చెప్పారు.
ఎన్ఎస్ఈ వెబ్ సైట్ ప్రకారం, వీళ్లు జూలై 23, 2024లో ఒక్క రోజులో 2వేల కోట్ల ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. జూన్ 5, 2024వ తేదీన 29 కోట్ల ట్రేడర్లను ఒకే రోజున ప్రాసెస్ చేసింది.
ఇది ప్రపంచ రికార్డ్. ఇన్ని కోట్ల లావాదేవీలను సీమ్‌లెస్‌గా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయడాన్ని బట్టి చూస్తేనే వీళ్ల మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
సగటున ఎన్ఎస్ఈలో ఒక్క రోజుకు 500 కోట్లకు పైగా కాంట్రాక్టులు, రూ.3 లక్షల కోట్లకు పైగా విలువైన ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అన్ని విభాగాల్లో సుమారు (సెప్టెంబర్ 15వ తేదీ) 1304 కోట్ల ఆర్డర్స్‌ను ఎన్ఎస్ఈ ప్రాసెస్ చేసింది.
ఇదే సమయంలో బీఎస్ఈలో యావరేజ్‌న రోజుకు 30 కోట్ల కాంట్రాక్ట్స్, రూ.250 కోట్ల టర్నోవర్ మాత్రమే జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
పదేళ్ల పాటు ఆలస్యం ఎందుకు
బిజినెస్ నిపుణులు నాగేంద్ర సాయి కుందవరం చెప్పిన ప్రకారం..
'' పదేళ్ల పోరాటం తర్వాత ఎన్ఎస్ఈకి ఐపీఓలోకి వస్తోంది. వేల కంపెనీలు లిస్ట్, ట్రేడ్ అయ్యే వేదిక కల్పించిన సంస్థ తనకు తాను మార్కెట్లోకి రావడానికి సుదీర్ఘ సమయం పట్టింది. 2016 నుంచి న్యాయపరమైన, రెగ్యులేటరీ, గవర్నెన్స్ కేసులను ఎదుర్కొంటూ వచ్చింది. ముఖ్యంగా కో-లొకేషన్ కేసును పరిష్కరించుకుని బయటకు రావడానికి ఇంతకాలం పట్టింది.
కొంత మంది హై ప్రొఫైల్ ట్రేడర్లకు డార్క్ ఫైబర్ యాక్సెస్ ఇచ్చారని, కొంత మంది ట్రేడర్లకు ముందస్తుగానే ఇన్‌స్టిట్యూషనల్ బయింగ్ - సెలింగ్ డేటాను లీక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంది. హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇచ్చారనేది అప్పట్లో ప్రధాన ఆరోపణ.
దీని వల్ల వాళ్లు ట్రేడ్స్‌ను ఎగ్జిక్యూట్ చేసే విషయంలో అన్ ఫెయిర్ అడ్వాంటేజ్ వచ్చిందని విజిల్ బ్లోయర్ కంప్లైంట్ అందింది. కొన్ని మైక్రో సెకెన్ల ముందస్తుగా ట్రేడ్ చేసుకునే అవకాశం లభించినా కూడా అది లాభదాయకంగా ఉంటుంది. అందుకే అప్పట్లో దీనిపై దుమారం రేగింది.
ఒక హిమాలయన్ యోగికి ముందస్తు సమాచారం అందుతోందని, ఆయన కనుసన్నల్లోనే ఇదంతా సాగుతోందని హడావుడి జరిగింది. ఇది కోర్టులు, ట్రైబ్యునళ్ల వరకూ వెళ్లి ఏళ్ల తరబడి నానుతూ వచ్చింది.
చివరకు ఎన్ఎస్ఈ ఈ కో-లొకేషన్, డార్క్ ఫైబర్ కేసుల్లో సెబీకి రూ.1491.2 కోట్లు చెల్లించి కేసు సెటిల్ చేసుకుంది. దీంతో, సెబీ నుంచి ఐపీఓకు వచ్చేందుకు ఆమోదం పొందింది'' అని తెలిపారు.
కో-లొకేషన్ కేస్ సమస్యలు, ఎలాంటి కేసులూ ఉండకూడదా?
''ఇది సాధారణ కంపెనీ, సాధారణ కేసు కాదు కాబట్టి ఎన్ఎస్ఈ విషయంలో మినహాయింపు. వాచ్ డాగ్‌లా ఉండాల్సిన వ్యవస్థపై ఆరోపణ, పారదర్శకత, జనాల నమ్మకం వంటివన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ కేసుకు అంత ప్రాధాన్యత వచ్చింది'' అని నాగేంద్ర సాయి కుందవరం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి ఎన్ఎస్ఈ ఐపీఓకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఐపీఓ కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ఐపీఓ ప్రకటించిన సంస్థ వెల్లడించిన తేదీలలో తమ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ట్రేడింగ్ ఖాతా ద్వారా కానీ ఆ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఐపీఓ దరఖాస్తు ప్రకారం ఎంత మొత్తం పెట్టుబడికి నిర్దేశించారో అదంతా మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. ఐపీఓలో మీకు కేటాయించిన షేర్లను బట్టి అందులో మినహాయించుకుని మిగతాది ఖాతాలో రిలీజ్ చేస్తారు.
అసలు కేటాయింపు లేకపోతే మొత్తం డబ్బు రిలీజ్ అవుతుంది. అంటే ఇతర లావాదేవీలకు ఆ డబ్బు ఎప్పటిలా అందుబాటులోకి వస్తుంది.
షేర్లు ఎలా కేటాయిస్తారు.. లాట్ అంటే ఏమిటి?
షేర్ల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్నవారందరికీ షేర్లు రాకపోవచ్చు.
సంస్థ ఐపీఓకు వచ్చినప్పుడే కనీస షేర్ల సంఖ్యను వెల్లడిస్తుంది.. దాన్నే లాట్ అంటారు. ఆ లాట్ కంటే తక్కువ షేర్లు కోరుతూ దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు తిరస్కరిస్తారు.
అలాగే లాట్ ప్రకారమే దరఖాస్తు చేసినా ఒక్కోసారి కోరుకున్నన్ని షేర్లు కేటాయించకపోవచ్చు.
మొత్తం ఎన్ని షేర్లు అందుబాటులో ఉన్నాయి.. ఎన్ని బిడ్‌లు దాఖలయ్యాయి.. అనేదాన్ని బట్టి షేర్ల కేటాయింపు ఉంటుంది.
సంస్థ కేటాయించిన ప్రకారం ఇష్యూ ముగిసినప్పటి నుంచి 5 రోజుల్లోగా మదుపరుల డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు జమ అవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
సమస్యలు వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
షేర్ల జారీ విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగినా, డబ్బులు రీఫండ్ కావడంలో సమస్యలు ఏర్పడినా ఐపీఓ జారీ చేసిన కంపెనీ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించాలి.
అక్కడ పరిష్కారం కాకపోతే సెబీకి ఫిర్యాదు చేయాలి.
'ఆఫీస్ ఆఫ్ ఇన్వెస్టర్ అసిస్టెన్స్ అండ్ ఎడ్యుకేషన్, సెబీ, సీ-4, జీ బ్లాక్, కుర్లా కాంప్లెక్స్, ఈస్ట్ బాంద్రా, ముంబయి' అనే చిరునామాకు పూర్తి వివరాలతో ఫిర్యాదు పంపించాలి.
ఐపీఓ తర్వాత ఎన్ఎస్ఈ తన సొంత ప్లాట్‌ఫామ్‌పై ట్రేడ్ కాదా?
ఐపీఓ ద్వారా మార్కెట్లోకి వచ్చే కంపెలన్నీ దాదాపు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయి, ట్రేడ్ అవుతుంటాయి.
అయితే, సెప్టెంబర్ 17న ఐపీఓకు వస్తోన్న ఎన్ఎస్ఈ మాత్రం తన సొంత ప్లాట్‌ఫామ్‌పై ట్రేడ్ కాదు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ తన సొంత ప్లాట్‌ఫామ్‌పై తన షేర్లను ట్రేడ్ చేసుకునేందుకు సెబీ అప్రూవల్ కోరలేదని ఈ ఎక్స్ఛేంజీ ఎండీ, సీఈవో ఆశీష్ చౌహాన్ గతవారం స్పష్టం చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రెగ్యులేటర్ నిబంధనలకు ఎన్ఎస్ఈ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలిపింది.
'' సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలనేవి మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలు మాత్రమే. అందుకే ఈ కంపెనీ మార్కెట్ ప్లేయర్‌గా, రెఫరీగా తన బాధ్యతలను పూర్తిస్థాయి నిబద్ధతతో పోషించడం కష్టం. కంప్లయన్స్, ఇన్‌సైడర్ ట్రేడింగ్, సర్వైలెన్స్ వంటివి చూసుకోవడం కష్టసాధ్యమైన పని. పారదర్శకత లోపించే ప్రమాదముంది. స్టాక్ మూమెంట్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఫ్యాక్టర్స్‌ను నియంత్రించడం కష్టం. అందుకే ఎన్ఎస్ఈ షేర్లు.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ కావడం కుదరదు. ఇవి బీఎస్ఈలో లిస్ట్ అయి, అక్కడే ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు బీఎస్ఈ షేర్లు కూడా అలానే ఎన్ఎస్ఈలో ట్రేడవుతున్నాయనే సంగతి గుర్తించాలి'' అని బిజినెస్ నిపుణులు నాగేంద్ర సాయి కుందవరం తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























