ఆ కంటైనర్‌లో దొరికింది చైనా ఆయుధమా లేక మద్యం సీసానా? పాపువా న్యూ గినియాలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, PNG East New Britain Province Facebook page
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
పాపువా న్యూ గినియాలోని ఒక వాణిజ్య నౌకా కంటైనర్‌లో చైనాలో తయారైనదిగా అనుమానిస్తున్న ఒక ఫిరంగి గుండు దొరికిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను చైనా అధికారులు తోసిపుచ్చారు.
అది "షెల్ ఆకారంలో ఉన్న ఒక వైన్ సీసా" అని వారు పేర్కొన్నారు.
"దీనివల్ల ఏమాత్రం ప్రమాదం లేదు," అని చైనా రాయబార కార్యాలయం మంగళవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాయగా, దానిపై అనేక సందేహాలు, కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.
రాజధాని నగరంలోని ఒక నిర్మాణ స్థలంలో 32 కిలోల వస్తువు లభ్యం కావడంతో, పోర్ట్ మోర్స్‌బీ పోలీసులు గత శుక్రవారం నలుగురు చైనా జాతీయులను అరెస్టు చేశారు.
అది పనిచేస్తున్న పరికరమా కాదా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీస్ కమిషనర్ డేవిడ్ మన్నింగ్ అన్నారు. "చాలా ఆందోళనకరమైన వస్తువుగా"గా ఆయన అభివర్ణించారని స్థానిక మీడియా వార్తలు వెలువరిచింది.

ఆ వస్తువు రసాయన పేలుడు పదార్థాలు, ఫ్యూజ్ కలిగిన 130 మిల్లీమీటర్ల చైనా టైప్-59 ఆర్టిలరీ షెల్ అని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలు చెప్పిన సమాచారంగా ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ)లో బుధవారం ప్రసారమైన ఒక రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే, దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ఇదిలా ఉండగా, ఆ వస్తువు "కేవలం డమ్మీ మాత్రమే" అన్న ఊహాగానాలను పపువా న్యూ గినియా పోలీసులు ఇప్పటికే తోసిపుచ్చినట్లు స్థానిక పత్రిక పోస్ట్ కొరియర్ వెల్లడించింది.
మరోవైపు, చైనా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, చైనాలోని సైనిక స్థాయి ఆర్టిలరీ షెల్‌ను అక్రమంగా బయటకు తీసుకువెళ్లి పపువా న్యూ గినియాకు తరలించడం "దాదాపు అసాధ్యం" అని పేర్కొంది.
"ప్రపంచంలోనే అత్యంత కఠినమైన తుపాకుల నియంత్రణ చట్టాలు, నిబంధనలు చైనాలో అమల్లో ఉన్నాయి" అని పేర్కొంటూ, "ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షిత దేశాలలో చైనా ఒకటిగా గుర్తింపు పొందింది" అని ఆ ప్రకటనలో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























