ఏపీ మున్సిపల్ ఎన్నికలు: కూటమి హవాను తట్టుకుని గెలిచిన ఆ నలుగురు వైసీపీ నేతలు ఎవరు?

ఫొటో సోర్స్, YCP/X
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచగా విపక్ష వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కార్పొరేషన్, ఒక నగర పంచాయతీ రెండు మున్సిపాలిటీల్లోనే విజయం సాధించింది.
ఎన్నికలు జరిగిన 13 కార్పొరేషన్ మేయర్ స్థానాల్లో వైసీపీకి ఎక్కడా ఒక్క మేయర్ సీటు కూడా రానివ్వమంటూ కూటమి పార్టీల నేతలు చెప్పినప్పటికీ అనంతపురంలో మాత్రం వైసీపీ అభ్యర్ధి విజయం సాధించారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిక్యం కొనసాగిన నేపథ్యంలో రాయలసీమలో అనంతపురం కార్పొరేషన్‌ను గెలుచుకోవడం వైసీపీకి కీలక విజయంగా మారింది. ఈ ఫలితం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతపురం మేయర్ ఎన్నికలో వైసీపీ సాధించిన విజయం నగర ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
అనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై విజేత రమేశ్ గౌడ్ బుధవారం మీడియాతో స్పందిస్తూ, ఈ గెలుపును పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి 'గిఫ్ట్' గా అభివర్ణించారు.
అనంతపురం కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలో నవంబర్ 1 జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవానూ తట్టుకుని ఎక్కడెక్కడ వైసీపీ విజయం సాధించిందంటే...


ఫొటో సోర్స్, YSRCP/X
అనంతపురం మేయర్ పీఠం
ఎన్నికలు జరిగిన మొత్తం 13 కార్పొరేషన్లలో ఒక్క అనంతపురం మేయర్ సీటుని వైసీపీ అభ్యర్థి రమేశ్ గౌడ్ కైవసం చేసుకున్నారు.
ఇక్కడ వార్డుల్లో కూటమిదే ఆధిక్యం అయినప్పటికీ కూటమి తరఫున బీజేపీ మేయర్ అభ్యర్థి అజయ్ బాబుపై వైసీపీ అభ్యర్థి రమేశ్ గౌడ్ 5,981 వేల మెజారిటీతో విజయం సాధించారు.
మొత్తం 62 డివిజన్లలో టీడీపీ 30, జనసేన పార్టీ 6, బీజేపీ1 స్థానంలో గెలిచాయి. వైయస్సార్సీపీ 21 డివిజన్లలో విజయాన్ని అందుకుంది.

ఫొటో సోర్స్, YCP
రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో..
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైసీపీ నుంచి పోటీ చేసిన ఫాతిమా బీ తన సమీప ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్థి సబేరున్నీసాపై 2,834 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇక్కడ వార్డుల్లో కూడా వైసీపీ ఆధిక్యత కనబరిచింది.
మొత్తం 32 వార్డులకు వైసీపీ 22 వార్డులు గెలుచుకోగా, కూటమికి 10 వార్డులే దక్కాయి.
ఇక తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైసీపీ అభ్యర్థి రాజేశ్వరమ్మ గెలుపొందారు. అయితే ఇక్కడ వార్డుల్లో మాత్రం కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబరచాయి.
కూటమి 15 వార్డులు గెలుచుకోగా వైసీపీ 12 వార్డులు, ఇండిపెండెంట్ ఒక వార్డు గెలుచుకున్నారు.
నంద్యాల జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ చైర్మన్‌గా వైసీపీ అభ్యర్థి దూదేకుల దస్తగిరి కూటమి అభ్యర్ధి లోకేశ్ గౌడ్‌పై 1,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
మరోవైపు రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైసీపీ 525 వార్డులను గెలుచుకుంది.
ఫలితాలపై అధినేత స్పందన.. ఎన్నికల సంఘానికి పార్టీ నేతల లేఖ
ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, ''ఇవి ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే... ప్రభుత్వానికి, పోలీసులకి కంగ్రాట్స్'' అంటూ మంగళవారం రాత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ.. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి 16 వేర్వేరు ఫిర్యాదులను పేర్కొంటూ ఎస్ఈసీకి లేఖలు రాశారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందులో కుప్పం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా వైయస్సార్సీపీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను బయటకు పంపించడం, పోలీసుల లాఠీచార్జి, అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అక్రమాలు చేసి వైఎస్ఆర్సీపీ గెలిచిన వార్డుల్లోనే రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ తక్షణ జోక్యం చేసుకోవాలని వైయస్సార్సీపీ కోరింది.
వీటితో పాటు ప్రకాశం జిల్లా చీమకుర్తి కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు, అనుచరులు వైయస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపైనా తక్షణ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ 26, 27 వార్డుల్లో రీకౌంటింగ్ సందర్భంగా అక్రమాలు, అనధికార వ్యక్తుల కౌంటింగ్ హాల్లో ప్రవేశం నేపథ్యంలో తిరిగి లెక్కింపు జరపాలని ఎస్ఈసీని కోరింది వైయస్సార్సీపీ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























