ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్, స్టార్‌లింక్, జియో, ఎయిర్‌టెల్
ఫొటో క్యాప్షన్, స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశించకుండా అంబానీ కుటుంబం అడ్డుకుంటోందని ఎలాన్ మస్క్ ఆరోపణ
    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

భారత్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశంపై నెలకొన్న వివాదాన్ని ఎలాన్ మస్క్ తీవ్రతరం చేశారు.

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని "ప్రధానమంత్రి అంబానీ" అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. భారత్‌లో శాటిలైట్ సేవల్లో పోటీకి అవకాశం ఇవ్వకుండా గుత్తాధిపత్యం కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ రంగంలో ఇతర కంపెనీలకు అవకాశం కల్పించే ఆలోచన అంబానీకి ఉందా అని ప్రశ్నించారు.

కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించిన తర్వాత కొన్ని గంటల్లోనే ఎలాన్ మస్క్ ఎక్స్‌లో ఈ తాజా వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని సింధియా పేర్కొన్నారు.

ఒక ప్రత్యేక కంపెనీ గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నప్పటికీ, ఇప్పటికే మూడు కంపెనీలకు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల లైసెన్సులు ఇచ్చామని సింధియా చెప్పారు. భద్రతా నియమాలు, ఇతర అవసరాలను పూర్తి చేసిన తర్వాత తమ సేవలను ఆ సంస్థలు ప్రారంభించవచ్చు అన్నారు.

ఇదిలా ఉంటే, మస్క్ చేసిన ఈ పోస్టుతో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలపై కొనసాగుతున్న వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. భారత్‌లో తమ సేవలను ప్రారంభించకుండా, మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కొందరు పెద్ద వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని మస్క్ ఈ మధ్య ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గురువారం చేసిన ఒక పోస్ట్‌లో ఎలాన్ మస్క్, "భారత్‌లో అసలు బాస్ అంబానీయేనా?"అని ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం, మస్క్ మరో పోస్ట్‌తో ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశారు.

అందులో "ప్రియమైన ప్రధానమంత్రి అంబానీ, భారత్‌కు అసలైన అధిపతి మీరేనన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినందుకు నా వినయపూర్వక క్షమాపణలను అంగీకరించండి. మీరు గుత్తాధిపత్యం కొనసాగించాలని అనుకోవచ్చు, అయినప్పటికీ స్టార్‌లింక్‌కు భారత్‌లో పోటీ చేసే అవకాశం ఇస్తారా? భారత్‌లో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దీనివల్ల చదువు అవకాశాలను పిల్లలు కోల్పోతున్నారు. చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో అమ్ముకోలేకపోతున్నారు. స్టార్‌లింక్‌ వల్ల వారి జీవితాలు మెరుగుపడే అవకాశం ఉంది. ధన్యవాదాలు" అని రాశారు.

మస్క్ వ్యాఖ్యలపై అంబానీ, రిలయన్స్ గ్రూప్ ఇంకా స్పందించలేదు. దీనిపై స్పందన కోసం బీబీసీ వారిని సంప్రదించింది.

ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్, స్టార్‌లింక్, జియో, ఎయిర్‌టెల్
ఫొటో క్యాప్షన్, మొబైల్ ఫోన్‌పై స్పేస్‌ఎక్స్ లోగో

వివాదం ఎక్కడ మొదలైంది

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్‌లో పోటీ పెరుగుతున్న సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్ కూడా తమ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆసక్తికరంగా, స్టార్‌లింక్‌తో అంబానీకి చెందిన రిలయన్స్ జియో, అలాగే భారతి ఎయిర్‌టెల్ భాగస్వామ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి.

భారత్‌లో స్టార్‌లింక్ పరికరాలు, సేవలు విక్రయించేందుకు స్పేస్‌ఎక్స్‌తో 2025 మార్చిలో ఈ రెండు కంపెనీలు ప్రభుత్వం అనుమతికి లోబడి ఒప్పందాలు చేసుకున్నాయి. నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలను కూడా పరస్పరం పంచుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపాయి.

బుధవారం మస్క్ మొదటగా స్పందిస్తూ, కొందరు పెద్ద వ్యాపార వర్గాలు భారత్‌లో గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

దీనికి గురువారం భారత కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ స్పందించింది. స్టార్‌లింక్, యూటెల్‌సాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్ అనే మూడు కంపెనీల దరఖాస్తులు దాదాపు ఒకే దశలో ఉన్నాయని తెలిపింది. సేవలు ప్రారంభించే ముందు అవి భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపులు పొందాల్సి ఉంటుందని పేర్కొంది.

మౌలిక సదుపాయాల విషయంలో వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కూడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

అయితే, ఇప్పటికే 165కుపైగా దేశాల్లో స్టార్‌లింక్ లైసెన్సులు ఉన్నాయని, భారత్‌లో మాత్రం ఇంకా ఎందుకు అనుమతి రాలేదని మస్క్ ప్రశ్నించారు. "భారత్‌లో అసలు బాస్ అంబానీయేనా?" అని గురువారం నాడు ఎక్స్‌లో మస్క్ రాసుకొచ్చారు.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్, భూమికి సమీప కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ముఖ్యంగా మొబైల్ నెట్‌వర్క్‌లు లేదా బ్రాడ్‌బ్యాండ్ కేబుళ్లు చేరని మారుమూల ప్రాంతాలకు ఈ సేవ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఆ కంపెనీ 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ కీలక లైసెన్సులను పొందింది. అయినప్పటికీ, వాణిజ్య సేవలు ప్రారంభించాలంటే ఇంకా తుది భద్రతా అనుమతి, స్పెక్ట్రమ్ కేటాయింపులు పొందాల్సి ఉంది.

ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్, స్టార్‌లింక్, జియో, ఎయిర్‌టెల్
ఫొటో క్యాప్షన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు

మస్క్ ఈ ఘర్షణను ఎందుకు ఎదుర్కొంటున్నారు?

బుధవారం దిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో స్టార్‌లింక్, రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్ కంపెనీల ప్రతినిధులు శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలపై తమ ప్రణాళికలను వివరించారు. ఈ సమయంలోనే వివాదం మొదలైంది.

సొంత శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని తమ కంపెనీ అభివృద్ధి చేస్తోందని, అవసరమైన ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నిస్తోందని రిలయన్స్‌ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ఈ సమావేశంలో చెప్పారు.

మస్క్ ఆరోపణలపై స్పందించడానికి ఆకాశ్ నిరాకరించారు. "భారతీయ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే దృష్టి ఉంది" అని మాత్రమే అన్నారు.

ఉపగ్రహ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వ ఆమోదం కోసం తమ కంపెనీ ఎదురుచూస్తోందని భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు.

భారత నియంత్రణ సంస్థలతో తమ కంపెనీ సంవత్సరాలుగా కలిసి పనిచేస్తోందని, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నెట్‌వర్క్‌ను రూపొందించామని స్టార్‌లింక్ వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించే స్పేస్‌ఎక్స్ ఎగ్జిక్యూటివ్ లారెన్ డ్రేయర్ చెప్పారు.

ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్, స్టార్‌లింక్, జియో, ఎయిర్‌టెల్
ఫొటో క్యాప్షన్, ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అని సంబోధించి శుక్రవారం మరో పోస్టు పెట్టారు ఎలాన్ మస్క్

అయితే, భారత్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశంపై భద్రతా అంశాలు ప్రధాన ఆందోళనగా ఉన్నాయి.

అండమాన్-నికోబార్ దీవుల్లో డ్రగ్స్ రవాణాపై 2024లో జరిపిన దర్యాప్తులో, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో సైనిక చర్య సందర్భంగా స్టార్‌లింక్ పరికరాలు లభించాయని అధికారులు తెలిపారు.

దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్, భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ఎప్పుడూ ప్రారంభించలేదని, స్వాధీనం చేసుకున్న పరికరాలు తమ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఉండకపోవచ్చని వాదించారు.

స్టార్‌లింక్ సేవలు భారతీయులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటాయన్న ప్రశ్న కూడా ఉంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌లలో భారత్ ఒకటి. అయినప్పటికీ దూర ప్రాంతాల్లో ఇంకా సరైన ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. అక్కడ మొబైల్ టవర్లు లేదా బ్రాడ్‌బ్యాండ్ కేబుళ్ల ఏర్పాటు కష్టం, ఖర్చుతో కూడుకున్నది.

ఈ సమస్యను స్టార్‌లింక్ పరిష్కరిస్తుందని మస్క్ చెబుతున్నారు.

"భారత్‌లో స్టార్‌లింక్, ప్రస్తుత ధరలను భరించలేని వారికి లేదా అసలు ఇంటర్నెట్ కనెక్షన్ లేని వారికి అధిక వేగవంతమైన, సరసమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది" అని ఆయన బుధవారం ఎక్స్‌లో రాశారు.

అయితే, భారత్‌లో స్టార్‌లింక్ ధరలను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇతర దేశాల్లో ఉన్న ధరలను చూస్తే, ఈ సేవ చాలామంది భారతీయ కుటుంబాలకు ఖరీదైనదిగా ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాలో స్టార్‌లింక్ రెసిడెన్షియల్ ప్లాన్‌లు నెలకు 55(సుమారు 4,500 రూపాయలు) డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్రాంతాన్ని, ప్లాన్‌ను బట్టి ధరలు మారతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)