ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?

రాహుల్ గాంధీ, ఎలాన్ మస్క్, టెస్లా, మోదీ, ముకేశ్ అంబానీ, భారతీ మిత్తల్, జియో, ఎయిర్ టెల్, స్టార్ లింక్,
ఫొటో క్యాప్షన్, అంబానీపై మస్క్ చేసిన పోస్టును రీపోస్టు చేస్తూ రాహుల్ గాంధీ స్పందించారు
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లోకి అడుగు పెట్టాలని చాలాకాలంగా ఎలాన్ మస్క్ ఆశిస్తున్నారు. అందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అనుకున్న విజయం సాధించలేకపోయాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, 2025 ప్రారంభంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వాషింగ్టన్‌లో కలిశారు.

కానీ, ఆ సమావేశం తర్వాత కూడా భారత్‌లో మస్క్ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం లభించలేదు.

అమెరికా- భారత్ సంబంధాలు దెబ్బతింటున్న వేళ, ఆ ప్రభావం రెండు దేశాల వ్యాపార వేత్తలపై కూడా కనిపిస్తోంది.

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ స్టార్‌లింక్, భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఆలస్యంపై ఎలాన్ మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆయన భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీపై నేరుగా విమర్శలు చేశారు.

స్టార్‌లింక్ గత ఐదేళ్లుగా భారత చట్టాలను పాటిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎందుకు లైసెన్స్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో చేసిన పోస్టులో మస్క్ ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వంపై ముకేశ్ అంబానీకి ఉన్న పలుకుబడి కారణమా అని కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు.

"భారతదేశానికి అసలైన బాస్ అంబానీయా?" అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో గురువారం మస్క్ పోస్ట్ చేశారు.

మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో తమ నియంత్రణ వ్యవస్థ "నిష్పక్షపాతంగా, వివక్షారహితంగా" పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అన్ని కంపెనీలు అనుమతుల ప్రక్రియలో దాదాపు ఒకే దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.

మస్క్ వ్యాఖ్యపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెంటనే స్పందించారు. ప్రముఖ వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

రాహుల్ గాంధీ, ఎలాన్ మస్క్, టెస్లా, మోదీ, ముకేశ్ అంబానీ, భారతీ మిత్తల్, జియో, ఎయిర్ టెల్, స్టార్ లింక్,

రాహుల్ వైఖరిపై ప్రశ్న

అంబానీపై మస్క్ చేసిన పోస్టును రీపోస్టు చేస్తూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో "ఎలాన్, భారత్‌కు స్వాగతం. ఇక్కడ ఉన్న మరో వ్యక్తి గురించి కూడా మీకు తెలిసినప్పుడు ఇంకాస్త ఆశ్చర్యపోతారు" అని కామెంట్ చేశారు.

దీనిపై స్పందించిన మస్క్, "ధన్యవాదాలు, రాహుల్. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం" అని బదులిచ్చారు.

స్టార్‌లింక్ విషయంలో కాంగ్రెస్ గత వైఖరితో పోలిస్తే, రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను చాలా మంది మస్క్‌కు మద్దతుగా భావిస్తున్నారు.

"కేవలం 12 గంటల్లోనే ఎయిర్‌టెల్, జియో రెండూ స్టార్‌లింక్‌తో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. చాలా కాలంగా భారత్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న ఆ సంస్థల అభ్యంతరాలన్నీ ఎలా పరిష్కారమయ్యాయి" అని గత సంవత్సరం మార్చి 13న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు.

అలాగే, స్టార్‌లింక్‌కు భారత్‌లో అవకాశం కల్పించడంలో ప్రధాని మోదీ పాత్ర ఉందని జైరామ్‌ రమేశ్ ఆరోపించారు. ఎలాన్ మస్క్ ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని అప్పట్లో అన్నారు.

జాతీయ భద్రతకు సంబంధించిన కీలక ప్రశ్నలు కూడా ఉన్నాయని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ఎలాన్ మస్క్‌ వివాదంలో రాహుల్ జోక్యం గతంలో జైరామ్ రమేశ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫలితంగా, ఆ పార్టీ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్‌పై విమర్శలు చేసే విదేశీ వ్యక్తుల వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని ది హిందూ గ్రూప్ డైరెక్టర్ మాలిని పార్థసారథి అభిప్రాయపడ్డారు.

రాహుల్ చేసిన వ్యాఖ్యను ఎక్స్‌లో రీపోస్ట్ చేస్తూ, "స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వడంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తి, భారత టెలికాం విధానాల స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నంగా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి" అని మాలిని పార్థసారథి రాశారు.

అలాగే, స్టార్‌లింక్‌కు భారత్‌లో అవకాశం కల్పించడంలో ప్రధాని మోదీ పాత్ర ఉందని జైరామ్‌ రమేశ్ ఆరోపించారు. ఎలాన్ మస్క్ ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలనే ప్రయత్నం జరుగుతోందని అప్పట్లో అన్నారు.

జాతీయ భద్రతకు సంబంధించిన కీలక ప్రశ్నలు కూడా ఉన్నాయని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ఎలాన్ మస్క్‌ వివాదంలో రాహుల్ జోక్యం గతంలో జైరామ్ రమేశ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫలితంగా, ఆ పార్టీ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్‌పై విమర్శలు చేసే విదేశీ వ్యక్తుల వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని ది హిందూ గ్రూప్ డైరెక్టర్ మాలిని పార్థసారథి అభిప్రాయపడ్డారు.

రాహుల్ చేసిన వ్యాఖ్యను ఎక్స్‌లో రీపోస్ట్ చేస్తూ, "స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వడంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తి, భారత టెలికాం విధానాల స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నంగా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి" అని మాలిని పార్థసారథి రాశారు.

రాహుల్ గాంధీ, ఎలాన్ మస్క్, టెస్లా, మోదీ, ముకేశ్ అంబానీ, భారతీ మిత్తల్, జియో, ఎయిర్ టెల్, స్టార్ లింక్,
ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ, ముకేశ్ అంబానీల మధ్య ఉన్న సంబంధాలపై రాహుల్ గాంధీ తరచూ విమర్శలు

అమెరికా ఇప్పటికే భారత ఐటీ కంపెనీల ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడాన్ని ఆమె ప్రస్తావించారు. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థ, భారత పారిశ్రామికవేత్తల పట్ల అమెరికా ప్రతికూల వైఖరి చూపుతోందని అభిప్రాయపడ్డారు.

కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకత కారణంగా, భారత్‌ను విమర్శించే వ్యక్తుల వ్యాఖ్యలకు రాహుల్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె విమర్శించారు. ఇలా చేయడం ద్వారా ఆయన భారత్‌ను బలహీనపరుస్తున్నట్టేనని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ నిర్ణయాలపై ప్రభావం చూపకూడదని సూచించారు.

భారత్‌ ఆర్థిక పురోగతిని దెబ్బతీయాలని చూస్తున్న విదేశీ శక్తులపై దేశ రాజకీయ పార్టీలు ఐక్యంగా స్పందించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

మాలిని పోస్ట్‌పై రచయిత, విశ్లేషకుడు సలీల్ త్రిపాఠి స్పందించారు. " కొన్ని పెద్ద వ్యాపార కుటుంబాల ఆధిపత్యం పెరగడం దేశం గర్వపడే విషయంకాదు. అది ఆ కుటుంబాలకు, వాటి వల్ల లబ్ధి పొందే ప్రజలకు మాత్రమే గర్వకారణం. భారత్‌ అభివృద్ధి చెందడం లేదు, కానీ కొద్దిమంది పారిశ్రామికవేత్తల ఆధిపత్యం కచ్చితంగా పెరుగుతోందన్న విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను" అని అన్నారు.

రాహుల్, మస్క్‌ వ్యాఖ్యలపై కెనడాలోని ఫ్రీ ప్రెస్ జర్నలిస్ట్ రూపా సుబ్రమణ్య కూడా స్పందించారు. "ప్రపంచవ్యాప్తంగా మితవాద పార్టీలకు మస్క్‌ మద్దతు ఇస్తారు. భారత్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది మితవాద పార్టీయే. అలాంటప్పుడు ఎలాన్ మస్క్ వామపక్ష భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వింతగా ఉంటుంది. అయితే, ప్రపంచంలో ఇంతకంటే వింతైన పరిణామాలు కూడా జరిగాయి" అని అన్నారు.

రాహుల్ గాంధీ, ఎలాన్ మస్క్, టెస్లా, మోదీ, ముకేశ్ అంబానీ, భారతీ మిత్తల్, జియో, ఎయిర్ టెల్, స్టార్ లింక్,
ఫొటో క్యాప్షన్, స్టారలింక్ లోగో

భారత్‌లో స్టార్‌లింక్ ఎదుర్కొన్న సమస్యలేంటి?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుమతి కోసం స్పేస్‌ఎక్స్ ఎదురుచూస్తోంది.

అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జియో, సునీల్ భారతి మిత్తల్‌కు చెందిన భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ సంస్థలు ఎన్నో ఏళ్లుగా భారత టెలికమ్యూనికేషన్ల రంగంలో బలంగా ఉన్నాయి.

భారత్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశాన్ని ప్రత్యర్థులు అడ్డుకుంటున్నారని గతంలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే మస్క్ ఆరోపించారు. మిత్తల్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ విమర్శలు చేశారని ప్రచారం జరిగింది.

"దురదృష్టవశాత్తు, కొందరు పారిశ్రామికవేత్తలు గుత్తాధిపత్యాన్ని, భారత ప్రజలపై తమకున్న పట్టును నిలుపుకోవడానికి మనల్ని అడ్డుకుంటున్నారు. వారెవరో మీరు ఊహించగలరు" అని మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో రాశారు.

తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్‌లోని రెండు అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌‌లకు దాదాపు 91 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులున్నారు. ఇది మొత్తం మార్కెట్‌లో 80 శాతానికిపైగా ఉంది.

అయితే మస్క్‌ తాజా వ్యాఖ్యలు గత ఏడాది తీసుకున్న వైఖరికి భిన్నంగా ఉన్నాయి. అప్పట్లో స్పేస్‌ఎక్స్, స్టార్‌లింక్ సేవలను భారత్‌లో అందించేందుకు ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియోతో ఒప్పందాలు చేసుకుంది.

భద్రతాపరమైన ఆందోళనల కారణంగా స్టార్‌లింక్ వాణిజ్య సేవలకు తుది అనుమతి ఇచ్చే ప్రక్రియను భారత్ ప్రభుత్వం నిలిపివేసినట్టు బ్లూమ్‌బర్గ్ ఈ ఏడాది జూన్‌లో ఒక కథనం ప్రచురించింది.

భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్స్‌ను పొందిన స్టార్‌లింక్‌, వాణిజ్య సేవలు ప్రారంభించాలంటే భద్రతా అనుమతి, స్పెక్ట్రమ్ కేటాయింపు అవసరం ఉంది.

"యూటెల్‌సాట్ కమ్యూనికేషన్స్‌లో అతిపెద్ద వాటాదారుల్లో ఎయిర్‌టెల్ ఒకటి. యూటెల్‌సాట్‌కు చెందిన వన్‌వెబ్‌ శాటిలైట్ నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్‌కు ప్రధాన పోటీదారుల్లో ఒకటి. ఈ సంస్థ కూడా భూమికి సమీప కక్ష్యలో ఉపగ్రహాలను నడుపుతోంది" అని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో రాసింది.

అదే సమయంలో, భారతి ఎయిర్‌టెల్ కూడా తన భారతీయ వినియోగదారులకు స్టార్‌లింక్ సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో విడిగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మార్కెట్‌లో ఆవిర్భవిస్తున్న సంక్లిష్టమైన వ్యాపార భాగస్వామ్యాలకు ఇది ఒక నిదర్శనం.

రిలయన్స్‌ కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో విస్తరించాలని చూస్తోంది. దీని కోసం లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్‌తో కలిసి జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్ పని చేస్తోంది.

భారత్‌లో ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి లైసెన్స్ పొందిన మూడు కంపెనీలలో జియో, వన్‌వెబ్, స్టార్‌లింక్ ఉన్నాయి. అయితే, వాటిలో ఏదీ ఇంకా పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభించలేదు.

రాహుల్ గాంధీ, ఎలాన్ మస్క్, టెస్లా, మోదీ, ముకేశ్ అంబానీ, భారతీ మిత్తల్, జియో, ఎయిర్ టెల్, స్టార్ లింక్,
ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడి అధికారిక అతిథి గృహం బ్లేయర్ హౌస్‌లో 2025 ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్పెక్స్, టెస్లా, ఎక్స్‌ సీఈవో ఎలాన్ మస్క్ సమావేశం

మోదీ నుంచి మస్క్ ఏం కోరుకుంటున్నారు?

మస్క్ సంపదలో టెస్లాది అత్యధిక వాటా. అయితే భారత్‌లో టెస్లా విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు.

బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం... టెస్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో కేవలం 29 కార్లను మాత్రమే అమ్మగలిగింది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలకు) మార్కెట్ పెద్దది కాకపోవడంతో టెస్లా మార్కెట్ వాటా తక్కువగానే ఉంది. ఆ నెలలో భారతీయులు మొత్తం 13,733 ఈవీలను కొనుగోలు చేయగా, అందులో టెస్లా వాటా కేవలం 0.2 శాతం మాత్రమే.

ఫిబ్రవరి ఒక్క నెలే కాదు, టెస్లా మొత్తం విక్రయాల పరిస్థితి కూడా బలహీనంగానే ఉంది. టెస్లా భారత్‌లో జూలై 2025లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. తర్వాత మరో రెండింటిని కూడా ప్రారంభించింది.

అయినప్పటికీ, సంవత్సరాంతానికి కంపెనీ కేవలం 225 కార్లను మాత్రమే అమ్మింది. ఇది 2025లో భారత్‌లో విక్రయించిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో 0.13 శాతం మాత్రమే.

దీనికి ఒక కారణం ధర. టెస్లా మోడల్ వై ప్రారంభ ధర సుమారు 65,000 డాలర్లు అంటే దాదాపు 63 లక్షల నుంచి ప్రారంభం కాగా, టాటా మోటార్స్ ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కారు ధర సుమారు 8,500 డాలర్లు అంటే 8.50 లక్షల వరకు ఉంటుంది.

దీనికి దిగుమతి సుంకాలు ఒక ప్రధాన కారణం. 40,000 డాలర్ల కంటే ఎక్కువ అంటే 38 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై 110 శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, దిగుమతి చేసుకున్న భాగాలను ఉపయోగించి భారత్‌లో అసెంబుల్ చేసిన కార్లపై దిగుమతి సుంకాలు 15 శాతం నుంచి ప్రారంభమవుతాయి.

దీన్ని మార్చాలని మస్క్ చాలా కాలంగా కోరుతున్నారు.

ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, "2024 వేసవిలో జరగబోయే భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనాలని మస్క్ భావించారు. ఆ సమయంలో, ఆయన భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేశారు. కొన్ని విధానపరమైన రాయితీలతో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది." అని ప్రచురించింది.

అయితే మస్క్ చివరి నిమిషంలో తన భారత పర్యటనను రద్దు చేసుకుని, దానికి బదులుగా చైనా వెళ్లారు. ఈ నిర్ణయం మోదీకి అసంతృప్తి కలిగించి ఉండొచ్చని ఆ కథనం పేర్కొంది. ఆ తర్వాత నుంచి టెస్లాకు ప్రత్యేక విధానపరమైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆసక్తి చూపలేదని అందులో పేర్కొన్నారు.

న్యూదిల్లీలోని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ సంస్థకు చెందిన దీపక్ మహేశ్వరి ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, సాధారణంగా ఏదైనా కంపెనీ భారత్‌లో వ్యాపారం ప్రారంభించాలంటే ఆ సంస్థ ఉన్నతాధికారులు దేశానికి వచ్చి ప్రభుత్వ విధాన నిర్ణేతలను కలుస్తారని చెప్పారు. దాన్ని భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనే వారి నిబద్ధతకు సంకేతంగా భావిస్తారని వివరించారు.

కానీ ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు అలాంటి పర్యటన చేయలేదని గుర్తు చేశారు.

భారత్‌లోకి వచ్చే విదేశీ కంపెనీలు సాధారణంగా ఎదుర్కొనే రెండు ప్రధాన సవాళ్లను కూడా మస్క్‌ ఇంకా పూర్తిగా అధిగమించలేదు. మొదటిది, కఠినమైన నియంత్రణ నిబంధనలను అధిగమించడం, రెండోది, ఇప్పటికే స్థిరపడిన, బలమైన వ్యాపార ప్రత్యర్థులతో పోటీపడటం.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో, భారత్‌లో బాగా పాపులరైన ఏకైక మస్క్ వ్యాపారం సంస్థ. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, భారత్‌లో ఎక్స్‌కు 23 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. 2022లో మస్క్ దీనిని కొనుగోలు చేసిన తర్వాత భారీ సంఖ్యలో వినియోగదారులు ఇందులో చేరారు.

అనేక దేశాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ను లాభదాయకంగా మార్చడానికి మస్క్ చాలా కష్టపడుతున్నారు. భారత్‌లో అయితే వ్యాపార సవాళ్లతోపాటు సమాచార నియంత్రణలను కఠినతరం చేయాలన్న మోదీ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)