ఫారెక్స్: డాలర్లు సంపాదించిపెట్టే అవకాశమున్న చక్కెర ఎగుమతులపై కేంద్రం ఎందుకు నిషేధం విధించింది?

    • రచయిత, శుభాంగి మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

2026 సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

ఇరాన్‌లో యుద్ధం కారణంగా రసాయన ఎరువుల కొరత ఏర్పడటం, ఈ ఏడాది చెరకు ఉత్పత్తి తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండటం, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అలాగే అతి పెద్ద చక్కెర ఎగుమతిదారుల్లో ఒకటిగా ఉంది.

విదేశీ మారక నిల్వలను పెంచుకోవల్సిన అవసరం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావిస్తున్న సమయంలో భారత్‌లో అధిక విలువ కలిగిన పంటలలో ఒక దాని ఎగుమతిపై నిషేధం విధించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

చక్కెరను భారీగా ఉపయోగించే దేశంలో దేశీయంగా చక్కెర సరఫరాకు అంతరాయం రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

"ఈ నిషేధం ముందు జాగ్రత్త చర్య. దేశీయంగా తగినంత చక్కెర లభ్యత ఉండేలా చూడటమే దీని ఉద్దేశం. అయితే ఎగుమతి పరిస్థితిపై క్రమబద్దమైన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది" అని ఇండియన్ షుగర్ అండ్ మ్యాన్యూఫ్యాక్చరర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ దీపక్ బల్లాని చెప్పారు.

"ఎగుమతులకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఒప్పందాలు అమల్లో ఉన్నందున ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష అవసరం ఉంటుందని అనుకుంటున్నాం. ఒప్పందాల ప్రకారం చక్కెరను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఒప్పందాలను ఉల్లంఘించడం సరైనది కాదు" అని బల్లానీ బీబీసీతో చెప్పారు.

తగ్గిన పంట దిగుబడి

ఈ సీజన్‌లో ( 2025-26) చెరకు ఉత్పత్తి ఆశించిన దాని కంటే తగ్గడం కూడా ఎగుమతులపై నిషేధానికి కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

2025-26లో చక్కెర ఉత్పత్తి 30 మిలియన్ టన్నులు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారని, అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల 28 మిలియన్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చిందని బల్లానీ బీబీసీతో చెప్పారు.

"మునుపటి అంచనాల ఆధారంగా భారత ప్రభుత్వం 1.5 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. అందులో 6.5 లక్షల టన్నులను ఇప్పటికే ఎగుమతి చేశాం. దేశీయంగా అందుబాటులో ఉన్న పంటను సమతుల్యం చేసుకుంటూ ప్రపంచ చక్కెర మార్కెట్‌లో భారత్ పోషిస్తున్న పాత్రకు మద్దతిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

రసాయన ఎరువులు ఉన్నాయా?

పంట దిగుబడి తగ్గడంతో పాటు, హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భారతదేశ ఎరువుల నిల్వలపై ఏర్పడిన ఒత్తిడి కూడా ఎగుమతి నిషేధానికి దారి తీసింది.

రసాయన ఎరువుల వాడకంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో సుమారు మూడో వంతు హార్ముజ్ ద్వారా జరుగుతుంది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28న మూసివేశారు.

భారత్‌లో పండించే పంటలలో చెరకుకు అత్యధికంగా రసాయన ఎరువుల్ని వాడతారని గణాంకాలు చెబుతున్నాయి. హార్ముజ్ మూసివేతతో చెరకు పంటకు గడ్డుకాలం ఎదురవుతోంది.

దేశంలో ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో రైతులు ఇప్పటికే ఎరువుల సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

"ప్రస్తుతం రసాయన ఎరువులు కావల్సినన్ని లేవు. దీంతో రైతులు ఎక్కువ ధర ఉన్న వాటిని కొనాలా లేక ఎరువుల పరిమాణాన్ని తగ్గించాలా అని ఆలోచిస్తున్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారచ్చు" అని బులంద్‌షహర్‌లోని భారతీయ కిసాన్ యూనియన్ ( టికైత్) జిల్లా అధ్యక్షుడు చౌధరి ఆరవ్ సింగ్ చెప్పారు.

భవిష్యత్‌లో రసాయన ఎరువుల కొరత ఏర్పడితే అది పంట దిగుబడి మీద ప్రభావం చూపుతుందని దీపక్ బల్లానీ అంచనా వేస్తున్నారు.

"చెరకు నాటడం పూర్తైంది. ఇక ఎరువులు, యూరియా లాంటివి అవసరం. ఎరువుల కొరత ఉన్నా, వాటి ధరలు పెరిగినా అది కచ్చితంగా దిగుబడి మీద ప్రభావం చూపుతుంది" అని ఆయన చెప్పారు.

ఇథనాల్ మాటేంటి?

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయానికీ, చెరకు పంటకూ సంబంధం ఉంది. చక్కెరను పులియబెట్టి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు.

భారత్‌లో చెరకు ఉత్పత్తుల ద్వారా 40 శాతం ఇథనాల్ తయారవుతోంది. 2025-26లో భారత్‌లోని మొత్తం చెరకు ఉత్పత్తిలో 35 లక్షల టన్నులను ఇథనాల్ తయారీ కోసం మళ్లించారని ఐఎస్ఎంఏ చెబుతోంది.

ఇంధనంలో కలిపేందుకు చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తిని ప్రభుత్వం చాలా వేగంగా పెంచింది. 2013-14లో 38 కోట్ల లీటర్లున్న ఇథనాల్ ఉత్పత్తి 2023-24 నాటికి 672 కోట్ల లీటర్లకు చేరుకుంది.

చక్కెర ఎగుమతులపై నిషేధం వెనుక ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంతో పాటు ఇంధన భద్రత కూడా ఉందని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ప్రోగ్రెస్‌లో పని చేస్తున్న ప్రేరణా ప్రభాకర్ చెప్పారు.

"ప్రభుత్వ ఉద్దేశం ఇంధన భద్రతగానే కనిపిస్తోంది. ఎందుకంటే దీనివల్ల చమురు దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది" అని ఆయన అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల భారత చమురు నిల్వల మీద ఒత్తిడి తగ్గుతుందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

ఇథనాల్‌కి చక్కెర ఎగుమతులపై నిషేధానికి ప్రత్యక్ష, తక్షణ సంబంధం లేదని షుగర్ ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. చెరకు ఉత్పత్తి సీజన్ ఇప్పటికే ముగిసిందని చక్కెర తయారీ మిల్లులను చాలా వరకు మూసివేశారని వాళ్లు చెబుతున్నారు. ప్రతీయేటా చెరకు పంట పండించే సీజన్ అక్టోబర్‌లో మొదలై తరవాతి ఏడాది సెప్టెంబర్‌లో ముగుస్తుంది.

"ఇథనాల్ తయారీకి అవసరమైన చక్కెరను ఇప్పటికే సరఫరా చేశారు. ఎగుమతిపై నిషేధం విధించింది ఇథనాల్ ఉత్పత్తి పెంచడానికి కాదు" అని దీపక్ బల్లానీ చెప్పారు.

దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం

ప్రపంచంలో అతి పెద్ద చక్కెర ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. భారత్ చక్కెర ఎగుమతులకు ఆఫ్రికా పెద్ద మార్కెట్. 2025 ఏప్రిల్ నంచి 2026 ఫిబ్రవరి మధ్య భారత్ 1869.69 మిలియన్ డాలర్ల చక్కెరను ఎగుమతి చేసిందని వాణిజ్య శాఖ చెబుతోంది. ఇందులో ఎక్కువ భాగం ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేసింది.

భారత్ నుంచి చక్కెర ఎక్కువగా టాంజానియా, కెన్యా, జిబౌటి, సోమాలియా, సూడాన్‌తో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఇండోనేషియాలకు ఎగుమతి అవుతోందని ఐఎస్ఎంఏ చెబుతోంది.

భారత్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించడంతో చక్కెర కోసం ఆఫ్రికన్ దేశాలు బ్రెజిల్ లేదా థాయిలాండ్ మీద ఆధారపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చక్కెర కొరత ఇప్పటికే కనిపిస్తోంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గుతోందని విదేశీ మారక నిల్వల్ని రక్షించుకునేందుకు పొదుపు పద్దతులు పాటించాలని ప్రధాని మోదీ సూచించిన తర్వాత చక్కెర ఎగుమతులపై నిషేధం అమల్లోకి వచ్చింది.

అయితే చక్కెర ఎగుమతులపై నిషేధం విదేశీ మారక నిల్వలపై పెద్దగా ప్రభావం చూపదని వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ అంటున్నారు.

"ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు తక్కువగానే ఉన్నాయి. అందువల్ల చక్కెర ఎగుమతులపై నిషేధం పెద్దగా ప్రభావం చూపదు. మొత్తం ఎగుమతుల కోటాలో ఇప్పటికే 7-8 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేశాం" అని ఆయన బీబీసీతో చెప్పారు.

నిషేధం వల్ల దేశంలో చక్కెర సరఫరా పెరిగే అవకాశం ఉంది. ఎగుమతులపై నిషేధం రైతులు, చక్కెర మిల్లుల యజమానులకు దుర్వార్తేనని నిపుణులు చెబుతున్నారు.

"ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిపుడే ధరలు పుంజుకుంటున్నాయి. భారత్ ఎగుమతులకు ఇది మంచి అవకాశం. అయితే ఇప్పుడిది సాధ్యం కాదు" అని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగ సమస్యల గురించి వార్తలు రాసే 'రూరల్ వాయిస్' న్యూస్ పోర్టల్ ఎడిటర్ ఇన్ చీఫ్ హరివీర్ సింగ్ చెప్పారు.

ఎగుమతులపై నిషేధం వల్ల చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది. ఇప్పటికే మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బాకీలు చాలా ఉన్నాయని సింగ్ చెప్పారు.

కొన్నేళ్లుగా భారత్‌లో చెరకు సాగు విస్తీర్ణం తగ్గినా, ధరలు పెరగలేదనీ, చెరకు ధర పెంచాలని పరిశ్రమ కోరుకుంటోంది.

"చెరకు ధర పెరుగుతుందే భావన ఉంది. పెరిగితే మిల్లుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ధర పెరిగితే మిల్లులు త్వరగా రైతులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లిస్తాయి. అది రైతులకు కూడా మేలు చేస్తుంది" అని హరివీర్ సింగ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)