అమెరికాలో సివిల్ ఫ్రాడ్ కేసు పరిష్కరించుకోవడానికి 18 మిలియన్ డాలర్ల చెల్లింపునకు అదానీ అంగీకారం

    • రచయిత, చెరీలాన్ మొలాన్, జెస్సికా మార్ఫీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దాఖలు చేసిన సివిల్ ఫ్రాడ్ కేసును పరిష్కరించుకోవడానికి భారత బిలియనీర్ గౌతమ్ అదానీ, సోదరుడి కుమారుడు సాగర్ అదానీ కలిసి 18 మిలియన్ డాలర్ల ( సుమారు 172 కోట్ల రూపాయలు ) జరిమానా చెల్లించేందుకు అంగీకరించారు.

ప్రతిష్టాత్మక పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పొందేందుకు భారతీయ ఉన్నతాధికారులకు లంచాలు చెల్లించారని, బాండ్ల జారీ ద్వారా నిధులను సేకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ విషయాన్ని దాచి, అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని నియంత్రణ సంస్థ 2024లో అదానీలపై ఆరోపణలు చేసింది.

ఈ ప్రతిపాదిత ఒప్పందం కోర్టు ఆమోదానికి లోబడి ఉన్నప్పటికీ, ఈ పరిణామాలకు మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. శుక్రవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పెరిగాయి.

అదానీ గ్రూప్ భారత్‌లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి. ఇంధనం, విమానాశ్రయం వంటి రంగాలలో అదానీ వ్యాపారాలు విస్తరించాయి.

ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, అదానీలు తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదు. అయితే, పెట్టుబడిదారులను మోసం చేయడం, సెక్యూరిటీల అవకతవకలు, మార్కెట్ మానిప్యులేషన్ వంటి నేరాలను నిరోధించే కీలకమైన అమెరికా యాంటీ-ఫ్రాడ్ (మోసాల నిరోధక) చట్టాలను భవిష్యత్తులో ఉల్లంఘించకుండా ఈ ఒప్పందం అదానీలను నిరోధిస్తుంది.

లంచాల నిరోధక చట్టాలకు అదానీ గ్రీన్ ఎనర్జీ కట్టుబడి ఉందని చెబుతూ అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవపట్టించి వారి నుంచి 175 మిలియన్ డాలర్లతో (రూ.1,679 కోట్లు) సహా అదానీలు మొత్తంగా 750 మిలియన్ డాలర్లను (రూ.7,199 కోట్లు) సేకరించారని 2024లో దాఖలు చేసిన దావాలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపించింది.

అయితే, ఈ ఆరోపణలన్నీ ''నిరాధారమైనవని’’అదానీ గ్రూపు కొట్టిపారేసింది.

ఫోర్బ్స్ ప్రకారం.. 63 ఏళ్ల అదానీ సంపద 82 బిలియన్ డాలర్లు. ఈ సంపదతో ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు.

గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్అభియోగాలను ఉపసంహరించుకోడానికి అమెరికా న్యాయ శాఖ చర్యలు తీసుకుంటుందని గురువారం న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్‌లు రిపోర్టు చేశాయి.

అమెరికాలో అత్యంత శక్తివంతమైన న్యాయ సంస్థలలో ఒకటైన ఓ సంస్థ అధిపతి, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయ సలహాదారులలో ఒకరిగా ఉన్న రాబర్ట్ జె జియుఫ్రా జూనియర్ నేతృత్వంలోని కొత్త న్యాయవాదుల బృందాన్ని అదానీ నియమించుకున్న తర్వాతే , న్యాయ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

హష్-మనీ చెల్లింపుల కేసులో ట్రంప్‌కు విధించిన శిక్షపై అప్పీల్‌ దాఖలు చేసేందుకు ఆయన నియమించుకున్న న్యాయవాదుల్లో జియుఫ్రా ఒకరు.

గతనెలలో జియుఫ్రా అమెరికా న్యాయశాఖాధికారులతో సమావేశమై ఈ కేసుపై తమ ఆందోళన వెలిబుచ్చారు. అలాగే ఈ అభియోగాలు ఉపసంహరించుకుంటే అదానీ అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారని, 15 వేల ఉద్యోగాలను సృష్టిస్తారని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.

2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన కొన్నిరోజులకు అదానీ ఇచ్చిన ఈ హామీని ఇక్కడ పునరుద్ఘాటించారు.

ట్రంప్ పాలనలో విదేశీ లంచాల కేసుల దర్యాప్తు, అభియోగాల విషయంలో వెనక్కుతగ్గే విస్తృత విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు టైమ్స్‌కు చెప్పాయి.

దీనిపై స్పందన కోసం అమెరికా న్యాయ శాఖను, అదానీ గ్రూప్‌ను బీబీసీ సంప్రదించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)